భారత్, చైనాలలో భవిష్యత్తులో పెరగనున్న కవలల జననాలు

Twins

ప్రపంచవ్యాప్తంగా కవల పిల్లల పుట్టుక గతంలో ఎన్నడూ లేనంతగా తారా స్థాయికి చేరిందని పరిశోధకులు చెబుతున్నారు.

ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం సుమారు 16 లక్షల మంది కవల పిల్లలు పుడుతున్నారు. పుట్టిన ప్రతి 42 మంది పిల్లల్లో ఒకరు కవలలు ఉంటున్నారు.

పిల్లల్ని కనడం వాయిదా వేయడం, కృత్రిమ గర్భధారణ పద్ధతులను అవలంబించటం వలన కూడా 1980ల నుంచి కవల పిల్లల పుట్టుక పెరగడానికి మూడొంతులు కారణమని నిపుణులు చెబుతున్నారు.

కానీ, ప్రస్తుత కాలంలో చాలా మంది ఒకే బిడ్డను కనాలనే దృక్పథం పెరుగుతూ ఉండటంతో ఈ పరిస్థితి మారవచ్చని అభిప్రాయపడుతున్నారు.

గత 30 సంవత్సరాలుగా ప్రపంచ వ్యాప్తంగా అన్ని ప్రాంతాలలోనూ కవల పిల్లల పుట్టుక పెరగడం వలన ఈ స్థాయికి చేరినట్లు హ్యూమన్ రీప్రొడక్షన్ జర్నల్ పేర్కొంది. ఆసియాలో కవల పిల్లల జననాలు 32 శాతం పెరగగా, నార్త్ అమెరికాలో 71 శాతం పెరిగింది.

కవల పిల్లలు

ఫొటో సోర్స్, Getty Images

ఈ అధ్యయనకారులు 2010 - 2015 మధ్యలో పుట్టిన కవలల గురించి 165 దేశాల నుంచి సమాచారం సేకరించి ఈ సంఖ్యను 1980-85 మధ్య కాలంలో పుట్టిన వారి సంఖ్యతో పోల్చి చూశారు.

ప్రతి 1000 జననాలకు పుడుతున్న కవలల సంఖ్య యూరప్, నార్త్ అమెరికాలో ఎక్కువగా ఉందని, ఇది ప్రపంచ వ్యాప్తంగా గతంలో ప్రతి 1000 జననాలకు 9 మంది కవల పిల్లలు ఉంటే అదిప్పుడు 12కి పెరిగిందని చెప్పారు.

అయితే, ఆఫ్రికాలో కవల పిల్లల పుట్టుక ఎప్పుడూ ఎక్కువగానే ఉంది. ఇక్కడి పరిస్థితిలో గత 30 ఏళ్లలో పెద్దగా మార్పు ఏమి కనిపించలేదు. దీనికి ఇక్కడ జనాభా పెరుగుదల కారణం కావచ్చని భావిస్తున్నారు.

ప్రపంచంలో ప్రస్తుతం 80 శాతం కవల పిల్లల జననాలు ఆఫ్రికా, ఆసియా దేశాలలో చోటు చేసుకుంటున్నాయి. దీనికొక కారణముందని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అధ్యయనకర్త ప్రొఫెసర్ క్రిస్టియాన్ మోన్డెన్ అన్నారు.

"ఆఫ్రికాలో రెండు వేర్వేరు అండాల వలన పుట్టిన (డిజిగోటిక్ కవలలు) జననాల సంఖ్య ఎక్కువగా ఉండటం వలన కవల పిల్లల జననాలు ఎక్కువగా ఉన్నాయి. మిగిలిన జనాభాకు, ఆఫ్రికా జనాభాకు మధ్య ఉన్న జన్యుపరమైన తేడాలే దీనికి కారణమై ఉండవచ్చు’’ అని చెప్పారు.

కవల పిల్లలు

యూరప్, నార్త్ అమెరికా, ఓషియానిక్ దేశాల్లో 1970ల నుంచి కృత్రిమ గర్భధారణ పద్ధతులైన ఐవీఎఫ్, ఐసీఎస్ఐ, గర్భాశయ ఉద్దీపన పద్ధతుల వల్ల కవలల జననాలు పెరుగుతున్నాయి.

మహిళలు ఆలస్యంగా పిల్లల్ని కనాలనుకోవడం, ఎక్కువగా గర్భ నిరోధక ఉత్పత్తులను వాడటం, సంతానోత్పత్తి సామర్ధ్యం తగ్గిపోవడం కూడా తర్వాత దశల్లో ఎక్కువ మంది పిల్లలు పుట్టడానికి కారణమని ఈ అధ్యయనం పేర్కొంటోంది.

కానీ, ప్రస్తుతం ఒకే బిడ్డను కనడం సురక్షితమనే అంశానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని ప్రొఫెసర్ మోన్డెన్ చెబుతున్నారు.

"శిశువుల్లో, పిల్లల్లో అధిక మరణాలు సంభవించడానికి కవల పిల్లల పుట్టుకకు సంబంధం ఉంది. దీంతో పాటు, కవలలు పుట్టే సమయంలో తల్లికి బిడ్డకు కూడా ముప్పు ఎక్కువగా ఉంటుంది" అని ఆయన చెప్పారు.

"పుట్టుక సమయంలో కవల పిల్లలకు ఎక్కువ సమస్యలు ఎదురవుతాయి. చాలా సార్లు కవల పిల్లలు నెలలు నిండక ముందే తక్కువ బరువుతో కానీ, తటస్థంగా పుట్టడం కానీ ఎక్కువగా ఉంటుంది" అని చెప్పారు.

ఆసియాలో కవల పిల్లల పుట్టుక 32 శాతం పెరగగా, నార్త్ అమెరికాలో 71 శాతం పెరిగింది.

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, ఆసియాలో కవల పిల్లల పుట్టుక 32 శాతం పెరగగా, నార్త్ అమెరికాలో 71 శాతం పెరిగింది.

బ్రతికే అవకాశాలు

మధ్య స్థాయి, అల్పాదాయ దేశాలలో పుట్టే కవలలు బ్రతికే అవకాశాల గురించి ఈ అధ్యయనం ఆందోళన వ్యక్తం చేసింది.

ముఖ్యంగా సబ్ సహారా దేశాల్లో కవలలు పుట్టిన మొదటి ఏడాదిలోనే తమ తోటి వారిని కోల్పోతారు. ఇలా ప్రతి సంవత్సరం 200,000 మందికి పైగా మరణిస్తున్నారు.

"సబ్ సహారా ఆఫ్రికా తరహాలో చాలా ధనిక పశ్చిమ దేశాల్లో కూడా కవల పిల్లల జననాలు పెరుగుతున్నాయి. కానీ, ఈ దేశాల్లో కవల పిల్లలు బ్రతికే అవకాశాల్లో చాలా వ్యత్యాసాలు ఉన్నాయి" అని అధ్యయనకర్త ప్రొఫెసర్ జెరోయిన్ స్మిట్స్ చెప్పారు.

అయితే, భవిష్యత్తులో భారతదేశం, చైనాలలో కవలల జననాలు పెరుగుతాయని అధ్యయనకర్తలు అంచనా వేస్తున్నారు.

తగ్గిపోతున్న సంతానోత్పత్తి సామర్ధ్యం, పిల్లలకు జన్మనిచ్చే మహిళల వయసు ఎక్కువగా ఉండటం, ఐవీఎఫ్ లాంటి పద్దతుల వాడకం అన్నీ రానున్న రోజుల్లో కవల పిల్లల పుట్టుకను ప్రభావితం చేయవచ్చు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)