కరోనావైరస్ వల్ల అమెరికాలో కనీసం 1,00,000 మంది చనిపోతారు: డోనల్డ్ ట్రంప్

ట్రంప్

ఫొటో సోర్స్, EPA

అమెరికాలో కరోనావైరస్ మహమ్మారి వల్ల కనీసం ఒక లక్ష మంది చనిపోతారని ఆ దేశాధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ పేర్కొన్నారు.

ఆయన రెండు గంటల పాటు ఆన్‌లైన్ ‘ప్రజా సమావేశం’లో మాట్లాడుతూ.. తన ప్రభుత్వం చాలా నెమ్మదిగా ప్రతిస్పందించిందన్న వాదనను తోసిపుచ్చారు.

అమెరికాలో కోవిడ్-19 కారణంగా ఇప్పటికే 67,000 మంది చనిపోయారు.

అయితే.. ఈ ఏడాది చివరికల్లా వ్యాక్సీన్‌ అందుబాటులోకి వస్తుందని ట్రంప్ ఆశాభావం వ్యక్తంచేశారు. నిపుణులు మాత్రం అందుకు ఏడాది నుంచి ఏడాదిన్నర కాలం పడుతుందని భావిస్తున్నారు.

‘‘ఈ ఏడాది చివరికల్లా వ్యాక్సీన్ వస్తుందని నేను భావిస్తున్నా. అలా చెప్పకూడదని డాక్టర్లు అంటున్నారు. కానీ నేను అనుకున్నది నేను చెప్తా. వ్యాక్సీన్ త్వరగానే అందుబాటులోకి వస్తుందనుకుంటున్నా’’ అని ఆయన ఫాక్స్ న్యూస్ చానల్‌తో వ్యాఖ్యానించారు.

డోనల్డ్ ట్రంప్

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, లింకన్ మెమోరియల్ టౌన్ హాల్‌లో డోనల్డ్ ట్రంప్

ఈ ఆశావహ అంచనాతో విభేదిస్తున్న నిపుణుల్లో అమెరికాలో అంటురోగాల రంగంలో అత్యున్నత నిపుణుడు డాక్టర్ ఆంథొని ఫౌసీ, ఇంగ్లండ్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ క్రిస్ విట్టీ ఉన్నారు.

ఒక వ్యాక్సీన్‌ను అభివృద్ధి చేయటానికి 18 నెలల వరకూ సమయం పడుతుందని డాక్టర్ ఫౌసీ గతంలో చెప్పారు. వచ్చే ఏడాది లోగా ప్రభావవంతమైన వ్యాక్సీన్ కానీ, చికిత్స కానీ కనుగొనగలిగే అవకాశాలు అత్యంత స్వల్పంగా ఉన్నాయని ప్రొఫెసర్ విట్టీ గత నెలలో పేర్కొన్నారు.

ట్రంప్ తన అధ్యక్ష ఎన్నికల ప్రచారాన్ని పునఃప్రారంభించే ఉద్దేశంతో ఈ టౌన్ హాల్ (ప్రజా సమావేశం) భేటీ నిర్వహించారు. ఇందులో ప్రేక్షకులు ప్రశ్నలు అడగేందుకు వీలుంది.

దేశంలో కరోనావైరస్ వ్యాప్తి మొదలైనపుడు తన ప్రభుత్వం వేగంగా స్పందించటంలో విఫలమైందన్న వాదనలను కూడా ట్రంప్ తిరస్కరించారు. ‘‘మేం సరైన పనే చేశాం’’ అని చెప్పారు.

BBC News Telugu Banner కరోనావైరస్ గురించి మరిన్ని కథనాలు బ్యానర్ - బీబీసీ న్యూస్ తెలుగు
BBC Red Bottom Line Banner బీబీసీ రెడ్ బాటమ్ లైన్ బ్యానర్

పైగా, వైరస్ వ్యాప్తిని నిలువరించటంలో విఫలమైందంటూ ఆయన మరోసారి చైనాను నిందించారు.

‘‘వాళ్లు భీకరమైన తప్పు చేశారని నేను అనుకుంటున్నా. ఆ తప్పును ఒప్పుకోవటానికి వాళ్లు సిద్ధంగా లేరు. మేం అక్కడికి వెళ్లాలనుకున్నాం. కానీ మేం అక్కడికి రావటం వాళ్లకి ఇష్టంలేదు’’ అని వ్యాఖ్యానించారు.

అమెరికా నిఘా అధికారులను కూడా ట్రంప్ కొంత తప్పుపట్టారు. కరోనా విజృంభణ గురించి జనవరి 23వ తేదీ వరకూ వాళ్లు అప్రమత్తం చేయలేదన్నారు.

అయితే, అధ్యక్షుడికి నిఘా అధికారులు ఇచ్చే నివేదికల్లో జనవరి 3వ తేదీనే కరోనావైరస్ గురించి ప్రస్తావించినట్లు అమెరికా వార్తా చానళ్లైన సీఎన్ఎన్, ఏబీసీ కథనాలు చెప్తున్నాయి.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

కరోనావైరస్ హెల్ప్ లైన్
కరోనావైరస్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)