కరోనావైరస్: భారత్‌లో సెకండ్ వేవ్ ఎందుకంత ప్రమాదకరం.. వైరస్ ఇంత వేగంగా ఎందుకు వ్యాపిస్తోంది..

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, కమలేశ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
భారత్‌లో కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి మొదలై ఏడాదిపైనే గడిచింది. 2020, మార్చి 22న భారత్‌లో తొలిసారిగా లాక్‌డౌన్ విధించారు.
గత ఏడాదిలో కరోనావైరస్ కేసులు రోజుకు 97 వేల వరకూ పెరిగాయి.
మళ్లీ ఇప్పుడు రెండో వేవ్‌లో కేసుల సంఖ్య 50 వేలకుపైనే నమోదు అవుతోంది.
మొదటి వేవ్‌తో పోలిస్తే, రెండో వేవ్‌లో కేసుల సంఖ్య చాలా వేగంగా పెరుగుతోంది.
మార్చి 30న 56,211 కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. 271 మంది మరణించారు. దేశ వ్యాప్తంగా ఐదు లక్షలకుపైనే యాక్టివ్ కేసులున్నాయి.
మార్చి 29న 68,020 కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. రెండో వేవ్‌లో ఒక రోజులో నమోదైన కేసుల్లో ఇవే అత్యధికం.

ఫొటో సోర్స్, EPA
దేశ వ్యాప్తంగా ఒకవైపు వ్యాక్సినేషన్ జరుగుతుంటే, మరోవైపు కరోనావైరస్ కేసులు పెరుగుతున్నాయి.
జనవరిలో వ్యాక్సినేషన్ మొదలైంది. మార్చి 30 నాటికి దేశ వ్యాప్తంగా 6,11,13,354 మందికి వ్యాక్సీన్‌ను ఇచ్చారు.
అందరూ మాస్క్‌లు పెట్టుకోవాలని, సామాజిక దూరం నిబంధనలు పాటించాలని కేంద్రంతోపాటు రాష్ట్ర ప్రభుత్వాలూ పదేపదే చెబుతున్నాయి.
మరోవైపు ఆంక్షలను కూడా మళ్లీ అమలులోకి తీసుకొస్తున్నాయి.
ఇప్పటికే చాలాచోట్ల సామూహిక వేడుకలపై నిషేధం విధించారు.
కేరళలో ఒక వైపు ఎన్నికలు జరుగుతుంటే, మరోవైపు కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి.
దీంతో 15 రోజులపాటు ఇక్కడ నిరసనలు, బహిరంగ ప్రదర్శనలు, ర్యాలీలపై ఆంక్షలు విధించారు.
హోలీ వేడుకల విషయంలోనూ ప్రభుత్వాలు ప్రత్యేక నిబంధనలు తీసుకొచ్చాయి. సామూహిక వేడుకలపై ఆంక్షలను అమలు చేశాయి.

ఫొటో సోర్స్, Getty Images
రెండో వేవ్‌లో అంత వేగంగా ఎందుకు?
ఎన్ని ఆంక్షలు అమలు చేస్తున్నప్పటికీ, కోవిడ్-19 కేసులు పెరుగుతూనే ఉన్నాయి.
వ్యాక్సినేషన్, హెర్డ్ ఇమ్యూనిటీ ఫలితాలు ఎక్కడా కనిపించడంలేదు.
దీంతో కరోనాకు ఎలా కళ్లెం పడుతుందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
మొదటి వేవ్‌లో రోజుకు 97 వేల కేసులు నమోదు కావడానికి సెప్టెంబరు వరకు సమయం పట్టింది.
కానీ రెండో వేవ్‌లో కేవలం రెండు నెలల్లోనే రోజుకు 68,000 కేసులకు ఎలా పెరిగాయి?
ఇంత వేగంగా వైరస్ ఎందుకు వ్యాపిస్తోంది?
''రెండో వేవ్‌లో కోవిడ్-19 మరింత వేగంగా వ్యాప్తి చెందుతోందని విదేశాల అనుభవాలు చెబుతున్నాయి. దాదాపు అన్ని దేశాల్లోనూ మొదటివేవ్‌తో పోలిస్తే, సెకండ్ వేవ్‌లో కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఇది సర్వసాధారణం. ఎందుకంటే రెండో వేవ్‌లో వైరస్ వ్యాప్తిని ప్రజలు అంతగా పట్టించుకోరు. ప్రస్తుతం ఇక్కడ కూడా అదే జరుగుతోంది''అని ప్రజారోగ్యం నిపుణుడు డాక్టర్ చంద్రకాంత్ లహరియా చెప్పారు.

