Mangal Pandey: భారత సైనికులను బలవంతంగా క్రైస్తవులుగా మారుస్తున్నారని వదంతులు వచ్చినప్పుడు ఏం జరిగింది?

మంగళ్ పాండే

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, అనంత్ ప్రకాశ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

మంగళ్ పాండే 1827 జులై 19న పుట్టారు. ఆయనకు 1857 ఏప్రిల్ 8న ఉరిశిక్ష అమలు చేశారు.

స్థానిక తలారులు మంగళ్ పాండేను ఉరి తీయడానికి ఒప్పుకోకపోవడంతో, కోల్‌కతా నుంచి నలుగురు తలారులను పిలిపించి ఆయనను ఉరి తీశారు.

కానీ మంగళ్ పాండే తనను ఉరి తీయడానికంటే చాలా రోజుల ముందే ఆత్మహత్యాయత్నం చేశాడనేది చాలా కొద్ది మందికే తెలిసిన విషయం. ఆ ప్రయత్నంలో ఆయన గాయపడ్డారు కూడా.

మంగళ్ పాండేకు ఉరిశిక్ష విధిస్తున్నట్లు చెబుతున్న పత్రాలు

ఫొటో సోర్స్, NATIONAL ARCHIVES

ఫొటో క్యాప్షన్, 1857 ఏప్రిల్ 8న మంగళ్ పాండేకు ఉరిశిక్ష విధిస్తున్నట్లు చెబుతున్న పత్రాలు

1857 మార్చిలో జరిగిన ఘటన

అది 1857 సంవత్సరం. మార్చి 29. మంగళ్ పాండే 34వ బెంగాల్ నేటివ్ ఇన్ఫాంట్రీతో బారక్‌పూర్‌లో మొహరించి ఉన్నారు. అదే సమయంలో సిపాయిలను బలవంతంగా క్రైస్తవులుగా మారుస్తున్నారంటూ రకరకాల వదంతులు వ్యాపించడం మొదలైంది.

భారత సైనికులను చంపడానికి యూరోపియన్ సైనికులు భారీగా వస్తున్నారని మరో వదంతి కూడా జోరందుకుంది.

చరిత్రకారుడు కిమ్ ఎ వాగనర్ తన 'ద గ్రేట్ ఫియర్ ఆఫ్ 1857-రూమర్స్, కాన్స్‌పయిరీస్ అండ్ మేకింగ్ ఆఫ్ ద ఇండియన్ అప్‌రైజింగ్' పుస్తకంలో మార్చి 29న జరిగిన ఆ ఘటనను వర్ణించారు.

"సిపాయిల మనసులో గూడుకట్టుకున్న భయాన్ని పోగొట్టేందుకు, యూరోపియన్ సైనికులు భారత సైనికులపై దాడి చేయడం అనేది వదంతి అని మేజర్ జనరల్ జేబీ హియర్‌సీ కొట్టిపారేశారు. కానీ సిపాయిల వరకే చేరిన ఆ వదంతుల గురించి మాట్లాడిన హియర్‌సీ వాళ్లను మరింత భయపెట్టి ఉండొచ్చు. ఆయన మాటల వల్ల భయపడ్డ వారిలో 34వ బెంగాల్ నేటివ్ ఇన్ఫాంట్రీ సిపాయి మంగళ్ పాండే కూడా ఉన్నారు" అని రాశారు.

మంగళ్ పాండే

ఫొటో సోర్స్, Getty Images

రక్తమోడిన మార్చి 29 సాయంత్రం

మార్చి 29న సాయంత్రం ఆ ఘటనకు ముందు మంగళ్ పాండే తన తుపాకీ శుభ్రం చేస్తున్నారని వాగనర్ రాశారు.

"సాయంత్రం 4 గంటలు. మంగళ్ పాండే తన గుడారంలో తుపాకీ శుభ్రం చేసుకుంటున్నారు. కాసేపటి తర్వాత ఆయనకు యూరోపియన్ సైనికుల విషయం తెలిసింది. సిపాయిలు బెదిరిపోయి ఉండడంతో, గంజాయి మత్తులో ఉన్న మంగళ్ పాండే భయపడిపోయారు. అధికారిక టోపీ, జాకెట్, ధోవతితో ఉన్న పాండే తన కత్తి, తుపాకీ తీసుకుని క్వార్టర్ గార్డ్ బిల్డింగ్ దగ్గరున్న పరేడ్ గ్రౌండ్ వైపు పరిగెత్తారు.

మంగళ్ పాండే బ్రిటన్ సైనిక అధికారులపై దాడి చేసిన ఘటనను బ్రిటన్ మహిళా చరిత్రకారులు రోజీ లిల్‌వెలన్ జోన్స్ తన 'ద గ్రేట్ అప్‌రైజింగ్ ఇన్ ఇండియా, 1857-58 అన్‌టోల్డ్ స్టోరీస్ అండ్ బ్రిటిష్‌' పుస్తకంలో రాశారు.

