కరోనా వ్యాక్సీనేషన్‌: మోదీ ప్రభుత్వం వయో పరిమితిని వెంటనే ఎందుకు తగ్గించడం లేదు?

కరోనా

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, సరోజ్ సింగ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

కరోనా వ్యాక్సీనేషన్ నిబంధనల్లో మార్పులు తీసుకురావాలని అనేకమంది కోరుకుంటున్నారు. వివిధ రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కూడా ఇదే డిమాండ్ వినిపిస్తోంది.

25 సంవత్సరాలు దాటిన వారందరికీ కరోనా వ్యాక్సీన్ అందించాలని మహారాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది.

కరోనా వ్యాక్సీన్ ఎగుమతి చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రస్తావిస్తూ.. భారత ప్రజల ప్రాణాల కన్నా పాకిస్తాన్ ప్రజల ప్రాణాలు ఎక్కువా? అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ప్రశ్నించారు దిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు రాఘవ్ చడ్డా.

"రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని అరికట్టడానికి వ్యాక్సీన్ నిబంధనల్లో ఉన్న వయో పరిమితిని తొలగించాలని, తక్కువ సమయంలో ఎక్కువమందికి వ్యాక్సీన్ ఇవ్వగలిగితేనే కోవిడ్ నియంత్రణ సాధ్యమవుతుందని" రాజస్థాన్ వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ రఘు శర్మ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించింది.

18 ఏళ్లు పైబడిన వారందరికీ కరోనా వ్యాక్సీన్ ఇవ్వడానికి అనుమతించాలని కోరుతూ ప్రధానమంత్రికి లేఖ రాసింది.

కరోనా

ఫొటో సోర్స్, Getty Images

వయో పరిమితి ఎందుకు తగ్గించడం లేదు

ఈ విషయమై వివిధ ప్రాంతాల నుంచి ఇన్ని అభ్యర్థనలు వస్తున్నప్పుడు మోదీ ప్రభుత్వం దీనిపై ఒక నిర్ణయం ఎందుకు తీసుకోవట్లేదు?

ఈ అంశంపై కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేశ్ భూషణ్ మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

"ప్రపంచంలో అన్నిచోట్లా కూడా ప్రజల కోరికల ఆధారంగా కాకుండా, అవసరాలను బట్టి వ్యాక్సీనేషన్ ప్రక్రియ జరుగుతోంది. బ్రిటన్, అమెరికా, ఫ్రాన్స్, ఆస్ట్రేలియాలాంటి దేశాల్లో కూడా వయోపరిమితి నిబంధనలతో దశలవారీగా టీకా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని" ఆయన అన్నారు.

అయితే, ఈ విషయంలో ఇంత కఠినంగా వయో పరిమితి నిబంధనలు పాటించడానికి కారణాలేంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

వయసు ప్రకారం టీకా వేయడం సరైన పద్ధతేనని, ప్రభుత్వ నిర్ణయం వెనుక తగిన కారణాలు ఉన్నాయని మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజీలో కమ్యూనిటీ మెడిసిన్ విభాగానికి అధిపతి అయిన డాక్టర్ సునీలా గార్గ్ అంటున్నారు.

ఆవిడ వాదనలు ఇలా ఉన్నాయి.

వాదన 1: ‘అందరూ అంటూ అవసరమైనవారిని నిర్లక్ష్యం చేయకూడదు

45 ఏళ్లు దాటిన వారిలో కోవిడ్ మరింత ప్రమాదకరంగా పరిణమిస్తోందని గణాంకాలు సూచిస్తునాయి.

18 ఏళ్లు నిండినవారికి కూడా టీకాలు వేయడం మొదలుపెడితే, వయసులో చిన్నవారందరికీ వ్యాక్సీన్ లభించి, పెద్దవారికి అందుబాటులో లేకుండా ఉండే పరిస్థితి రావొచ్చు.

ముందు ముందు ప్రభుత్వం వీరికి టీకాలు వేయలేకపోతే, కోవిడ్ మరణాల సంఖ్య పెరిగే ప్రమాదం ఉంది.

