కరోనావైరస్: హోలీ రోజున నిర్లక్ష్యం మిమ్మల్ని 'సూపర్ స్ప్రెడర్'గా మార్చవచ్చు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, కమలేష్
- హోదా, బీబీసీ ప్రతినిధి
2020 మార్చిలో భారత్‌లో కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరగడం మొదలైంది. అదే నెలలో సరిగ్గా హోలీ తర్వాత స్కూళ్లు, కాలేజీలు మూసేశారు. అంతర్జాతీయ విమాన సేవలను ఆపేశారు.
అది జరిగి ఏడాదైపోయింది. మళ్లీ హోలీ వచ్చింది. కరోనా మహమ్మారి కూడా మళ్ళీ వేగంగా వ్యాపిస్తోంది.
గత ఏడాదిలో రోజువారీ నమోదయ్యే కరోనా కేసుల సంఖ్య 9 వేల వరకూ తగ్గింది. అందరూ కరోనా అంతం అయిందనే అనుకున్నారు.
కానీ, ఒక నెల రోజుల నుంచి కరోనా కేసులు మళ్లీ వేగంగా పెరుగుతున్నాయి. దీనిని భారత్‌లో కరోనా సెకండ్ వేవ్‌గా చూస్తున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
చాలా ప్రాంతాల్లో లాక్‌డౌన్
మార్చి 27న ఉదయం వరకూ దేశవ్యాప్తంగా 62,258 కొత్త కరోనా కేసులు బయటపడ్డాయి. 291 మంది చనిపోయారు.
ఇప్పటివరకూ కోటీ 19 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదు కాగా, దేశంలో ప్రస్తుతం నాలుగు లక్షల 52 వేలకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి.
చాలా ప్రాంతాల్లో లాక్‌డౌన్ విధించారు. వ్యాక్సినేషన్ వేగం కూడా పెంచారు. మాస్క్ ధరించడం, సోషల్ డిస్టెన్సింగ్ లాంటి నిబంధనలు కచ్చితంగా పాటించాలని చెబుతున్నారు.
మరోవైపు, మార్చి 29న హోలీ పండుగ ఉండడంతో ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. మొదటి వేవ్ వచ్చినపుడు కూడా హోలీ పండుగ తర్వాతే కరోనావైరస్ కేసుల సంఖ్య వేగంగా పెరిగింది.
గత ఏడాది అక్టోబర్, నవంబర్‌లో నవరాత్రి, దీపావళి పండుగల సమయంలో కరోనా కేసులు మరింత భారీగా పెరిగాయి.
కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ తీవ్రంగా ఉండడం, కోవిడ్-19 కొత్త వేరియంట్స్ కూడా బయటపడడంతో హోలీ వేడుకల్లో తగిన జాగ్రత్తలు పాటించకపోతే కరోనా వ్యాప్తిని తగ్గించడం సవాలుగా మారవచ్చు.
"గత అనుభవాల నుంచి మనం చాలా నేర్చుకోవాల్సి ఉంటుంది. వేడుకలకు, కార్యక్రమాలకు వెళ్లి సూపర్ స్ప్రెడర్ కాకుండా ఉండడం మంచిది" అని డాక్టర్లు చెబుతున్నారు.

ఫొటో సోర్స్, EPA
హోలీ వల్ల మీరు సూపర్ స్ప్రెడర్ కావచ్చు
"ఎంత పెద్ద వేడుకలు, పండుగలు జరిగినా.. తర్వాత భారీగా కరోనా కేసులు బయటపడడం మనం చూశాం. ఉత్తరాఖండ్‌లో జరుగుతున్న కుంభమేళాలో కూడా కరోనా కేసులు వస్తున్నాయి.
పెళ్లిళ్ల తర్వాత, దానికి వెళ్లిన అతిథులు, వధూవరులకు కూడా కరోనా వస్తోంది. అంటే, వైరస్ నుంచి మనల్ని కాపాడుకునే జాగ్రత్తలను నిర్లక్ష్యం చేస్తే, ఆ వైరస్ వ్యాపించడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది" అని ఆకాశ్ హెల్త్ కేర్ ఇంటర్నల్ మెడిసిన్ విభాగం చీఫ్ డాక్టర్ రాకేశ్ పండిత్ అన్నారు.
