రాహుల్‌ గాంధీని మళ్లీ కాంగ్రెస్ అధ్యక్షుడిని చేయాలంటూ పెరుగుతున్న డిమాండ్, ఇంతకీ సమస్య ఎక్కడుంది?

రాహుల్ గాంధీ

ఫొటో సోర్స్, AFP

    • రచయిత, సరోజ్‌సింగ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

కేంద్ర ప్రభుత్వ విధానాలను విమర్శించడంతో మొదలుపెట్టి, పార్లమెంటులో విపక్షాలను ఏకం చేయడం వరకు దాదాపు అన్నిచోట్లా కాంగ్రెస్ నాయకుడిగా రాహుల్ గాంధీ ముందుకు కదులుతున్నారు.

అయితే, పార్టీ అధ్యక్ష పదవిని మాత్రం ఆయన తీసుకోవడం లేదు.

తాజాగా ఆయన్ను అధ్యక్షుణ్ని చేసే ప్రయత్నాలు మళ్లీ కాంగ్రెస్‌లో మొదలయ్యాయి.

ఈ సారి ఇండియన్ యూత్ కాంగ్రెస్ (ఐవైసీ) ఈ ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చింది. ఐవైసీ రెండు రోజుల జాతీయ ఎగ్జిక్యూటివ్‌ల సమావేశాలు ఇటీవల గోవాలో జరిగాయి.

కాంగ్రెస్ పార్టీ పగ్గాలను రాహుల్ మళ్లీ చేపట్టాలని ఈ సమావేశాల్లో ఐవైసీ ఒక తీర్మానాన్ని ఆమోదించింది.

రాహుల్ గాంధీ

ఫొటో సోర్స్, IYC/ Twitter

ఈ తీర్మానాన్ని ఆమోదించడానికి గల కారణాలపై యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు బీవీ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ‘‘రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకుంటే, కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడేందుకు, కాంగ్రెస్ కార్యకర్తలకు నూతనోత్తేజం వస్తుంది’’అని అన్నారు.

అయితే, కాంగ్రెస్ అధ్యక్ష పదవిని చేపట్టేందుకు రాహుల్ గాంధీ సిద్ధంగా ఉన్నారా? ఇదే అసలైన ప్రశ్న.

రాహుల్, సోనియా

ఫొటో సోర్స్, PRAKASH SINGH/AFP VIA GETTY IMAGES

రాజకీయ ప్రస్థానం..

34 ఏళ్ల వయసులో 2004లో రాహుల్ క్రియాశీల రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. అదే ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఆయన అమేఠీ నుంచి గెలిచారు.

2007లో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీకి జనరల్ సెక్రటరీగా రాహుల్ నియమితులయ్యారు.

2013లో పార్టీ ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నారు. నాలుగేళ్ల తర్వాత, అంటే 2017లో రాహుల్ భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్ష పదవిని చేపట్టారు.

2018లో మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయంపై రాహుల్‌పై పార్టీ వర్గాలతోపాటు విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు కురిశాయి.

అయితే, 2019 లోక్‌సభ ఎన్నికల్లో పరాజయం అనంతరం, పార్టీ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేశారు. ఆ తర్వాత అధికారికంగా పదవిని చేపట్టకపోయినప్పటికీ, అధ్యక్షుడు నిర్వహించాల్సిన విధులన్నీ ఆయన నిర్వర్తిస్తూ వస్తున్నారు.

నేరాల్లో దోషులుగా నిర్ధరణ అయిన ఎంపీలకు ఉపశమనం కల్పిస్తూ 2013లో అప్పటి యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌తో మొదలుపెట్టి, కీలకమైన సమయాల్లో విదేశీ పర్యటనలకు వెళ్లడం వరకు చాలాసార్లు రాహుల్ వార్తల్లో నిలుస్తున్నారు.

పంజాబ్ కాంగ్రెస్‌లో కెప్టెన్ అమరీందర్ సింగ్, నవజ్యోత్ సింగ్ సిద్ధుల మధ్య విభేదాలు, ఛత్తీస్‌గఢ్‌లో వర్గ పోరు ఇలా అన్ని అంశాలు చివరగా రాహుల్ దగ్గరకే వస్తున్నాయి. అయితే, అధ్యక్ష పదవిని చేపట్టేందుకు మాత్రం ఆయన ఎందుకు ముందుకు రావడం లేదు?

యూత్ కాంగ్రెస్

ఫొటో సోర్స్, IYC

సంకేతాలు వస్తున్నాయా?

ఈ అంశంపై సీనియర్ జర్నలిస్టు జతిన్ గాంధీ బీబీసీతో మాట్లాడారు. ‘‘ఆయన వెనకడుగు వేస్తున్నట్లు కనిపించడం లేదు. నిజానికి ఆయన మళ్లీ అధ్యక్షుడు కావాలనే అనుకుంటున్నారు. కానీ, పరిస్థితులే ఆయనకు సహకరించడం లేదు’’అని జతిన్ అన్నారు.

రాహుల్ రాజకీయ ప్రస్థానంపై ‘‘రాహుల్’’ పేరుతో జతిన్ గాంధీ, వీను సంధు ఓ పుస్తకం కూడా రాశారు.

