సంచయిత గజపతిరాజు ఇంటర్వ్యూ: ‘గుడికి వెళ్తే చీర కట్టుకుని, బొట్టు పెట్టుకుని వెళ్తా.. సినిమాకి వెళ్తే ప్యాంట్, షర్ట్ వేసుకుంటా’

ఫొటో సోర్స్, FB/Sanchaita Gajapati Raju
- రచయిత, లక్కోజు శ్రీనివాస్
- హోదా, బీబీసీ కోసం
సంచయిత గజపతి రాజు... మాన్సాస్ ట్రస్ట్, సింహాచలం దేవస్థానం బోర్డు ఛైర్‌పర్సన్ పదవులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పగించగానే ఈమె పేరు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది.
అసలు, సంచయిత గజపతి రాజు ఎవరు? ఆమె మాన్సాస్ ట్రస్ట్ చైర్‌పర్సన్ కాకముందు ఏం చేసేవారు? అశోక గజపతిరాజుతో ఆమెకున్న వివాదం ఏంటి? ఇలా.. ఎన్నో ప్రశ్నలకు ఆమె సమాధానాలు తెలుసుకోవాలని బీబీసీ తెలుగు ప్రయత్నించింది. సమాధానాలు ఆమె మాటల్లోనే...

ప్రశ్న: లా చదివిన మీరు 'సనా' ఎన్జీవో పేరుతో సేవా కార్యక్రమాల్లో ఉన్నారు. కానీ, ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే హఠాత్తుగా సింహాచలం దేవస్థానం, మాన్సాస్ ట్రస్ట్ చైర్పర్సన్‌గా తెర మీదకు వచ్చారు. ఇది ఎలా సాధ్యమైంది?
జవాబు: అకస్మాత్తుగా కాదు. 2011లోనే ఎన్జీవో పెట్టాను. విజయనగరం, విశాఖల్లో చాలా ప్రాంతాలకు బయో టాయిలెట్స్, తాగునీరు 10 ఏళ్లుగా ఇస్తున్నాను. 2016లో నాన్న గారు చనిపోయినప్పుడు ఏం జరిగిందో నాకు తెలుసు.
ఆ సమయంలో బాబాయి అశోక్ గజపతి గారి మాట వినే గవర్నమెంట్ ఉంది. అందుకే, నేను 2019లో న్యాయపరంగా నా హక్కుని కాపాడుకుని చైర్‌పర్సన్ అయ్యాను.
ప్రపంచంలో ఒక హిందూ దేవాలయానికి చైర్‌పర్సన్ అయిన తొలి మహిళను నేనే. ఇది నాతోనే ఆగిపోకూడదు.

ఫొటో సోర్స్, FB/Sanchaita Gajapati Raju
ప్ర: మాన్సాస్ చైర్ పర్సన్‌గా, సింహాచలం ధర్మకర్తగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి మీరు ఎలాంటి మార్పులు తీసుకొచ్చారు...?
జ: ఏడాదిలో నేను మాన్సాస్‌లో చాలా సంస్కరణలు తీసుకొచ్చానని గర్వంగా చెప్పగలను. మాన్సాస్ ద్వారా నాణ్యమైన విద్యను తక్కువకు అందించడమే ప్రధాన లక్ష్యం. ఆ లక్ష్యాన్ని చేరుకోడానికి మాన్సాస్‌కి ఉన్న ప్రధాన వనరు భూములు.
రూ. 55 వేల కోట్ల విలువ చేసే ఆ భూములే మాన్సాస్‌కు కోహినూర్ వజ్రాలు. అలాంటి విలువైన భూముల రికార్డులన్నీంటిని కట్టలు కట్టి స్టోరూంలో పడేశారు. అగ్ని ప్రమాదం జరిగితే వాటి పరిస్థితి ఏంటి? అందుకే వాటిని డిజిటలైజ్ చేశాను.
