ఫోర్డ్: భారత్‌కు గుడ్‌బై చెబుతున్న అమెరికన్ కార్ల కంపెనీ

ఫోర్డ్ కంపెనీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, భారత్‌లో అయిదు రకాల కార్లను విక్రయిస్తున్న ఫోర్డ్ కంపెనీ

అమెరికాకు చెందిన అతిపెద్ద కార్ల తయారీ సంస్థ 'ఫోర్డ్' భారతదేశంలో ఉత్పత్తిని నిలిపి వేయాలని నిర్ణయించింది. భారత్‌లో ఉన్న రెండు కార్ల తయారీ కర్మాగారాలను మూసివేస్తున్నట్లు ఆ సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది.

తమిళనాడు, గుజరాత్‌లలోని తమ ప్లాంట్లను 2022 రెండో త్రైమాసికంలో మూసివేస్తామని, అయితే ఎగుమతుల కోసం కారు ఇంజన్ల తయారీ మాత్రం కొనసాగుతుందని ఆ ప్రకటనలో ఫోర్డ్ తెలిపింది.

ఇటీవలి కాలంలో భారత్‌ నుంచి నిష్క్రమిస్తున్న మరో అతిపెద్ద వాహన తయారీ సంస్థ ఫోర్డ్. జనరల్ మోటార్స్ భారతదేశంలో తన కార్యకలాపాలను 2017లో నిలిపివేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద మోటార్ సైకిల్ కంపెనీగా పేరున్న హార్లీ డేవిడ్సన్ కూడా గత ఏడాది భారతదేశంలో వాహన తయారీని ఆపేయడమే కాకుండా విక్రయాలను కూడా గణనీయంగా తగ్గించుకుంది.

విదేశీ కంపెనీలు భారతదేశంలో ఉత్పత్తి కార్యకలాపాలు చేసేలా చూడాలనే ప్రధాని నరేంద్ర మోదీ ప్రయత్నాలకు ఇదొక ఎదురుదెబ్బ అని చెప్పవచ్చు. ఫోర్డ్ కంపెనీ భారత్‌లో గత దశాబ్ద కాలంలో 200 కోట్ల డాలర్లకు పైగా నష్టాలను చవి చూసింది. పైగా, కొత్త వాహనాలకు డిమాండ్ బాగా పడిపోయిందని ఆ కంపెనీ తెలిపింది.

భారతదేశంలో అయిదు రకాల కార్లను విక్రయిస్తున్న ఫోర్డ్ కంపెనీ తమ వినియోగదారులకు వాహన నిర్వహణ సేవలను, విడి భాగాల పంపిణీని కొనసాగిస్తామని ప్రకటించింది.

"అంతర్జాతీయ స్థాయి వాహనాలను, ఎలక్ట్రిక్ ఎస్.యూ.వీల తయారీపై దృష్టి సారిస్తాం'అని ఈ ప్రకటనలో వెల్లడించిన ఫోర్డ్ సంస్థ వాటిని భారత్‌లో తయారు చేస్తారా అన్నది చెప్పలేదు. గత 25 ఏళ్లుగా భారతదేశంలో కార్లు ఉత్పత్తి చేస్తున్న ఈ కంపెనీ ఇక్కడి పోటీని తట్టుకోవడంలో సమస్యలు ఎదుర్కొంది. భారతదేశ ప్యాసెంజర్ వాహనాల మార్కెట్లో ఈ సంస్థ 2 శాతం వాటాను కూడా అందుకోలేకపోయింది. దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థల్లో ఫోర్డ్ స్థానం తొమ్మిదికి పడిపోయింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్లోనూ ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేయండి.)