300 ఏళ్ల మొఘల్ సామ్రాజ్యం చివరి రోజుల్లో ఏం జరిగింది? చక్రవర్తి బహదూర్ షా జఫర్ ‘బోనులో జంతువు’ ఎందుకయ్యారు?

ఫొటో సోర్స్, PRINT COLLECTOR
- రచయిత, రేహాన్ ఫజల్
- హోదా, బీబీసీ ప్రతినిధి
అది 1857, మే 11. సోమవారం. రంజాన్ మాసంలో 16వ రోజు.
ఉదయం 7 గంటలకు మొఘల్ చక్రవర్తి బహదూర్ షా ఎర్రకోటలో నదికి ఎదురుగా ఉన్న మసీదులో ఉదయం నమాజు పూర్తి చేశారు.
సరిగ్గా అప్పుడే, యమునా వంతెన దగ్గర టోల్ హౌస్ నుంచి పొగలు రావడం కనిపించింది.
వెంటనే కారణం తెలుసుకోమని ఆయన తన అనుచరులతో చెప్పారు. ప్రధాన మంత్రి హకీమ్ అహసానుల్లా ఖాన్‌ను, కోట రక్షణను చూసుకునే కెప్టెన్ డగ్లస్‌ను వెంటనే పిలిపించారు.
ఆంగ్లేయుల సైనిక యూనిఫాంలో ఉన్న కొందరు భారతీయులు చేతుల్లో కత్తులతో యమునా నది దాటి వస్తున్నారని అనుచరులు ఆయనకు చెప్పారు. వారు నది తూర్పు తీరంలో ఉన్న టోల్ హౌస్‌కు నిప్పుపెట్టారని, దాన్ని లూటీ చేశారని తెలిపారు.

ఫొటో సోర్స్, INDIAPICTURES
చక్రవర్తికి సందేశం
విషయం తెలీగానే నగరం చుట్టూ, కోటలో అన్ని తలుపులూ మూసివేయాలని చక్రవర్తి ఆదేశించారు.
కానీ, సాయంత్రం నాలుగు గంటలకు మిమ్మల్ని కలవాలని అనుకుంటున్నామని తిరుగుబాటుదారుల నాయకుడు చక్రవర్తికి సందేశం పంపించాడు.
సైనికులందరూ దీవాన్-ఏ-ఖాస్ పక్కనే గుమిగూడి తుపాకులు, పిస్తోళ్లతో గాల్లోకి కాల్పులు జరపడం ప్రారంభించారు.
అప్పట్లో దిల్లీలోని ఒక సంపన్నుడు అబ్దుల్ లతీఫ్ తన డైరీలో ఆరోజు జరిగింది రాశారు.
“అప్పుడు చక్రవర్తి పరిస్థితి చదరంగంలో చెక్ పెట్టిన తర్వాత బాద్షా పరిస్థితి ఎలా ఉంటుందో అలాగే ఉంది. చాలాసేపు మౌనంగా ఉన్న బహదూర్ షా జఫర్ “నాలాంటి వృద్ధుడిని ఎందుకిలా అవమానిస్తారు.? ఈ గోలకు కారణం ఏంటి? మా జీవితంలో ఇప్పటికే సూర్యుడు అస్తమించబోతున్నాడు. ఇవి మా జీవితంలో చివరి రోజులు. ఇలాంటి సమయంలో మేం ఒంటరితనాన్నే కోరుకుంటున్నాం” అన్నారని రాశారు.

ఫొటో సోర్స్, Getty Images
తిరుగుబాటుదారులు ఆ తరువాత ఒక్కొక్కరుగా వచ్చి చక్రవర్తి ముందు తలవంచి నిలబడ్డారు.