అప్పుడే, మాన్సాస్ భూములను కారుచౌకగా ఒక్కో ఎకరం రూ. 37 చొప్పున లీజుకి ఇచ్చేశారని తెలిసింది. ఆ భూముల్లో పెరిగే కొబ్బరికాయ ధరే 5 రూపాయలు ఉంటుంది. అలాంటి భూములను అంత తక్కువకు లీజుకి ఇవ్వడం ఏంటో ఆ దేవుడికే తెలియలి. ఇప్పుడు నేను ఆ లీజులన్నీ ఆపేశాను. దాంతో కొందరికి కష్టం కలిగింది. అందుకే నా గురించి ఏదేదో మాట్లాడుతున్నారు.
ప్ర: మాన్సాస్ ట్రస్టుకి వేల కోట్ల విలువైన భూములు, వందల కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయి. అలాంటిది ఎంఆర్ కళాశాల సిబ్బందికి జీతాలు ఇవ్వలేకపోవడానికి కారణాలేంటి...?
జ: గత ఐదేళ్లుగా మాన్సాస్ ట్రస్ట్ లో ఆధ్వర్యంలో నడిచే ఎంఆర్ కళాశాల విద్యార్థుల వివరాలన్నీ తప్పులతడకలతో ఉన్నాయి. దాంతో ప్రభుత్వం నుంచి రావాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్ డబ్బులు రాలేదు. ఇప్పుడు నేను మొత్తం రికార్డులు సరి చేశాను.
2019 నాటికి మాన్సాస్ విద్యాసంస్థలకు ప్రభుత్వం నుంచి రూ.35 కోట్లు రావాల్సి ఉంది.
వాటి కోసం అశోక్ గజపతిరాజు ప్రభుత్వానికి ఒక్క లేఖ కూడా రాయలేదు.
చంద్రబాబు, అశోక్ గారు ఇద్దరు కవలల్లా ఉంటారు కదా. ఆయన అడిగితే ఇస్తారు కదా, మరేందుకు అడగలేదు? ఇప్పుడు నేను ఆ బకాయిలను కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాశాను. ఫైల్ ప్రాసెస్‌లో ఉంది.
ఇలా, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా విద్యాసంస్థల్లో పనిచేస్తున్న సిబ్బంది అందరికీ ట్రస్టు నిబంధనల ప్రకారం వేతన బకాయిలను చెల్లించాం.
నిబంధనలకు విరుద్ధంగా కొందరు మాకు జీతాలు ఇవ్వడం లేదు, కళాశాలల ప్రైవేటీకరణ అని అంటున్నారు. అదంతా అబద్ధం.

ఫొటో సోర్స్, FB/Sanchaita Gajapati Raju
ప్ర: మీరు సింహాచలం దేవస్థానం ధర్మకర్తగా భాధ్యతలు స్వీకరించగానే... మిమ్మల్ని హిందూ ఆలయానికి ధర్మకర్తగా ఎలా నియమిస్తారనే విమర్శలు వచ్చాయి... ఎందుకలా?
జ: నేను ఒక హిందువుగా నేను అన్ని మతాలనూ గౌరవిస్తాను. కొందరు వంకర బుద్ధితో రాష్ట్ర ముఖ్యమంత్రిని లక్ష్యంగా చేసుకుని నన్ను విమర్శిస్తున్నారు.
నేను ఇటలీ టూర్‌కి వెళ్లి అక్కడ సెల్ఫీ తీసుకుంటే నన్ను క్రిస్టియన్ అంటున్నారు. మరీ అశోక్ గజపతి రాజుగారు ముస్లిం టోపీ పెట్టుకుని ఫోటోలున్నాయి. ఆయన ముస్లిం అయిపోయినట్లేనా.
మా అమ్మ బ్రాహ్మిణ్. ఆమె విడాకులు తీసుకున్నారు. మా తాత కూడా విడాకులు తీసుకున్నారు. అయితే ఏంటి? విడాకులు తీసుకోవడం పెద్ద నేరమా? నా సవతి తండ్రి పేరు రమేశ్ శర్మ. మరి నేను క్రిస్టియన్ ఎలా అవుతాను?