మరోవైపు, కరోనా కొత్త వేరియంట్స్ కూడా వ్యాపిస్తున్నాయి. ఇటీవల డబుల్ మ్యూటెంట్ వైరస్ కూడా గుర్తించారు. ఈ కొత్త వేరియంట్లు వేగంగా వ్యాపించేలా ఉంటాయి. హోలీలో జనం కలిసి తినడం, తాగడం చేస్తుంటారు. అలాంటి సమయంలో సోషల్ డిస్టెన్సింగ్, మాస్క్ ధరించడం లాంటివి చేయరు. అవన్నీ కలిపి కరోనా మరింత వేగంగా వ్యాపించడానికి కారణం అవుతుంది.
భారత్‌లో హోలీ పండుగను రకరకాలుగా జరుపుకుంటారు. కొన్ని ప్రాంతాల్లో దానిని ఒక్క రోజే జరుపుకుంటే, మరికొన్ని ప్రాంతాల్లో అది చాలా రోజులు జరుగుతుంది.
హోలీ సందర్భంగా చాలా ప్రాంతాల్లో మేళాలు కూడా ఏర్పాటుచేస్తారు. వాటిలో జనం భారీగా గుమిగూడతారు.
"ఇలాంటి వేడుకల్లో, మనం తరచూ సూపర్ స్ప్రెడర్ కేసులు చూస్తుంటాం. గుంపులో ఒక్క రోగి ఉన్నా.. అది చాలా మందికి వ్యాపిస్తుంది. అక్కడ మీరు మాస్క్ వేసుకున్నప్పటికీ, అది నీళ్లలో తడిచిపోతే, కరోనా నుంచి మిమ్మల్ని కాపాడలేదు" అని హరియాణాలో కోవిడ్-19 నోడల్ ఆఫీసర్ డాక్టర్ ధ్రువ్ చౌధరి చెప్పారు.
అలాంటి సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో డాక్టర్ రాకేశ్ పండిత్ చెప్పారు.
"మీరు హోలీ జరుపుకోండి. కానీ, జనం గుమిగూడిన ప్రాంతాల్లోకి వెళ్లకండి. ఇంట్లోనే ఉండి హోలీ జరుపుకోవడం మంచిది. దానితోపాటూ ఎక్కువ కేసులు బయటపడుతున్న రాష్ట్రాలకు వెళ్లడం కూడా మానుకోండి. కరోనాను నిర్లక్ష్యం చేయడం వల్ల, వచ్చే దీపావళి కూడా ఘోరంగా ఉండచ్చు" అన్నారు.

ఫొటో సోర్స్, Reuters
వివిధ రాష్ట్రాల కరోనా మార్గదర్శకాలు
హోలీ వేడుకల సమయంలో కరోనా కేసులు పెరిగే ప్రమాదం ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. హోలీ, ఇతర వేడుకలు, కార్యక్రమాలు నిర్వహించడంపై ప్రత్యేక మార్గదర్శకాలు విడుదల చేశాయి.
-తెలంగాణలో మాస్కుల వినియోగం తప్పనిసరి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. బహిరంగ ప్రదేశాలు, పని చేసే ప్రదేశాలు, ప్రజా రవాణా వాహనాల్లో కచ్చితంగా మాస్కులు ధరించాలని స్పష్టం చేసింది. మాస్కులు ధరించని వారిపై విపత్తు నిర్వహణ చట్టం, ఐపీసీ కింద చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
మాస్క్ నిబంధనలు కచ్చితంగా అమలు అయ్యేలా చూడాలని కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
షబ్-ఏ-రాత్, హోలీ, ఉగాది, శ్రీరామనవమి వేడుకలను బహిరంగంగా నిర్వహించకూడదని తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది.
- ముంబయిలో బహిరంగ స్థానాల్లో హోలీ సంబరాలు జరుపుకోవడం నిషేధించారు. హోలికా దహనం, రంగ్ పంచమి లాంటివి వాళ్ల ఇంటి ఆవరణలోనే జరుపుకోవాల్సి ఉంటుంది.
- హరియాణా ప్రభుత్వం బహిరంగ ప్రదేశాల్లో వేడుకలు, పూజల కోసం జనం గుమిగూడడం నిషేధించింది. ఆదేశాలను ఉల్లంఘించినవారిపై కఠిన చర్యలకు ఆదేశించింది.
-దిల్లీలో హోలీ సందర్భంగా బహిరంగ కార్యక్రమాలు ఏవీ ఏర్పాటు చేయకూడదు. అంటే, జనం ఒక చోట గుమిగూడి హోలీ జరుపుకోవడానికి అనుమతులు లేవు. కరోనా కేసులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల నుంచి వచ్చేవారికి కరోనా టెస్టులు చేస్తారు. రిపోర్ట్ నెగటివ్ వస్తేనే, దిల్లీలోకి అనుమతిస్తారు.
