‘సోలో బతుకే సో బెటర్’ అని జపాన్ ప్రజలు ఎందుకు అంటున్నారు?

ఒంటరి మహిళ

ఫొటో సోర్స్, Shiho fukada

    • రచయిత, బ్రయిన్ లఫ్కిన్
    • హోదా, బీబీసీ వర్క్ లైఫ్

సాధారణంగా సమూహాలలో ఉండటానికి ఇష్టపడే జపాన్ ప్రజలు ఇటీవల ఒంటరిగా జీవించడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

దశాబ్దం క్రితం జపనీయులు స్కూలులో కానీ, ఆఫీసు కెఫెటేరియాలలో కానీ ఒంటరిగా భోజనం చేయాలంటే చాలా ఇబ్బంది పడేవారు.

స్నేహితులు ఎవరూ లేకుండా బయటకు కనిపించడాన్ని ఏమాత్రం ఇష్టపడేవారు కాదు.

అలాంటిది ఇప్పుడు 'బెంజోమెషి' అనే విధానం మొదలయింది. దీనర్థం టాయిలెట్లో వలె ఒంటరిగా కూర్చుని లంచ్ తీసుకోవడం.

జపాన్ చాలా వేగంగా మారుతోంది అని చాలా మంది అనుకుంటున్నారు.

మికి తటీషి టోక్యోలో ఒంటరిగా మద్యం సేవించే వారి కోసం ఉన్న హితోరి బార్‌లో బార్ టెండర్ గా పని చేస్తున్నారు.

దీనిని 2018 మధ్యలో తెరిచారు. ఇక్కడకు మద్యం సేవించడానికి చాలా మంది ఒంటరిగానే వస్తూ ఉంటారు.

ఎక్కడో టాయిలెట్లా ఉండే దుకాణాలలో దాక్కుని తినకుండా బయటకు వెళ్లి ఒంటరిగా తమను తాము ప్రదర్శించుకోవడానికి చాలా మంది పెద్దగా సంకోచించటం లేదు.

"కొంత మంది ఒంటరిగా ఉండటాన్ని ఇష్టపడతారు. మరి కొంత మంది ఒకే అభిరుచి కలిగిన వారంతా కలిసి ఒక కొత్త సమూహాన్ని ఏర్పరుచుకునేందుకు చూస్తున్నారు" అని తటీషి చెప్పారు.

ఒక్కొక్కసారి పెద్ద పెద్ద గ్రూపులను చూసినప్పుడు బాధకు గురి కాకుండా కేవలం ఒంటరిగా ఉండే వారి కోసం ఈ బార్‌ని ఏర్పాటు చేయడం వెనకనున్న ముఖ్య ఉద్దేశం అని ఆమె అన్నారు.

ఇక్కడకు వచ్చే కస్టమర్లు కావాలంటే పక్క వారితో మాటలు కలపవచ్చు అని అన్నారు.

ఈ బార్‌లో 12 మంది వెళ్లేందుకు సౌకర్యంగా ఉంటుంది.

జపాన్ మహిళలు

ఫొటో సోర్స్, Shiho fukada and keith bedford

"ఇలాంటి బార్లు ఉండటం అరుదు అని ఒక పరిశ్రమలో పని చేసే 29 సంవత్సరాల కాయ్ సుగియమా చెప్పారు.

"జపాన్ ప్రజలు సమూహంలో ఉన్నప్పుడు జీవితాన్ని జీవిస్తారు. చాలా మంది ఇతరుల కోసం ఏదైనా చేయాలని అనుకుంటారు. ఒంటరిగా పనులు చేసే సంస్కృతి మా దేశంలో లేదు" అని అన్నారు.

హిటోరి అంటే ఒక వ్యక్తి అని అర్ధం. ఎవరికి వారే జీవించే సౌలభ్యం కల్పించేందుకు వ్యాపారాలు తమను తాము ఎలా మలుచుకుంటున్నాయో చెప్పేందుకు ఈ బార్ ఒక్కటే ఉదాహరణ కాదు.

హోటళ్ల నుంచి నైట్ లైఫ్, పర్యటనల వరకు ఒంటరిగా వెళ్లే వారి కోసం కేటాయించిన చాలా రకాల వ్యాపారాలు మొదలయ్యాయి.

దీనినే ఓహిటోరిసమా ఉద్యమం అని పిలుస్తారు.

చాలా మంది తాము చేసే కార్యకలాపాలను ఒంటరిగా చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

ఇతరుల అభిప్రాయాలకు అంతగా ప్రాధాన్యం ఇవ్వటం లేదు.

single woman

ఫొటో సోర్స్, Shiho fukada and keith bedford

ఒంటరితనంలో ఉండే శక్తి

ఓహిటోరిసమా అంటే "ఒక్కరే జరుపుకునే సంబరం" అనే అర్ధం వస్తుంది.