నేను గుడికి వెళ్తే చీర కట్టుకుని, బొట్టు పెట్టుకుని వెళ్తా. స్నేహితులతో సినిమాకి వెళ్తే షర్ట్, ఫ్యాంట్ వేసుకుంటా. ఆఫీసుకి ఇంకో డ్రెస్‌లో వెళ్తాను. హాలిడేకి వెళ్తే నచ్చిన చోట సెల్పీ తీసుకుంటాను. వీటిలో తప్పేముంది?
ప్ర: మీరు కేవలం వారసురాలిని అని చెప్పుకోవడం కోసమే అప్పడప్పుడూ వచ్చి వెళ్తుంటారని, అసలు మీకు వారసత్వపు హక్కే లేదని అశోక్ గజపతి రాజు కుటుంబం అంటోంది. ఇందులో నిజమేంటి?
జ: మొదటి పెళ్లి వలన కలిగిన పిల్లలకు హక్కులేదని వాళ్లు అంటున్నారు. నాకు హక్కు లేదంటే వాళ్లకి ఉండదు.
ఎందుకంటే మా తాతగారికి కూడా రెండో పెళ్లి అయ్యింది. మొదటి పెళ్లి ద్వారా అశోక్, ఆనంద్, సునీత, రెండో పెళ్లి ద్వారా మరో ముగ్గురు పుట్టారు. అలాటప్పుడు నాకు హక్కు లేదంటే వాళ్లకు కూడా లేదు.
నాకు ఒక రూల్, వాళ్లకి ఒక రూలా? తనకు ఎటువైపు లాభం ఉంటే, అటువైపు అశోక్ గజపతిరాజు రూల్స్ మార్చేస్తారా?
ఇప్పుడు గొడవంతా ఆస్తుల కోసం కాదు, వారసత్వం కోసం. ఎందుకంటే చైర్ పర్సన్ పదవికి జీతం లేకపోయినా గౌరవ పదవి.

ఫొటో సోర్స్, fb/Sanchaita Gajapati Raju
ప్ర: ఆస్తి పంపకాలు అన్నీ జరిగిపోయి వాటిని అమ్ముకున్న తర్వాత సంచయిత మళ్లీ వారసురాలినంటూ వస్తున్నారని అశోక్ గజపతి రాజు కుటుంబం ఆరోపిస్తోంది దీనికి మీరు ఏమంటారు?
జ: మా తాతగారు పీవీజీ రాజు గారికి రెండు పెళ్లిళ్లయ్యాయి. వాళ్ల పిల్లల ఆస్తి పంపకాలే ఇంకా కోర్టుల్లో పెండింగులో ఉన్నాయి. అంటే, కోర్టులో నా ముందు తరం వాళ్ల కేసులే ఇంకా సెటిల్ కాలేదు. మరి మా ఆస్తి పంపకాలు అప్పుడే ఎలా సెటిల్ అవుతాయి?
ట్రస్టు నిబంధనలు ప్రకారం పెద్ద కుమారుడి, పెద్ద సంతానానికే వారసత్వపు హక్కులు వస్తాయి. ఆ విధంగా నేను చైర్ పర్సన్ అయ్యాను. అది వాళ్లు తెలుసుకోవాలి.
2016లో మా నాన్నగారు చనిపోయినప్పుడు ఏం జరిగిందో నాకు ఇంకా గుర్తుంది. వాళ్లకి గుర్తుండే ఉంటుంది. ఆ సమయంలో నా విషయంలో కనీస మర్యాద కూడా పాటించలేదు. ఏ జన్మలో పాపాలను ఆ జన్మలోనే అనుభవిస్తారు. ప్రస్తుతం ఇప్పుడు అదే జరుగుతోంది.
ప్ర: మాన్సాస్ ట్రస్ట్ చైర్ పర్సన్‌గా మహిళలకు హక్కు లేదని, ఇది బైలాస్‌లో ఉందని అశోక్ గజపతి అంటున్నారు. అసలు అందులో ఏముంది. మీరు చూశారా?
