ఝార్ఖండ్: ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆసుపత్రి.. చేరుకునేలోపే ప్రసవం.. ప్రాణాలు కోల్పోయిన తల్లి, బిడ్డ

- రచయిత, ఆనంద్ దత్త
- హోదా, బీబీసీ కోసం
ఇరవై మూడేళ్ల సుర్జీ గత తొమ్మిది నెలలుగా కన్న కలలన్నీ నిజమై ఉంటే ఈ కథ మరోలా ఉండేది. ఆసుపత్రికి వెళ్లే దారిలోనే సుర్జీ కడుపు నుంచి బయటపడిన బిడ్డ ఇప్పుడు ప్రాణాలతో లేదు. ఆమె కూడా బతికి లేరు.
ఫిబ్రవరి 26న నెలలు నిండిన సుర్జీకి నొప్పులు రావడంతో మంచం మీద పడుకోబెట్టి ఆరోగ్య కేంద్రానికి తీసుకెళుతుండగా దారిలోనే ప్రసమైంది..
పుట్టిన బిడ్డ అక్కడే కన్నుమూసింది. ఉరుకులు పరుగులతో సుర్జీని ఆసుపత్రికి తీసుకెళ్లిన బంధువులకు అక్కడ డాక్టర్ కనిపించలేదు. అక్కడికి తీసుకొచ్చిన కాసేపటికే సుర్జీ కూడా కన్ను మూశారు.
ఝార్ఖండ్ రాష్ట్రంలోని గిరిడీహ్ జిల్లాలోని ఆ రహదారిలో ఆసుపత్రికి వెళ్లాలంటే ఏడు కిలోమీటర్లు నడవాలి.
గిరిడీహ్ జిల్లా రోడ్లు, ఆరోగ్య కేంద్రాలు ఎంత దయనీయంగా ఉన్నాయో సుర్జీ భర్త సునీల్ టుడూ మాటలు వింటే అర్థమవుతుంది.
"మా గ్రామం దాకా ఏ వాహనం రాదు. అంబులెన్స్ గురించి, ఇతర సేవల గురించి మాకు ఎలాంటి సమాచారం లేదు. అందుకే ఆమెను మంచం మీద పడుకోబెట్టి సమీప ఆసుపత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేశాం" అని సునీల్ వివరించారు.
"ఆ రోజు ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ కాజిం ఖాన్ విధుల్లో ఉండాలి. కానీ ఆయన లేరు. మరో డాక్టర్ సాలిక్ జమాల్ కూడా ఆ రోజు విధులకు హాజరు కాలేదు. వీళ్లిద్దరికీ ఫోన్ కూడా చేశారు. కానీ ఇద్దరూ ఫోన్ ఎత్తలేదు" అని గావాం బ్లాక్ డిప్యుటీ చీఫ్ నవీన్ యాదవ్ తెలిపారు.

పెద్ద ఆసుపత్రి 23 కి.మీ. దూరం
గిరిడీహ్ జిల్లా మూడవ బ్లాకులో ఉన్న లక్ష్మీబథాన్ టోలాలో సుర్జీ కుటుంబం నివసిస్తోంది. ఇక్కడి నుంచి పెద్ద ఆసుపత్రికి 23 కిలోమీటర్ల దూరం ఉంటుంది.
అందుకే ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న గవాన్ బ్లాకులోని ఆరోగ్య కేంద్రానికి ఆమెను తీసుకువెళ్లారు.
ఆ రోజు ఏం జరిగిందో సుర్జీ భర్త సునీల్ టుడూ వివరించారు. "ఆ రోజు కూలి పని మీద నేను బయటకు వెళ్లాను. మధ్యహ్నం సుర్జీకి నొప్పులు మొదలయ్యాయి. గ్రామంలోని మహిళలు ఆమెను దగ్గరుండి చూసుకుంటూ ఉన్నారు. కానీ, బిడ్డ పూర్తిగా బయటకు రాలేదు. నొప్పులు ఎక్కువ కావడంతో మా నాన్న, మరి కొంతమంది సాయంతో సుర్జీని మంచంపై పడుకోబెట్టారు. నలుగురైదుగురు కలిసి మంచాన్ని భుజాన మోస్తూ ఏడు కిలోమీటర్లు (సుమారు మూడున్నర గంటలు) నడిచారు. దారిలోనే ఆమెకు ప్రసవం జరిగింది. కానీ బిడ్డ బతకలేదు. మావాళ్లు నా భార్యను అలాగే మోసుకుని ఆరోగ్య కేంద్రానికి చేర్చారు." అని తెలిపారు.
"ఎన్నాళ్లు మేమంతా ఇలా ప్రాణాలు పోగొట్టుకోవాలి? మా ఊరుకు రోడ్లు ఎప్పుడు వేస్తారు?" అని సునీల్ ఏడుస్తూ ప్రశ్నించారు.