దానికి సంబంధించిన మరో వివరణను చార్లెస్ మెట్‌కాఫ్ తన ‘టూ నేషన్స్ నరేటివ్’లో ఇచ్చారు. “అహసానుల్లాహ్ ఖాన్ ఆ సైనికులతో.. మీరు ఆంగ్లేయుల కోసం పనిచేస్తున్నారు. ప్రతి నెలనెలా జీతం తీసుకోడానికి అలవాటు పడ్డారు. చక్రవర్తి దగ్గర ఎలాంటి ఖజానా లేదు. ఆయన మీక జీతాలెలా ఇవ్వగలరు” అన్నారు.
“సైనికులు ఆయనతో ‘మేం దేశంలో ఉన్న డబ్బంతా మీ ఖజానాలోకి తీసుకొచ్చి పడేస్తాం’ అన్నారు. జఫర్ షా వారితో ‘మా దగ్గర సైన్యం. ఆయుధాలు, డబ్బు ఏవీ లేవు’ అన్నారు. తిరుగుబాటుదారులు ‘మాకు మీ దయ ఉంటే చాలు, మీకోసం అన్నీ తీసుకొచ్చి ఇస్తాం’ అన్నారు.
“జఫర్ కాసేపు మౌనంగా ఉన్నారు. అప్పట్లో ఆయన ఉన్న పరిస్థితుల్లో వెంటనే నిర్ణయం తీసుకోవడం చాలా కష్టం. కానీ చక్రవర్తి ఆలస్యం చేయకుండా ‘సరే’ అన్నారు. ఆయన ఒక కుర్చీలో కూర్చోగానే, సైనికులందరూ ఒక్కొక్కరుగా వచ్చి ఆయన ముందు తలవంచారు. వాళ్ల తలలపై ఆయన తన చేయి ఉంచారు” అని రాశారు.
తర్వాత కొందరు సైనికులు కోటలోని కొన్ని గదులను విడిదిగా చేసుకున్నారు. మరికొందరు దీవాన్-ఏ-ఆమ్‌లో పడకలు వేసుకున్నారు.

వెండి సింహాసనం, కొత్త నాణేలు
చక్రవర్తి అంత పెద్ద దళాన్ని తన అదుపులో ఉంచుకుని, వారికి అన్నిరకాల ఏర్పాట్లు చేసే పరిస్థితిలో లేరు.
దాంతో ఆయనే ఆ సైనికుల అదుపులోకి వెళ్లిపోయారు. తర్వాత రోజు చక్రవర్తి అందమైన దుస్తులు ధరించారు.
ఒక పాత వెండి సింహాసనాన్ని శుభ్రంగా తుడిచి బయటకు తీసుకొచ్చారు. కొంతమంది సైనికాధికారులు, సంపన్నులకు చక్రవర్తి తరఫున బిరుదులు కూడా ఇచ్చారు.
చక్రవర్తి పేరున నాణేలు ముద్రించడం కూడా మొదలైంది. తర్వాత ఒక భారీ ఫిరంగులు పేల్చిన శబ్దాలు వినిపించాయి.

ఫొటో సోర్స్, PRINT COLLECTOR
తూటాలకు ఆవు, పంది కొవ్వు
1857 మే 10న మీరఠ్‌లోని బెంగాల్ అశ్వికదళంలో కొందరు సైనికులు దిల్లీ వైపు రావడంతో ఈ తిరుగుబాటు ప్రారంభమైంది.
1857లో జరిగిన ఘటనలపై ప్రత్యేకంగా పరిశోధనలు చేసిన ప్రముఖ చరిత్రకారులు రానా సఫ్వీ అలా ఎందుకు జరిగిందో చెప్పారు.
“అదే సమయంలో ఇన్‌ఫీల్డ్ రైఫిల్స్ వచ్చాయి. వాటి తూటాలను పళ్లతో కొరికి వాటిలో వేయాల్సి ఉంటుంది. వాటికి ఆవు, పంది కొవ్వు పూశారని ఆరోజుల్లో వదంతులు వచ్చాయి. దాంతో ముస్లింలు, హిందువులు వాటిని తాకడానికి వెనకాడారు.
కానీ సైనికుల్లో అసంతృప్తి పెరగడానికి వేరే కారణాలు కూడా ఉన్నాయి. వారిని యుద్ధాల కోసం సముద్రాల అవతల విదేశాలకు పంపించేవారు. బ్రాహ్మణుల్లో ఎవరైనా సముద్రం దాటితే వారి మతం అంతం అవుతుందని భావించేవారు.
వారికి ప్రమోషన్లు కూడా లభించేవి కావు. భారత సైనికులు సుబేదార్ పదవిని దాటి పైకి వెళ్లలేకపోయేవారు. ఆరోజు తిరుగుబాటు చేసిన భారత సైనికులు తమ బ్రిటిష్ అధికారులను చంపేశారు. 44 మైళ్ల దూరంలో ఉన్న దిల్లీ వైపు బయల్దేరారు.

