"నేను కరోనా వ్యాక్సీన్ రెండు డోసులూ వేసుకున్నాను. అయినా, కోవిడ్ వచ్చింది" - ఒక డాక్టర్ అనుభవం

- రచయిత, సరోజ్ సింగ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
డాక్టర్ పునీత్ టండన్ భోపాల్‌లోని గాంధీ మెడికల్ కాలేజీలో పాథాలజీ స్పెషలిస్ట్‌గా పని చేస్తున్నారు. ఆయన వయసు 53 సంవత్సరాలు. ఆయనకు ఏ రకమైన ఆరోగ్య సమస్యలు లేవు. డాక్టర్ పునీత్ కరోనా వ్యాక్సీన్ (కోవిషీల్డ్) రెండు డోసులు వేయించుకున్న తరువాత కూడా యథావిధిగా వైద్య సేవలను కొనసాగిస్తున్నారు. ఆయన భార్య కూడా డాక్టరే. ఆమె అనస్థీషియన్‌గా కోవిడ్ ఐసీయూలో రొటేషన్ పద్ధతిలో పని చేస్తున్నారు. డాక్టర్ పునీత్ సోదరి పాథాలజీ విభాగంలో డాక్టర్‌గా సేవలు అందిస్తున్నారు.
(డాక్టర్ పునీత్ అనుభవాలను చదివేటప్పుడు ఈ అంశాలను దృష్టిలో ఉంచుకోవాలని మనవి. చదివేవారిని భయపెట్టే ఉద్దేశంతో కాకుండా, ఇప్పటివరకూ అందుబాటులో ఉన్న వాస్తవాల ఆధారంగా అవసరమైన సమాచారాన్ని, సూచనలను అందించాలని ఈ కథనాన్ని అందిస్తున్నాం)
"2021 జనవరి 15.. రేపు కరోనా వ్యాక్సీన్ మీకు అందుతుందని నా ఫోన్‌లో మెసేజ్ వచ్చింది. అది చూసి నేను చాలా సంతోషించాను.
డాక్టర్లు, ఫ్రంట్‌లైన్ వర్కర్లు కరోనా మహ్మమరితో పోరాడుతూ ప్రజల ప్రాణాలు కాపాడడానికి ఎంతో కృషి చేస్తున్నారు.
ప్లాస్మా థెరపీ ద్వారా కరోనాకు చికిత్స అందించే ప్రయోగాలలో నేను కూడా పాలుపంచుకున్నాను.
నా భార్య డాక్టర్. ఆమె కోవిడ్ ఐసీయూలో విధి నిర్వహణలో ఉన్నారు. నా సోదరి కూడా ఇదే వృత్తిలో ఉన్నారు.
ఎట్టకేలకు మా కుటుంబానికి ఒక రక్షణ కవచం లభించబోతోందని సంతోషించాను.

జనవరి 16న నేను వ్యాక్సీన్ మొదటి డోసు తీసుకున్నాను. నాకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాలేదు.
టీకా తీసుకున్న తరువాత అరగంటపాటూ వ్యాక్సీన్ కేంద్రంలోనే కూర్చుని ఇంటికి వచ్చేశాను.
టీకా వేయించుకునే ముందు నా శరీరంలోని యాంటీబాడీస్ స్థాయిలను చెక్ చేశాను.
మొదటి డోసుకు ముందురోజు 0.05 ఉంది. టీకా వేసుకున్న తరువాత జనవరి 30న మళ్లీ చెక్ చేస్తే 0.88 చూపించింది.
మొదటి డోసు వేసుకున్న 38 రోజుల తరువాత.. ఫిబ్రవరి 24న వ్యాక్సీన్ రెండో డోసు తీసుకున్నాను.
దీనికి ముందు కూడా యాంటీబాడీస్ చెక్ చేసుకుంటే 2.28 చూపించింది. అంటే మొదటి డోసు తరువాత యాంటీబాడీస్ క్రమక్రమంగా పెరుగుతూ వచ్చాయన్నమాట.
వ్యాక్సీన్ రెండో డోసు తరువాత కూడా నాకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కలగలేదు. వ్యాక్సీన్ తరువాత సాధారణంగా విశ్రాంతి తీసుకోమన్నారు. వాళ్లు చెప్పిన నియమాలన్నీ పాటించాను.