ఈ హాష్ టాగ్ తో ఇన్‌స్టాగ్రామ్‌లో వెతికితే కొన్ని వందల వేల ఫోటోలు కనిపిస్తాయి.

ఇందులో ఒక్కరి కోసం మాత్రమే కేటాయించిన రెస్టారంట్ భోజనాలు, సినిమా హాళ్లు, క్యాంపులలో టెంట్లు, సోలో సహస యాత్రల ఫోటోలు కనిపిస్తాయి.

గత 18 నెలల్లో ముఖ్యంగా చాలా మంది ఈ కొత్త పంథా పై వార్తల్లోనూ, సోషల్ మీడియాలోనూ తమ ప్రేమను వ్యక్తం చేస్తున్నారు.

హితోరి యకినీకు (కాల్చిన మాంసం) అనే కొత్త వంటకం తినేటప్పుడు టేబుల్ చుట్టూ కూర్చుని అందరూ కలిసి మాంసాన్ని కాల్చుకుని తింటూ ఉంటారు.

కానీ, ఓహిటోరిసమా విధానంలో ఎవరికి వారే మాంసాన్ని కాల్చుకుని తింటూ ఉంటారు.

ఆఖరికి కరావుకే కూడా సోలో గా తయారు అవుతోంది.

ఇది జపనీయులు ఖాళీ సమయాల్లో గడిపే విధానంలో వచ్చిన అతి పెద్ద మార్పు అని చెప్పవచ్చు.

"ఒంటరిగా చేసే కరావుకేకు 30 - 40 శాతం డిమాండు పెరిగిందని 1కార సోలో కరావుకే కంపెనీ సేల్స్ మేనేజర్ డైకి యమతాని చెప్పారు.

జపాన్ లో కరావుకే స్పాట్ లు ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి.

అయితే, ఒంటరిగా పాడే వారి కోసం డిమాండ్ అయితే పెరిగింది.

పెద్ద పెద్ద గదుల నుంచి ఫోన్ బూత్ లలా ఉండే స్టూడియోలకు డిమాండు పెరిగింది అని ఆయన చెప్పారు.

జపాన్ లో మద్యం సేవించడం, నైట్ లైఫ్ కార్యకలాపాలు సాధారణంగా సహ ఉద్యోగులతో గాని, స్నేహితులతో కలిసి కానీ చేసేవారు.

డిన్నర్ కి బయటకు వెళ్లడం కూడా స్నేహితులతో కలిసి వెళ్లేవారు.

కానీ, ఈ కొత్త ఓహిటోరిసమా ఉద్యమం మాత్రం ఈ పంథాలో చాలా మార్పు తీసుకుని వస్తోంది.

దీనికి ప్రభావితం చేసిన కారణాలేమిటి? ఇదెందుకు ప్రాముఖ్యం సంతరించుకుంటోంది?

బార్

ఫొటో సోర్స్, Shiho fukada and keith bedford

చాలా దేశాలలో ఒంటరిగా గడపడం అనే అంశం అంతగా ఆశ్చర్యం కలిగించక పోవచ్చు.

కానీ, డిసెంబరులో అమెరికా నటి క్రిస్టీనా హెన్డ్రిక్స్ సోలో డేట్ ఫోటోలను పోస్ట్ చేశారు.

బ్రిటిష్ నటీమణి ఎమ్మా వాట్సన్ కూడా ఒంటరి జీవితం పట్ల తన ప్రేమను దానిని ఆమె ఎలా ఆస్వాదిస్తున్నారో చెబుతూ పోస్టు చేశారు.

ఒంటరిగా మద్యం సేవించడం, పుస్తకం చదవడం, వంటి వాటి గురించి కొన్ని పశ్చిమ దేశాల నియమావళితో కూడిన రచనలు కూడా ప్రచురించాయి.

ఒంటరిగా పర్యటనలు చేయడం లాంటివి అయితే కొన్ని వందల మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్‌లకు కెరీర్ ని కూడా తెచ్చిపెట్టాయి.

కానీ, సమూహాలలో ఉండటాన్ని ఎక్కువగా ఆమోదం పొందిన జపాన్ లాంటి దేశంలో ఇలా ఒంటరిగా గడపడమనేది పెద్ద విషయమే.

కాలిఫోర్నియా కంటే తక్కువ విస్తీర్ణం ఉండే ద్వీప సమూహంలో నివాసం ఉండే 10 కోట్ల 25 లక్షల (125 మిలియన్ జనాభా)కు సరిపోయేంత నివాస యోగ్యమైన స్థలం దొరకడం అంత సులభం కాదు.

జపాన్ లో నాలుగువాంతులు భూభాగం పర్వతాలతో నిండి నివాస యోగ్యంగా ఉండదు. దాంతో, ఇతరులతో కలిసి సమూహాలలో నివసించడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు.

