నైజీరియా: చిన్నారులను రేప్ చేసేవారికి క్యాస్ట్రేషన్ చేయాలని నిర్ణయం

ఫొటో సోర్స్, Getty Images
అత్యాచార నిందితుల విషయంలో కఠినంగా వ్యవహరించడానికి నిర్ణయించుకుంది నైజీరియాలోని కదునా రాష్ట్రం. ముఖ్యంగా చిన్నారులపై అత్యాచారాలకు పాల్పడేవారికి కఠిన శిక్ష విధించాలని అక్కడి పాలకు నిర్ణయించారు. 14 ఏళ్ల లోపు పిల్లలపై అత్యాచారం చేసిన కేసుల్లో దోషిగా తేలినవారికి ఆపరేషన్ చేసి పురుషత్వం కోల్పోయేలా(క్యాస్ట్రేషన్) చేయాలని నిర్ణయించారు. ఈ శిక్షకు అక్కడి ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
నైజీరియా వాయువ్య రాష్ట్రమైన కదుమాలో పాలకులు ఆమోదించిన ఈ శిక్ష చట్ట రూపం దాల్చడానికి ఆ రాష్ట్ర గవర్నర్ నాసిర్ అహ్మద్ ఎల్ రుఫాయీ సంతకం చేయాల్సి ఉంది.
రేపిస్టులు పదేపదే ఆ నేరం చేయకుండా వారికి క్యాస్ట్రేషన్ చేయాలన్న వాదనకు రుఫాయీ గతంలో మద్దతివ్వడంతో ఆయన దీనిపై సంతకం చేస్తారని భావిస్తున్నారు.
కదుమా రాష్ట్రంలో ఇటీవల కాలంలో అత్యాచారాలు ఎక్కువవడంతో ప్రజాగ్రహం వెల్లువెత్తింది. దాంతో రాష్ట్ర ప్రభుత్వం ఎమర్జెన్సీ కూడా ప్రకటించింది.
నైజీరియా జాతీయ చట్టాల ప్రకారం అత్యాచార దోషులకు అక్కడ 14 ఏళ్ల నుంచి జీవితకాల జైలు శిక్ష వరకు పడే అవకాశం ఉంటుంది. అయితే, రాష్ట్రాలు ఈ జైలు శిక్షా కాలాలను మార్చొచ్చు.
నైజీరియాలో అత్యాచార బాధితుల్లో చాలామంది తమపై జరిగిన అకృత్యాన్ని చెప్పుకోవడానికి వెనుకాడుతారు.. సమాజం ఎక్కడ చిన్నచూపు చూస్తుందోనని ఆందోళన చెందుతారు. అంతేకాదు.. ఈ కేసుల్లో దోషులకు శిక్ష పడడమూ అక్కడ తక్కువే.
2015లో నైజీరియాలో అత్యాచారాలకు సంబంధించిన కొత్త చట్టం ప్రవేశపెట్టిన తరువాత దోషులకు శిక్ష పడే అవకాశాలు పెరిగాయి.

నేషనల్ ఏజెన్సీ ఫర్ ది ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాఫికింగ్ ఇన్ పర్సన్స్ హెడ్ జూలియా ఓఖా దోన్లీ 'బీబీసీ'తో మాట్లాడుతూ రుజువు చేయాల్సిన బాధ్యత ప్రాసిక్యూషన్‌పై ఉండడం వల్ల నిరూపణ సాంకేతిక కష్టమైన ప్రక్రియని అభిప్రాయపడ్డారు.
కాగా చిన్నారులపై అత్యాచారాలు చేసేవారికి క్యాస్ట్రేషన్ చేయాలన్న చర్చ నైజీరియాలో కొద్దికాలంగా ఉంది. కరోనావైరస్ లాక్‌డౌన్ కాలంలో అత్యాచారాలు పెరుగుతుండడంతో ఇటీవల కాలంలో ఈ చర్చ జరుగుతోంది.

ఫొటో సోర్స్, UWAVERA OMOZUWA/FACEBOOK
జులైలో 22 ఏళ్ల ఉవావెరా ఒమొజువా అనే యూనివర్సిటీ విద్యార్థిని హత్య కేసు అక్కడ సంచలనం సృష్టించింది. ఆమెను రేప్ చేసి చంపేశారని ఆమె కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై ప్రజాగ్రహం వెల్లువెత్తింది.
కొద్దిరోజుల వ్యవధిలోనే జరిగిన అనేక అత్యాచారాల కేసుల్లో ఇదొకటి మాత్రమే.. దీంతో ప్రజలు వీధుల్లోకి వచ్చి పెద్ద పెట్టున నిరసనలు తెలిపారు.. ఆన్‌లైన్ పిటిషన్లు దాఖలు చేశారు. #WeAreTired అనే హ్యాష్‌ట్యాగ్ అక్కడ ట్రెండయ్యింది.
అత్యాచారాలకు పాల్పడేవారికి మరణ శిక్ష విధించాలని ప్రజలు డిమాండ్ చేశారు.
కాగా అత్యాచార దోషులకు క్యాస్ట్రేషన్ చేయాలన్న నిర్ణయంపై భిన్న వాదనలున్నాయి. 'ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ ది ట్రీట్‌మెంట్ ఆఫ్ సెక్సువల్ అఫెండర్స్' సూచనల్లోనూ ఇలాంటి శిక్ష లేదు.
క్యాస్ట్రేషన్ చేస్తే వారిపై శారీరకంగా, మానసికంగా తీవ్ర ప్రభావం ఉంటుందని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు.
ఇవి కూడా చదవండి:
- సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చివరి గంటల్లో ఏం జరిగిందంటే..
- సుశాంత్ సింగ్ రాజ్‌పుత్: టీవీ అతనిని తారని చేసింది... అదే టీవీ అతనిని పదే పదే చంపింది...
- సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ 50 కలలు.. భౌతిక శాస్త్ర ప్రయోగాలు, విశ్వం, ప్రకృతి గురించి కన్న కలల్లో నెరవేరనివి ఎన్నంటే..
- "కార్గిల్ యుద్ధంలో భారత సైన్యం పైచేయి సాధించడానికి ఏకైక కారణం ఇదే"
- 1990ల్లో 13 నెలలపాటు నేపాల్‌ను భారత్ ఎందుకు దిగ్బంధించింది?
- ఒక్క సంవత్సరంలోనే 600 సార్లు అతిక్రమణలకు పాల్పడిన చైనా..
- ఏడు నెలల గర్భంతో ఉన్న భార్యను తీసుకుని 1200 కిలోమీటర్లు స్కూటీపై ప్రయాణం
- తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య ఆర్టీసీ బస్సుల రాకపోకలు మొదలయ్యేది ఎప్పుడు?
- 10 కి.మీ దూరంలో భారతీయ మహిళ మృతదేహం.. తీసుకురావాలంటే 2291 కి.మీ. ప్రయాణించాలి
- భారత్-చైనా సరిహద్దు వివాదంలో దూకుడు ప్రదర్శిస్తోంది ఎవరు? - మాజీ సైన్యాధికారి వీపీ మాలిక్ ఇంటర్వ్యూ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