- చండీగఢ్ ప్రభుత్వం హోలీకి సంబంధించిన అన్ని వేడుకలనూ నిషేధించినట్లు ఆదేశాలు జారీ చేసింది. క్లబ్బులు, హోటళ్లు, రెస్టారెంట్లలో హోలీ సందర్భంగా జనం గుమిగూడకూడదు. నిర్వాహకులు సీటింగ్ సామర్థ్యంలో 50 శాతం మాత్రమే ఉండేలా చూసుకోవాలి.
- సీనియర్ సిటిజన్స్, వివిధ వ్యాధులతో బాధపడుతున్నవారు హోలీ వేడుకలకు దూరంగా ఉండాలని యూపీ ప్రభుత్వం సూచించింది. అధికారుల అనుమతి లేకుండా ఎలాంటి ఊరేగింపులు, వేడుకలు నిర్వహించకూడదు. కరోనా కేసులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల నుంచి వచ్చేవారికి కోవిడ్ పరీక్షలు తప్పనిసరి.
- మధ్యప్రదేశ్ ప్రజలు ఇళ్లలోనే హోలీ జరుపుకోవాలని ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అపీల్ చేశారు. హోలీ సందర్భంగా ఎలాంటి జాతరలూ ఏర్పాటు చేయకూడదు. ఏ కార్యక్రమం అయినా 20 కంటే ఎక్కువ మంది అతిథులకు అనుమతి లేదు.
- బిహార్ ప్రభుత్వం హోలీ మిలన్ కార్యక్రమాలను నిషేధించింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారికి ఎయిర్ పోర్టుల్లో, రైల్వే స్టేషన్లలో కరోనా పరీక్షల చేస్తారు.
- రాష్ట్ర ప్రజలు హోలీని సంప్రదాయ పద్ధతుల్లో కొంతమందితో కలిసి చేసుకోవచ్చని గుజరాత్ ప్రభుత్వం చెప్పింది. పండుగ రోజున బహిరంగ కార్యక్రమాలు, భారీగా జనం గుమిగూడే కార్యక్రమాలకు అనుమతి లేదు.

ఫొటో సోర్స్, Getty Images
సెకండ్ వేవ్ తీవ్రంగా ఎందుకు ఉంది
కరోనా వైరస్ మొదటి వేవ్‌లో దేశంలో రోజువారీ కేసుల సంఖ్య 50 వేలు చేరడానికి ఐదు నెలలు పట్టింది. కానీ సెకండ్ వేవ్‌లో ఒక నెలలోనే పాజిటివ్ కేసులు 9 వేల నుంచి 60 వేలు దాటేశాయి.
"మొదటి వేవ్‌లో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించారు. అందుకే, కరోనా వ్యాప్తి తక్కువగా ఉంది. కానీ, ఇప్పుడు ఎలాంటి లాక్‌డౌన్ లేదు. జనం అందరినీ కలుస్తున్నారు. మరోవైపు, కొత్త కొత్త వేరియంట్లు కూడా పుట్టుకొస్తున్నాయి. పంజాబ్‌లో గుర్తించిన కొత్త వేరియంట్ వ్యాపించే సామర్థ్యం 50 శాతం ఎక్కువగా ఉంది. అందుకే సెకండ్ వేవ్ వేగంగా పెరుగుతోంది" అని డాక్టర్ ధ్రువ్ అన్నారు.
"ఏప్రిల్, మే నెలలు మనకు చాలా కష్టంగా ఉండబోతున్నాయి. సెకండ్ వేవ్ పీక్‌కు చేరుకోడానికి మనం ఇంకా చాలా వేచిచూడాల్సుంటుంది. అది వివిధ రాష్ట్రాల కేసులను బట్టి ఉంటుంది. కొన్ని రాష్ట్రంలో కేసులు చాలా ఎక్కువగా ఉంటే, ఇంకో దగ్గర చాలా తక్కువ ఉండచ్చు. అందుకే, అది వాటి పీక్‌కు అనుగుణంగా ఉంటుంది" అన్నారు.

ఫొటో సోర్స్, Ani
వ్యాక్సినేషన్ లేదా లాక్‌డౌన్
దీనిపై ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ గత వారం మాట్లాడారు.
