'విడాకులు తీసుకుంటే ఎందుకు సిగ్గుపడాలి? ఇదేమీ జీవితానికి ముగింపు కాదు'

ఫొటో సోర్స్, పూజా ప్రియంవద
- రచయిత, పూజా ప్రియంవద
- హోదా, బీబీసీ కోసం
ఇటీవలే మాజీ మిస్ పసిఫిక్, సినీ నటి దియా మీర్జా వివాహం ముంబయికి చెందిన వ్యాపారవేత్త వైభవ్ రేఖీతో జరిగింది. వారి వివాహ వేడుకల ఫొటోలు సోషల్ మీడియాలో పాపులర్ అయ్యాయి.
ఈ ఫొటోలు పాపులర్ కావడానికి కారణం ఆమె సెలిబ్రిటీ కావడం మాత్రమే కాదు. ఇంకా అనేక కారణాలున్నాయి.
వారి వివాహాన్ని ఒక మహిళా పూజారి జరిపించారు. ఈ పెళ్లిలో కన్యాదానం గానీ చివర్లో అప్పగింతలు గానీ జరగలేదు.
వీటన్నిటిని గురించీ దియా మీర్జా మాట్లాడుతూ.. "మార్పు రావాలంటే మనం సరైన మార్గాన్ని ఎంచుకోవాలి" అని అన్నారు.
వాళ్ల పెళ్లి ఫొటోలన్నీ చాలా అందంగా ఉన్నాయి. ఒక ఫొటో మాత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలించింది.. అందులో వైభవ్ కుమార్తె సమైరా దియా మీర్జాను పెళ్లి మండపం వైపు నడిపించుకుని తీసుకుని వెళుతూ ఉంది. ఆమె చేతిలో "నాన్న కూతురు" అని రాసి ఉన్న కార్డు ఉంది.
ఆ ఫొటోలు చూస్తుంటే.. సమైరా ఎంతో ఆనందంగా తన తండ్రి వివాహ వేడుకల్లో పాలుపంచుకున్నారో అర్థమవుతుంది.
తన కూతురు ఈ వివాహ వేడుకల్లో పాల్గొనడం ముఖ్యమని వైభవ్ మాజీ భార్య సునయన కూడా భావించారు.
కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతూ అమె ఇన్‌స్టాగ్రాంలో ఒక వీడియో పోస్ట్ చేశారు. తన కూతురు సమైరాకు (దియా మీర్జా రూపంలో) ముంబయిలో మరో కుటుంబం లభించినందుకు, ఆమె తన తండ్రి పునర్వివాహ వేడుకుల్లో పాల్గొన్నందుకు ఆనందంగా ఉందని సునయన ఆ వీడియోలో తెలిపారు.
దియా మీర్జా తల్లిదండ్రులు కూడా గతంలో విడాకులు తీసుకున్నారు. ఆమె తల్లి మరో వివాహం చేసుకున్నారు. దియా మిస్ ఇండియా టైటిల్ గెలుచుకున్నప్పటినుంచీ తన సవతి తండ్రితో తనకున్న సన్నిహిత సంబంధం, ఆయన ప్రభావం తన మీద ఎంత ఉందన్నది బహిరంగంగా చెబుతూనే ఉన్నారు.
అయితే, ఈ విషయాలపై నేనెందుకు ఇంత ఆసక్తిని కబరుస్తున్నానని అనుకుంటున్నారా?
ఎందుకంటే నేను కూడా విడాకులు తీసుకున్న మహిళను. నా బిడ్డను ఒంటరిగా పెంచుతున్నాను. ఈ మధ్యే నా విడాకుల వార్షికోత్సవాన్ని జరుపుకొన్నాను కూడా.
నేను నా భర్తతో అధికారికంగా విడాకులు తీసుకుని మూడేళ్లవుతోంది. కానీ అంతకుముందే, మా బంధం బీటలు వారింది. ఎన్నో ఏళ్లుగా మా మధ్య దూరం పెరుగుతూ వచ్చింది.