రాష్ట్ర ఆరోగ్య మంత్రి బన్నా గుప్తా ఈ ఘటనపై స్పందించేందుకు నిరాకరించారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేసేందుకు విచారణ కమిటీని ఏర్పాటు చేశారు.
" డ్యూటీ డాక్టర్ కాజింఖాన్ ఆరోజు సాయంత్రం 4 గంటలకు భోజనం చేయడానికి బయటకి వెళ్లారు. అయితే, డాక్టర్ సాలిక్ జమాల్ అక్కడ ఎందుకు లేరనేది తెలీదు. వీరిద్దరినీ జరిగిన ఘటనపై వివరణ ఇవ్వమని కోరాం. ఇద్దరూ ఫోను కూడా తీయలేదని తెలిసింది. కమిటీ నివేదిక సమర్పించిన తరువాత చర్యలు తీసుకుంటాం" అని గిరిడీహ్ సివిల్ సర్జన్ డాక్టర్ సిద్ధార్థ్ సన్యాల్ తెలిపారు.
ఈ ఘటనకు రెండు రోజుల ముందు ఈ ప్రాంతంలోని ఏఎన్ఎం ఇక్కడి ప్రసూతి వివరాలను సేకరించిందని ఆయన తెలిపారు. అయితే, అలాంటిది ఏదీ జరగలేదని సుర్జీ కుటుంబీకులు అంటున్నారు.

డాక్టర్ కాజిం ఖాన్ ఏమంటున్నారు?
"ఆ రోజు అరవింద్ కుమార్ విధుల్లో ఉన్నారు. కానీ ఒక ముఖ్యమైన సమావేశానికి హాజరయ్యేందుకు ఆయన గిరిడీహ్ జిల్లా ప్రధాన కార్యాలయానికి వెళ్లారు. ఆయన స్థానంలో నేను డ్యూటీలోకి వచ్చాను. ఉదయం 9గం.ల నుంచి మధ్యాహ్నం 3 వరకూ నేను ఓపీడీలో రోగులకు చికిత్స అందిస్తూ ఉన్నాను. 3.45 గం.లకు ఎమర్జెన్సీలో ఒక పేషెంట్‌ను చూడ్డానికి వెళ్లాను. ఓపీడీ టైం 3గం.ల వరకే. ఆ తరువాత ఎమెర్జెన్సీలో రోగులను చూస్తాం. అందుకే నాలుగు దాటాక ఆసుపత్రికి కొద్ది కిలోమీటర్ల దూరంలో ఉన్న మా ఇంటికి భోజనానికి వెళ్లాను" అని డాక్టర్ కాజిం ఖాన్ వివరించారు.
సుర్జీని అక్కడకు తీసుకు వచ్చాక పేగును కత్తిరించిన వెంటనే ఆమె మరణించారని ఒక నర్స్ చెప్పినట్లు డాక్టర్ కాజింఖాన్ వెల్లడించారు. ప్రసవం తరువాత అధిక రక్తస్రావం జరిగిందని, చికిత్స చేసే అవకాశమే లేకుండా పోయిందని ఆయన అన్నారు.
ప్రభుత్వం అందించిన వివరాల ప్రకారం గిరిడీహ్ జిల్లాలో ఒక సదర్ ఆసుపత్రితోపాటు 12 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు (సీహెచ్‌సీలు), 12 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్‌సీలు), 2 ఫస్ట్ రిఫరల్ యూనిట్లు, 180 ఆరోగ్య ఉప కేంద్రాలు ఉన్నాయి. జిల్లా జనాభా 24 లక్షల 45 వేలు. అంటే ప్రతీ 2 లక్షల 38 వేలమందికి ఒక సీహెచ్‌సీ, ఒక పీహెచ్‌సీ ఉన్నట్టు లెక్క.
2011 జనాభా లెక్కల ప్రకారం జార్ఖండ్ జనాభా 3.3 కోట్లు. ఈ రాష్ట్రంలో 24 జిల్లా ఆసుపత్రులు, 12 సబ్ డిస్ట్రిక్ట్ ఆసుపత్రులు, 188 సీహెచ్‌సీలు, 3876 ఆరోగ్య ఉప కేంద్రాలు ఉన్నాయి. అంటే ప్రతీ 8514 మందికీ ఒక ఆరోగ్య ఉప కేంద్రం ఉన్నట్టు లెక్క.
జాతీయ ఆరోగ్య సర్వే ప్రకారం.. ప్రతీ 18,518 మందికి ఒక డాక్టర్ ఉన్నారు.

ఇక్కడ రోడ్లు ఎందుకు వెయ్యడం లేదు?
"లక్ష్మీబథాన్ టోలా బర్దౌనీ గ్రామానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది పూర్తిగా అటవీ ప్రాంతం. వాహనాలు బర్దౌనీ వరకూ వస్తాయిగానీ ఈ కుగ్రామానికి చేరుకునేందుకు మార్గం లేదు. అందువల్ల ఆరోగ్య కార్యకర్తలు బర్దౌనీ వరకు మాత్రమే రాగలరు" అని పంచాయతీ చీఫ్ మంజు దేవి భర్త సోమ ముర్ము తెలిపారు.
