కమల్ హాసన్: ‘అఖండ భారతం గురించి వారు మాట్లాడుతుంటే నేను అఖండ ద్రావిడం గురించి ఎందుకు మాట్లాడకూడదు’

ఫొటో సోర్స్, TWITTER@IKAMALHAASAN
- రచయిత, మురళీధరన్ కాశీ విశ్వనాథన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
తమిళ రాజకీయాల్లోకి వచ్చిన కమల్ హాసన్ బీబీసీ ప్రతినిధి మురళీధరన్ కాశీ విశ్వనాథన్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు.
ఈ ఇంటర్వ్యూలో ఆయన అసెంబ్లీ ఎన్నికలు, ద్రావిడ పార్టీలు, బ్రాహ్మణులు, బ్రాహ్మణేతరులకు సంబంధించిన అనేక అంశాల గురించి మాట్లాడారు.
ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలు..
ప్రశ్న: మీరు రాష్ట్రమంతా పర్యటించారు. పరిస్థితి ఎలా ఉంది?
జవాబు: ప్రతి చోటా ప్రజలు మమ్మల్ని స్వాగతించారు. ఇది ఓట్ల రూపంలో మారాలి. ఈ ఆటలో ప్రవహిస్తున్న డబ్బుపై ప్రజాస్వామ్యం గెలవాలి.
ప్రశ్న: ఈ ఎన్నికల్లో ప్రధాన అంశమేమిటి?
జవాబు: ఇక్కడ అంశాలు చాలా సరళమైనవి. ఇక్కడ జరుగుతున్న విషయాలను చూసి నేను ఆశ్చర్యపోయాను. ప్రజలకు కొన్ని చోట్ల కనీస అవసరాలు కూడా లేవు. పూర్తి స్వార్థం కనిపిస్తోంది. ఇప్పటివరకు ప్రజల కరువును జాగ్రత్తగా సంరక్షించారు. చూస్తుంటే కరవును ఒక మ్యూజియంలో కళాఖండంలా పరిరక్షిస్తున్నట్లుగా ఉంది.
ప్రశ్న: కానీ, సామాజిక సంక్షేమ గణాంకాల్లో తమిళనాడు భారతదేశంలోనే అగ్ర స్థానంలో ఉంది..
జవాబు: మనం భారతదేశంలోని మిగిలిన రాష్ట్రాలతో పోల్చుకోకూడదేమో. మనం అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చి చూసుకోవాలి.
అప్పుడే మనం అభివృద్ధి చెందగలం. బెంగాల్ లోని కరువు ఏర్పడినప్పటి పరిస్థితులతో మనం రాష్ట్రాన్ని పోల్చుకుంటే మనం బాగానే కనిపిస్తాం. బీహార్ తో పోల్చుకుని మనం వారి కంటే బాగానే ఉన్నామని అనుకోవడం సమంజసమేనా?
మనకి చాలా ఆసుపత్రులు ఉన్నాయని అంటారు. అవేవి సరిగ్గా పని చేయవు. ఈ ప్రభుత్వంలో ఏ పరిశ్రమ ఉత్తమంగా పని చేస్తుందో అందరికీ తెలుసు. టాస్మాక్. అదే ఆసక్తిని, అన్ని విభాగాలలో చూపిస్తే, తమిళనాడు దేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా నిలిచే అవకాశం ఉంది.
ప్రశ్న: తమిళనాడు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అనుకుంటున్నారా?
జవాబు: వైఫల్యం అనే కంటే, ఇది అవినీతితో నిండిపోయిందని చెబుతాను. యంత్రాంగం వైఫల్యం అవ్వలేదు. దానిని వైఫల్యం అయ్యేలా చేశారు. దీనికి ముఖ్య కారణం 30 శాతం కమీషన్ తీసుకోవడం. తమిళనాడు ప్రస్తుతం ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో ఉంది.

ఫొటో సోర్స్, TWITTER/KAMALHAASAN
ప్రశ్న: మీరు అవినీతి గురించి మాట్లాడుతూనే ఉన్నారు. అలాగే, ఓట్ల కోసం ప్రజలు డబ్బులు తీసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో మార్పు తీసుకుని రావడం ఎంత వరకు సాధ్యం?
జవాబు: నాయకులు నిజాయితీగా ఉంటే అదే నిజాయితీ జలపాతంలా ప్రవహించి రాళ్ళన్నీ ఆ నీటిలో తడుస్తాయి.