ఫొటో సోర్స్, PRINT COLLECTOR
దిల్లీ ప్రజల ఘన స్వాగతం లేదు
మొదట్లో దిల్లీ ప్రజలు తిరుగుబాటుదారులకు స్వాగతం పలకలేదు, నగరంలో కొన్ని వర్గాలు, బహదూర్ షా సన్నిహితులు కూడా వారు చేసిన పనిని వ్యతిరేకించారు.
తిరుగుబాటుదారులు చక్రవర్తి ముందు కూడా తగిన మర్యాదతో ప్రవర్తించేవారు కాదు. మాటిమాటికీ సభ నియమాలను ఉల్లంఘించేవారు. దర్బారులోకి వచ్చే ముందు బూట్లు విప్పకపోవడం, చక్రవర్తి ముందే ఆయుధాలతో తిరగడం లాంటివి చూసి లోపలున్న వారి నుంచి అభ్యంతరం వ్యక్తమైంది.
ప్రముఖ చరిత్రకారుడు, ‘బిసీజ్డ్ వాయిసెస్ ఫ్రం ఢిల్లీ 1857’ రచయిత మహమూద్ ఫారూఖీ తన పుస్తకంలో ఆనాటి స్థితిని రాశారు. “దిల్లీ ప్రజలు చాలా కోపంగా ఉన్నారు. అంటే, అంతమాత్రాన వారు ఆంగ్లేయులతో యుద్ధానికి వ్యతిరేకం అని కాదు. నగరంలో ప్రతి ఒక్కరూ వారితో యుద్ధం చేయాలనే కోరుకునేవారు” అన్నారు.

ఫొటో సోర్స్, APIC
అరాచకం మధ్య కూడా కొనసాగిన వ్యవస్థ
ఆ ఘటన దిల్లీ ప్రజల జీవితాల్లో కల్లోలాన్ని సృష్టించింది. కానీ ఫారూఖీ మాత్రం నగరంలో పరిస్థితి గందరగోళంగా ఉన్నా వ్యవస్థ మొదటిలాగే కొనసాగింది అని రాశారు.
“1857 గురించి చెప్పాలంటే, అప్పట్లో భారత్‌లో ఐకమత్యం లేదని అంటారు. ప్రతిచోటా అరాచకం పెరిగిపోయింది. సైనికులకు ఎలాంటి క్రమశిక్షణ లేకుండా పోయింది. నేను నా పుస్తకంలో అదే చెప్పడానికి ప్రయత్నించా. కానీ లక్షన్నర జనాభా ఉన్న నగరంలోకి 30 వేల మంది సైనికులు వస్తే కాస్త గందరగోళం ఏర్పడుతుంది అనేది తెలిసిందే. కానీ, అలాంటి సమయంలో కూడా ఆశ్చర్యపరిచేలా వ్యవస్థ కొనసాగింది. కమాండర్ ఇన్ చీఫ్ యుద్ధానికి వెళ్లని సైనికులను తీసుకురండి అని కొత్వాల్‌తో చెబితే, ఆయన వారిని పట్టుకుని వచ్చేవారు. వాళ్లు క్షమించమని కూడా అడిగేవారు. యుద్ధంలో 500 మంచాలు అవసరమై, వాటి సంఖ్య తగ్గినపుడు, వాటిని వెంటనే అక్కడకు చేర్చేవారు. అంటే అక్కడ ఏదో ఒక వ్యవస్థ ఉందనే అర్థం చేసుకోవాలి. అలాంటి పనులన్నీ అలా జరిగిపోవుగా”
యుద్ధంలో సైనికులు మాత్రమే ఉండరు. అప్పుడైనా, ఇప్పుడైనా ఇసుక సంచులు కావాలి. నీళ్లు, సరుకులు, వాటిని తీసుకొచ్చే కూలీలు కూడా ఉంటారు. ఒక్కో సైనికుడి వెనుక నలుగురు కూలీలు పనిచేస్తారు. ఒక వ్యవస్థ అనేది లేకుంటే వారందరూ ఎక్కడనుంచి వస్తారు” అన్నారు.