కరోనా

ఫొటో సోర్స్, Pib india

వాదన 2: కోవిడ్ వ్యాక్సీన్ కొత్తగా వచ్చింది. దాన్ని ఇంటింటికీ వెళ్లి వేయడం కుదరదు

కరోనావైరస్‌కు రికార్డ్ సమయంలో వ్యాక్సీన్ తయారవడం ఇదే మొదటిసారి. దీనివల్ల కొన్ని ప్రతికూల ప్రభావాలు కూడా ఉండొచ్చు.

భారతదేశంలో ఇంతవరకూ ఎలాంటి అవాంచనీయ సంఘటనలూ నమోదు కాలేదు. కానీ, భవిష్యత్తులో కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది.

అందుచేత ఇంటింటికీ వెళ్లి వ్యాక్సీన్ వేయడం లేదా రైల్వే స్టేషన్‌లో బూత్ పెట్టి టీకాలు వేయడం సాధ్యం కాదు.

ప్రజల సహకారంతో, అంగీకారంతో మాత్రమే ప్రభుత్వం వ్యాక్సీనేషన్ కార్యక్రమాన్ని నిర్వహించగలుగుతుంది.

వాదన 3: 'వ్యాక్సీన్ పట్ల విముఖత'తో వ్యవహరించడం

మొదట్లో అనేకమంది కోవిడ్ వ్యాక్సీన్ పట్ల విముఖంగా ఉన్నారు. కొందరు డాక్టర్లు, ఫ్రంట్‌లైన్ వర్కర్లు కూడా కోవిడ్ టీకా వేసుకోవడానికి వెనుకాడారు.

ప్రస్తుతం కోవిడ్ వ్యాక్సీన్ కోసం డాక్టర్ల రిజిస్ట్రేషన్ ఆగిపోయింది. కానీ, ఇప్పుడొచ్చి వాళ్లంతా వ్యాక్సీన్ కావాలని అడుగుతున్నారు.

ఇలాంటి పరిస్థితి 45 ఏళ్లు పైబడినవారిలో రాకూడదు. వారికి కొంత సమయం ఇవ్వాలి.

వ్యాక్సీన్ పట్ల ఉన్న విముఖత పోయి ఆ వయో పరిధిలోని వారందరూ టీకాలు వేయించుకోవాలి.

జనవరి నుంచి కోవిడ్ టీకాలు ఇవ్వడం మొదలుపెట్టారు. వ్యాక్సీనేషన్ ప్రారంభమై మూడు నెలలే అవుతోంది.

అందుచేత, 45 ఎళ్లు పైబడినవారికి మరికొంత సమయం ఇవ్వడం అవసరం.

వాదన 4: పర్యవేక్షణ కష్టం అవుతుంది

భారతదేశంలో జనాభా ఎక్కువ. 80 కోట్ల మందికి టీకాలు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అంటే 160 కోట్ల డోసుల వ్యాక్సీన్ కావాలి.

ఈ లక్ష్యాన్ని చేరుకోవాలంటే ప్రైవేటు రంగం సహాయం కూడా కావాలి.

అలాంటప్పుడు పర్యవేక్షణ సమస్యగా మారే అవకాశం ఉంది.

కరోనావైరస్ ఒక కొత్త అంటువ్యాధి. అందుకే కేంద్ర ప్రభుత్వమే అన్నీ చూసుకుంటోంది. వయో పరిమితిని తొలగించడం పర్యవేక్షణ దృష్ట్యా ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారుతుంది.

కరోనా

ఫొటో సోర్స్, Getty Images

వాదన 5: చిన్న వయసు వారికి మాస్కే వ్యాక్సీన్

బయట తిరగకుండా ఇంట్లో కూర్చుంటున్నవారికే ప్రభుత్వం వ్యాక్సీన్ ఇస్తోందన్న వాదన వినిపిస్తోంది.

నిజానికి 18 నుంచి 45 ఏళ్ల లోపువారి వల్లే కరోనా అధికంగా వ్యాపిస్తోంది.