ఫొటో సోర్స్, TWITTER/@DEESPEAK
విడాకులు తీసుకోవడాన్ని సెలబ్రేట్ చేసుకోడానికి కారణాలు
నా విడాకుల వార్షికోత్సవాన్ని నేను సెలబ్రేట్ చేసుకుంటున్నానంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన వెంటనే అనేక ప్రశ్నలు నా ముందు వచ్చి పడ్డాయి. అవేమీ ఇవేమీ కొత్త ప్రశ్నలు కావు. గత కొన్నేళ్లుగా నన్ను మళ్లీ, మళ్లీ అడుగుతున్నవే.
విడాకులు తీసుకోవడంలో వేడుక ఏముంది? దాన్నెందుకు సెలబ్రేట్ చేసుకోవాలి? అంత అంత సులువా? మిగతా ఆడవాళ్లకు కూడా విడాకులు తీసుకోమని మీరు సలహాలు ఇస్తారా? విడాకులు తీసుకుంటే మధ్యలో పిల్లలు నలిగిపోరా?.. ఇలా ఎన్నో ప్రశ్నలు నన్ను అడుగుతూనే ఉన్నారు. వీటన్నిటికీ నేను స్పష్టమైన జవాబులు ఇవ్వదల్చుకున్నాను.
విడాకులు తీసుకోవడం అంత సులువా?
నా జీవితంలో జరిగిన ఒక బాధాకరమైన సంఘటనకు ముందు, తరువాత నేను నా జీవితాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాను.
ఎవరైనా సంతోషంగా ఉండడానికే పెళ్లి చేసుకుంటారు. చేసుకునేటప్పుడు విడిపోయే ఉద్దేశం ఎవరికీ ఉండదు. పిల్లలు కలిగాక ఆ ఊహ కూడా రాకుండా ఉండేందుకే ప్రయత్నిస్తారు. ఎప్పటికీ కలిసి ఉందామనే అనుకుంటారు. కానీ జీవితం మనం కోరుకున్న మార్గంలో పయనించకపోవచ్చు.
నా వైవాహిక జీవితం సుమారు రెండు దశాబ్దాలు సాగింది. పదమూడేళ్లు మా మధ్య బలమైన బంధమే కొనసాగింది.
విడాకులు తీసుకోవడం అంత సులువా అని అడిగిన ప్రశ్నకు ఇప్పుడు సమాధానం చెప్తాను.. కచ్చితంగా సులువు కాదు.
కొన్నేళ్ల క్రితం నా తండ్రి చనిపోయారు. మా అమ్మాయికి ఎమోషనల్ సపోర్ట్ ఇవ్వడానికి ఎవరూ లేరు. సామాజిక, ఆర్థిక సహాయం అందించడానికి ఎవరూ లేరు.
ఇద్దరి మధ్య సంబంధం ఎంత చెడిపోయినా దాన్ని తెగ్గొట్టడం చాలా కష్టం. మీ బంధాన్ని దుర్వినియోగం చేస్తున్నా, మిమ్మల్ని హింసిస్తున్నా, ప్రేమ అన్న మాటే లేకపోయినా, మొదట్లో చాలా ప్రేమగా, స్నేహంగా ఉంటూ రానురాను కఠినంగా మారినా.. విడిపోవడం అంత సులువు కాదు.

ఫొటో సోర్స్, Getty Images
ఇవన్నీ వ్యక్తిగత నిర్ణయాలు
విడాకులు తీసుకోమనిగానీ, వద్దనిగానీ నేనెవరికీ సలహాలు ఇవ్వను. ఇవన్నీ వ్యక్తిగత నిర్ణయాలు. ఆ తోవలో ఎవరు ప్రయాణిస్తున్నారో వారే నిర్ణయించుకోవాలి.