ప్రశ్న: మీ పార్టీకి ఇవి రెండవ ఎన్నికలు. ఈ ఎన్నికలు మీకు ఎంత ముఖమైనవి?
జవాబు: తమిళనాడు రాజకీయాలను ఇక పై నేను లేకుండా ఊహించలేమని అందరూ చెబుతున్నారు. ఆనందం, ఉత్సాహంతో కొందరు మనం గెలిచామని అంటున్నారు. కానీ, నా వరకు ఎన్నికల్లో గెలవడమే విజయం కాదు. అయిదేళ్లలో లక్ష్యాలను సాధించడమే మా విజయం. ఈ విషయంలో నేనింకా విజయం మెట్లు ఎక్కడం కూడా మొదలుపెట్టలేదు.
ప్రశ్న: ఈ ఎన్నికల్లో మీరు గెలిస్తే మీ తదుపరి కార్యాచరణ ఏమిటి? మీరు నటనలో కొనసాగుతారా? మీరు ప్రజల నిరసనలను ముందుకు తీసుకుని వెళతారా?
జవాబు: నా అభ్యర్థులు కొంత మంది వారి వృత్తిలో కొనసాగుతూనే ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. నేనూ అంతే. నేను సినిమాకు సమయం ఇస్తాను. కానీ, తక్కువ సమయం ఇస్తాను. నాకు చాలా డబ్బులు ఇస్తారు కానీ, నేను కష్టపడి పని చేయాల్సిన అవసరం లేదు. కానీ, నటించడం తప్పేమీ కాదు. రౌడీలు రాజకీయాలలోకి వచ్చి పూర్తి సమయం వెచ్చిస్తే ఇతర వృత్తుల్లో ఉన్న వారు రాజకీయాలకు కొంత సమయం ఇవ్వడం నిజమైన సంఘ సేవ చేయడమే.
ప్రశ్న: ఎంఎన్ఎం పార్టీకి ప్రత్యేక పర్యావరణ విభాగం ఉంది. కానీ, మీరు మీ మ్యానిఫెస్టోలో జన్యుపరంగా రూపాంతరం చెందించిన పంటలకు ప్రోత్సాహం ఇస్తానని చెప్పారు. ఈ జిఎమ్ పంటలను పర్యావరణవేత్తలు వ్యతిరేకిస్తున్నారు.
జవాబు: సైన్స్, వ్యవసాయం కలవాలి. మా మ్యానిఫెస్టో జీవంతో కూడుకుని ఉంటుంది. మేము ప్రజలతో సంప్రదించి వాటికి కొన్ని మార్పులు చేయాలి. మేము రాసిందేమి రాతి మీద చెక్కలేదు. చర్చలు జరిగితే వాటిని మార్చవచ్చు.
ప్రశ్న: తమిళనాడు చాలా కాలంగా ద్విభాషా విధానాన్ని అనుసరిస్తోంది. మీ మ్యానిఫెస్టోలో ద్విభాష, త్రిభాష విధానాన్ని కూడా ప్రస్తావించారు. భాషకు సంబంధించి మీ పార్టీ విధానం ఏమిటి?
జవాబు: అన్నా చెప్పిన విధానమే మా విధానం కూడా. ఆయన మూడు భాషల విధానాన్ని సమర్ధించారు. నా వరకు అవసరాలే విధానాన్ని నిర్ణయిస్తాయి.
ప్రశ్న: అయితే ఈ విషయంలో మీరు అన్నాని ఆమోదిస్తారు.
జవాబు: నేనొక ఆధునిక రాజకీయ వేత్తను. నేను ప్రతి ఒక్కరిలో మంచిని స్వీకరిస్తాను. మేమొక దారిలోనే ఉంటాం అని మొండిగా ప్రవర్తించం.

ఫొటో సోర్స్, TWITTER/KAMALHAASAN
ప్రశ్న: మీరు దక్షిణ కోవైలో పోటీ చేస్తున్నారు. మీరా నియోజకవర్గాన్ని ఎందుకు ఎన్నుకున్నారు? అక్కడ సమస్యలు మీకు తెలుసా?
జవాబు: అవును. ఈ నియోజకవర్గాన్ని నేనొక ఉదాహరణగా చూస్తాను. రాష్ట్రంలో ఉన్న అన్ని సమస్యలు అక్కడ కనిపిస్తాయి.