జ: మొదట్లో మాన్సాస్ ప్రైవేట్ ట్రస్ట్ గా ఉండేది. దానిని మా తాతగారు ప్రభుత్వానికి ఇచ్చేశారు.
ప్రస్తుతం ఈ ట్రస్టు ఎండోమెంట్ యాక్ట్ రూల్స్ ప్రకారమే నడుస్తోంది.
ఆ నిబంధనల ప్రకారం చైర్ పర్సన్‌గా మహిళైనా, పురుషుడైనా ఉండొచ్చు. ఇద్దరూ సమానమే. ఆడ, మగ తేడా లేదు.
ఇద్దరికీ ఒకే రకమైన హక్కులుంటాయి. కాబట్టి బైలాస్‌లో ఏమున్నా, ఆ రూల్స్ ఇప్పుడు వర్తించవు.

ఫొటో సోర్స్, fb/Sanchaita Gajapati Raju
ప్ర: పైడితల్లి అమ్మవారి సంబరంలో మీరు మీ పినతల్లిని, సోదరిని కోట నుంచి బయటకు పంపించేశారనే ఆరోపణలున్నాయి. అసలు ఆ రోజు జరిగింది...?
జ: కూర్చున్న వాళ్లను నేను ఎందుకు పంపించేస్తాను? అక్కడ ప్రెస్, పబ్లిక్ అంతా ఉన్నారు. సుధా గజపతి, ఉర్మిళ గజపతితో పాటు వాళ్ల కజిన్స్ ఇంకా కొందరు వచ్చి కూర్చున్నారు. వాళ్ల పక్కనే మాన్సాస్ ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఇతర అధికారులు ఉన్నారు. వాళ్లతో పాటూ నేనూ అక్కడే కూర్చున్నాను.
అయితే మేం 'రాయల్' అన్న ఫీలింగ్‌తో అధికారులను అక్కడ నుంచి వెళ్లిపోమన్నారు.
నేను వాళ్లు మాన్సాస్ ట్రస్ట్ కు సంబంధించిన అధికారులు, వాళ్లని గౌరవించడం మన ధర్మం అన్నాను. వాళ్లకు అది నచ్చలేదు. వాళ్లే వెళ్లిపోయారు.
నిజానికి మాన్సాస్ ట్రస్టులో ఎన్నో అక్రమాలు జరిగాయి. అవన్నీ బయటకు తీస్తున్నానని నన్ను అందరికీ చెడుగా చూపించాలనే ప్రయత్నం చేస్తున్నారు.
ప్ర: మీ తండ్రి ఆనంద గజపతిరాజు బతికున్నంత వరకు అశోక్ గజపతి, ఆనంద గజపతి కుటుంబాల మధ్య ఎలాంటి వివాదాలు లేవు. మీరు ధర్మకర్తగా వచ్చిన తర్వాతే వివాదాలు, రాజకీయాలు మొదలైయ్యాయన్న ఆరోపణలున్నాయి.. దీనికి మీరు ఏమంటారు?
జ: నేను పగ, ప్రతీకారాలు తీర్చుకునే మనిషిని కాదు. బాబాయ్ అశోక్ గజపతిరాజు ఎప్పుడూ మంచిగా ఉండాలనే కోరుకుంటున్నాను. కోర్టు ద్వారా నాకు సంక్రమించిన హక్కు ద్వారానే నేను చైర్‌పర్సన్ అయ్యాను. నేను నా శక్తినంతా నా పనిమీద పెట్టి మాన్సాస్ ట్రస్ట్‌ను మరింత ఉన్నతంగా తీర్చిదిద్దుతా. నాపైన తప్పుడు ప్రచారం చేస్తునే ఉంటారు. అయితే అది ఎంతో కాలం నిలవదు. చివరకు సత్యమే గెలుస్తుందని నా నమ్మకం.