ఫొటో సోర్స్, EPA
వైరస్ వేగంగా వ్యాప్తి చెందడానికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయని బీఎల్‌కే ఆసుపత్రిలో ఛాతి, శ్వాసకోశ వ్యాధుల నిపుణుడు డాక్టర్ సందీప్ నాయర్ చెప్పారు.
''కరోనావైరస్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో ప్రజల్లో నిర్లక్ష్యం పెరిగింది. మాస్క్‌లు పెట్టుకోవడం తగ్గించారు. చేతులు కడుక్కోవడం మానేశారు. చాలా మంది ఒక డోసు వ్యాక్సీన్ వేసుకున్న తర్వాత వైరస్ నుంచి ఇమ్యూనిటీ వచ్చినట్లు భావిస్తున్నారు. రెండో డోసు వ్యాక్సీన్ కూడా వేసుకోవడం లేదు''
''కరోనావైరస్‌లో కొత్త వేరియంట్లు పుట్టుకురావడం రెండో ప్రధాన కారణం. ఈ కొత్త వేరియంట్లు మరింత వేగంగా వ్యాపిస్తున్నాయి. ముఖ్యంగా బ్రిటన్ వేరియంట్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతోంది''అని ఆయన అన్నారు.
భారత్‌లో కూడా కొత్త ''డబుల్ మ్యూటెంట్'' వేరియంట్ వైరస్‌ను గుర్తించామని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
బ్రిటన్‌తోపాటు దక్షిణాఫ్రికా, బ్రెజిల్ వేరియంట్లు కూడా భారత్‌లో కనిపిస్తున్నాయి.

ఫొటో సోర్స్, EPA
హెర్డ్ ఇమ్యూనిటీ పరిస్థితేమిటి?
ఒక ప్రాంతంలో ఒక వ్యాధి పెద్దయెత్తున వ్యాపించిన అనంతరం.. అక్కడి ప్రజల్లో ఆ వ్యాధిని తట్టుకొని నిలబడే శక్తి పెరగడాన్ని హెర్డ్ ఇమ్యూనిటీ అంటారు.
వ్యాధి నిరోధక శక్తి ప్రజల్లో పెరుగుతున్న కొద్దీ ఆ ప్రాంతాల్లో ఇన్ఫెక్షన్ రేటు తగ్గుతూ వస్తుంది.
దీని గురించి లోతైన అవగాహన కోసం.. కేంద్ర ప్రభుత్వం కొన్ని ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఎంత మందికి వైరస్ సోకిందనే అంశాన్ని ఎప్పటికప్పుడు పరీక్షిస్తోంది.
ఐసీఎంఆర్ ఫిబ్రవరిలో చేపట్టిన సెరో సర్వే ప్రకారం.. ప్రతి ఐదుగురిలో ఒక భారతీయుడికి కరోనావైరస్ సోకింది. దీనికి సంబంధించిన నమూనాలను డిసెంబరు 17 నుంచి జనవరి 8 మధ్య సేకరించారు.
కేసులు పెరుగుతున్న కొద్దీ, ఇక్కడ హెర్డ్ ఇమ్యూనిటీపై చర్చ కూడా మొదలైంది.
హెర్డ్ ఇమ్యూనిటీతో కోవిడ్-19కు కళ్లెం పడుతుందని చాలా వార్తలు వచ్చాయి. కానీ అలాంటిదేమీ జరగలేదు.
తాజా కోవిడ్-19 వ్యాప్తి విషయంలో హెర్డ్ ఇమ్యూనిటీ పెద్దగా పనిచేయకపోవచ్చని డాక్టర్ చంద్రకాంత్ అన్నారు.
''ఒక చిన్న ప్రాంతంలో వ్యాధి వ్యాప్తి విషయంలో హెర్డ్ ఇమ్యూనిటీ పనిచేస్తుంది. పైగా కొత్త వైరస్‌ల విషయంలో హెర్డ్ ఇమ్యూనిటీ రావడం అంత తేలిక కాదు. ఎందుకంటే దీనిపై పోరాడే యాంటీబాడీలు మన శరీరంలో అసలు ఉండవు. వ్యాక్సినేషన్‌తో ప్రజల్లో వ్యాధిని తట్టుకునే శక్తి పెరుగుతుంది. ప్రజల్లో 60 నుంచి 70 శాతం మందిలో ఈ శక్తి పెరిగితే, అప్పుడు వ్యాక్సినేషన్‌తో హెర్డ్ ఇమ్యూనిటీ వచ్చిందని భావించొచ్చు'' అని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, Reuters
వ్యాక్సీన్ల ప్రభావం ఎప్పుడు కనిపిస్తుంది?
వ్యాక్సీన్లను కరోనావైరస్‌పై ప్రధాన అస్త్రాలుగా వైద్య నిపుణులు అభివర్ణిస్తున్నారు.
అయితే, వాటి ప్రభావం ఇప్పటివరకు స్పష్టంగా కనిపించడం లేదు.
వ్యాక్సీనేషన్ ప్రభావం కనిపించాలంటే చాలా సమయం పడుతుందని వైద్యులు భావిస్తున్నారు.
''రెండు డోసుల వ్యాక్సీన్‌ను పూర్తిగా తీసుకుంటేనే ఫలితం ఉంటుంది. మొదటి డోసు తీసుకున్న నెల రోజుల తర్వాత రెండో డోసు ఇస్తున్నారు. ఆ తర్వాత 14 రోజులకు ప్రజల్లో పూర్తిగా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇప్పటివరకు కేవలం ఆరు కోట్ల మందికి మాత్రమే వ్యాక్సినేషన్ జరిగింది. దీంతో వ్యాక్సినేషన్ ప్రభావం కనపడాలంటే చాలా సమయం పడుతుంది''అని సందీప్ నాయర్ అన్నారు.
భారత్‌లో జనవరి 16న కరోనావైరస్ వ్యాక్సినేషన్ మొదలైంది. మొదటి దశలో ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్ లైన్ వర్కర్లకు వ్యాక్సీన్లు ఇచ్చారు. ఆ తర్వాత 45ఏళ్లు పైబడి ఇతర అనారోగ్యాలతో బాధపడుతున్న వారికి వ్యాక్సీన్లు ఇవ్వడం మొదలుపెట్టారు.
ఇప్పుడు 45ఏళ్లు పైబడిన ఎవరైనా వెళ్లి వ్యాక్సీన్లు తీసుకోవచ్చు.