ఫొటో సోర్స్, DEA / BIBLIOTECA AMBROSIANA
56 మంది ఆంగ్లేయ మహిళలు, పిల్లల హత్యం
మే 12న ఉదయంలోపే ఆంగ్లేయులు దిల్లీని పూర్తిగా ఖాళీ చేశారు. కానీ కొందరు ఆంగ్లేయ మహిళలు, ఎర్రకోటలో వంటగది దగ్గరగా ఉన్న కొన్ని గదుల్లో దాక్కున్నారు. చక్రవర్తి వద్దని అడ్డుకుంటున్నా, తిరుగుబాటుదారులు వారందరినీ చంపేశారు.
“తిరుగుబాటుదారులు దాడి చేసినప్పుడు ఆంగ్లేయులు చాలామంది దిల్లీ వదిలి పారిపోయారు. కానీ ఆంగ్లేయ మహిళలు కోట లోపలికి వచ్చి ఒక భవనంలో దాక్కున్నారు. ఆ 56 మందిలో ఎక్కువగా మహిళలు, పిల్లలే ఉన్నారు. సైనికులు వారందరినీ క్రూరంగా చంపేశారు” అని రానా సఫ్వీ చెప్పారు.
తర్వాత, బహదూర్‌షా జఫర్ మీద బ్రిటిష్ విచారణ జరిగినప్పుడు మహిళలను చంపించారని ఆయనపై అతిపెద్ద ఆరోపణ నమోదైంది.
అయితే, మనం జహీర్ దెహల్వీ పుస్తకం చదివితే అందులో ప్రత్యక్ష సాక్ష్యులు చాలా మంది “చక్రవర్తి ఆ సమయంలో సైనికులకు నచ్చజెప్పడానికి ప్రయత్నించారని, అమాయకులను చంపమని ఏ మతంలోనూ చెప్పలేదని అన్నారని” చెప్పారు.

ఫొటో సోర్స్, PRINT COLLECTOR
ఆంగ్లేయుల మారణహోమం
కానీ, కొన్నిరోజుల తర్వాత దిల్లీ నుంచి వెళ్లిపోయిన ఆంగ్లేయులు మళ్లీ లోపలికి వచ్చారు. అంబాలా నుంచి వచ్చిన ఆంగ్లేయ సైన్యం, తిరుగుబాటుదారులపై పైచేయి సాధించి దిల్లీలోకి అడుగుపెట్టింది.
వారు లోపలికి వచ్చాక మారణహోమం సృష్టించారు. ‘కచ్చా చలా’ అనే ఒకే ఒక వీధిలో 1400 మందిని చంపేశారు.
ఆనాటి బ్రిటిష్ సైనికుల్లో 19 ఏళ్ల ఎడ్వర్డ్ విబ్బార్డ్ కూడా ఉన్నారు. ఆయన తన పినతండ్రి గార్డెన్‌కు ఒక లేఖ రాశారు.

ఫొటో సోర్స్, FELICE BEATO
అందులో “నేను ఇంతకు ముందు ఎన్నో భయానక దృశ్యాలు చూశాను. కానీ నిన్న చూసిన దృశ్యాలను, ఇక జీవితంలో ఎప్పటికీ చూడకూడదని నేను దేవుడిని కోరుకుంటున్నాను.
మహిళలను వదిలేశారు, కానీ వారి భర్తలను, కొడుకులను చంపుతుంటే ఆ ఆక్రందనలు ఇప్పటికీ నా చెవుల్లో మార్మోగుతున్నాయి. వారిపై నాకు ఎలాంటి దయ లేదనే విషయం ఆ దేవుడికి తెలుసు. కానీ వృద్ధులందరినీ ఒక దగ్గరికి చేర్చి వారిపై బుల్లెట్ల వర్షం కురిపించినప్పుడు అది నన్ను కదిలించకుండా ఉండలేకపోయింది” అని రాశారు.