"సెకండ్ వేవ్ త్వరగా రావడం మనం చూస్తున్నాం. కరోనాతో పోరాటానికి ఏడాది పూర్తవుతోంది. మా ఫోకస్ అంతా టెస్టింగ్, మాస్క్ ధరించేలా చూడడం, వాక్సినేషన్ మీదే ఉంది" అన్నారు.
ఒకవైపు వాక్సినేషన్ జరుగుతున్నప్పటికీ, కరోనా వ్యాప్తి తగ్గించడానికి చాలా రాష్ట్రాలు లాక్‌డౌన్ లేదా కర్ఫ్యూ విధిస్తున్నాయి. ఇలాంటి సమయంలో కోవిడ్-19 వైరస్ వ్యాప్తిని అడ్డుకోడానికి ఎలాంటి పద్ధతులు మెరుగైన ప్రభావం చూపించవచ్చు.
సమాధానంగా "లాక్‌డౌన్ ఒక తాత్కాలిక ప్రత్యామ్నాయం మాత్రమే. దానిని ఎక్కువ రోజులు విధించలేం. ఎందుకంటే, దానివల్ల దేశ ఆర్థిక వ్యవస్థపై ఘోరమైన ప్రభావం పడుతుంది. అందుకే, దానికి సమర్థమైన పద్ధతి వ్యాక్సినేషన్ పెంచడం ఒక్కటే. కానీ, దానితోపాటూ మాస్క్, సోషల్ డిస్టన్సింగ్ పాటించేలా కూడా చర్యలు కొనసాగించాలి" అని డాక్టర్ రాకేశ్ అన్నారు.
ప్రస్తుతం అత్యధిక కేసులు బయటపడుతున్న రాష్ట్రాల్లో కరోనాను అడ్డుకోవడంపై కేంద్రం దృష్టి పెట్టింది. ఈ రాష్ట్రాల్లో మహారాష్ట్ర, కేరళ, పంజాబ్, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, గుజరాత్ ఉన్నాయి. మరోవైపు దిల్లీ, తమిళనాడు, హరియాణా, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లో కూడా కరోనా కేసులు మెల్లమెల్లగా పెరుగుతున్నాయి.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: భారత్‌లోని 18 రాష్ట్రాల్లో ‘డబుల్ మ్యూటెంట్ వేరియంట్’.. తెలుగు రాష్ట్రాల్లో 104 మందిలో యూకే, 20 మందిలో దక్షిణాఫ్రికా వేరియంట్
- కుతుబ్ మినార్ స్థానంలో అంతకు ముందు హిందూ దేవాలయం ఉండేదా?
- వీగర్ ముస్లిం జాతిని చైనా సమూలంగా తుడిచిపెట్టేస్తోందా? బ్రిటన్ నివేదికలో ఏం బయటపడింది?
- తమిళనాడు ఎన్నికల వల్లే శ్రీలంక వ్యతిరేక తీర్మానంపై ఓటింగ్‌కు భారత్ గైర్హాజరయ్యిందా...
- న్యూజీలాండ్ ప్రభుత్వం 'తల్లుల' కోసం చేసిన చట్టంపై చర్చ ఎందుకు... భారత్‌లో పరిస్థితి ఏంటి?
- భారత్-పాక్ సరిహద్దు: కచ్ నిర్బంధ కేంద్రంలో అయిదుగురు పాకిస్తానీలు ఎలా చనిపోయారు?
- మహిళల మోకాళ్లు, చిరిగిన జీన్స్‌పై ఎందుకింత చర్చ జరుగుతోంది
- 15 వందల మంది భారత సైనికుల భీకర పోరాటం రెండో ప్రపంచ యుద్ధ గతిని ఎలా మార్చిందంటే..
- 'ఒకవేళ నేను చనిపోతే మన బిడ్డను జాగ్రత్తగా చూసుకోండి'
- వరల్డ్ హ్యాపీనెస్ డే: అత్యంత సంతోషకర దేశంగా ఫిన్లాండ్, 139వ స్థానంలో భారత్
- మహాశివరాత్రి: పురుష లింగాకారానికి పూజలు చేసే అరుదైన ఆలయం.. గుడిమల్లం
- సిద్దిక్ కప్పన్: రేప్ కేసు రిపోర్ట్ చేయడానికి ప్రయత్నించినందుకు జైల్లో పెట్టి 'హింసిస్తున్నారు'
- ముస్లిం, క్రైస్తవ మతాలకు చెందిన మృతుల ఖననానికి మారుమూల దీవిని ఎంపిక చేసిన శ్రీలంక
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