"జపాన్ చాలా చిన్న దేశం. అందరూ కలిసి బ్రతకాల్సిందే" అని జపాన్ ఎకనామిక్ రెసెర్చ్ సంస్థలో సీనియర్ కన్సల్టెంట్ మోటోకో మట్సుషిత అన్నారు.

ఆమె ఓహిటోరిసమా పుట్టుక, భవిష్యత్తు గురించి అధ్యయనం చేస్తున్నారు.

"అందరూ సామరస్యంగా కలిసి ఉండటం పై దృష్టి పెట్టాల్సి ఉంది. కొన్ని పనులను చేయడానికి సమూహాలలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది" అని ఆమె అన్నారు.

కరాఒకే బూత్

ఫొటో సోర్స్, Shiho fukada and keith bedford

"సోషల్ మీడియా ప్రాముఖ్యం పెరగడంతో, మనకున్న స్నేహితుల సంఖ్య కూడా సోషల్ వేదికల పై మన విలువను శాసిస్తున్న రోజుల్లో ఒంటరిగా ఉండటం అంటే తప్పుగా చూడటం అనే భావనను కూడా అణిచివేసింది. 24 గంటలూ ఒకరితో ఒకరు మాట్లాడుకునే సౌలభ్యం ఈ ఓహిటోరిసమ సంస్కృతికి దారి తీసింది" అని మట్సుషిత అంటారు.

బెంజో మెషి అనే పదాన్ని 2008లో ఒసాకా యూనివర్సిటీ సామాజిక శాస్త్రవేత్త డైసుకే సుజి కనుగొన్నారు.

ఒక చిన్న స్టాల్ లో కూర్చుని తినడం ఇష్టపడే విద్యార్థులు కేవలం ఒంటరిగా తినడానికి ఇష్టపడటం వలన అలా చేయరని, పక్క వాళ్ళు వారితో పాటు తినడానికి ఎవరూ లేరని అనుకోకూడదని అలా చేస్తారని సుజి అభిప్రాయ పడ్డారు.

కానీ, ఈ పద్దతి మారుతోందని మట్సుషిత భావిస్తున్నారు.

"ఒంటరిగా ఉండటం పట్ల ప్రతికూలంగా ఉండే సాంఘిక ఒత్తిడి తగ్గుతోందని. పెళ్లి చేసుకోవాలి, పిల్లలను కనాలి లాంటి సామాజిక ఒత్తిడులు తగ్గుతున్నాయి" అని ఆమె అన్నారు.

మనుషులు స్వతంత్రంగా ఉండటానికి, నచ్చినట్లు బ్రతకడం లాంటి విషయాలలో ప్రజల ఆలోచనా ధోరణి మారుతోందని ఆమె 2015- 2018 మధ్యలో 10,000 మందితో నిర్వహించిన సర్వేలో తేలినట్లు చెప్పారు.

కొంత మంది మాత్రం ఇంకా పెళ్లి చేసుకుని పిల్లలను కనాలని భావిస్తున్నారని, అలాగే, పిల్లలు ఉన్నా విడాకులు తీసుకోవడంలో తప్పు లేదని చెప్పారు. భాగస్వామితో కొన్ని రహస్యాలు దాచి పెట్టి ఉంచడంలో తప్పు లేదని కొంత మంది దంపతులు భావిస్తున్నారు.

ఒంటరి సమాజం

జపనీస్ సమాజంలో జనాభా స్థితిగతులు ఒక ప్రకంపనలా మారుతున్నాయి. జననాలు తగ్గుతున్నాయి. గత సంవత్సరంలో కేవలం 8,64,000 మంది శిశువులు జన్మించారు. ఇది 1899 నుంచి చూస్తే అతి తక్కువ జననాలు అని చెప్పవచ్చు. ఒంటరిగా నివసించే వారితో నిండిన గృహాలు ఎక్కువవుతున్నాయి.

1995లో 25 శాతం ఒంటరిగా నివసిస్తున్న వారి గృహాలు ఉండగా అది 2015కి 35 శాతానికి పెరిగింది అని జనాభా లెక్కలు చెబుతున్నాయి.వివాహాలు చేసుకునేవారు తగ్గడంతో ఒంటరిగా ఉండేవారు ఎక్కువవుతున్నారు. ఇక్కడ ఉండే వృద్ధులు చాలా మంది వైధవ్యం వలన కూడా ఒంటరివారవుతున్నారు.

వీటన్నిటి వలన వినియోగదారుల వినియోగ ప్రవర్తన కూడా మారిపోతోంది. వారి అవసరాల దృష్ట్యా వ్యాపారాలు కూడా వ్యాపార శైలిని మార్చుకుంటున్నాయి.

