విజయనగరం: చనిపోయిన వృద్ధురాలికి పింఛన్ ఇచ్చిన గ్రామ వలంటీర్.. బతికే ఉన్నారంటున్న ఎంపీడీవో, చనిపోయారంటున్న కుటుంబసభ్యులు

ఫొటో సోర్స్, ugc
ఆంద్రప్రదేశ్‌లో చనిపోయిన వృద్ధురాలికి గ్రామ వలంటీర్ సామాజిక భద్రత పింఛన్ పంపిణీ చేసిన వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
విజయనగరం జిల్లా గుర్ల మండలంలోని గుర్ల గ్రామంలో ఎర్ర నారాయణమ్మ అనే వృద్ధురాలు సోమవారం ఉదయం మరణించారు.
ప్రతి నెలా 1వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం వలంటీర్ల ద్వారా నేరుగా ఇంటి వద్దే వృద్ధులకు పెన్షన్ అందజేస్తుంది. సోమవారం ఒకటో తేదీ కావడంతో ఆ గ్రామంలో వలంటీర్‌గా పని చేస్తున్న ఇజ్జిరోతు త్రినాథ్ పింఛను పంపిణీ చేసేందుకు ఎర్ర నారాయణ ఇంటికి వెళ్లారు.
అప్పటికే ఆమె మరణించగా మృతదేహాన్ని ఇంటి బయట ఉంచి కుటుంబ సభ్యులు అంత్యక్రియలను ఏర్పాట్లు చేస్తున్నారు.
అదే సమయంలో అక్కడికి చేరుకున్న త్రినాథ్.. ఎర్ర నారాయణ చనిపోయినప్పటికీ అప్పటికే ఆమెకు పింఛను మంజూరైంది కాబట్టి ఇవ్వడం తన విధి అంటూ ఆమెతో వేలి ముద్ర వేయిస్తే చాలని కుటుంబ సభ్యలతో చెప్పారు.
దీంతో కుటుంబ సభ్యులు కూడా సరేనని ఆమె వేలిని బయోమోట్రిక్ పరికరంపై ఉంచి వేలి ముద్రలు వేయించారు.
చనిపోయిన వృద్ధురాలికి పింఛను ఇస్తున్నట్లు, వేలి ముద్రలు తీసుకుంటున్నట్లుగా ఉన్న ఫోటో సోషల్ మీడయాలో వైరల్‌గా మారింది.

ఫొటో సోర్స్, YASUYOSHI CHIBA/gettyimages
నిబంధనలు ఏం చెబుతున్నాయి
చనిపోయిన వారికి పెన్షన్, ఇతర పథకాలు ఇవ్వడానికి నిబంధనలు అంగీకరించవు.
చనిపోయిన వ్యక్తికి పెన్షన్ పంపిణీ చేశారనే విషయం తెలుసుకున్న అధికారులు సమాచారం సేకరించారు. డీఆర్‌డీఏ పీడీ సుబ్బారావు ఈ ఘటనపై స్పందించారు.
"చనిపోయిన వ్యక్తికి ఫించన్ మంజూరు చేయడం తప్పు. అసలు మృతదేహం నుంచి వేలి ముద్రలు సేకరించరాదు. వలంటీర్ వివరణ కోరాం. 'నేను నిజాయితీగానే ఆమె డబ్బు ఆమెకు ఇచ్చాను' అని చెప్పారు. వలంటీర్ అత్యుత్సాహంతో చేసిన పనిలాగే కనపడుతుంది. ఈ ఘటనపై విచారణకు ఆదేశించాం. గుర్ల ఎంపీడీవోను విచారణ అధికారిగా నియమించాం". అని పీడీ సుబ్బారావు మీడియాతో చెప్పారు.
చనిపోయిన ఎర్ర నారాయణమ్మ కుటుంబసభ్యులు ఈ ఘటనపై స్పందించారు. "వలంటీర్ ఇంటికి వచ్చినప్పటీకే ఆమె చనిపోయింది. అయితే ఆమెకు ఈ నెల ఫించన్ మంజూరైందని...ఇచ్చేసి వెళ్తానని వాలంటీర్ చెప్పారు. ఆమె చేత వేలి ముద్రలు వేయిస్తే చాలని చెప్పారు. మృతదేహంతో వేలి ముద్రలు తీసుకోవడం సరైనది కాదని మాలో కొందరు ఆయనతో చెప్పాం. అయితే, చనిపోవడానికి ముందే పింఛను మంజూరైందని చెప్పి వేలి ముద్రలు తీసుకుని వెళ్లారు" అన్నారు.

