ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌పై మావోయిస్టుల లేఖ.. అందులో ఏముందంటే.. - Newsreel

మావోయిస్టులు

ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎదురుకాల్పుల్లో తమ సభ్యులు నలుగురు మరణించారని మావోయిస్టు పార్టీ అంగీకరించింది.

వారి పేర్లు నూపో సురేశ్, ఓడి సన్నీ (మహిళ), కోవాసి బద్రు, పద్దమ్ లఖ్మాగా పేర్కొంది.

ఈ నలుగురి ఫొటోలను విడుదల చేసింది.

కాగా మాడ్వి సుక్కా అనే గ్రామస్థున్ని పోలీసులు పట్టుకొని కాల్చేశారని ఆరోపించింది.

అయితే, బీబీసీ ఈ ఆరోపణలను స్వతంత్రంగా నిర్ధరించలేదు.

మావోయిస్టుల లేఖ

దాడి చేయడానికి వచ్చారు అందుకే..

సుక్మా, బీజాపుర్‌ జిల్లాల్లో వివిధ గ్రామాలపై దాడి జరిపేందుకు బస్తర్‌లోని ఐజీ పి. సుందర్‌రాజ్‌ నేతృత్వంలో ఏప్రిల్ 3న 2000 మంది జవాన్లు ఈ ప్రాంతానికి తరలి వచ్చారని, అందుకే తాము ఎదురుదాడికి దిగామని మావోయిస్టులు ప్రకటించారు.

దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ పేరుతో మంగళవారం ఓ లేఖను మావోయిస్టులు విడుదల చేశారు.

పోలీసులు దాడి చేయడానికి రావడంతో తమ సభ్యులు వారితో వీరోచితంగా పోరాడారని ఆ లేఖలో మావోయిస్టులు పేర్కొన్నారు.

ఈ పోరాటంలో తమ దళ సభ్యులు నలుగురు మరణించారని కూడా అందులో వెల్లడించారు.

ప్రధానమంత్రి మోదీ, హోంమంత్రి అమిత్‌షాలను జన విరోధులుగా, సామ్రాజ్యవాదులుగా పేర్కొంటూ, తమను చంపడానికి భారీ ఎత్తున సైన్యాన్ని పంపారని ఆరోపించారు.

తమ ఎదురుదాడిలో 24మంది పోలీసులు మరణించారని 31మందికి పైగా గాయపడ్డారని వారు ఈ లేఖలో పేర్కొన్నారు.

పోలీసులు తమ శత్రువులు కాదని ప్రకటించిన మావోయిస్టులు, మరణించిన పోలీసుల కుటుంబాలకు తమ సంతాపాన్ని తెలిపారు.

చర్చల గురించి

"మేం చర్చలకు ఎప్పుడూ సిద్ధమే. కానీ ప్రభుత్వానికి ఇందులో నిజాయితీ లేదు. చర్చల్లో పాల్గొన్న వారెవరూ గతంలో ఆయుధాలు వదిలేసి చర్చలకు వెళ్లలేదు. కాబట్టి ఆయుధాలు వదిలేస్తేనే చర్చలు జరుపుతామనే షరతు సరైంది కాదు. పోలీసు క్యాంపులను ఎత్తివేయాలి, దాడులు ఆపాలి, చర్చలకు అనువైన వాతావరణాన్ని కల్పించాలి. అప్పుడే చర్చలు సాధ్యం" అని మావోయిస్టులు లేఖలో పేర్కొన్నారు.

కనిపించకుండా పోయిన సీఆర్‌పీఎఫ్‌ జవాన్ తమ వద్ద క్షేమంగా ఉన్నాడని, అతన్ని విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నామని, అయితే ప్రభుత్వం నిర్దిష్టంగా మధ్యవర్తుల పేర్లను ప్రకటించాలని, అప్పటి వరకు జనతన సర్కారు దగ్గర ఆ జవాన్‌ క్షేమంగా ఉంటాడని మావోయిస్టులు ఆ లేఖలో తెలిపారు.

ఆ వార్తలను వెరిఫై చేస్తున్నాం..

తమ జవాన్ ఒకరు ఇప్పటికీ కనిపించడం లేదని, మావోయిస్టుల వద్ద బందీగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయని, అయితే, ఆ వార్తలను వెరిఫై చేసుకుంటున్నట్లు సీఆర్‌పీఎఫ్ డీజీ కుల్దీప్ సింగ్ చెప్పినట్లు ఏఎన్‌ఐ వార్తా సంస్థ తెలిపింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

'మట్టి సత్యాగ్రహం'లో తెలుగు రైతులు.. ఏపీ, తెలంగాణ నుంచి దిల్లీకి చేరిన మట్టి కుండలు

మట్టి సత్యాగ్రహం

కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళన కొనసాగుతోంది.

ఘాజీపూర్, సింఘూ సరిహద్దుల దగ్గర కొన్ని నెలలుగా రైతులు నిరసనలు చేపడుతున్నారు.

