ప్రధాని నరేంద్ర మోదీ: ‘బంగ్లాదేశ్ స్వాతంత్ర్యం కోసం సత్యాగ్రహం చేశాను..జైలుకు వెళ్లాను’ -Newsreel

ఫొటో సోర్స్, Ani
రెండు రోజుల పర్యటన కోసం బంగ్లాదేశ్ వెళ్లారు ప్రధాని నరేంద్ర మోదీ.
బంగ్లాదేశ్ ఏర్పాటులో ఇందిరాగాంధీ కృషిని అందరూ గౌరవిస్తారని, ఆ దేశ ఆవిర్భావంలో ఆమె సహకారం మరచిపోలేనిదని ఆయన అన్నారు.
తన జీవితం ప్రారంభంలో జరిగిన మొదటి ఉద్యమాల్లో బంగ్లాదేశ్ స్వతంత్ర పోరాటం ఒకటని మోదీ చెప్పారు.
"20-22 ఏళ్ల వయసులో చాలామంది స్నేహితులతో కలిసి నేను బంగ్లాదేశ్ స్వాతంత్ర్యం కోసం సత్యాగ్రహం చేశాను. దానికి మద్దతుగా అరెస్ట్ కూడా అయ్యాం. నేను జైలుకు కూడా వెళ్లాను" అని మోదీ చెప్పారు.
బంగబంధు షేఖ్ ముజీబుర్ రహమాన్ గురించి మాట్లాడుతూ "బంగ్లాదేశ్‌ను ఏ శక్తీ బానిసత్వంలో ఉంచలేదని ఆయన నాయకత్వం నిర్ణయించింది" అని మోదీ అన్నారు.
త్యాగాలతో బంగ్లాదేశ్ ఏర్పాటు కలను సాకారం చేసిన వీర జవాన్లను ఆయన స్మరించుకున్నారు.
"విముక్తి పోరాటంలో బంగ్లాదేశ్‌కు అండగా నిలిచిన భారత సైన్యం వీర జవాన్లకు నేను వందనం చేస్తున్నాను" అని ప్రధాని మోదీ అన్నారు.
"బంగ్లాదేశ్ స్వాతంత్ర్య 50 ఏళ్ల వేడుక, భారత స్వాతంత్ర్య 75 ఏళ్ల సంబరాలు ఒకేసారి జరుగుతుండడం సంతోషం కలిగించే సందర్భం. మన రెండు దేశాలకు వచ్చే 25 ఏళ్లు చాలా కీలకం" అని మోదీ చెప్పారు.
శుక్రవారం ఢాకాలోని నేషనల్ పరేడ్ స్క్వేర్‌లో నిర్వహించిన వేడుకలో ఆయన పాల్గొన్నారు.
స్వాతంత్ర్య స్వర్ణోత్సవాలతోపాటూ, ప్రధాని షేఖ్ ముజీబుర్ రహమాన్ జయంతి వేడుకలను కూడా బంగ్లాదేశ్ నిర్వహిస్తోంది.
ఈ కార్యక్రమానికి తనను ఆహ్వానించినందుకు బంగ్లాదేశ్ అధ్యక్షుడు అబ్దుల్ హమీద్, ప్రధానమంత్రి షేక్ హసీనా, ఆ దేశ ప్రజలకు భారత ప్రధాని నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు.
మరోవైపు, మోదీ రాకకు నిరసనగా బంగ్లాదేశ్‌లో పలు చోట్ల ఆందోళనలు జరుగుతున్నాయి.
చిట్టగాంగ్ జిల్లాలో ఆందోళనకారులు పోలీసుల మధ్య ఘర్షణ జరిగింది.
ఈ సంఘటనలో నలుగురు నిరసనకారులు చనిపోయారని బీబీసీ ప్రతినిధి అక్బర్ హొస్సేన్ తెలిపారు.
మోదీ పర్యటనకు వ్యతిరేకంగా ఢాకాలో కూడా నిరసనలు చేపట్టారు.