ఈ నియోజకవర్గానికి అన్ని అర్హతలు సరిపోతాయి. ఇక్కడ మతపరమైన ఐక్యత సాధించడం ఒక పెద్ద సవాలు. మేము దాని పై పని చేయాలని అనుకుంటున్నాం. బీజేపీ కూడా ఇక్కడ గెలుస్తుందనే నమ్మకంతో ఉంది. అందుకే వారిని ఓడించాలనే పట్టుదలతో ఉన్నాను.
ప్రశ్న: కొన్ని రోజుల క్రితం ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి ఇక్కడకు వచ్చినప్పుడు ఒక వివాదం చోటు చేసుకుంది. మీరు దానిని వ్యతిరేకించారు. కానీ, మీ ప్రచారంలో ఎక్కడా బీజేపీ కి వ్యతిరేకంగా నిలబడలేదు.
జవాబు: ఎక్కడ అవసరమో అక్కడ వ్యతిరేకిస్తే చాలు. నేను మోదీని దేశ ప్రధానిగా గౌరవిస్తాను. కానీ, దేశానికి వ్యతిరేక కార్యకలాపాలు ఎవరు చేసినా నేను వ్యతిరేకిస్తాను. ప్రతిపక్షం ఎప్పుడూ ప్రజాస్వామిక విధానంలోనే వ్యతిరేకించాలి.
నేనేమీ తుపాకులు పట్టుకున్న నక్సలైట్ కాదు. నేను ప్రజాస్వామ్యాన్ని విశ్వసిస్తాను.
ప్రశ్న: ప్రజలు సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు రాజకీయ పార్టీలు నిరసిస్తాయి. మీ తరహా రాజకీయాల్లో నిరసనలకు చోటుందా?
జవాబు: గాంధీ హీరో అయితే, నిరసనలకుండే రంగు పూర్తిగా భిన్నంగా ఉంటుంది. సహాయ నిరాకరణ కూడా నిరసనే. విద్యార్థులు లోపల ఉంటుండగా బస్సులు తగలబెట్టడం, ఆఫీసులు కాల్చడం, ప్రజా ధనాన్ని ధ్వంసం చేయడం వీటిని నిరసనలంటే అలాంటివి మేము చేయం. ఇలాంటివి ఎవరైనా చేస్తే వారిని పార్టీ నుంచి తొలగిస్తాం.
ప్రశ్న: ద్రావిడ వాదంతో మీ పార్టీ ఎంత వరకు కలుస్తుంది? ఎంత విభేదిస్తుంది?
జవాబు: నేను చాలా విభేదిస్తాను. నేను మంచి విషయాలు తీసుకుంటారు. అది ఎమ్ జి ఆర్ ప్రవేశపెట్టారా, కామరాజర్ ప్రవేశపెట్టారా అనేది నాకు సంబంధం లేదు. మధ్యాహ్న భోజన పథకం మంచిదే.
ఆఖరి తమిళ పౌరునికి అవసరమైనంత వరకు రిజర్వేషన్లు ఉంటాయి,
ప్రశ్న: గత 100 సంవత్సరాలుగా తమిళనాడు రాజకీయాలు బ్రాహ్మణ బ్రాహ్మణేతర విభజనలతో చీలిపోయాయి.
ఇదే కొనసాగాల్సిన అవసరం ఉందంటారా?
జవాబు: లేదు. దీనిని చాలా సులభంగా పరిష్కరించవచ్చు. కులాన్ని అలా విభజించలేం. అందులో కొన్ని స్థాయిలు ఉంటాయి.
బ్రాహ్మణేతరులు అందరూ కలిసి మెలిసి జీవిస్తున్నారా? లేదు కదా. అన్ని చోట్లా సమస్యలు ఉన్నాయి.
అన్ని స్థాయిల్లో ఉన్న ఈ అసమానతల పై మనం దాడి చేయాలి.

ఫొటో సోర్స్, TWITTER/KAMALHAASAN
ప్రశ్న: బ్రాహ్మణులు ఒక్కరినే లక్ష్యంగా చేసుకున్నారని మీరనుకుంటున్నారా?
జవాబు: లేదు. వాళ్ళని లక్ష్యంగా చేసుకోవాలి. బ్రాహ్మణ వాదాన్ని సమర్ధించేవారిని మేము వ్యతిరేకిస్తాం. దానిని బ్రాహ్మణులను వ్యతిరేకించడం అని మీరు అర్ధం చేసుకోవడానికి లేదు. నేను కామరాజర్ ని ఆయన కులాన్ని బట్టి చూడలేను.