రైతు ఉద్యమంలో మట్టి సత్యాగ్రహం ఒక కీలక ఘట్టంగా భావిస్తున్నారు.

ఈ మట్టి సత్యాగ్రహంలో భాగంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని 150 గ్రామాలకు చెందిన రైతులు మట్టికుండలను పంపించారు.

విస్సా కిరణ్ కుమార్ నేతృత్వంలో రైతు స్వరాజ్య వేదిక బృందం వీటిని దిల్లీకి తీసుకుని వచ్చి రైతు ఉద్యమ నాయకులకు అందించారు.

ఉప్పు సత్యాగ్రహం ముగిసిన ఏప్రిల్ ఆరునే ఈ కార్యక్రమం చేపట్టామని వారు తెలిపారు.

మట్టి సత్యాగ్రహం

కేంద్రం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుని, రైతులకు కనీస మద్దతు ధర లభించేలా చట్టాన్ని తేవాలని డిమాండ్ చేస్తూ తెలుగు రాష్ట్రాల్లో కూడా రైతులు సమావేశాలు నిర్వహించారని రైతు స్వరాజ్య వేదిక పేర్కొంది.

నేరుగా రాలేక మట్టిని పంపించడం ద్వారా ఈ ఉద్యమానికి రైతులు తమ సంఘీభావం తెలిపారని విస్సా కిరణ్ కుమార్ అన్నారు.

మట్టి సత్యాగ్రహం

కనీస ధర రాకపోతే, మరింత మంది రైతులు అప్పుల్లో కూరుకుపోతారని కె. సాగరిక చెప్పారు.

ఆమె భర్త కొన్నేళ్ల క్రితం అప్పుల బాధ భరించలేక ఆత్మహత్య చేసుకున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో ఈ మట్టి సత్యాగ్రహ ప్రచారాన్ని అంబేద్కర్ జయంతి వరకు కొనసాగిస్తామని తెలిపారు.

ఇరాన్ అణు ఒప్పందం: వియన్నా చర్చలకు హాజరుకానున్న అమెరికా

ఫైల్

ఫొటో సోర్స్, Reuters

2018లో ట్రంప్ హయాంలో ఇరాన్‌ అణు ఒప్పందం నుంచి వైదొలిగింది అమెరికా.

ఈ ఒప్పందాన్ని పునరుద్ధరించాలని అమెరికా కొత్త అధ్యక్షుడు జో బైడెన్ భావిస్తున్నారు.

అందుకే వియన్నాలో జరిగే చర్చల్లో పాల్గొనాలని అమెరికా నిర్ణయించింది.

కానీ, ట్రంప్‌ గతంలో ఇరాన్‌పై అనేక ఆంక్షలు విధించారు.

వాటిని ఇప్పుడు బైడెన్ ఎత్తేయాలనుకుంటే ఇందులో భాగస్వాములుగా ఉన్న ఆరు దేశాలు కూడా ఆమోదం తెలపాల్సి ఉంటుంది.

ఈ ఆంక్షలు ఎత్తివేసే వరకు అమెరికాతో నేరుగా సంప్రదింపులు జరిపేది లేదని ఇరాన్ తెలిపింది.

ఆస్ట్రియాలో జరగనున్న సమావేశంలో అమెరికా ప్రతినిధులు పాల్గొంటున్నారు.

ఇరాన్ మరో చోటు నుంచి సమావేశానికి హాజరవుతుంది. మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్న చైనా, ఫ్రాన్స్, జర్మనీ, రష్యా, యూకే మరొకచోట నుంచి సమావేశంలో పాల్గొంటాయి.

"మా ముందున్న సవాళ్లను మేము తక్కువగా అంచనా వేయటం లేదు" అని యుఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్‌ ప్రతినిధి నెడ్ ప్రైస్ అన్నారు.

"ఇది ప్రారంభ దశ. ఈ చర్చల ద్వారా వెంటనే ఏదో పరిష్కారం లభిస్తుందని మేము అనుకోవడం లేదు. ఈ చర్చలు కూడా చాలా క్లిష్టంగా ఉండొచ్చని భావిస్తున్నాం" అని ఆయన అన్నారు.

ఇరాన్ అణు ఒప్పందం వివాదమేంటి

ఇరాన్ అణుబాంబును తయారు చేసి న్యూక్లియర్ శక్తిగా అవతరించాలని అనుకుంటోందని కొన్ని అగ్రదేశాలు భావిస్తాయి. అయితే, ఇరాన్ దీన్ని ఖండిస్తోంది.

2015లో ఇరాన్‌ మరో 6 దేశాలు ఒక అంగీకారానికి వచ్చాయి.

కఠినమైన ఆంక్షలు తొలగించినందుకు బదులుగా అణు కార్యక్రమాలను ఇరాన్ నిలిపివేయడం ఆ ఒప్పందం సారాంశం.

ఇప్పుడున్న సమస్య ఏమిటి?