రెండో డోసు వేసుకున్న మూడు వారాల తరువాత అంటే మార్చి 30నాటికి నా శరీరంలో యాంటీబాడీస్ స్థాయి 11.75 దగ్గర ఉంది.
అంతా సవ్యంగా జరుగుతోందని భావించాను.
అయితే, మార్చి 30 ఉదయం నాకెందుకో కొంచెం అసౌకర్యంగా అనిపించింది.
నేను ఒక రన్నర్‌ను. రోజూ పొద్దునే పరుగెడతాను. తరువాత కొంతసేపు వ్యాయామం చేస్తాను.
అసౌకర్యాన్ని పట్టించుకోకుండా ఆరోజు కూడా రన్నింగ్‌కు వెళ్లాను. సగం దూరానికే చాలా అలిసిపోయినట్టు అనిపించింది. అలా ఎప్పుడూ జరగలేదు. కొంచం ఆశ్చర్యమేసింది.
మామూలుగా నేను 10 కిలోమీటర్లు ఆపకుండా పరిగెత్తగలను. సరే, ఏదో ఆరోజు అలా అనిపించిదిలే అని పట్టించుకోకుండా వదిలేశాను.
అయితే, ఆ రోజు నా గుండె ఎప్పటికన్నా వేగంగా కొట్టుకుంటున్నట్లు అనిపించింది.
తరువాత, ఆస్పత్రికి వెళ్లాను. మిగతా పనులన్నీ మామూలుగానే చేశాను.
సాయంత్రమయేసరికి నాకు జలుబు చేసింది. చలిగా ఉన్నట్లు కూడా అనిపించింది.
మరుసటి రోజు.. మార్చి 31న నాకు జ్వరం వచ్చింది. ఉష్ణోగ్రత చూస్తే 99 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంది.
నాకెందుకో అనుమానం వచ్చింది.. ఒకవేళ నాకు కరోనా సోకిందా! వ్యాక్సీన్ రెండు డోసులు తీసుకున్నాను కదా. నాకు కోవిడ్ రావడం అసాధ్యం అనుకున్నాను.
కానీ, డాక్టర్‌ని కదా.. నా అనుమానాలు నాకుంటాయి. టీకా వేయించుకున్న తరువాత కూడా కోవిడ్ సోకే అవకాశం ఉందని నాకు తెలుసు.

వెంటనే ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ (ఆర్ఏటీ) చేయించుకున్నాను. నాకు కోవిడ్ 19 సోకినట్లు నిర్ధరణ అయింది.
క్వారంటీన్‌లో ఉండమని నాకు డాక్టర్ సలహా ఇచ్చారు. ఇంటికొచ్చి ఒక గదిలో ఐసొలేషన్‌లోకి వెళ్లాను.
నా ఫ్రెండ్ డాక్టర్ సహాయంతో కోవిడ్ -19 చికిత్స ప్లాన్ వేసుకున్నాను. మరి కొన్ని రక్త పరీక్షలు చేయించుకున్నాను. సీటీ స్కాన్, గుండెకు సంబంధించిన పరీక్షలన్నీ చేయించుకున్నాను.
రక్త పరీక్షల్లో వేల్యూస్ కొంచం తేడాగా వచ్చాయే కానీ మరే ఇతర సమస్యా లేదు.
డాక్టర్ సలహాతో సమతుల ఆహారం తీసుకుంటూ యాంటీబయోటిక్స్ వాడాను.
రెండు రోజుల తరువాత జ్వరం తగ్గింది. నాలుగో రోజుకి శరీరం తేలికపడింది. మళ్లీ పరీక్షలు చేయించుకుంటే అంతా నార్మల్ అని తేలింది.
ఏప్రిల్ 6న ఆర్‌టీపీసీఆర్ కోవిడ్ టెస్ట్ చేయించుకుంటే నెగటివ్ వచ్చింది.
అయితే, ఎందుకైనా మంచిదని ఈరోజుకు కూడా ఇంట్లో ఐసొలేషన్‌లోనే ఉన్నాను.
ఇంట్లో వృద్ధులైన తల్లిదండ్రులు ఉన్నారు. నేను డాక్టర్‌ను కాబట్టి గత ఏడాది కాలంగా వారికి కొంత దూరంగానే ఉంటూ వచ్చాను.
నా భార్య, పిల్లలకు కోవిడ్ టెస్ట్ నెగటివ్ వచ్చిందిగానీ నా సోదరికి పాజిటివ్ వచ్చింది.