ఫొటో సోర్స్, NURPHOTO
మిర్జా గాలిబ్‌ను కూడా వదల్లేదు
మహమూద్ ఫారూఖీ “1857 సమయంలో దిల్లీ అంతటా రక్తపాతం కొనసాగింది. ప్రపంచంలోనే అత్యంత బలమైన సైన్యంతో పోరాడుతున్నప్పుడు అలాగే జరుగుతుంది. నగరంలో అత్యంత భయానక వాతావరణం ఏర్పడింది. కానీ, దిల్లీలోకి మళ్లీ వచ్చిన తర్వాత ఆంగ్లేయులు నగరంలో ఎంత మారణహోమం సృష్టించారంటే దానికి వేరే ఎలాంటి ఉదాహరణలూ లభించవు.
నగరంలోని అందరినీ దిల్లీ నుంచి బయటకు తరిమేశారు. మొత్తం ఆరు నెలలపాటు వారు ఏ నీడా లేకుండా వర్షంలో తడుస్తూ, చలికి వణుకుతూ ఉన్నారు. దాదాపు నగరంలో అన్ని ఇళ్లూ దోచుకున్నారు.
అప్పట్లో దిల్లీలోనే ఉంటున్న మీర్జా గాలిబ్ ఎంతగా కదిలిపోయారంటే, 1857 తర్వాత ఆయన తన 12 ఏళ్ల శేష జీవితంలో మొత్తం 11 గజల్స్ రాశారు. అంటే ఏడాదికి ఒక గజల్ కూడా రాయలేకపోయారు.

ఫొటో సోర్స్, PRINT COLLECTOR
లొంగిపోయిన బహదూర్ షా జఫర్
ఆంగ్లేయులు దిల్లీలో అడుగుపెట్టగానే, బహదూర్ షా జఫర్ ఎర్రకోట వెనక నుంచి పల్లకీలో మొదట నిజాముద్దీన్ సమాధి దగ్గరకు, తర్వాత హుమాయూన్ సమాధి దగ్గరకు వెళ్లారు. అక్కడే 1857 సెప్టెంబర్ 18న ఆయన్ను కెప్టెన్ విలియం హడ్సన్ అరెస్ట్ చేశారు.
తర్వాత సీవీ శాండర్స్ కు రాసిన లేఖలో ఆయన నాటి ఘటన గురించి ప్రస్తావించారు.
“మీర్జా ఇలాహీబక్ష్, ఒక మౌల్వీతో కలిసి చక్రవర్తి జఫర్ ఒక పల్లకీలో బయటకు వచ్చారు. ఆయన వెనక బేగమ్ తన కొడుకు మీర్జా జవాన్ బక్ష్, తండ్రి మీర్జా కుళీ ఖాన్‌తో కలిసి బయటకు వచ్చారు”.
“తర్వాత ఆ రెండు పల్లకీలనూ అడ్డుకున్నాం. వారి ప్రాణాలకు ప్రమాదం లేదని చక్రవర్తి నా నోటితో వినాలని చూశారు. నేను నా గుర్రం మీద నుంచి దిగి, మీ ప్రాణాలకు గ్యారంటీ ఇస్తున్నాం. మానుంచి తప్పించుకోడానికి ఎలాంటి ప్రయత్నాలూ చేయకండి” అన్నాను.
“నేను వారితో మిమ్మల్ని అవమానించడం జరగదని, మీ గౌరవం కాపాడతామని హామీ ఇచ్చాను” అని చెప్పారు.

ఫొటో సోర్స్, BETTMANN
బహదూర్ షా ముగ్గురు కొడుకుల హత్య
మీ ప్రాణాలకు హాని తలపెట్టం అని బహదూర్ షా జఫర్‌కు ముందే భరోసా ఇచ్చారు. కానీ, ఆయన ముగ్గురు కొడుకులు మీర్జా ముఘల్, ఖిజ్రా సుల్తాన్, అబూ బక్ష్ లను పాయింట్ బ్లాంక్ రేంజిలో కాల్చి చంపారు. వారు ఆయుధాలు కూడా వదిలి లొంగిపోయిన సమయంలో అంత దారుణంగా చంపారు.
దీనిపై తన సోదరికి లేఖ రాసిన విలియమ్ హడ్సన్ “నేనంత క్రూరుడిని కాను. కానీ ఈ దుర్మార్గులకు ఈ భూమి నుంచి విముక్తి కల్పించినందుకు నాకు చాలా సంతోషంగా అనిపించింది” అన్నారు.
బహదూర్ షా చక్రవర్తిని ఎర్రకోటలో ఒక గదిలో ఒక మామూలు ఖైదీలా ఉంచారు.
సర్ జార్జ్ కాంప్‌బెల్ తన ‘మెమౌర్స్ ఆఫ్ మై ఇండియన్ కెరియర్’లో “చక్రవర్తిని ఒక విధంగా పంజరంలో జంతువును బంధించినట్లు ఉంచాం” అని రాశారు.