ద్రావిడ పార్టీలు అధికారంలోకి వచ్చి 50 సంవత్సరాలు కావస్తోంది. వారు సమాజానికి, రాష్ట్రానికి చేసిన సేవలేమిటని మీరనుకుంటున్నారు?
వారి సిద్ధాంతాల ప్రకారం వారు చాలా సేవ గణనీయమనే చెప్పవచ్చు. వారు అప్పట్లో గెలవడం ముఖ్యమే. అలాగే ఇప్పుడు వారు చేసిన అవినీతి వలన ఓడిపోవడం కూడా ముఖ్యమే.
ప్రశ్న: మీరు పెరియార్, అన్నా, రాజాజీ సిద్ధాంతాలతో ఎంత వరకు కలుస్తారు?
జవాబు: డిఎంకె పార్టీ ఆది ద్రావిడియార్ అనే పదాన్ని సృష్టించారు. దానిని రాజకీయ ప్రణాళికలోకి చేర్చాలని అనుకున్నారు. ఇది స్వాతంత్రానికి ముందే జరిగింది. అక్కడ తెలుగు వారు, మలయాళీలు, కన్నడ ప్రజలు ఉన్నారు. ఇలాంటిదే దక్షిణ భారతమంతటా జరగాలి. దానిని కేవలం మూడు రకాల భాషలకు చెందిన వారితో పరిమితం చేయకూడదు. ఇలాంటి ప్రయత్నంతో మొదలుపెట్టాలని అనుకుంటున్నాను.
ప్రశ్న: ఇదే సిద్ధాంతాన్ని మీరు భారతదేశమంతటా వ్యాపింప చేయగలరా?
జవాబు: ద్రావిడ వాదం కేవలం సిద్ధాంతం కాదు. అది మన భౌగోళిక పరిస్థితులను, మనం నివసించే ప్రదేశాన్ని, శారీరక లక్షణాలను ప్రతిబింబిస్తుంది.
ఇది దేశమంతటా వ్యాపిస్తుంది. ఇది మొహెంజోదారో, హరప్పా నాగరికత నుంచి వచ్చింది. వారు అఖండ భారతం గురించి మాట్లాడుతుంటే అఖండ ద్రావిడ వాదం గురించి నేనెందుకు మాట్లాడకూడదు?
ఇవి కూడా చదవండి:
- సెక్స్‌కు ఒకసారి ఒప్పుకుంటే... ప్రతిసారీ ఒప్పుకున్నట్లేనా?
- లాక్డౌన్: జనతా కర్ఫ్యూకి ఏడాది.. దేశంలో మళ్లీ లాక్డౌన్.. ఎక్కడెక్కడంటే
- రూ. 2000 నోట్ల ముద్రణను రిజర్వు బ్యాంక్ ఆపేసింది... పెద్ద నోటు మళ్లీ రద్దవుతుందా?
- బ్యాంకుల సమ్మె ఎందుకు? మోదీ ప్రభుత్వం.. ప్రభుత్వ బ్యాంకులను ఎందుకు ప్రైవేటీకరిస్తోంది?
- IPO అంటే ఏమిటి... దరఖాస్తు చేసిన వారందరికీ షేర్లు కేటాయిస్తారా? కేటాయించకపోతే ఏం చేయాలి?
- మ్యూచువల్ ఫండ్స్: మహిళలు పెట్టుబడి పెట్టేందుకు అద్భుతమైన మార్గం ఇదేనా?
- విశాఖపట్నం: సాగర తీరంలో టీయూ-142 యుద్ధ విమానం... దీని చూస్తే ఎందుకు ఉద్వేగం ఉరకలేస్తుంది?
- మియన్మార్‌లో 'సరోంగ్ విప్లవం': మహిళలు నడుముకు కట్టుకునే 'సరోంగ్' వస్త్రం.. నిరసనకారుల ఆయుధంగా మారిన వైనం
- యాంటీకిథెరా: రెండు వేల ఏళ్ల కిందటి 'పురాతన కంప్యూటర్'.. గుట్టు వీడబోతోందా
- గుజరాత్: టీ షర్ట్ ధరించి వచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యేను సభ నుంచి పంపించేసిన స్పీకర్
- బిర్యానీ పక్కాగా వండాలంటే కచ్చితమైన లెక్కలు ఉంటాయా? దీనికో ఆల్గారిథమ్ ఉందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