కచ్చితంగా చెప్పాలంటే 2016లో రాజకీయాలు జరిగాయి. ఇప్పుడు జరిగింది న్యాయ సవరణ (లీగర్ కరక్షన్) మాత్రమే.
మా డాడీ చనిపోయిన రోజు రాత్రి నేను మా బాబాయ్‌తో, మన ఇంట్లో పడుకుంటానని అడిగాను. కానీ గదులేవీ ఖాళీలేవు అన్నారు. కొన్ని కాగితాలు చూసిన తర్వాత అప్పుడు ఎందుకు అలా చెప్పారో నాకు ఇప్పుడు అర్థమైంది.
మా నాన్న చితి మంటలు చల్లరకుండానే, అశోక్ గజపతిరాజు గారు లాయర్లతో మాట్లాడుకున్నారు.
మా పెద్దన్నయ్య చనిపోయారు, కాబట్టి నన్ను చైర్ పర్సన్‌గా చేయండి అంటూ లేఖ రాశారు. ఆ రోజే రాజకీయాలు మొదలయ్యాయి.

ఫొటో సోర్స్, fb/Sanchaita Gajapati Raju
ప్ర: అశోక్ గజపతి రాజును లక్ష్యంగా చేసుకుని వదిలిన రాజకీయ బాణమే సంచయిత అంటున్నారు?
జ: నేను విద్య, ఆధ్మాత్మిక సంస్థలకు చైర్‌పర్సన్‌ని. నేను ఉన్న చోట రాజకీయాలకు తావు లేదు.
గుడికి, మా విద్య సంస్థలకు కమ్యూనిస్టులైనా, భక్తులైనా, చంద్రబాబు, అశోక్ గజపతిగారు ఇలా ఎవరు వచ్చినా వారిని గౌరవించడం మా విధి.
కానీ గతంలో వాళ్లు ఈ రెండు చోట్ల రాజకీయాలు చేశారు. నేను అలా చేయడం లేదు. చేయను కూడా. నా వంశ ప్రతిష్టను కాపాడుకోవడం కోసం నేను పని చేస్తున్నాను. రాజకీయాల కోసం కాదు.
అయితే ప్రధాని మోదీకి నేను పెద్ద అభిమానిని. బీజెపీ సభ్యురాలిని. కానీ, నాకు రాజకీయాలంటే ఆసక్తి లేదు. అది కేంద్ర రాజకీయాలైనా, రాష్ట్ర రాజకీయాలైనా.
ప్ర: ఎవరితోనూ వివాదాలు లేవంటున్న మీరు, మీ బాబాయి అశోక్ గజపతిరాజును కలిస్తే ఏం మాట్లాడతారు?
జ: నమస్కారం చేస్తాను. ఆశీర్వదించమని అడుగుతాను. నేను ఎలాంటి తప్పు చేయలేదు. అందుకే నేను రోజూ ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నాను. నాకు ఎలాంటి భయాలు లేవు.

ఫొటో సోర్స్, fb/Sanchaita Gajapati Raju
ప్ర: ఇది ఆస్తి, వారసత్వపు హక్కు లాంటి అంశాలకు సంబంధినది కాబట్టి, ఒక లాయర్‌గా మీరు దీనిని ఎలా చూస్తారు? ఈ విషయంలో మీకు ఏ పార్టీ నుంచి సహకారం లభిస్తోంది?
జ: న్యాయంగా నాకు హక్కు ఉంది కాబట్టే, నేను నా పనిని ధైర్యంగా చేయగలుగుతున్నాను.
కోర్టులు సైతం మహిళా హక్కులకు అండగా నిలబడుతున్నాయి. ఇది కాళీ, దుర్గ, శక్తి లాంటి దేవతలున్న భూమి.
అలాగే, నాకు సింహాద్రి అప్పన్న, మా తాతగారి ఆశీస్సులు ఉన్నాయి.
అందుకే నేను గత ఏడాది నుంచి ఒంటరిగా రాజకీయాలను ఎదుర్కొని పోరాడగలుగుతున్నాను. నాకు ఏ పార్టీ సపోర్ట్ చేయలేదు.