ఫొటో సోర్స్, NCERT
బహదూర్ షా జఫర్ చివరి రోజులు
ఆ సమయంలో అక్కడే పనిచేసిన లెఫ్టినెంట్ చార్లెస్ గ్రిఫిత్స్ కూడా తన ‘సీజ్ ఆఫ్ డిల్హీ’ పుస్తకంలో మొఘల్ సామ్రాజ్యం చివరి ప్రతినిధి ఒక మామూలు మంచం మీద కూర్చుని ఉన్నారు. ఆయన తెల్లటి పొడవాటి గడ్డం నడుము వరకూ ఉంది. ఆయన తెల్లటి బట్టలు, అదే రంగు తలపాగా ధరించి ఉన్నారు”
“ఆయన వెనక ఇద్దరు సేవకులు ఉన్నారు. నెమలి ఈకల విసనకర్రలతో ఆయనకు విసురుతున్నారు. ఆయన నోట ఒక్క మాట కూడా రావడం లేదు. చూపులు నేలను చూస్తున్నాయి. చక్రవర్తికి మూడు అడుగుల దూరంలో ఒక బ్రిటిష్ అధికారి కూర్చుని ఉన్నాడు”
“అధికారికి రెండు వైపులా తుపాకులు పట్టుకున్న ఆంగ్లేయ సెంట్రీలు నిలబడి ఉన్నారు. చక్రవర్తిని ఎవరైనా కాపాడాలని ప్రయత్నిస్తే, ఆయన్ను వెంటనే చంపేయాలని వారికి ఆదేశాలు ఉన్నాయి” అని రాశారు.

ఫొటో సోర్స్, MUGHAL ART
బోనులో జంతువులా గదిలో బంధించారు
బంధీగా ఉన్న బహదూర్ షాను తీవ్రంగా అవమానించారు. ఎర్రకోటలో ఉన్న మొఘల్ చక్రవర్తి ఎలా ఉంటారో చూడాలని ఆంగ్లేయులు భారీగా వచ్చేవారు.
ఎర్రకోటను చూడ్డానికి వచ్చే ఆంగ్లేయ పర్యాటకులందరూ ఆయనను ఉంచిన గదికి వచ్చి బహదూర్ షా జఫర్‌ను చూసేవారు. అలాంటి దుర్భర పరిస్థితుల్లో దిల్లీ చక్రవర్తి తన మృత్యువు కోసం మిగతా ఏడాదంతా ఎదురుచూస్తూ గడిపారనేది సుస్పష్టం” అని మహమూద్ ఫారూఖీ రాశారు.
దిల్లీ నుంచి ఆయన్న రంగూన్ పంపించారు. దాని సమీపంలోని బర్మా చక్రవర్తిని భారత్‌లో రత్నగిరికి తీసుకొచ్చారు. చివరికి బహదూర్ షా జఫర్ ముమ్మాటికీ నిజమే రాశారు. “జఫర్ ఎంత దురదృష్టవంతుడు, తను పాలించిన చోట ఖననం కోసం రెండు గజాల భూమి కూడా దొరకలేదు” అన్నారు.