ఫొటో సోర్స్, B.Kalyani
చనిపోలేదు.. చనిపోయే స్థితిలో ఉన్నారు: ఎంపీడీవో
కాగా ఈ ఘటపై విచారణాధికారి, గుర్ల ఎంపీడీవో నివేదిక ఇచ్చారు. వలంటీర్ వెళ్లిన సమయానికి ఎర్ర నారాయణమ్మ చనిపోలేదని, చనిపోయే స్థితిలో ఉండడంతో ఇంటికి బయటకు తెచ్చేశారని ఆ నివేదికలో రాశారు.
"వలంటీర్ వెళ్లే సమయానికి ఎర్ర నారాయణమ్మ చనిపోయే స్థితిలో ఉన్నారు. దాంతో కుటుంబసభ్యులు ఆమెకు పసుపు, కుంకుమ పెట్టి గుమ్మం బయటకు తెచ్చి అగరబత్తులు వెలిగించారు. సరిగ్గా ఆ సమయానికే వెళ్లిన వలంటీర్ బయోమెట్రిక్ అథెంటిఫికేషన్ తీసుకుని పింఛను బట్వాడా చేశారు.
బతికి ఉండగానే ఆమెకు పింఛను ఇవ్వాలనే ఉద్దేశంతో వలంటీర్ అలా చేశారు. అలాగే బయోమెట్రిక్ ద్వారానే ఆమెకు ఫించన్ మంజూరు చేశానని చెప్పడం కోసం ఆధారంగా ఫొటో తీసుకున్నారు" అని గుర్ల ఎంపీడీవో బి. కళ్యాణి చెప్పారు.
కాగా దీనిపై వలంటీర్ త్రినాథ్‌తో మాట్లాడేందుకు బీబీసీ ప్రయత్నించినా ఆయన ఫోన్‌లో అందుబాటులోకి రాలేదు.
‘సరైంది కాదు’
"ప్రభుత్వం ఇచ్చే ఫించన్ తీసుకోవాలంటే ఆ వ్యక్తి బతికుండాలి. చనిపోయిన వ్యక్తికి ఫించన్ ఇవ్వడం సరైనది కాదు. ఇచ్చిన వలంటీర్ తన పని తాను సక్రమంగా నిర్వర్తించినట్లు చెప్తున్నా కూడా నిబంధనలు పాటించలేదనే అర్థమవుతోంది. ఒక వేళ చనిపోయిన వ్యక్తి ఫించన్ ఇవ్వాలంటే ఎమ్మార్వో నుంచి లిఖిత పూర్వక అనుమతితో వారి కుటుంబసభ్యులకు ఇవ్వొచ్చు. కానీ చనిపోయిన వ్యక్తి వేలిముద్రలు తీసుకుని ఫించన్ లేదా ఏదైనా ప్రభుత్వ పథకాలకు సంబంధించిన లావాదేవీలు జరపకూడదు" అని ఏయూ జర్నలిజం విభాగాధిపతి ప్రొఫెసర్ డీవీఆర్ మూర్తి బీబీసీతో చెప్పారు.
అయితే, కొందరు స్థానికులు మాత్రం ఇందులో ఏమీ కుంభకోణం లేదని, ప్రభుత్వం అందించే సాయాన్ని చేర్చాలనే ఉద్దేశంతోనే వలంటీర్ అలా చేశారని అంటున్నారు.
జరిగింది చిన్న విషయమని.. గోరంతలను కొండంతలు చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని స్థానికులు అంటున్నారు.
ఇవి కూడా చదవండి:
- విజయవాడ టీడీపీలో ఎంపీ వర్సెస్ ఎమ్మెల్సీ.. మేయర్ పీఠం కోసమేనా
- కడప స్టీల్: ముగ్గురు ముఖ్యమంత్రులు, మూడుసార్లు శంకుస్థాపనలు.. ఈ ప్రాజెక్ట్ పూర్తయ్యేనా?
- తెలుగు భాషకు తమిళంలా స్వయం ప్రతిపత్తి సాధ్యం కాదా?
- బ్రాహ్మణాబాద్: పాకిస్తాన్‌లోని ఈ నగరాన్ని హిందూ రాజులు పాలించారా?
- ఎర్రకోటను షాజహాన్ ఎందుకు కట్టించారు.. చరిత్రలో అక్కడ జరిగిన రాజకీయ కుట్రలెన్ని.. తెగిపడిన తలలెన్ని
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








