రాజాసింగ్: గోమాంసం తినేవారిపై బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు, వెల్లువెత్తిన విమర్శలు

రాజా సింగ్

ఫొటో సోర్స్, SUDHEER KALANGI

హైదరాబాద్‌లోని గోషామహల్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే, బీజేపీ నేత రాజా సింగ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

గోమాంసం తినేవారి నుంచి అయోధ్యలోని రామమందిర నిర్మాణానికి ఒక్క రూపాయి కూడా విరాళంగా తీసుకోవద్దని ఆయన అన్నారు.

''ఒక్కరూపాయి ఐటమ్ కూడా ఆవు మాంసం తినే వ్యక్తుల నుంచి, ఆ లం.కొడుకుల దగ్గర నుంచి తీసుకోకూడదు. ఒక్క రూపాయి ఐటమ్.. నేను చెబుతున్నా సీరియస్.. ఒక్క రూపాయి ఐటమ్ కూడా.. పువ్వులు ఉండనీ, మాంసం ఉండనీ, ఏదైనా ఫ్రూట్ ఉండనీ, ఇంకేదైనా ఉండనీ.. భారత్ మాతా కీ జై అను, వందేమాతరం అని చెప్పు.. అప్పుడే నీ దగ్గర నుంచి మేం కొంటాం. లేకపోతే కొనం అని చెప్పండి''అని ఆయన చెప్పారు.

హైదరాబాద్‌లోని పాతబస్తీలో జరిగిన ఒక బహిరంగ సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ''భారత్ మాతా కీ జై'', వందేమాతరం నినాదాలు చేయని వారి నుంచి ఎలాంటి వస్తువులూ కొనుగోలు చేయొద్దని పిలుపునిచ్చారు.

రాజాసింగ్ బీజేపీ ఎమ్మెల్యే

రాజా సింగ్ వ్యాఖ్యలపై నిరసనలు, విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు.. రాజాసింగ్ దిష్టిబొమ్మను కూడా దహనం చేశారు. మరికొందరు ఆయనపై కేసులు నమోదు చేస్తామని అన్నారు.

మరోవైపు దళిత కవి తుల్లిమల్లి విల్సన్ సుధాకర్ కూడా స్పందించారు. ''రాజా సింగ్ ఉపయోగించిన భాషను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. గోమాంసం తినేవారి పేరుతో.. బీసీలను, రైతులను విడదీయాలను భావిస్తున్నారు. మొదట గోమాంసం తినేవారి నుంచి వారు విరాళాలు సేకరించారు. ఇప్పుడు వారికే వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఇది సిగ్గుచేటు''అని ఆయన వ్యాఖ్యానించారు.

రాజా సింగ్ దిష్టిబొమ్మను దహనం చేస్తున్న విద్యార్థులు

ఫొటో సోర్స్, ugc

ఫొటో క్యాప్షన్, రాజా సింగ్ దిష్టిబొమ్మను దహనం చేస్తున్న విద్యార్థులు

''రాజా సింగ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. బీజేపీ లేదా రాజా సింగ్ పుట్టకముందు నుంచీ వస్తున్న ఆహారపు అలవాట్లపై ఇలాంటి మతోన్మాద వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు.

దేశంలోని బడుగు బలహీన వర్గాల ప్రజలంతా ముక్తకంఠంతో ఇలాంటి వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. ఒక మత ప్రాతిపదికన, ఆహారపు అలవాట్ల ప్రాతిపదికన రాజకీయాలు చేయడం సిగ్గుచేటు. ఇది కేవలం బీజేపీకే చెల్లుతుంది.

ఎప్పటినుంచో దళితులు, బహుజన వర్గాలకు చెందినవారి ప్రధాన ఆహారపు అలవాట్లలో బీఫ్‌ కూడా ఉంది. దీనిపై విమర్శలు చేస్తే ఊరుకునేది లేదు''అని ఉస్మానియా యూనివర్సిటీ జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్, మాదిగ విద్యార్థి సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కొంగరి శంకర్ మాదిగ వ్యాఖ్యానించారు.

చేతిలో గోమాంసంతో నిరసన చేపడుతున్న ఓయూ విద్యార్థులు

ఫొటో సోర్స్, ugc

ఫొటో క్యాప్షన్, చేతిలో గోమాంసంతో నిరసన చేపడుతున్న ఓయూ విద్యార్థులు

ఇదివరకు కూడా రాజా సింగ్ చాలా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కూడా ఎన్‌ఆర్‌సీని అమలు చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కోరతానని గతంలో ఆయన చెప్పారు.

''హైదరాబాద్‌ ఎంపీ తన ఓటుబ్యాంకు కోసం బంగ్లాదేశీయులు, రోహింజ్యాలకు చోటు కల్పిస్తున్నారు. బాలాపూర్‌, కంచన్‌బాగ్‌ వంటి ప్రాంతాల్లో 8 వేల మందికి పైగా రోహింజ్యాలు అక్రమంగా నివాసముంటున్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వారికి ఆధార్‌కార్డు, ఓటరు కార్డులు ఇవ్వడం దురదృష్టకరం''అని అన్నారు.

గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్

ఫొటో సోర్స్, facebook/Rajasingh

ఫొటో క్యాప్షన్, గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్

2020 సెప్టెంబరులో రాజా సింగ్‌ ఫేస్‌బుక్ ఖాతాను స్తంభింప చేస్తున్నట్లు ఫేస్‌బుక్ ఒక ప్రకటన విడుదల చేసింది.

"బీజేపి ఎమ్మెల్యే రాజాసింగ్ విద్వేషపూరిత వ్యాఖ్యలు, ప్రసంగాలతో రెచ్చగొట్టే కార్యకలాపాలకు పాల్పడ్డారు. ఫేస్‌బుక్‌ విధానాన్ని ఉల్లంఘించారు. అందుకే ఆయన్ను బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నాం" అని ఫేస్‌బుక్‌ ప్రతినిధి అప్పట్లో తెలిపారు.

వీడియో క్యాప్షన్, ఫేస్‌బుక్ కామెంట్స్‌పై రాజాసింగ్: 'నేను అన్నదేదీ తప్పు కాదు... కరెక్టే'

2017లోనూ ఆయన ముస్లింలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ''ముస్లింలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో తిరగను, అక్కడ అభివృద్ధి చేయను''అని అన్నారు.

రాజా సింగ్‌పై దాదాపు 70 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. వాటిలో చాలా వ‌ర‌కూ అల్ల‌ర్లు, ఉద్రిక్తతలను రెచ్చగొట్టడానికి సంబంధించిన‌వే. తనపై అన్ని కేసులు ఉన్నాయన్న విషయాన్ని చెప్పుకునేందుకూ ఆయన వెనుకాడరు.

"నా మీద చాలా కేసులున్నాయి. వారంలో నాలుగు రోజులు కోర్టుల‌కు వెళ్లాల్సి ఉంటుంది"అని ఇదివరకు ఆయన బహిరంగంగా వెల్లడించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)