ఫొటో సోర్స్, PRINT COLLECTOR
చక్రవర్తి మరణం
1862 నవంబర్ 7న రంగూన్‌లోని ఒక జైలు గది నుంచి 87 ఏళ్ల ఒక వృద్ధుడి శవాన్ని కొందరు బ్రిటిష్ సైనికులు మోసుకెళ్లి జైలు పెరట్లో అంతకు ముందే తవ్వి ఉంచిన ఒక గొయ్యి దగ్గరకు తీసుకొచ్చారు. ఆ శవం వెనుక మృతుడి ఇద్దరు కొడుకులు, పొడవాటి గడ్డం ఉన్న ఒక మౌల్వీ కూడా నడుస్తున్నారు.
ఆ అంత్యక్రియల్లో పాల్గొనడానికి మహిళలను అనుమతించలేదు. బజారులో ఉన్న కొంతమందికి ఆ గురించి సమాచారం అందింది. వారు అంత్యక్రియల వైపు కదిలారు. కానీ ఆయుధాలతో ఉన్న సైనికులు వారిని దగ్గరికి రానీయలేదు. ఆంగ్లేయులు ఆ శవాన్ని ఖననం చేసే ముందు, అది త్వరగా కుళ్లి, మట్టిలో కలిసిపోయేలా దానిపై సున్నం చల్లారు.
ఒక వారం తర్వాత బ్రిటిష్ కమిషనర్ హెచ్ఎన్ డేవిస్ లండన్ పంపించాల్సిన తన తన రిపోర్టులో “ఆ తర్వాత నేను మిగిలిన రాజకీయ ఖైదీల గురించి తెలుసుకోడానికి వారి ఇళ్లకు వెళ్లాను. అందరూ బాగానే ఉన్నారు. పెద్దాయన చనిపోయిన ప్రబావం ఎవరిమీదా లేదు. ఆయన పక్షవాతం వల్ల చనిపోయారు” అని చెప్పారు.
“ఖననం చేసిన రోజే ఉదయం 5 గంటలకు ఆయన మృతిచెందారు. సమాధికి నాలుగు వైపులా వెదుళ్లతో ఒక కంచె ఏర్పాటు చేశారు. ఆ కంచె పాడయ్యేలోపు అక్కడంతా గడ్డి మొలుస్తుందని, ఆ ప్రాంతాన్ని కప్పేస్తుంది".
"చివరి మొఘల్ చక్రవర్తిని ఖననం చేసింది ఇక్కడేననే విషయం ఎవరికీ తెలీకుండా మిగిలిపోతుంది” అని డేవిస్ రాశారు.
ఇవి కూడా చదవండి:
- రెండో ప్రపంచ యుద్ధంలో ఎవరికీ పెద్దగా తెలియని 8 మంది మహిళా 'వార్ హీరోలు'
- హిట్లర్ మరణించాడని ప్రపంచానికి బీబీసీ ఎలా చెప్పింది?
- ఫ్రెంచ్ సావిత్రి దేవికి జర్మన్ హిట్లర్‌కు ఏమిటి సంబంధం?
- 'నా పాపను బయోవేస్ట్ అన్నారు. ఆ మాటకు నా గుండె పగిలింది‘
- తల్లిపాలు ఎంతకాలం ఇస్తే మంచిది.. రెండేళ్లా? ఐదేళ్లా?
- చనిపోయాడని చెప్పారు.. కానీ పదేళ్ల తర్వాత తిరిగొచ్చాడు
- ఐవీఎఫ్: భర్తలు లేకుండానే తల్లులవుతున్న ఒంటరి మహిళలు
- మదర్స్ డే: అమ్మ కోసం వెదుకులాటలో అనుకోని మలుపులు
- ఈ 'అమ్మ'కు ఒక్క బ్రెస్ట్‌ఫీడింగ్ తప్ప అన్ని పనులూ వచ్చు!
- అమెరికాలో కరోనావైరస్ వల్ల కనీసం 1,00,000 మంది చనిపోతారు: డోనల్డ్ ట్రంప్
- కరోనావైరస్ సంక్షోభం తర్వాత గూగుల్, ఫేస్‌బుక్, యాపిల్, అమెజాన్ మరింత బలపడతాయా?
- కరోనావైరస్ లాక్డౌన్: దేశంలో నిరుద్యోగం, పేదరికం విపరీతంగా పెరిగిపోతాయా? సీఎంఐఈ నివేదిక ఏం చెప్తోంది?
- కాలాపానీ: నేపాల్ సరిహద్దులోని 35 చ.కి.మీ భూమి సమస్యను వాజ్‌పేయి నుంచి మోదీ వరకు ఎవ్వరూ ఎందుకు పరిష్కరించలేదు?
- ఏడు దశాబ్దాల కిందట సముద్రంలో అణుబాంబు పేలుడు.. ఇంకా మానని గాయం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)