ఫొటో సోర్స్, kcr/facebook
తెలంగాణలో లాక్‌డౌన్‌తో ఎంతో నష్టపోయాం... మళ్లీ లాక్‌డౌన్ ప్రసక్తే లేదు:కేసీఆర్
తెలంగాణాలో మరొక లాక్‌డౌన్ విధించే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ శాసనసభా సమావేశాల్లో ప్రకటించారు.
పరిశ్రమల మూసివేత కూడా ఉండదని చెప్పారు.
గతంలో విధించిన లాక్‌డౌన్ వల్ల చాలా దెబ్బతిన్నామని ఆయన అన్నారు.
కరోనా నియంత్రణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని కేసీఆర్ స్పష్టం చేశారు.
ప్రజలంతా మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలని, కోవిడ్ నిబంధనలు, జాగ్రత్తలు పాటించాలని ఆయన ప్రజలను కోరారు.
ఊరేగింపులు, ర్యాలీలు, ఫంక్షన్లు తగ్గించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఫొటో సోర్స్, ANI
ముంబయి డ్రీమ్ మాల్‌లో అగ్నిప్రమాదం...10మంది మృతి
ముంబయిలోని ఓ మాల్ జరిగిన అగ్ని ప్రమాదంలో 10మంది మృతి చెందినట్లు ముంబయి పోలీసులు వెల్లడించారని ఏఎన్‌ఐ వార్తా సంస్థ తెలిపింది.
ఈ మాల్‌లో నిర్వహిస్తున్న సన్‌రైజ్ ఆసుపత్రి నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, వారిపై కేసు పెడతామని ముంబయి పోలీస్ కమిషనర్ వెల్లడించినట్లు ఏఎన్‌ఐ పేర్కొంది.
ఈ ఆసుపత్రిలో ఉన్న 70మంది కోవిడ్ పేషెంట్లను ఇతర ఆసుపత్రులకు తరలించినట్లు అంతకు ముందు పోలీసులు ప్రకటించారు.
మొదట ఇద్దరు పేషెంట్లు మంటల కారణంగా చనిపోయారని ప్రకటించినా, వారు కోవిడ్‌తో మరణించారని తర్వాత అధికారులు వెల్లడించారు.
బృహన్ ముంబయి పరిధిలోని డ్రీమ్ మాల్ మొదటి ఫ్లోర్‌లో గత అర్ధరాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. ఈ మాల్‌లోని టాప్‌ఫ్లోర్‌లో సన్‌రైజ్ హాస్పిటల్ ఉంది.
అంతకు ముందు అగ్నిప్రమాద ఘటనా స్థలాన్ని సందర్శించిన ముంబయి మేయర్ కిశోరీ పెడ్నేకర్, ఒక మాల్‌లో ఆసుపత్రిని నిర్వహించడాన్ని తాను మొదటిసారి చూస్తున్నానని వ్యాఖ్యానించారు.

న్యూజీలాండ్: గర్భస్రావం అయినప్పుడు ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవు

ఫొటో సోర్స్, Getty Images
ఉద్యోగం చేస్తున్న దంపతులకు గర్భస్రావం, లేదా మృత శిశు జననాలు వంటి సంఘటనలు జరిగినప్పుడు దానిని కుటుంబ సభ్యులు చనిపోయినప్పుడు ఇచ్చే పెయిడ్ లీవ్(వేతనంతో కూడిన సెలవు)గా ఇవ్వాలని న్యూజీలాండ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఒక చట్టాన్ని ఆ దేశ పార్లమెంటు ఆమోదించింది.
పిల్లలు దత్తత తీసుకున్నవారు, సరోగసీ ద్వారా సంతానాన్ని పొందిన వారికి కూడా ఈ చట్టం వర్తిస్తుంది. ప్రపంచంలో భారత్ తర్వాత ఈ తరహా చట్టం చేసిన రెండో దేశంగా న్యూజీలాండ్ నిలిచింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
"సిక్ లీవ్ తీసుకునే అవసరం లేకుండా వారు ఈ బాధ నుంచి కోలుకోవడానికి ఈ సెలవు ఉపయోగపడుతుంది" అని ఈ బిల్లును ప్రవేశపెట్టిన పార్లమెంటు సభ్యురాలు గిన్నీ ఆండర్సన్ పేర్కొన్నారు.
పార్లమెంటులో ఏకగ్రీవంగా ఆమోదం పొందిన ఈ బిల్లుతో గర్భస్రావం లేదా మృత శిశు జననం జరిగినప్పుడు వేతనంతో కూడిన మూడు రోజుల సెలవు ఇస్తారు. న్యూజీలాండ్‌లో ప్రతి నలుగురిలో ఒకరికి ఇలాంటి సమస్య ఎదురవుతోందని, వారు ఆ బాధ నుంచి కోలుకోవడానికి ఈ సెలవు ఉపయోగపడుతుందని గిన్నీ ఆండర్సన్ వ్యాఖ్యానించారు.
గత ఏడాదే న్యూజీలాండ్ ప్రభుత్వం అబార్షన్ చట్టాన్ని సంస్కరించే ఒక బిల్లును ప్రవేశపెట్టింది. దీని ప్రకారం 20 వారాలలోపు గర్భాన్ని రద్దు చేసుకునే అధికారం మహిళలకు ఉంటుంది.

