కరోనావైరస్: ‘45 ఏళ్లు నిండలేదు.. కానీ, మాకు వ్యాక్సీన్ అత్యవసరం’

శిఖా గోయల్
ఫొటో క్యాప్షన్, శిఖా గోయల్
    • రచయిత, వికాస్ పాండే
    • హోదా, బీబీసీ ప్రతినిధి

శిఖా గోయల్‌(37)కు రొమ్ము క్యాన్సర్ ఉందని మూడు నెలల కిందట తెలిసింది. దాంతో ఆమెకు ఒక్కసారిగా జీవితం ఆగిపోయినట్టనిపించిది.

దిల్లీలో డిజైనర్ దుస్తుల బిజినెస్ చేస్తున్న శిఖా తన కుటుంబం, స్నేహితుల సహాయంతో జీవితాన్ని మళ్లీ కూడదీసుకోవడానికి ప్రయత్నించారు.

తనకు క్యాన్సర్ అని తెలిసిన వెంటనే షాక్ తిన్నారు. కానీ మెల్లగా తేరుకుని క్యాన్సర్‌తో పోరాటానికి సిద్ధమయ్యారు.

మహిళలు తరచూ రొమ్ము క్యాన్సర్ పరీక్షలు చేయించుకోవాలని పిలుపునిస్తూ సోషల్ మీడియాలో ప్రచారం ప్రారంభించారు.

శిఖాకు వెంటనే సర్జరీ చేయించుకోవాల్సి వచ్చింది. తరువాత చాలాకాలం కీమోథెరపీ కూడా చేయించుకోవాల్సి వచ్చింది.

మొదట్లో ఆస్పత్రికి తరచూ వెళ్తూ చికిత్స చేయించుకుంటూ ఉండేవారు. కానీ, అప్పుడే కోవిడ్ 19 వ్యాప్తి మొదలైంది.

క్యాన్సర్ ఉన్నవాళ్లకి కోవిడ్ 19 సంక్రమించే ప్రమాదం చాలా ఎక్కువగా ఉందని ఆమె తెలుసుకున్నారు. ఆమెకు కరోనా సోకితే పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయని తెలిసింది.

ఈ పరిస్థితి శిఖాను మరింత భయపెట్టింది. ఆస్పత్రులకు వెళ్లేటపుడు మరిన్ని జాగ్రత్తలు తీసుకునేవారు.

కోవిడ్ నుంచీ దూరంగా ఉంచడానికి వ్యాక్సీన్ "సురక్షితమైన మార్గం" అని ఆమె భావిస్తున్నారు. అయితే, తనకు వయసు 45 కన్నా తక్కువ ఉండడంతో వ్యాక్సీన్ ఇవ్వలేదని ఆమె చెప్పారు.

శిఖా గోయల్

శిఖా మాత్రమే కాదు. ఇండియాలో చాలామంది యువత అధిక రిస్క్ కేటగిరీలో ఉన్నారు. వాళ్లందరికీ వ్యాక్సీన్ తీసుకోవడం చాలా అవసరం.

ప్రస్తుతం భారతదేశంలో 45 ఏళ్లు దాటినవారికి మాత్రమే కోవిడ్ వ్యాక్సీన్ ఇస్తున్నారు. ప్రమాదకరమైన వ్యాధులతో బాధపడుతున్న వారైనా సరే, వయసు 45 కన్నా తక్కువ ఉంటే వ్యాక్సీన్ ఇవ్వట్లేదు.

ఈ పరిస్థితి శిఖాను కుంగదీసింది. వ్యాక్సీన్ కోసం పలు ఆస్పత్రులను సందర్శించినాగానీ లాభం లేకపోయింది.

"నాకు పరిష్కారం దొరికే వరకూ ఆస్పత్రుల చుట్టూ తిరుగుతూనే ఉంటాను. క్యాన్సర్ విషయంలో నా ఆరోగ్యం మెరుగవుతోంది. కానీ కోవిడ్ భయం నన్ను ప్రశాంతంగా ఉండనివ్వట్లేదు" అని ఆమె చెప్పారు.

