కరోనావైరస్: వ్యాక్సినేషన్ కొనసాగుతున్నా కేసులు ఎందుకు తగ్గడం లేదు

వ్యాక్సీనేషన్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, షాదాబ్ నజ్మీ
    • హోదా, బీబీసీ విజువల్ జర్నలిజం టీం

ఒక వైపు వివిధ రాష్ట్రాల్లో వ్యాక్సీన్ కార్యక్రమం కొనసాగుతుండగా మరో వైపు పెరుగుతున్న కోవిడ్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి.

ఈ ఏడాది జనవరి నుంచి దేశంలో మొదలైన వ్యాక్సీన్ కార్యక్రమం నెమ్మదిగా పుంజుకుంటోంది. వ్యాక్సీన్లు ఇవ్వడం పెరిగేకొద్దీ కొత్త కేసులు తగ్గుతాయని భావించారు. కానీ, దీనికి వ్యతిరేక పరిణామం కనిపిస్తోంది. ఎందుకిలా జరుగుతోంది?

మార్చ్ 14 నాటికి దేశంలో 2.9 కోట్ల మందికి వ్యాక్సీన్ ఇచ్చారు. అందులో 18 శాతం మంది రెండో డోసు కూడా తీసుకున్నారు.

సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, దిల్లీ లాంటి చిన్న రాష్ట్రాలలో ప్రతి 10 లక్షల జనాభాకి అత్యధిక శాతం వ్యాక్సీన్లను కూడా ఇచ్చారు. మిగిలిన రాష్ట్రాలు కూడా వ్యాక్సీన్ ప్రక్రియను వేగవంతం చేశాయి. కేరళ, రాజస్థాన్, గోవా ఇప్పటికే ప్రతి 10 లక్షల జనాభాలో 35,000 డోసులు ఇచ్చాయి.

ఒక వైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా జరుగుతున్నప్పటికీ, రోజు వారీ పెరుగుతున్న కోవిడ్ కేసుల సంఖ్య మాత్రం కలవర పెడుతోంది. చాలా రాష్ట్రాలలో కేసుల సంఖ్య పెరుగుతోంది.

ఉదాహరణకు మహారాష్ట్రలో ప్రస్తుతం రోజుకు 13,000 కేసులు నమోదు అవుతున్నాయి. ఇక్కడ జనవరిలో రోజుకు 3000 కేసులకు పడిపోయాయి జనవరి మొదట్లో రోజుకు 300 కంటే తక్కువ కేసులు నమోదయిన పంజాబ్ లాంటి రాష్ట్రంలో కూడా ఇప్పుడు 1200కి పైగా కేసులు నమోదవుతున్నాయి. ఇది జనవరితో పోలిస్తే 5 రెట్లు ఎక్కువ.

కోవిడ్ వ్యాక్సినేషన్ అనాల్సిస్ గ్రాఫ్

వ్యాక్సీన్ ప్రభావం

వ్యాక్సీన్ పెరుగుతున్న కేసుల సంఖ్యను తగ్గించగలదా? దీనిని అర్ధం చేసుకోవాలంటే దేశంలో ఇప్పటి వరకు ఎంత మంది వ్యాక్సీన్ తీసుకున్నారో తెలుసుకోవలసిన అవసరం ఉంది.

భారతదేశంలో 100 మంది నివసిస్తున్నారని అనుకుంటే, అందులో కేవలం 2.04 మంది మాత్రమే వ్యాక్సీన్ తీసుకున్నారు. ఇందులో మరో మినహాయింపు ఉంది. ఈ 2.04 డోసులు వైద్య రంగంలో ఉన్న వారికి, ఫ్రంట్ లైన్ ఉద్యోగులకు, లేదా 60 ఏళ్లు దాటిన వారికి, 45 సంవత్సరాలు పైగా ఉండి ఏదైనా దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్నవారికి ఇచ్చారు.

ఇప్పుడు తమిళ నాడు ఉదాహరణ చూద్దాం. ఈ రాష్ట్రం జెండర్, వయసు ప్రాతిపదికన కొత్త కేసుల జాబితాను విడుదల చేస్తోంది.

