ద గేట్స్ ఆఫ్ హెల్: ఎడారిలో అగ్ని బిలం.. దశాబ్దాలుగా మండుతూనే ఉంది

ద గేట్స్ ఆఫ్ హెల్
    • రచయిత, అడ్రియాన్ హార్ట్రిక్, డొమినికా ఒజిన్స్కా
    • హోదా, బీబీసీ ట్రావెల్

పైన ఫొటోలో కనిపిస్తున్న ఈ బిలాన్ని 'నరకానికి ద్వారాలు' అని పిలుస్తారు. ఇది కొన్ని దశాబ్దాలుగా మండుతూనే ఉంది.

కానీ ఈ మంటలు ఎలా మొదలయ్యాయో ఇప్పటికీ అంతుచిక్కని మిస్టరీగానే మిగిలింది.

కరాకుమ్ ఎడారిలో ఎటుచూసిన మండే ఎండలు, ఇసుక దిబ్బలే కనిపిస్తాయి.

తుర్క్‌మెనిస్తాన్‌లో 70 శాతాన్ని ఈ ఎడారే ఆక్రమించింది.

3,50,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోని ఈ ఎడారిని మొత్తం చూడాలంటే కొన్ని రోజులు పడుతుంది.

దీనిలో పెద్దపెద్ద పర్వతాలు, లోయలు కూడా ఉంటాయి.

అయితే, ఈ ఎడారికి ఉత్తరాన కనిపించే మైదానాల్లోకి వెళ్తే, ఒక అద్భుతమైన బిలం కనిపిస్తుంది.

దాని పేరు ‘‘ద దర్వాజా క్రేటర్’’.

గ్యాస్‌తో నిండిన ఈ బిలం దశాబ్దాలుగా నిప్పులు వెళ్లగక్కుతోంది.

అందుకే దీన్ని ‘‘ద గేట్స్ ఆఫ్ హెల్’’గా పిలుస్తారు.

ద గేట్స్ ఆఫ్ హెల్

దీని కథ 1971లో మొదలైంది.

సోవియట్ యూనియన్‌కు చెందిన కొందరు జియాలజిస్టులు చమురు కోసం ఎడారిలో డ్రిల్లింగ్ చేశారు.

ఈ క్రమంలో డ్రిల్లింగ్ భూమి లోపల సహజ వాయువు ఉన్న ప్రాంతాన్ని తాకింది. ఫలితంగా మూడు భారీ బిలాలు ఏర్పడ్డాయి.

వీటి నుంచి మీథేన్ వాయువు భారీగా వెలువడింది. అది వాతావరణంలో కలవకుండా అడ్డుకునేందుకు ఓ శాస్త్రవేత్త గ్యాస్‌కు నిప్పు పెట్టారనే వదంతులు ఉన్నాయి. ఇలా చేస్తే కొన్ని వారాలపాటు గ్యాస్ మండి ఆగిపోతుందని ఆయన భావించారు.

ద గేట్స్ ఆఫ్ హెల్

2013లో తొలిసారిగా ఈ బిలం లోతును కెనడా పరిశోధకుడు జార్జ్ కౌరోనిస్ కొలిచారు. అప్పుడే దీని శక్తి, సామర్థ్యాలు ప్రపంచానికి తెలిశాయి.

అయితే, ఈ బిలం పుట్టుకపై స్థానిక జియాలజిస్టులు జార్జ్‌కు భిన్నమైన కథ చెప్పారు.

‘‘69 మీటర్ల వైశాల్యం, 30 మీటర్ల లోతు ఉన్న ఈ బిలం 1970ల్లో ఏర్పడిందని స్థానిక జియాలజిస్టులు చెబుతున్నారు. 1980ల్లో దీనికి నిప్పుపెట్టారని వారు వివరిస్తున్నారు’’అని జార్జ్ చెప్పారు.

సోవియట్ కాలంలో చమురు, గ్యాస్‌కు ఇక్కడ విలువ చాలా ఎక్కువగా ఉండేది. అందుకే ఇలాంటి బిలాల పుట్టుకపై వివరాలను చాలా సీక్రెట్‌గా ఉంచేవారు.

ఏదిఏమైనప్పటికీ, నేడు ఈ బిలం భారీగా పర్యటకుల్ని ఆకర్షిస్తోంది. ఏటా దీన్ని చూడటానికి వచ్చే పర్యటకులు పెరుగుతున్నారని స్థానికులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)