ఫొటో సోర్స్, Reuters
కేసులు ఎక్కువ.. మరణాలు తక్కువ..
కోవిడ్-19 కేసులు వేగంగా పెరగడం ఒకవైపు.. మరణాలు తగ్గడం మరోవైపు ఇప్పుడు మనం గమనించొచ్చు.
కరోనావైరస్ మరణాల సంఖ్య ఒకప్పుడు రోజుకు వెయ్యికిపైనే ఉండేది. ఇప్పుడు అది 250కి అటూఇటూగా ఉంటోంది.
మరణాలు తగ్గడానికి రెండు కారణాలు కనిపిస్తున్నాయి.
వాటిలో మొదటిది ఆరోగ్య వ్యవస్థలు మెరుగుపడటం. రెండోది కొత్త వేరియంట్లు కాస్త తక్కువ ప్రాణాంతకం కావడం.
''గత ఏడాది కరోనావైరస్‌పై పోరాటంలో భాగంగా ఆరోగ్య వ్యవస్థల్లో సదుపాయాలను పెంచారు. దీంతో కరోనావైరస్ రోగులకు చికిత్స తేలికైంది''అని సందీప్ నాయర్ చెప్పారు.
''గత ఏడాది కరోనావైరస్ వ్యాప్తి మొదలైనప్పుడు దానికి ఎలా చికిత్స చేయాలో ఎవరికీ తెలియదు. కొంతమంది వైద్యులు యాంటీ వైరల్ ఔషధాలను సిఫార్సు చేశారు. మరికొంతమంది క్లోరోక్విన్‌ను సిఫార్సు చేశారు. ఇప్పుడు వైద్యుల్లో అవగాహన పెరిగింది. ఏ మందు ఎప్పుడు ఇవ్వాలో అవగాహన వచ్చింది''అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Reuters
లాక్‌డౌన్ ఎందుకు విధించడం లేదు?
గత ఏడాది కరోనావైరస్ కేసులు పెరుగుతున్నప్పుడు భారత్‌లో లాక్‌డౌన్ విధించారు. ఇది చాలా రోజులు కొనసాగింది.
ఇప్పుడు కేసులు 50 వేలకుపైగానే నమోదు అవుతున్నప్పటికీ, ప్రభుత్వాలు లాక్‌డౌన్ విధించేందుకు ముందుకు రావడం లేదు.
మహారాష్ట్రతోపాటు కేరళలలోనూ ప్రస్తుతం కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి.
కేరళలో లాక్‌డౌన్ విధిస్తారని వార్తలు కూడా వచ్చాయి. అయితే, ఆంక్షలు మాత్రమే విధించారు.
ఆర్థికపరమైన కారణాల వల్లే లాక్‌డౌన్ విధించడానికి ప్రభుత్వాలు ముందుకు రావడంలేదని నిపుణులు అంటున్నారు.
''ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో లాక్‌డౌన్ విధించడం సరికాదు. గతేడాది లాక్‌డౌన్ విధించినప్పుడు ఆర్థిక వ్యవస్థలు తీవ్రంగా ప్రభావితం అయ్యాయి. చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు. వ్యాపార వ్యవస్థలు స్తంభించాయి. ఆ ప్రభావాన్ని పోగొట్టేందుకు ఇప్పటికీ ప్రభుత్వం ప్రయత్నిస్తూనే ఉంది. ఇప్పుడు మరోసారి లాక్‌డౌన్ విధిస్తే, ఆర్థిక వ్యవస్థ కోలుకోవడం చాలా కష్టం''అని కేర్ రేటింగ్ ఏజెన్సీ ప్రధాన ఆర్థిక నిపుణుడు మదన్ సబ్నవిస్ అన్నారు.