నాకు ఇన్‌ఫెక్షన్ ఎలా సోకిందో తెలీదు. నేను పూర్తి జాగ్రత్తలు తీసుకున్నాను. కానీ ఒక డాక్టర్‌గా ఎంతోమంది రోగులను కలుస్తూ ఉంటాను.
ఇక్కడ గమనించాల్సి ముఖ్య విషయం ఏమిటంటే.. నాకు కోవిడ్ సోకిన తరువాత పరిస్థితి చాలా తీవ్రమయే అవకాశాలు ఉన్నాయి. ఆస్పత్రిలో చేరాల్సిన పరిస్థితి వచ్చి ఉండొచ్చు లేదా మరణించవచ్చు.
కానీ, కోవిడ్ వ్యాక్సీన్ తీసుకోవడం వలన ఇన్‌ఫెక్షన్ తీవ్ర స్థాయికి చేరకుండా, తొందరగా తగ్గిపోయింది.
అందుకే కోవిడ్ వ్యాక్సీన్ తప్పనిసరిగా వేయించుకోవాలి.

వ్యాక్సీన్ తరువాత కూడా కరోనా రావొచ్చు. కానీ అది తీవ్రతరం కాకుండా వ్యాక్సీన్ కాపాడుతుంది.
వ్యాక్సీన్ వేయించుకున్నాం కదా అని నిర్లక్ష్యంగా ఉండొద్దు. మాస్క్ తప్పనిసరిగా పెట్టుకోవాలి. రెండు మీటర్ల భౌతిక దూరం పాటిస్తూ తరచూ చేతులు కడుక్కుంటూ ఉండాలి" అని డాక్టర్ పునీత్ వివరించారు.
డాక్టర్ పునీత్ అనుభవాలు చదివిన తరువాత కూడా మీకు కొన్ని సందేహాలు రావొచ్చు.
అలాంటి సందేహాలకు ప్రభుత్వ కోవిడ్ 19 టాస్క్ ఫోర్స్‌లో సభ్యులైన డాక్టర్ సునీలా గార్గ్ అందిస్తున్న జవాబులు ఇవీ...
ప్రశ్న: కరోనా వ్యాక్సీన్ వేసుకున్న తరువాత కూడా ఎందుకు ఇన్‌ఫెక్షన్ సోకుతుంది?
జవాబు: దీనికి సమాధానం చెప్పాలంటే వ్యాక్సీన్ సామర్థ్యాన్ని చూపించే డాటా పరిశీలించాలి.
ఏ వ్యాక్సీన్ కూడా 100 శాతం రక్షణ కల్పిస్తుందని తయారీదారులు హామీ ఇవ్వలేరు.
ఉదాహరణకు ఇండియాలో తయారైన కోవాగ్జిన్ 80 శాతం సామర్థ్యాన్ని కలిగి ఉంది. అంటే ఈ వ్యాక్సీన్ వేసుకున్న తరువాత కూడా 20 శాతం కోవిడ్ సోకే అవకాశాలు ఉన్నాయని అర్థం.
అదే విధంగా కోవిషీల్ద్ సామర్థ్యం 70 శాతం అని తెలిపారు. రెండు డోసుల మధ్య ఉన్న కాల వ్యవధి బట్టి కూడా కోవిషీల్డ్ సామర్థ్యంలో మార్పులు ఉంటాయని తెలుస్తోంది. 28 రోజుల వ్యవధిలో రెండో డోసు తీసుకుంటే తక్కువ సామర్థ్యం, రెండు నెలల వ్యవధిలో తీసుకుంటే ఎక్కువ సామర్థ్యం ఉంటుంది.
ప్రశ్న: మరెందుకు కరోనా వ్యాక్సీన్ తీసుకోవాలి?
జవాబు: తప్పనిసరిగా కరోనా వ్యాక్సీన్ వేయించుకోవాలి. ఇది కోవిడ్ తీవ్రతను తగ్గిస్తుంది. కోవిడ్ మరణాలను అదుపులో ఉంచుతుంది.
వ్యాక్సీన్ వేసుకున్న తరువాత కూడా కోవిడ్ సోకవచ్చు. కానీ వ్యాక్సీన్ ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. త్వరగా కోలుకునేందుకు అవకాశం ఉంటుంది. అందుకే, వ్యాక్సీన్ తప్పకుండా వేయించుకోవాలి.