ఫొటో సోర్స్, Reuters
ఉత్తర కొరియా: 'అణుబాంబులు వేయగల అత్యాధునిక క్షిపణులను ప్రయోగించాం'

ఫొటో సోర్స్, Reuters
కొత్త తరహా వ్యూహాత్మక క్షిపణులను విజయవంతంగా ప్రయోగించామని ఉత్తర కొరియా గురువారంనాడు ప్రకటించుకుంది.
ఏడాది తర్వాత, ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడిగా బైడెన్ అధికారంలోకి వచ్చాక ఉత్తర కొరియా ప్రయోగించిన తొలి బాలిస్టిక్ క్షిపణి ఇది. అయితే ఈ క్షిపణి ప్రయోగాన్ని అటు జపాన్, ఇటు అమెరికా రెండూ ఖండించాయి. ఐక్యరాజ్యసమితి నిబంధనల ప్రకారం ఉత్తర కొరియా బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించకూడదు.
"ఇది ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి నిబంధనలను ఉల్లంఘించడమే కాదు, తన ప్రయోగాలతో పొరుగు దేశాలను, ప్రాంతీయ రాజ్యాలను భయపెట్టడమే" అని అమెరికా వ్యాఖ్యానించింది.
దేశపు తూర్పుతీరంలో 600 కి.మీ. దూరంలో ఏర్పాటు చేసిన లక్ష్యాలను తమ రెండు క్షిపణులు ఛేదించాయని ఉత్తర కొరియా ఒక ప్రకటనలో పేర్కొనగా, కేవలం 400 కి.మీ. మాత్రమే మిసైళ్లు ప్రయాణించాయని జపాన్ పేర్కొంది.
ఇందులోని క్షిపణి రెండున్నర టన్నుల బరువును మోయగలదని, అణుబాంబును కూడా మోసుకెళ్లగల సామర్ధ్యం ఉందని, తమ దేశ భద్రత విషయంలో ఈ మిసైళ్లు కీలక పాత్ర పోషించబోతున్నాయని ఉత్తరకొరియా తన ప్రకటనలో తెలిపింది. ఈ ప్రయోగ కార్యక్రమానికి దేశాధినేత కిమ్ జోంగ్ ఉన్ హాజరు కాలేదు.
ఇవి కూడా చదవండి:
- భారత్-పాక్ సరిహద్దు: కచ్ నిర్బంధ కేంద్రంలో అయిదుగురు పాకిస్తానీలు ఎలా చనిపోయారు?
- మహిళల మోకాళ్లు, చిరిగిన జీన్స్‌పై ఎందుకింత చర్చ జరుగుతోంది
- 15 వందల మంది భారత సైనికుల భీకర పోరాటం రెండో ప్రపంచ యుద్ధ గతిని ఎలా మార్చిందంటే..
- 'ఒకవేళ నేను చనిపోతే మన బిడ్డను జాగ్రత్తగా చూసుకోండి'
- వరల్డ్ హ్యాపీనెస్ డే: అత్యంత సంతోషకర దేశంగా ఫిన్లాండ్, 139వ స్థానంలో భారత్
- మహాశివరాత్రి: పురుష లింగాకారానికి పూజలు చేసే అరుదైన ఆలయం.. గుడిమల్లం
- సిద్దిక్ కప్పన్: రేప్ కేసు రిపోర్ట్ చేయడానికి ప్రయత్నించినందుకు జైల్లో పెట్టి 'హింసిస్తున్నారు'
- ముస్లిం, క్రైస్తవ మతాలకు చెందిన మృతుల ఖననానికి మారుమూల దీవిని ఎంపిక చేసిన శ్రీలంక
- కృత్రిమ గర్భధారణ ఖర్చులు భరించలేక ఫేస్బుక్లో వీర్యదాతలను ఆశ్రయిస్తున్నారు... ఆరోగ్యం ఏమవుతుంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