దీనికి కారణం ఏమిటంటే మాస్కులు లేకుండా తిరగడం.

మాస్కులే రక్షణ, మాస్కే వ్యాక్సీన్ అని యువత అర్థం చేసుకోవాలి.

భౌతిక దూరం పాటించడం, చేతులు సబ్బుతో కడుక్కుంటూ ఉండడం మానకూడదు.

ఎలాగూ, వ్యాక్సీన్ కూడా 100 శాతం రక్షణ కల్పించలేదు. కరోనా వ్యాప్తి నివారణకు పద్ధతులన్నీ పాటిస్తూ ఉండాల్సిందే.

వాదన 6: వ్యాక్సీన్ నేషనలిజం, కోవాక్స్ రెండూ కలిసి నడవాలి

ప్రపంచంలో టీకా ఉత్పత్తిలో భారతదేశం అగ్రస్థానంలో ఉంది. అందుచేత భారతదేశానికి కొన్ని బాధ్యతలు కూడా ఉంటాయి.

కోవాక్స్ ప్రక్రియ (అవసరమైనవారికి వ్యాక్సీన్ అందించేందుకు WHO చేపట్టిన కార్యక్రమం)లో భారత్ తప్పక పాల్గొంటుంది.

అదే సమయంలో, సామాజిక బాధ్యతగా ఇండియా కోవిడ్ వ్యాక్సీన్‌ను ఇతర దేశాలకు కూడా పంపిస్తోంది.

అయితే, దేశ ప్రజల ప్రాణాలను పణంగా పెట్టే పనులేవీ ప్రభుత్వం చేయట్లేదు.

దేశ ప్రజల అవసరాలను తీర్చడంపైనే కేంద్ర ప్రభుత్వం దృష్టి సారిస్తోంది.

వాస్తవానికి, భారతదేశం మొత్తానికి ఒకటి లేదా రెండు వ్యాక్సీన్లు సరిపోవు.

మరో ఆరు వ్యాక్సీన్లకు ఆమోదం ఇచ్చేందుకు చర్చలు జరుగుతున్నాయి. అవి కూడా వచ్చేస్తే వ్యాక్సీనేషన్ ప్రక్రియ మరింత ఊపందుకుంటుంది.

తరువాతి దశలో 30 ఏళ్లు పైబడినవారికి కోవిడ్ టీకాలు ఇచ్చే అవకాశం ఉందని డాక్టర్ సునీలా భావిస్తున్నారు.

అయితే, కొన్ని రాష్ట్రాలు 18 ఏళ్లు పైబడినవారికి, 25 ఏళ్లు పైబడినవారికి కోవిడ్ టీకాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి.

ఈ డిమాండ్లు సరైనవేనని, కోవిడ్ వ్యాక్సీన్‌కు వయోపరిమితిని తొలగించాలని 'ది కరోనావైరస్ బుక్', 'ది వ్యాక్సీన్ బుక్' పుస్తకాల రచయిత, ముంబై జస్‌లోక్ హాస్పిటల్ మెడికల్ రిసెర్చ్ డైరెక్టర్ డాక్టర్ రాజేశ్ పారేఖ్ అభిప్రాయపడ్డారు.

ఆయన వాదనలు ఇలా ఉన్నాయి..

వాదన 1: కరోనావైరస్ సెకండ్ వేవ్ నుంచి బయటపడడానికి వ్యాక్సీన్‌కు వయోపరిమితిని తొలగించాలి

కరోనా సెకండ్ వేవ్ కొన్ని రాష్ట్రాల్లో తీవ్రంగా ఉంది. ఫస్ట్ వేవ్ కన్నా వేగంగా వ్యాప్తిస్తోంది.

సెరో సర్వే ప్రకారం కొన్ని ప్రాంతాల్లోని ప్రజల్లో యాంటీబాడీస్ ఎక్కువగా ఉన్నాయని, కొన్ని ప్రాంతాల్లో తక్కువగా ఉన్నాయని తేలింది.