ఫొటో సోర్స్, Getty Images
ప్రశ్న: కోవిషీల్డ్, కోవాగ్జిన్ టీకాలు ఎన్నాళ్లు రక్షణ కల్పిస్తాయి?
జవాబు: ఇప్పటివరకూ ఉన్న సమాచారం ప్రకారం ఈ రెండు వ్యాక్సీన్లు కూడా ఒక ఏడాది కన్నా అధికంగా రక్షణ కవచాల్లా పనిచేస్తాయని తెలుస్తోంది.
అయితే, ఇక్కడ ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి. ఇంకా అధ్యయనాలు జరుగుతున్నాయి. సమయం గడుస్తున్నకొద్దీ మరిన్ని విషయాలు అవగాహనకు వస్తాయి.
అనేక రకాల చర్చలు జరుగుతున్నాయి. మరొక వ్యాక్సీన్ బూస్టర్ డోసు అవసరమా కాదా అనే విషయంపై కూడా పరిశోధన, చర్చ జరుగుతోంది.
ప్రశ్న: కో-మార్బిడ్ (రెండో రకం వ్యాధి) వచ్చినవారికి వ్యాక్సీన్ వేయించుకున్న తరువాత ఇంఫెక్షన్ సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయా?
జవాబు: వారికి వ్యాక్సీన్ మరింత రక్షణ కల్పిస్తుంది. కోమార్బిడ్ ఉన్నవారికి వ్యాక్సీన్ వేయించుకోకుండా మైల్డ్ కరోనా సోకినా పరిస్థితి తీవ్రంగా మారే అవకాశాలు ఉన్నాయి. అందుకే వ్యాక్సీన్ విషయంలో వారికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు.
ప్రశ్న: వ్యాక్సీన్ వేయించుకున్న తరువాత కోవిడ్ సోకే అవకాశం ఎంత శాతం?
జవాబు: అలాంటి కేసులు అరుదు. దీనిపై అమెరికాలో రెండు విభిన్న అధ్యయనాలు వెలువడ్డాయి.
ఒక అధ్యయనంలో.. 8177 కేసుల్లో కేవలం నలుగురికి మాత్రమే వ్యాక్సీన్ వేయించుకున్న తరువాత కూడా కోవిడ్ 19 సోకినట్లు తేలింది.
రెండవ అధ్యయనంలో.. వ్యాక్సీన్ వేయించుకున్న14,000 మందిలో కేవలం ఏడుగురికి మాత్రమే కరోనావైరస్ సోకినట్లు తేలింది.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: మాస్క్ వేసుకోలేదని ఓ వ్యక్తిని రోడ్డు మీద పడేసి తీవ్రంగా కొట్టిన పోలీసులు... వైరల్ అయిన వీడియో
- గోల్డెన్ బ్లడ్: ఈ రక్తం కలిగి ఉండటం చాలా ప్రమాదకరం
- సిపాయిల తిరుగుబాటు: భారత సైనికులను బలవంతంగా క్రైస్తవులుగా మారుస్తున్నారని వదంతులు వచ్చినప్పుడు ఏం జరిగింది?
- ఎడారి ఇసుక నేలలో పచ్చని పొలం... ఈ అద్భుతం ఎలా సాధ్యం?
- కరోనావైరస్: తెలుగు రాష్ట్రాల్లో వ్యాక్సీన్ వేస్టేజీ ఎక్కువగా ఉందా... ప్రధాని మోదీ ఆ మాట ఎందుకు అన్నారు?
- ‘మనిషి లాంటి’ చేప: ఇది కేన్సర్‌కి పరిష్కారం చూపుతుందా?
- మాస్క్ చరిత్ర: 17వ శతాబ్దం నాటి కాకి ముక్కు మాస్క్ నుంచి నేటి కోవిడ్-19 మాస్క్ వరకు...
- సింధు నదీజలాల ఒప్పందం వల్ల భారత్ నష్టపోతోందా.. అసలు ఎందుకీ ఒప్పందం చేసుకున్నారు?
- మహిళల మోకాళ్లు, చిరిగిన జీన్స్‌పై ఎందుకింత చర్చ జరుగుతోంది
- కొండ బారిడి: తుపాకులు గర్జించిన నేలలో ఇప్పుడు సేంద్రియ వ్యవసాయ విప్లవం
- రాయలసీమలోని ఈ గ్రామంలో ప్రతి ఇంటి ముందూ సమాధులు ఎందుకున్నాయ్?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