కొందరు మాత్రం నన్ను అడ్డుగా పెట్టుకుని విజయసాయి రెడ్డిని, సీఎం జగన్‌ను ఇరకాటంలో పెట్టాలని చూస్తున్నారు. నా న్యాయపరమైన హక్కులను నిలిపినందుకు వాళ్లు నిందలుపడాల్సి వస్తోందనే బాధ నాకు ఉంది. నా హక్కుల విషయంలో అండగా నిలిచిన సీఎం జగన్, విజయసాయి రెడ్డిలపై టీడీపీ తన మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తోంది. మీడియాలో ఫేక్ వార్తలు ప్రసారం చేయడంలో టీడీపీ దిట్ట.

ఫొటో సోర్స్, fb/Sanchaita Gajapati Raju
ప్ర: అసలు సంచయిత గజపతి రాజు ఏ పార్టీ? రాజకీయ లక్ష్యాలేంటి...?
జ: నాకు రాజకీయాల ఆశలు, ఆశయాలు లేవు. నాకున్న ఒకే ఒక లక్ష్యం విజయనగరాన్ని విద్యానగరంగా మార్చడం.
మా తాతగారి కలని నిజం చేయడం. అలాగే సింహాచలం దేవస్థానాన్ని గ్రీన్ టెంపుగా మారుస్తాను.
ఇవి తప్ప నాకు ఇక ఎలాంటి పొలిటికల్ టార్గెట్స్ లేవు.
ఇవి కూడా చదవండి:
- ఇస్లాం స్వర్ణయుగం: జ్యోతిషశాస్త్రాన్ని అధ్యయనం చేసిన అరబ్ తత్వవేత్త అల్-కింది
- సుభాష్ చంద్రబోస్ 'ద గ్రేట్ ఎస్కేప్': బ్రిటిష్ వాళ్ల కళ్లుగప్పి నేతాజీ దేశం ఎలా దాటారు?
- లాల్ బహదూర్ శాస్త్రి: ఆయన ఒక్క పిలుపుతో లక్షలాది భారతీయులు ఒక పూట భోజనం మానేశారు
- ఓ డొక్కు టీవీ ఊరు మొత్తానికీ ఇంటర్నెట్ రాకుండా చేసింది.. ఎలాగంటే...
- జీలాండియా: మునిగిపోయిన ఎనిమిదో ఖండం జాడ 375 ఏళ్లకు దొరికింది, దాని రహస్యాలెన్నో
- సర్ ఆర్థర్ కాటన్: ఈ ‘బ్రిటిష్ దొర’కు ఇంట్లో పూజలు చేస్తారు, పూర్వీకులతో పాటు పిండ ప్రదానమూ చేస్తారు
- వందల ఏళ్ల పాటు ఆఫ్రికాలో ‘కనిపించిన’ ఆ పర్వతాలు ఎలా మాయమయ్యాయి?
- పోర్ట్ రాయల్: చరిత్రలో ‘అత్యంత దుర్మార్గపు నగరం’ ఎందుకైంది? సముద్రంలో ఎలా మునిగిపోయింది?
- కరోనావైరస్ వంటి ప్రాణాంతక మహమ్మారులు సహజంగానే అంతరించిపోతాయా? అదెలా సాధ్యం?
- గ్వాదర్: ఒమన్ నుంచి ఈ ప్రాంతం పాకిస్తాన్లో ఎలా కలిసింది? భారత్ మంచి అవకాశం వదులుకుందా?
- కోటీశ్వరుడైన యజమానితో పనిమనిషి పోరాటం.. ఎందుకు? ఎవరు గెలిచారు?
- వాడి పడేసిన 3 లక్షల కండోమ్‌లు రీసైకిల్ చేసి విక్రయించే ప్రయత్నం...
- నియాండర్తాల్ మానవులు, తొలి తరం ఆధునిక మానవుల మధ్య సెక్స్ గురించి శాస్త్రవేత్తలు ఏం తెలుసుకున్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