తక్కువ యాండీబాడీస్ ఉన్న ప్రాంతాలు కరోనా హాట్‌స్పాట్‌లుగా మారే ప్రమాదం ఉంది.

అలాంటి ప్రాంతాల్లో అన్ని వయసులవారికీ వ్యాక్సీన్ ఇచ్చేందుకు ప్రభుత్వం అనుమతించాలి. తద్వారా సెకండ్ వేవ్‌ను నియంత్రించొచ్చు.

వ్యాక్సినేషన్

ఫొటో సోర్స్, Getty Images

వాదన 2: వ్యాక్సీనేషన్ లక్ష్యాన్ని త్వరగా చేరుకోవాలి

మొదటి దశలో ఆరోగ్య కార్యకర్తలకు, ఫ్రంట్‌లైన్ వర్కర్లకూ టీకాలు వేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మూడు నెలలు కావొస్తున్నా ఆ లక్ష్యాన్ని చేరుకోలేదు.

ఇప్పటివరకు 5 శాతానికి మాత్రమే వ్యాక్సీన్ ఇచ్చారు.

బ్రిటన్‌లో 50 శాతం వ్యాక్సీనేషన్ పూర్తయింది. ఇజ్రాయెల్‌లో కూడా వేగంగా జరుగుతోంది. ఆ దేశాలలో కోవిడ్ నియంత్రణ వేగంగా జరుగుతోంది.

వీటినుంచి భారతదేశం నేర్చుకోవాలి. వ్యాక్సీనేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలి.

ప్రస్తుతం ఇండియాలో వ్యాక్సీనేషన్ జరుగుతున్న వేగం చూస్తే దేశం మొత్తం టీకాలు వేయడానికి మూడేళ్లు పట్టొచ్చు అనిపిస్తోంది.

వయోపరిమితిని తొలగించడం ద్వారా లక్ష్యాలను మరింత త్వరగా చేరుకోవచ్చు.

వాదన 3: వ్యాక్సీన్ వృధాను కట్టడి చేయాలి

ఏడు శాతం వ్యాక్సీన్లు వృధా అవుతున్నాయని కేంద్రం తెలిపింది. వయో పరిమితిని తొలగిస్తే వ్యాక్సీన్ వృధా అవ్వకుండా చూడొచ్చు.

అయితే, డాక్టర్ సునీలా ఏమంటున్నారంటే.. ప్రభుత్వం వాక్-ఇన్ వ్యాక్సీనేషన్ ద్వారా టీకా వృధాలను కట్టడి చేసే ప్రయత్నాలు చేస్తోంది. దీనికి వ్యాక్సీన్ ఉత్పత్తిదారుల సహకారం కూడా కావాలి. ఇప్పుడు 20 మోతాదుల ప్యాక్ వస్తున్నట్లైతే దాన్ని 5 మోతాదుల ప్యాక్‌గా మార్చలి. చిన్న చిన్న మోతాదుల్లో ప్యాకింగ్ చేస్తే టీకాలు వృధా అవ్వకుండా ఉంటాయి.

వాదన 4: సెకండ్ వేవ్ వలన వ్యాక్సీనేషన్ ఆగిపోకూడదు

రెండు నెలల క్రితం ఇజ్రాయెల్‌లో ఈ పరిస్థితి వచ్చింది. సెకండ్ వేవ్ కారణంగా రెండు రోజులు టీకాలు ఇవ్వడం ఆపేయాల్సి వచింది. అలాంటి పరిస్థితి భారత్‌లో రాకూడదు. ఇజ్రాయెల్ అనుభవాల నుంచి భారత్ నేర్చుకోవాల్సి ఉందని డాక్టర్ పారేఖ్ అంటున్నారు.

వాదన 5: మిగతా దేశాల నుంచి నేర్చుకోవాలి

వ్యాక్సీనేషన్‌ను వేగవంతం చేయడం వలన అమెరికా, బ్రిటన్‌లాంటి దేశాల్లో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది.

వీటన్నిటినీ చూసి భారతదేశం తన వ్యూహంపై పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)