అయితే, చెడు సంబంధాలనుంచీ, గౌరవం, ప్రేమ లేని పరిస్థితులనుంచీ బయటపడమని మాత్రం చెప్తాను. స్త్రీలైనా, పురుషులైనా సరే సత్సంబంధాలు లేనిచోట జీవితం కొనసాగించవద్దనే చెప్తాను. మీకు తెలిసినవారు అలాంటి నిర్ణయం తీసుకుంటే కచ్చితంగా వారికి వెన్నుదన్నుగా నిలబడమని సలహా ఇస్తాను.
తల్లిదండ్రులు విడిపోతే పిల్లలకు కష్టమే. ఒంటరిగా పిల్లలని పెంచడం కష్టం. సాంప్రదాయ ధోరణులు అధికంగా ఉండే సమాజంలో ఒక మహిళ విడాకులు తీసుకుని ఒంటరిగా జీవితాన్ని సాగించడం, పిల్లల్ని పెంచడం మరీ కష్టం.
పిల్లలు కూడా మిమ్మల్నే తప్పు పట్టొచ్చు. ఒంటరి తల్లి దగ్గర పెరుగుతున్న పిల్లలు సమాజం నుంచీ అనేక ప్రశ్నలు ఎదుర్కొంటారు. ఒత్తిడికి గురవుతారు. వాటన్నిటికీ కారణం మీరే అని పిల్లలు ఆరోపించవచ్చు.
కానీ, తల్లి, తండ్రి మధ్య సత్సంబంధాలు లేనప్పుడు.. నిత్యం తగవులు పడుతూ, కోపం, అవమానాల మధ్య పిల్లలు పెరగడం కంటే ఒంటరి తల్లి లేదా తండ్రి దగ్గర పెరగడం ఎంతో మేలు.
జీవితంలో సమూల మార్పులు
విడాకులు అనేవి భావోద్వేగాలకు సంబంధించినవి మాత్రమే కాదు. విడాకుల అనంతరం ఒక మహిళ జీవితంలో సమూలమైన మార్పులు జరుగుతాయి. సామాజిక, ఆర్థిక స్థితిలో పెను మార్పులు వస్తాయి. ఇంక జీవితం అంతా ఒంటరిగానే గడపాలా అనే భయం కలుగుతుంది. నేను కూడా ఇలాంటి సమస్యలను ఎదుర్కొన్నాను. ఇది ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది.
కానీ, నేను నా నిర్ణయం పట్ల గర్వపడుతున్నాను. ఇది నాకు నేనుగా తీసుకున్న నిర్ణయం. ఫలితంగా ఇబ్బందులొస్తే సంతోషంగా ఎదుర్కొన్నాను.
నేను చదువుకున్నాను. నా కాళ్ల మీద నేను నిలబడగలను. అవకాశాలు పుష్కలంగా ఉండే ఒక పెద్ద నగరంలో నివసిస్తున్నాను. ఇవన్నీ ఉండడం నా అదృష్టం. అయినా కూడా సమాజం నాపై వేసిన నిందలను ఎదుర్కోవాల్సి వచ్చింది.
అనేకమంది మగవాళ్లతో సంబంధం ఉందని, ఒంట్లో చేవ లేదని, కొడుకును కనలేకపోయిందని, చెడ్ద తల్లి అనీ.. తండ్రిని, బిడ్డని విడదీసిందని.. ఇలా ఈ నిందలకు అంతూ పొంతూ లేదు. విడాకులు తీసుకున్న మహిళలకు సమాజంలో గౌరవం లేదు.
భారతదేశంలో విడాకులు తీసుకోవడం కన్నా విధవగా ఉండడం మేలని ఒకసారి నేను నా స్నేహితుడితో అన్నాను.
సమాజం స్త్రీలను లైంగిక కోణం నుంచి మాత్రమే చూస్తుంది. సెక్స్‌కు పనికి రాలేదని మాత్రమే అనుకుంటారు. వివాహ బంధాన్ని తెంపేసుకుని కుటుంబాన్ని విచ్ఛిన్నం చేశారని నిందలు మోపుతారు.