శిఖాకు ఇంకా అనేక సార్లు కీమోథెరపీ చేయించుకోవాల్సి ఉంది. అది ఆస్పత్రుల్లో మాత్రమే చేస్తారు. అక్కడకు వెళ్లాలంటే ఆమెను కోవిడ్ భయం వెంటాడుతోంది.

ముఖ్యంగా శిఖాలాంటి క్యాన్సర్ రోగులు కోవిడ్ బారిన పడే అవకాశాలు ఎక్కువ.

కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభించినప్పుడు, వయసుతో సంబంధం లేకుండా ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ రోగులందరికీ ముందు వ్యాక్సీన్ అందించాలని 'ది యూరోపియన్ సొసైటీ ఫర్ మెడికల్ ఆంకాలజీ' సూచించింది.

కొన్ని నిర్దిష్ట రకాలైన క్యాన్సర్‌తో బాధపడే రోగులకు ముందుగా వ్యాక్సీన్ అందించమని ప్రపంచ దేశాలకు సూచించే అధ్యయనం ఒకటి 'నేచర్' జర్నల్‌లో పబ్లిష్ అయింది.

బ్రిటన్‌లాంటి దేశాల్లో వయసుతో సంబంధం లేకుండా ప్రాణాంతకమైన వ్యాధులతో బాధపడుతున్నవారికి వ్యాక్సీన్ అందిస్తున్నారు.

'ది యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్' కూడా 16 నుంచీ 64 లోపు వయసు వారిలో దీర్ఘకాలిక రోగాలతో బాధపడేవారికి, ప్రమాదకరమైన వ్యాధుల బారినపడ్డవారికి ముందుగా వ్యాక్సీన్ అందించమని సూచించింది.

భారత ప్రభుత్వం క్యాన్సర్ బారిన పడ్ద యువతకు వ్యాక్సీన్ అందించకపోవడం ఆందోళన కలిగించే విషయమేనని ఇండియాలోని ప్రముఖ ఆంకాలజిస్ట్ డాక్టర్ గణపతి భట్ అంటున్నారు.

"క్యాన్సర్ బాధితులకు రోగ నిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది. కోవిడ్ రిస్క్ అధికంగా ఉంటుంది. ఒకవేళ కోవిడ్ 19 సోకితే కోలుకోవడం వారికి చాలా కష్టమవుతుంది. మరణాలకు దారి తీసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కోవిడ్ నుంచీ క్యాన్సర్ బాధితులను కాపాడడం అన్నిటికన్నా చాలా ముఖ్యం. ఇది జరిగితేనే వారి క్యాన్సర్ చికిత్సకు ఏ ఆంటంకం రాకుండా ఉంటుంది" అని డాక్టర్ భట్ తెలిపారు.

అయితే, దేశంలోని క్యాన్సర్ రోగులందరికీ వ్యాక్సీన్ అందించేదుకు అనుమతి ఇవ్వడం సాధ్యం కాదని కొందరి వాదన.

తీవ్ర లుకేమియాతో బాధపడుతున్నవారు, స్టెమ్ సెల్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకుంటున్నవారు వ్యాక్సీన్ వేయించుకునే ముందు నిపుణులను సంప్రదించాల్సిన అవసరం ఉందని డాక్టర్ భట్ కూడా అంటున్నారు.

కాగా, వ్యాక్సీన్ ఇవ్వాలో వద్దో నిర్ణయించే అధికారం ప్రస్తుతానికి డాక్టర్లకు లేదు.

చిన్న వయసులోనే క్యాన్సర్ బారినపడినవారికి వ్యాక్సీన్ ఇవ్వాలో వద్దో నిర్ణయించే అవకాశం.. వారికి చికిత్స అందిస్తున్న ఆంకాలజిస్టులకు ఉండాలని డాక్టర్ భట్ అభిప్రాయపడుతున్నారు.