మార్చి 1 నుంచి సాధారణ ప్రజలకు వ్యాక్సీన్ ఇవ్వడం మొదలుపెట్టడంతో 60కి పైగా వయసు ఉన్న వారిలో కేసుల సంఖ్య తగ్గింది. జనవరి మొదట్లో నమోదైన కేసుల్లో 24 శాతం మంది వృద్ధులు ఉండేవారు. మార్చి 01 తర్వాత వీరిలో కేసుల సంఖ్య 22-23 శాతానికి తగ్గింది.

అయితే, ఇది ఇంకా తక్కువే అని చెప్పవచ్చు. దీనిని వ్యాక్సీన్ ప్రభావం అని చెప్పగలమా? ఇది ఇప్పట్లో చెప్పలేం. వైరస్ ప్రస్తుతం అన్ని వయసుల వారికి పాకుతోంది.

గ్రాఫ్

పెరుగుతున్న కేసుల పై వ్యాక్సీన్ ప్రభావం ఎప్పుడు చూపుతుందో ఎలా తెలుస్తుంది?

రానున్న నెలల్లో కోవిడ్ బారిన పడే వృద్ధుల సంఖ్య ఆసుపత్రుల్లో చేరే యువత సంఖ్య తగ్గుముఖం పడితే వ్యాక్సిన్లు ప్రభావం చూపిస్తున్నాయని చెప్పుకోవచ్చు.

కేరళలో వ్యాక్సీన్ ప్రక్రియ మొదలయిన తర్వాత కోవిడ్ బారిన పడుతున్న వైద్య సిబ్బంది సంఖ్య గణనీయంగా తగ్గింది. ఇది గత నెలలతో పోల్చి చూసుకుంటే 40 శాతం తగ్గింది.

కొన్ని రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్నప్పటికీ, వ్యాక్సినేషన్ వలన కేసులు తగ్గుతున్నాయని తెలుస్తోంది.

గ్రాఫ్

గ్రామీణ , నగర ప్రాంతాల మధ్య వ్యత్యాసాలు

దేశంలో ఒక వైపు వేగవంతంగా వ్యాక్సీన్ ప్రక్రియ అమలు అవుతున్నప్పటికీ , మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక వంటి పెద్ద రాష్ట్రాల్లో నగర ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాల మధ్య వ్యత్యాసాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

ఈ వ్యాక్సీన్ల గురించి నగర ప్రాంత ప్రజల్లో అవగాహన ఉండటం వలన ఎక్కువ మంది వ్యాక్సీన్ వేయించుకోవడానికి ముందుకు వస్తున్నారు.

ఉదాహరణకు మార్చ్ 12 నాటికి ముంబయిలో 60 ఏళ్లకు పై బడిన 190,000 మంది మొదటి డోసు వ్యాక్సీన్ తీసుకున్నారు. అలాగే, పూణె , నగరాలున్న జిల్లాల్లో తొలి డోసు తీసుకున్న వారి సంఖ్య 90,000, 49,000 ఉంటే బీడ్, ధూలే లాంటి గ్రామీణ జిల్లాల్లో తొలి డోసు తీసుకున్న వారి సంఖ్య 9000 కంటే తక్కువగా ఉంది.

వైరస్ ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకు కూడా వ్యాపించింది. కొన్ని వారాల క్రితమే మహారాష్ట్ర లోని అమరావతి జిల్లా కోవిడ్ కేసులకు కేంద్రంగా మారింది. అమరావతిలో వ్యాక్సీన్ ప్రక్రియను గమనిస్తే మార్చి 12 నాటికి 16,000 కి పైగా వృద్ధులు వ్యాక్సీన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇది అహ్మద్ నగర్, కొల్హాపూర్ జిల్లాలతో పోలిస్తే చాలా తక్కువ.

గ్రామీణ,నగర ప్రాంతాల మధ్య వ్యత్యాసాలు ఎంత తగ్గితే రోజు వారి కేసులు తగ్గే అవకాశం కూడా అంతే ఉంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)