ఒంటరిగా జీవించే వారి కొనుగోలు సామర్ధ్యాన్ని తక్కువగా అంచనా వేయడానికి లేదని హకుహోడో అనే ప్రకటన సంస్థలో పరిశోధకులు కజుహిస అరకావా అన్నారు. 2040 కల్లా 15 సంవత్సరాలు పైబడిన జనాభాలో 50 శాతం మంది ఒంటరిగానే జీవిస్తారని ఆయన అంచనా వేశారు.

ప్రజలు వారికి కావల్సింది వాళ్ళు ధైర్యంగా చేయడం, ఇతరుల అభిప్రాయాలకు విలువ ఇవ్వకపోవడాన్నే ఓహిటోరిసమా ఉద్యమం అంటారు.

ఒంటరిగా ఉండటం అంటే చాలా మంది ఇష్టపడరు. కానీ, నాకు ఒంటరిగా తిరగడం ఇష్టం అని 22 సంవత్సరాల ఎరికా మియురా చెప్పారు. ఆమె ఎప్పటి నుంచో సోలో లైఫ్ జీవిస్తున్నారు. ఆమె సినిమాలకు, కరావుకేకు ఒంటరిగా వెళతారు. ఇందులో ఆమె ఎక్కువ స్వేచ్ఛను అనుభవిస్తారు. టోక్యోలో చాలా సోలో సేవలు అందుబాటులో ఉన్నాయి.

"కొన్ని సంప్రదాయ కుటుంబాలతో కలిసి జీవించే అవకాశాన్ని కూడా ఓహిటోరిసమ ఇస్తుంది" అని నిపుణులు అంటున్నారు.

ప్రతి ముగ్గురు వివాహం చేసుకున్న వారిలో కనీసం ఒకరు సోలో పర్యటనలను చేయడానికి ఇష్టపడతారని అరకావా 2018 లో చేసిన అధ్యయనం తెలుపుతోంది.

పెద్ద వయసు ఉన్న మహిళల్లో ఒంటరిగా బ్రతికేందుకు కావాల్సిన మానసిక సామర్ధ్యం కనిపిస్తుందని ఆమె అన్నారు.

కరాఒకే బూత్

ఫొటో సోర్స్, Shiho fukada and keith bedford

ప్రపంచం మారుతోంది

ఇలాంటి సామాజిక మార్పులు కేవలం జపాన్ లో మాత్రమే జరగడం లేదు.

జననాల రేటు తగ్గుతుండటం,, వివాహం చేసుకునే వయసు పెరగడం, మరో వైపు జనాభాలో వృద్ధులు పెరగడంతో చాలా దేశాలలో ఒంటరిగా జీవించే వారి సంఖ్య పెరుగుతోంది.

ప్రపంచ వ్యాప్తంగా 2000 - 2030 సంవత్సరాల మధ్యలో ఒంటరిగా నివసించే వారున్న గృహాల సంఖ్య 128 శాతం పెరుగుతుందని యూరో మానిటర్ ఇంటర్నేషనల్ అంచనా వేసింది.

ఎవరికి వారే ఒంటరిగా మద్యం సేవించడం, విందు ఆరగించడం, తిరగడం లాంటి పనుల పట్ల కనుబొమ్మలు ఎగరేయడం అయితే బాగా తగ్గింది. కానీ, జపాన్ లో మాత్రం ఇదొక హాట్ టాపిక్ గా మారింది.

జపాన్ లో ప్రజలు చాలా వరకు స్వతంత్రులు అని అరకావా అభిప్రాయం.

"ఇక్కడ రెండు రకాల ప్రజలు ఉంటారని అనుకోవడం తప్పు. ఒంటరిగా ఉండటాన్ని ఇష్టపడేవారు, ఇష్టపడని వారు ఉంటారంతే" అని ఆమె అన్నారు.

ఒక పదేళ్ల క్రితమే అలా "ఎవరైనా ఒక్కరైనా భోజనం చేస్తే, "టాయిలెట్లో లంచ్ " అని పిలిచే వారని మట్సుషిత చెప్పారు.

"కానీ, ఇప్పుడు చాలా సోలో సేవలు అందుబాటులో ఉన్నాయి. ప్రజలు ఒంటరిగా ఉండటం పట్ల సానుకూలంగా ఆలోచిస్తున్నారు" అని ఆమె అన్నారు.

"కేవలం ఇంటి దగ్గరే ఉండిపోయే ఒంటరి వ్యక్తులు సోలో సేవలు అందించే హితోరి లాంటి స్థలాల్లో వారికంటూ ఒక కమ్యూనిటీని ఏర్పర్చుకోవచ్చు" అని తటేషి అంటారు. ప్రపంచం మారుతోందని వారు గమనిస్తున్నారు.

అదనపు రిపోర్టింగ్ యోకో ఇషితాని

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)