"కత్తి, తుపాకీ తీసుకున్న మంగళ్ పాండే క్వార్టర్ గార్డ్(బిల్డింగ్) ముందు తిరుగుతూ తన రెజిమెంటులో వారిని రెచ్చగొట్టడం మొదలుపెట్టారు. యూరోపియన్ సైనికులతో తమను అంతం చేస్తారని చెప్పి రెజిమెంట్ సైనికులను రెచ్చగొడుతున్నారు. సార్జంట్ మేజర్ జేమ్స్ హ్యూసన్‌ ఏం జరుగుతోందో తెలుసుకోడానికి నడిచి బయటకు వచ్చారు. ఆ మొత్తం ఘటనకు ప్రత్యక్ష సాక్షి అయిన హవల్దార్ షేఖ్ పల్టూ వివరాల ప్రకారం పాండే హ్యూసన్ మీద కాల్పులు జరిపారు. కానీ, తూటాలు ఆయనకు తగల్లేదు" అని ఆమె చెప్పారు.

లఖ్‌నవూలో సిపాయిల తిరుగుబాటు సమయంలో దృశ్యం

ఫొటో సోర్స్, HULTON ARCHIVE

ఫొటో క్యాప్షన్, లఖ్‌నవూలో సిపాయిల తిరుగుబాటు సమయంలో దృశ్యం

తర్వాత మంగళ్ పాండే కత్తి కదిలింది

"అడ్జుటెంట్ లెఫ్టినెంట్ (లెఫ్టినెంట్‌కు సహాయంగా ఉండే అధికారి) బాంప్‌డే బాగ్‌కు దీని గురించి తెలీగానే ఆయన తన గుర్రంపై అక్కడకు చేరుకున్నారు. పాండే తన తుపాకీని లోడ్ చేస్తుండడం ఆయన చూశారు. మంగళ్ పాండే ఈసారి ఆయనపై కాల్పులు జరిపారు. మళ్లీ గురి తప్పింది. బాగ్ కూడా తన పిస్తోల్ తీసి పాండే మీద కాల్పులు జరిపారు. కానీ అవి కూడా పాండేకు తగల్లేదు" అని చరిత్రకారులు రోజీ లిల్‌వెలన్ జోన్స్ రాశారు.

చరిత్రకారుడు కిమ్ ఎ వాగనర్ ఆ తర్వాత ఏం జరిగిందో వివరంగా రాశారు.

"సార్జంట్ మేజర్ హ్యూసన్ 'మంగళ్ పాండేను పట్టుకో'మని ఈశ్వరీ ప్రసాద్‌కు చెప్పగానే, ఆయన హ్యూసన్‌తో 'నేనేం చేయగలను, మా నాయక్ అడ్జుటెంట్ దగ్గరకు వెళ్లాడు. హవల్దార్ ఫీల్డ్ ఆఫీసర్ దగ్గరకు వెళ్లారు. నేనొక్కడినే తనను ఒంటరిగా అదుపు చేయగలనా' అన్నారు.

మంగళ్ పాండే తర్వాత, సిపాయి ఈశ్వరి ప్రసాద్‌ను కూడా ఉరితీశారు

ఫొటో సోర్స్, HULTON ARCHIVE

ఫొటో క్యాప్షన్, మంగళ్ పాండే తర్వాత, సిపాయి ఈశ్వరి ప్రసాద్‌ను కూడా ఉరితీశారు

జోన్స్ కూడా తన పుస్తకంలో ఆ ఘటన గురించి చెప్పారు.

"మంగళ్ పాండే తన కత్తి తీసుకుని సార్జంట్ మేజర్, అడ్జుటెంట్ మీద దాడికి దిగారు. ఇద్దరినీ తీవ్రంగా గాయపరిచారు. ఆ సమయంలో షేఖ్ పల్టూ అనే ఒకే ఒక్క భారత అధికారి అక్కడ ఆ బ్రిటన్ సైనికాధికారులను కాపాడాలని ప్రయత్నించారు. పాండేతో దాడి చేయద్దని చెప్పారు. కానీ, మంగళ్ పాండే పల్టూ మీద కూడా దాడి చేశారు"

"తర్వాత మంగళ్ పాండేను పట్టుకోవడానికి నలుగురు సైనికులను పంపించాలని పల్టూ.. జమాదార్ ఈశ్వరీ ప్రసాద్‌కు చెప్పినపుడు, ఆయన పల్టూ పైకి తుపాకీ ఎక్కుపెట్టి.. మంగళ్ పాండేను పారిపోనివ్వకపోతే, కాల్పులు జరుపుతానని బెదిరించారు. నేను గాయపడి ఉండడంతో నేను పాండేను వదిలేశానని పల్టూ తర్వాత చెప్పారు" అని ఆమె తన పుస్తకంలో రాశారు.

సిపాయిల తిరుగుబాటు

ఫొటో సోర్స్, HULTON ARCHIVE

చివరి తూటాను కాలి వేలితో పేల్చిన మంగళ్ పాండే

ఆ తర్వాత మంగళ్ పాండే తన సహచరులందరినీ గట్టిగా తిడుతూ, "మీరంతా కలిసి నన్ను రెచ్చగొట్టి, ఇప్పుడు నాకు సాయంగా రారేంటి" అని అరిచారు.

"అశ్వికదళం, పదాతిదళంలోని సైనికులు మంగళ్ పాండే వైపు వెళ్లడం మొదలెట్టారు. అది చూడగానే మంగళ్ పాండే చేతిలోని తుపాకీ బారెల్‌ను తన గుండెకు పెట్టుకున్నారు. కాలి బొటనవేలితో ట్రిగ్గర్ నొక్కారు. ఆ తూటా పేలడంతో ఆయన జాకెట్, బట్టలకు మంటలు అంటుకున్నాయి. గాయపడిన ఆయన నేలమీద పడిపోయారు" అని జోన్స్ తన పుస్తకంలో చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)