పునర్వివాహం చేసుకున్నప్పటికీ బంధువులు, స్నేహితులు తమతో కలుపుకోకపోవచ్చు.
మళ్లీ పెళ్లి చేసుకుంటే బాలీవుడ్ సినిమాల్లో చూపించినట్టు అందమైన జీవితం చేకూరుతుందని భావించకండి. ఒకసారి విడాకులు తీసుకున్నాక, మళ్లీ వివాహాం చేసుకున్నా కూడా మహిళలకు సమాజంలో తగినంత గౌరవం లభించదు.
విడాకుల అనంతరం జీవితం సాఫీగా సాగిపోతుందని అనుకోవడానికి వీల్లేదు. కాబట్టి ఒక నిర్ణయం తీసుకునే ముందు ఆచితూచి అడుగేయండి. అన్ని రకాల పరిణామాలను దృష్టిలో పెట్టుకుని, అన్నిటికీ సిద్ధపడి నిర్ణయం తీసుకోండి.

విడాకులు తీసుకోవడం సిగ్గు పడాల్సిన విషయమా?
అయితే, ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్న.. విడాకులు తీసుకోవడం సిగ్గు చేటా? నేను విడాకులు తీసుకున్నందుకు సిగ్గుపడుతున్నానా?
లేదు. అస్సలు లేదు. మంచిని ఆశించే ఒక సంబంధంలోకి అడుగు పెట్టాను. అది సవ్యంగా సాగనప్పుడు చట్టబద్ధంగా, గౌరవప్రదంగా విడిపోయాను. ఇందులో సిగ్గు పడే అంశమేమీ లేదు.
మరి, నా విడాకులు నా కూతురికి తలవంపులు తెస్తాయా?
మొదట్లో తను కొంత ఇబ్బంది పడి ఉండొచ్చు. తన తల్లి విడాకులు తీసుకున్నారని స్నేహితులకు చెప్పడానికి సంకోచించి ఉండొచ్చు. అప్పుడు తన వయసు కేవలం ఎనిమిది సంవత్సరాలు. చిన్న పిల్ల కాబట్టి కొన్ని ఇబ్బందులు ఎదురై ఉండొచ్చు.
అయితే, నేను మా అమ్మయితో నిరంతరం దీని గురించి మాట్లాడుతూనే ఉన్నాను. కోర్టుకు వెళ్లినప్పుడల్లా.. ఏం జరిగింది, ఎందుకు వెళుతున్నాను అనే విషయాలు విడమర్చి చెప్పాను.
మేము పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నాం కాబట్టి అంతా సవ్యంగా జరిగిపోయింది. కానీ చాలామంది మహిళలకు అలా జరగదు. ఎందరో మహిళలు ఒంటరిగానే పోరాడుతూ ఉంటారు. వారికి కుటుంబం నుంచీ మద్దతు ఉండదు. డబ్బులు ఉండవు. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు.
కొత్త జీవితం - కొత్త భయాలు
అనేకమంది మహిళలు ఒంటరిగా కష్టపడుతూ, పిల్లల్ని పెంచుతూ ఉంటారు. ఇంటికి అద్దె చెల్లించలేక, పిల్లల స్కూలు ఫీజు కట్టలేక సతమతమవుతూ ఉంటారు.
అలాంటి కొందరితో నేను మాట్లాడాను. వారిలో నాకు రెండు విషయాలు కనిపించాయి.. సిగ్గు, భయం.
నా విడాకుల గురించి బంధువులకు, స్నేహితులకు చెప్పడానికి మా అమ్మే ఎంతో సంకోచించారు.
మన సమాజంలో అధిక శాతం విడాకులు తీసుకోవడాన్ని సిగ్గుమాలిన వ్యవహారంగానే భావిస్తారు.
రెండోది భయం.. కోవిడ్ 19 సమయంలో నేను కూడా భయపడ్డాను. నాకేదైనా అయితే మా అమ్మాయిని ఎవరు చూస్తారు అనే భయం కలిగింది.