వీలైనంత త్వరగా వ్యాక్సీన్ వేయించుకోమని తనకు చికిత్స అందిస్తున్న డాక్టర్ సలహా ఇచ్చారని శిఖా తెలిపారు.

"ఓ పక్క క్యాన్సర్‌తో బాధపడుతూ, మరో పక్క వ్యాక్సీన్ కోసం వెతుకుతూ చాలా ఒత్తిడికి గురవుతున్నాను. వ్యాక్సీన్ దొరకకపోవడం వెయ్యి రెట్లు ఒత్తిడి కలిగిస్తోంది. ఇంత బాధ మాలాంటి వారు పడాల్సిన అవసరం లేదు" అని శిఖా అన్నారు.

కోవిడ్ టెస్ట్

ఫొటో సోర్స్, EPA

45 నుంచి 59 ఏళ్ల వయసువారికి కూడా వ్యాక్సీన్ అందించాలని భారత్ ప్రభుత్వం మంగళవారం నిర్ణయించింది. కానీ అధిక రిస్క్ ఉన్నవారి గురించి ఏమీ చెప్పలేదు.

ప్రస్తుతం జరుగుతున్న వ్యాక్సినేషన్ రౌండ్ పూర్తయ్యాక వయసు పరిమితిని మరింత తగ్గిస్తామని తెలిపింది.

క్యాన్సర్‌లాంటి ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న అనేకమంది రోగులు ఆస్పత్రులకు వచ్చి చికిత్స చేయించుకోవాలి. వారికి కోవిడ్ సోకే ప్రమాదం అధికంగా ఉంటుందని డాక్టర్ ఓం శ్రీవాస్తవ తెలిపారు.

"ఇలాంటి అధిక రిస్క్ ఉన్నవారికి వెంటనే వ్యాక్సీన్లు అందించాల్సిన అవసరం ఉంది" అని ఆయన అన్నారు.

మళ్లీ మరో కోవిడ్ వేవ్ వస్తుందేమోనని హెల్త్‌కేర్ వర్కర్లు ఆందోళన చెందుతున్నారు
ఫొటో క్యాప్షన్, మళ్లీ మరో కోవిడ్ వేవ్ వస్తుందేమోనని హెల్త్‌కేర్ వర్కర్లు ఆందోళన చెందుతున్నారు

మొదట్లో వ్యాక్సీన్ సరఫరా తక్కువగా ఉండేది కాబట్టి వయసులో చిన్నవాళ్లకు వ్యాక్సీన్ అందించకపోవడాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు 5 కోట్ల భారతీయులకు కనీసం ఒక డోసు వ్యాక్సీన్ వేశారు.

"ఇప్పుడు 45 కన్నా తక్కువ వయసులో ప్రాణాంతకమైన వ్యాధులతో బాధపడుతున్నవారికి వ్యాక్సీన్ అందించడం తక్షణ కర్తవ్యం" అని డాక్టర్ భట్ అభిప్రాయపడుతున్నారు.

అయితే, క్యాన్సర్ బాధితులకి కొత్త వ్యాక్సీన్ నిబంధనలు ప్రవేశపెట్టాల్సి ఉంటుందని, రెండు డోసులకు మధ్య సరైన కాలపరిమితి నిర్ణయించాల్సి ఉంటుందని డాక్టర్ భట్ చెప్పారు.

"సాలిడ్, హెమటాలజికల్ క్యాన్సర్ బాధితుల్లో వ్యాక్సీన్ (ఫైజర్-బయోఎన్‌టెక్) మొదటి డోసు తీసుకున్న మూడవ వారానికి కేవలం 39%, 13% యాంటీబాడీలు మాత్రమే అభివృద్ధి చెందుతున్నాయని, క్యాన్సర్ లేనివారికి 97% యాంటీబాడీస్ వృద్ధి చెందుతున్నాయని" కింగ్స్ కాలేజ్ లండన్, ఫ్రాన్సిస్ క్రిక్ ఇన్స్టిట్యూట్ సంయుక్తంగా చేసిన ఒక పరిశోధనలో వెల్లడైంది.