లక్ష్మీబథాన్ టోలాలో ఎక్కువగా దళితులు, ఆదివాసులు నివసిస్తున్నారు. 32 ఇళ్లు, సుమారు 100మంది జనాభా ఉంటారు. ఇక్కడ ఎంఎన్‌ఆర్‌ఈజీఏ పథకం కింద రోడ్లు వేసేందుకు చాలాసార్లు ప్రయత్నించినా అటవీ శాఖ అనుమతించ లేదని సోమ వెల్లడించారు. కొన్నేళ్ల కిందట ఈ పంచాయితీలో ఒక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేసినా, అది పూర్తిగా పాడైపోయిందని ఆయన చెప్పారు.
ఈ గ్రామం ధన్వర్ అసెంబ్లీ నియోజకవర్గంలో వస్తుంది. ఈ నియోజకవర్గం నుంచీ వచ్చిన జార్ఖండ్ తొలి ముఖ్యమంత్రి బాబూలాల్ మరాండి లక్ష్మీబథాన్ నుంచీ 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోడై బ్యాంక్ గ్రామానికి చెందినవారు.
"అటవీ ప్రాంతాల్లో ఉన్న చిన్నచిన్న ఊళ్లకు రోడ్లు వేయడంలో ప్రభుత్వం విఫలమైంది. ఏడాది కాలంగా అభివృద్ధి పనులు ఆగిపోయాయి. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక పట్టణాలకు, గ్రామాలకు రోడ్లు వేయించా" అని బాబూలాల్ మరాండి అన్నారు.
"ఈ చిన్నచిన్న గ్రామాల్లోని ఓట్లకు పెద్ద ప్రాముఖ్యత ఉండదు. అందుకే ప్రభుత్వం వీళ్ల విషయంలో చొరవ చూపించదు. ఎమ్మెల్యే నిధి నుంచీ రోడ్లు వెయ్యడం చాలా కష్టం. ఎందుకంటే ఒక కిలోమీటర్ రోడ్డు వెయ్యాలంటేనే రూ.30- 40 లక్షలు ఖర్చవుతుంది. మాకు రూ.4 కోట్లు మాత్రమే ఇస్తారు. ఈసారి అసెంబ్లీ సెషన్ ముగిసిన తరువాత నేను ఆ ప్రాంతానికి వెళ్లి చూస్తాను. ఎలాగైనా అక్కడ రోడ్లు వెయ్యడానికి ప్రయత్నిస్తాను" అని ఆయన అన్నారు.
ఇవి కూడా చదవండి:
- చైనా సైన్యం 'కెప్టెన్ అమెరికా', 'ఐరన్ మ్యాన్' లాంటి సూపర్ హీరోలను సృష్టిస్తోందా
- సైన్యంలో చేరాలని రెండు సార్లు ఫెయిలైన వ్యక్తి ఇప్పుడు దేశాన్నే గుప్పిట్లో పెట్టుకున్నాడు
- బుమ్రా, షమీ, ఉమేశ్, ఇషాంత్... ఇంగ్లండ్‌ను భయపెడుతున్న భారత పేసర్లు
- ఎర్రకోటను షాజహాన్ ఎందుకు కట్టించారు.. చరిత్రలో అక్కడ జరిగిన రాజకీయ కుట్రలెన్ని.. తెగిపడిన తలలెన్ని
- దీప్ సిద్ధూ ఎవరు? ఎర్రకోట ఘటన తరువాత చర్చల్లోకి ఎందుకొచ్చారు?
- ‘18 మందిని చంపిన సీరియల్ కిల్లర్’: ఒంటరి మహిళలతో మాట కలుపుతాడు... కోరిక తీర్చుకుని కడతేరుస్తాడు...
- బడ్జెట్ 2021-22: సామాన్యులకు ఈ బడ్జెట్‌తో చేకూరే ప్రయోజనాలు ఇవే..
- పాకిస్తాన్ గురించి నేపాల్ ప్రజలు ఏమనుకుంటారు?
- తీరా కామత్: రూ.16 కోట్ల ఇంజెక్షన్ ఈ పాపాయిని కాపాడుతుందా?
- పదకొండేళ్ల పర్యావరణ ఉద్యమకారుడిని చంపేస్తామంటూ బెదిరింపులు
- సెక్స్‌కు 'విశ్వగురువు' ప్రాచీన భారతదేశమే
- పేద దేశాలకు దక్కకుండా ధనిక దేశాలు వ్యాక్సీన్‌ను లాగేసుకుంటున్నాయా?
- అంబేడ్కర్ తొలి పత్రిక ''మూక్ నాయక్''కు 101 ఏళ్లు: అప్పట్లో దళితులు మీడియాను ఎలా నడిపించేవారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