ఈ రెండూ మహిళలను కుంగదీస్తాయి. సమాజం నుంచి వచ్చే ఒత్తిడి, అనుమానాలు, నిందలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కొత్త సంవత్సరం రోజు, పుట్టినరోజు నాడు, పండగలప్పుడు ఒంటరితనం బాధిస్తుంది. శూన్యం ఆవరించినట్టు ఉంటుంది. ఏదో కోల్పోయిన భావన కలుగుతుంది.
అయినప్పటికీ, విడాకులు తీసుకున్నందుకు నేను సిగ్గు పడను. అది తప్పని నేను భావించడం లేదు. దాని గురించి బాధ కూడా లేదు.
ఈ మధ్యనే నేను పాస్‌పోర్ట్ రెన్యువల్ కోసం వెళ్లాను. అక్కడ అడిగిన ప్రశ్నలు చాలా అసౌకర్యం కలిగించాయి.. నా ఇంటి అద్దె ఎవరు చెల్లిస్తారని, నేను పేరు ఎందుకు మార్చుకోలేదని అడిగారు.
మీ చుట్టూ ఉన్న సమాజం మారేవరకూ ఈ ఇబ్బందులు తప్పవు. వివాహాన్ని ఎంత సాధారణంగా చూస్తారో, విడాకులను కూడా అంతే సాధారణంగా చూసే పరిస్థితి రానంత వరకూ నాలాంటి మహిళలు ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉంటారు.
అయితే, విడాకులు తీసుకున్న మహిళలందరూ గుండె నిబ్బరం చేసుకుని ముందుకు అడుగేయాలి. మనల్ని సిగ్గు పడేట్లు చెయ్యాలని ప్రయత్నించేవారి కళ్లల్లోకి సూటిగా చూస్తూ మాట్లాడాలి. సమాజం వేసేనిందలన్నిటినీ లెక్క చేయకుండా ముందుకు సాగిపోవాలి.
ఒంటరితనం బాధే కానీ సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం వలన కలిగే ఆనందం గొప్పది. మీ జీవితం గురించి మీరు సొంతంగా నిర్ణయం తీసుకోగలగడం ఒక అందం, ఆనందం కూడా. మీకు అది ఒక సొంత గుర్తింపును తెచ్చి పెడుతుంది. అందుకు కొంత మూల్యం చెల్లించాల్సి వస్తే, దానికి కూడా తయారుగా ఉండాలి.
ఇవి కూడా చదవండి:
- సోలో బతుకే సో బెటర్’ అని జపాన్ ప్రజలు ఎందుకు అంటున్నారు?
- మహిళల అవయవాలకు ‘మగ’ పేర్లే ఎందుకున్నాయి?
- సింగర్ సునీత పెళ్లి: మహిళలు రెండో పెళ్లి చేసుకోవడం తప్పా?
- ఝార్ఖండ్: ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆసుపత్రి.. చేరుకునేలోపే ప్రసవం.. ప్రాణాలు కోల్పోయిన తల్లి, బిడ్డ
- భారతదేశంలోని ‘అస్థిపంజరాల సరస్సు’.. అంతు చిక్కని రహస్యాల నిలయం
- సెక్స్‌కు 'విశ్వగురువు' ప్రాచీన భారతదేశమే
- సన్నీ లియోని ఇంటర్వ్యూ: 'రోడ్డు మీద నుంచున్న వేశ్యకు - పోర్న్ స్టార్‌కి తేడా ఏమిటి?'
- తొలిరాత్రి కన్యత్వ పరీక్ష: నెత్తురు కనిపించకపోతే ఆమెకు నరకమే!
- ఊళ్లలో కుల వివక్షకు పేపర్ కప్పుకు సంబంధమేంటి?
- తాగునీరు అందని గ్రామాలు.. ఆంధ్రాలో మూడొంతులు, తెలంగాణలో సగం
- రాజాసింగ్: గోమాంసం తినేవారిపై బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు, వెల్లువెత్తిన విమర్శలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