ఫొటో సోర్స్, EPA
జాగ్రత్తగా ఉంటేనే..
లాక్‌డౌన్ విధించడం మంచిదికాదని వైద్యులైన డా. చంద్రకాంత్ కూడా అభిప్రాయపడ్డారు.
''కోవిడ్-19పై పోరాటానికి ప్రజలను మానసికంగా సిద్ధం చేయడం, ఆరోగ్య వ్యవస్థలను మెరుగుపరచడం తదితర లక్ష్యాలతో గతేడాది లాక్‌డౌన్ విధించారు. వైరస్‌పై ప్రజలకు అవగాహన కలిగించడానికి ఆ సమయం ఉపయోగపడింది. మాస్క్‌లు పెట్టుకోవడం, చేతులు తరచూ కడుక్కోవడం, సామాజిక దూరం పాటించడం తదితర అలవాట్లనూ ప్రజలు అలవరుచుకున్నారు''
''ఒకవేళ ఏడాది కాలంలో ఆరోగ్య సదుపాయాలను మెరుగుపరచలేకపోతే, ఇప్పుడు కొన్ని రోజులు లాక్‌డౌన్ విధించి కూడా ఎలాంటి ఉపయోగం ఉండదు''.
''ఇప్పుడు ఒక రోజు లాక్‌డౌన్ విధించినా చాలా చేటు జరుగుతుంది. ఉదాహరణకు ఆదివారం లాక్‌డౌన్ విధించాలని భావిస్తే, ఆ రోజు బయటకు వెళ్లాల్సినవారు.. సోమవారం వెళ్తారు. ఫలితంగా సోమవారం మార్కెట్లలో రద్దీ పెరుగుతుంది. ఫలితంగా ఆ రోజు వ్యాపించే కేసులు కూడా పెరుగుతాయి''అని ఆయన అన్నారు.
''ఇప్పుడు, జాగ్రత్తగా ఉంటేనే వైరస్‌తో పోరాడగలం. వ్యాక్సీన్లతో కచ్చితంగా ప్రయోజనాలు ఉంటాయి. అయితే, మాస్క్‌లు పెట్టుకోవడం, సామాజిక దూరం పాటించడం మరచిపోకూడదు''అని ఆయన అన్నారు.
ఇవి కూడా చదవండి:
- అంగారకుడి మీద ఒకప్పుడు ప్రవహించిన నీరంతా ఆ గ్రహం పైపొరలోనే బందీగా ఉందా?
- విశాఖపట్నం: సాగర తీరంలో టీయూ-142 యుద్ధ విమానం... దీని చూస్తే ఎందుకు ఉద్వేగం ఉరకలేస్తుంది?
- ఆఫ్రికా నుంచి హబ్సిగూడకు.. బానిసలుగా వచ్చి బాద్‌షాలయ్యారు
- మియన్మార్‌లో 'సరోంగ్ విప్లవం': మహిళలు నడుముకు కట్టుకునే 'సరోంగ్' వస్త్రం.. నిరసనకారుల ఆయుధంగా మారిన వైనం
- దేశంలో మళ్లీ లాక్‌డౌన్.. ఎక్కడెక్కడంటే
- యాంటీకిథెరా: రెండు వేల ఏళ్ల కిందటి 'పురాతన కంప్యూటర్'.. గుట్టు వీడబోతోందా
- సముద్రపు చేపలా, చెరువు చేపలా... ఏవి తింటే ఆరోగ్యానికి మంచిది?
- మహానగరం మధ్యలో అభయారణ్యం... అందులో రహస్య గిరిజన గ్రామం
- గుజరాత్: టీ షర్ట్ ధరించి వచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యేను సభ నుంచి పంపించేసిన స్పీకర్
- బిర్యానీ పక్కాగా వండాలంటే కచ్చితమైన లెక్కలు ఉంటాయా? దీనికో ఆల్గారిథమ్ ఉందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