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ ఒప్పందం నుంచి వైదొలిగి, ఇరాన్‌పై ఆంక్షలను తిరిగి విధించారు.

అప్పటి నుంచి ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించింది.

ఇప్పుడు అమెరికా కొత్త అధ్యక్షుడు జో బైడెన్ ఈ ఒప్పందాన్ని పునరుద్ధరించాలని అనుకుంటున్నారు.

మంగళవారం సమావేశంలో ఆంక్షల ఎత్తివేతపైనే దృష్టి సారిస్తామని ఇరాన్ విదేశాంగ శాఖ తెలిపింది.

దిల్లీలో ఇవాళ్టి నుంచి రాత్రి కర్ఫ్యూ

దిల్లీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, దిల్లీలోని ఇండియా గేట్

దిల్లీలో రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించిందని ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.

ఈ నిర్ణయం మంగళవారం రాత్రి నుంచి ఏప్రిల్ 30 వరకు అమల్లో ఉంటుందని దిల్లీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

కరోనావైరస్ కేసులు మళ్లీ పెరుగుతుండడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సోమవారం ఒక్కరోజునే దిల్లీలో 3,548 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. 15 మంది చనిపోయారు.

దీంతో కలిపి ఇప్పటివరకు దేశ రాజధానిలో కోవిడ్ సోకిన వారి సంఖ్య 6,79,962కు చేరింది. ప్రస్తుతం నగరంలో 14,589 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

line

నైజీరియా: జైలు మీద బాంబులు, గ్రెనేడ్లతో దాడి... 1,844 మంది ఖైదీలు పరార్

నైజీరియా
ఫొటో క్యాప్షన్, నైజీరియాలో సాయుధుల దాడి జరిగిన జైలు

నైజీరియాలోని ఒక జైలు నుంచి 1,800 మందికి పైగా ఖైదీలు పారిపోయారు. కొంతమంది సాయుధులు ఓవేరీ పట్టణంలోని జైలులోకి చొరబడి అడ్మినిస్ట్రేటివ్ బ్లాకు బాంబులతో పేల్చేశారని అధికారులు తెలిపారు.

అయితే, ఈ ఘటన తరువాత 35 మంది ఖైదీలు పారిపోవడానికి నిరాకరించి అక్కడే ఉండిపోయారు. మరో ఆరుగురు తిరిగి వెనక్కి వచ్చారు.

నిషిద్ధ ' ఇండిజీనస్ పీపుల్ బయాఫ్రా' సంస్థ ఈ దాడికి పాల్పడిందని పోలీసులు చెప్పారు. అయితే, ఆ సంస్థ ఈ దాడితో తమకు సంబంధం లేదని ప్రకటించినట్లు వార్తలు వచ్చాయి.

ఐమో రాష్ట్రంలోని ఈ జైలు నుంచి మొత్తంగా 1,844 మంది ఖైదీలు పారిపోయారని నైజీరియన్ కరెక్షనల్ సర్వీస్ ధ్రువీకరించింది.

సోమవారం తెల్లవారుజామున సాయుధ గుంపులు బస్సులు, ట్రక్కులలో ఓవేరీ కస్టోడియల్ సెంటర్లోకి దూసుకొచ్చారని, వారి వద్ద బాంబులు, మెషీన్ గన్లతో పాటు రాకెట్‌తో ప్రయోగించే గ్రెనేడ్లు కూడా ఉన్నాయని అధికారులు తెలిపారు.

నైజీరియా అధ్యక్షుడు ముహమ్మద్ బుహారీ, "ఇది ఉన్మాదంతో కూడిన తీవ్రవాద చర్య" అని అన్నారు. దాడి చేసిన వారిని, తప్పించుకున్న ఖైదీలను వెంటనే పట్టుకోవాలని ఆయన భద్రతా దళాలను ఆదేశించారు.

నైజీరియా జైలు

ఇండిజీనస్ పీపుల్ ఆఫ్ బయాఫ్రా సంస్థ ప్రతినిధి ఒకరు ఏఎఫ్‌పీతో మాట్లాడుతూ, సోమవారం నాటి దాడి వెనుక తాము ఉన్నామన్నది "అబద్ధం" అని చెప్పారు.

ఐమో రాష్ట్రం చాలా కాలంగా వేర్పాటువాదు ఉద్యమాలతో రక్తమోడుతోంది. ఇక్కడి స్థానిక ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి.

జనవరి నెల నుంచి ఈ ప్రాంతంలోని పోలీసు స్టేషన్లు, వాహనాల మీద దాడులు జరిగాయి. తుపాకులు, మందుగుండు సామగ్రిని భారీగా కొల్లగొట్టారు.

సోమవారం నాటి దాడి గురించి ఇప్పటివరకూ ఏ సంస్థా అది తమ పనే అని ప్రకటించలేదు.

వీడియో క్యాప్షన్, తల్లులను, శిశువుల ప్రాణాలు కాపాడుతున్న కారు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)