అయితే, మూడు వారాల తరువాత రెండవ డోసు తీసుకున్న సాలిడ్ క్యాన్సర్ బాధితుల్లో రోగ నిరోధక శక్తి అమాంతంగా పెరుగుతోందని, 95% యాంటీబాడీస్ వృద్ధి చెందుతున్నాయని ఈ పరిశోధనలో తేలింది.

"మూడు వారాల తరువాత రెండో డోసు తీసుకోనివారి పరిస్థితి మాత్రం మెరుగవ్వలేదని" ఈ అధ్యయనంలో తెలిపారు.

గత కొద్ది వారాలుగా ఇండియాలో కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది
ఫొటో క్యాప్షన్, గత కొద్ది వారాలుగా ఇండియాలో కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది

ఇండియాలో రెండూ డోసులకు మధ్య కాల పరిమితిని ఇటీవలే 4-6 నుంచి 4-8 వారాలకు పెంచారు.

కానీ, అధిక రిస్క్ ఉన్న రోగులకు ప్రత్యేక విధానాలేమీ సూచించలేదు.

ప్రస్తుతం భారతదేశంలో చిన్నవయసులోనే క్యాన్సర్ బారిన పడ్దవారికి మాత్రమే కాకుండా ప్రాణాంతకమైన కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నవారికి కూడా అత్యవసరంగా వ్యాక్సీన్ అందించాలని నిపుణులు అంటున్నారు.

కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నవారు కూడా తరచూ డయాలసిస్ కోసం ఆస్పత్రులకు వెళ్లాల్సి వస్తుంది కాబట్టి వారికి కూడా కోవిడ్ సోకే ప్రమాదం అధికంగా ఉంటుది.

ఇలాంటి ప్రాణాంతక రోగాలతో బాధపడుతున్నవారు కోవిడ్ బారిన పడడం గత జూన్‌లో మొదటిసారి చూశానని కేరళలోని ఎర్నాకులం మెడికల్ కాలేజ్ ప్రొఫెసర్ ఫతాహుదీన్ తెలిపారు.

"ఇలాంటివారందరికీ అత్యవసరంగా వ్యాక్సీన్ అందించాలి. ఇంటి దగ్గరే డయాలసిస్ చేయించుకోవడం చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం. అలా అందరూ చేయించుకోలేరు. అలాగని వాళ్లని వారి కర్మానికి వదిలేయలేం. వారికి మన సహాయం కావాలి" అని ఆయన అన్నారు.

"50 ఏళ్ల డయాబెటిస్ బాధితుడి కన్నా 30 ఏళ్ల క్యాన్సర్ బాధితుడికి కోవిడ్ సోకే ప్రమాదం అధికంగా ఉంటుందని కచ్చితంగా చెప్పవచ్చు" అని ప్రొఫెసర్ ఫతాహుదీన్ తెలిపారు.

33 ఏళ్ల శరత్‌కు వారానికి మూడు సార్లు డయాలసిస్ చేయించుకోవాల్సి ఉంటుంది. దానికి తోడు కోవిడ్ భయం ఆయన్ను వెంటాడుతోంది.

"వయసుతో సంబంధం లేకుండా దీర్ఘకాలిక రోగాలతో, ప్రాణాంతకమైన వ్యాధులతో బాధపడుతున్నవారికి ప్రభుత్వం వ్యాక్సీన్లు అందించాలని కోరుకుంటున్నాను" అని శరత్ అన్నారు.

శిఖా కూడా అదే అంటున్నారు.

"ఒక సమయంలో ఒక విషయం గురించే ఆందోళన చెందగలం. కోవిడ్‌తో పోరాడే అవకాశాన్ని మాకు కల్పించండి" అని శిఖా అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)