‘‘2019 లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ పరాజయానికి బాధ్యత వహిస్తూ రాజీనామా చేసే సమయంలో రాహుల్ నాలుగు పేజీల లేఖను విడుదల చేశారు. తన సొంత బాధ్యతపై ఆయన దీనిలో రెండు పేజీలు రాశారు. ఓటమికి బాధ్యతగా రాజీనామా చేయడం అనేది కాంగ్రెస్‌లో బేసిక్ సెంటిమెంట్‌. అయితే, ఆనాడు ఓటమికి మరికొందరు సీనియర్ నాయకులు కూడా బాధ్యతలు తీసుకోవాల్సింది’’అని వీను అన్నారు.

అయితే, రాహుల్ తర్వాత, కాంగ్రెస్‌లో ఓటమికి మరెవరూ బాధ్యత తీసుకొని తమ పదవులకు రాజీనామా చేయలేదు.

‘‘ఇప్పుడు దాదాపు రెండేళ్లు గడిచాయి. మళ్లీ పాత సంప్రదాయాల ప్రకారం, తమ నాయకుడిగా రాహుల్‌ను నియమించేందుకు పార్టీలో కసరత్తులు ప్రారంభమయ్యాయి’’అని వీను అన్నారు. వీను వాదనతో జతిన్ కూడా ఏకీభవించారు.

‘‘2020 ఫిబ్రవరిలోనే రాహుల్‌ను మళ్లీ అధ్యక్షుణ్ని చేసే ప్రయత్నాలు మొదలయ్యాయి. కేరళ నుంచి రాజస్థాన్ వరకు తలపెట్టిన జన్ ఆక్రోశ్ ర్యాలీలో భాగంగా రాహుల్‌ను అధ్యక్షుణ్ని చేయాలని పార్టీ భావించింది. అయితే, కరోనావైరస్ విజృంభించింది. దీంతో అన్నీ స్తంభించిపోయాయి. లేకపోయుంటే 2020లోనే రాహుల్ పార్టీ అధ్యక్షుడు అయ్యుండేవారు. అయితే, ఆ తర్వాత పార్టీలోని కొందరు తిరుగుబాటు నేతలు విడుదలచేసిన ఓ లేఖతో మళ్లీ పరిస్థితులు ప్రతికూలంగా మారాయి’’అని జతిన్ అన్నారు.

‘‘మొత్తంగా చెప్పాలంటే, తాజా యూత్ కాంగ్రెస్ ప్రతిపాదనను మళ్లీ రాహుల్‌కు పార్టీ పగ్గాలను అప్పగించే దిశగా జరిగిన ప్రయత్నంగానే చూడాలి.’’

రాహుల్ గాంధీ

ఫొటో సోర్స్, Twitter/Rahul Gandhi

రాహుల్ సిద్ధంగానే ఉన్నారా?

2019 లోక్‌సభ ఎన్నికల తర్వాత, వరుసగా అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పరాజయం పాలవుతూ వస్తుందనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి.

కాంగ్రెస్ 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఎక్కువ స్థానాల్లో విజయం సాధించలేదు. అయితే, పార్టీ ఓటింగ్ శాతం మాత్రం 2014 ఎన్నికల్లానే దాదాపు 20 శాతం ఉంది.

అయితే, గత ఏడాదిలో బిహార్, అసోం, పశ్చిమ్ బెంగాల్ ఎన్నికల్లో పార్టీ ప్రభావం పూర్తిగా తగ్గింది. ప్రాంతీయ పార్టీలతో ఏర్పాటుచేస్తున్న కూటములు అంతర్గత కలహాలకు కారణం అవుతున్నాయి.

ఇలాంటి పరిస్థితుల్లో, మరోసారి కాంగ్రెస్ పగ్గాలు చేపట్టేందుకు రాహుల్ సిద్ధంగా ఉన్నారా?

ఈ అంశంపై సీనియర్ జర్నలిస్టు పల్లవి ఘోష్ బీబీసీతో మాట్లాడారు. సీఎన్ఎన్ న్యూస్ 18లో సీనియర్ ఎడిటర్‌గా పనిచేస్తున్న పల్లవి దాదాపు రెండు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీపై వార్తలు రాస్తున్నారు. ‘‘పార్టీ అధికార పదవిని చేపట్టేందుకు రాహుల్ సిద్ధంగా లేనట్లే కనిపిస్తోంది. అయినా పార్టీ కోసం పనిచేయాలంటే అధ్యక్ష పదవి తప్పనిసరని రాహుల్ అనుకోరు. ఆయన ముందుకు రాకపోవడం వల్లే పార్టీ అధ్యక్ష ఎన్నికలు ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడ్డాయి. మరోవైపు అధ్యక్ష పదవిలో కూర్చునేటప్పుడు, తన కొత్త వర్గం పక్కనే ఉండాలని రాహుల్ భావిస్తున్నారు. ఆ కొత్త వర్గం విషయంలో సోనియా గాంధీ సిద్ధంగా లేరు.’’

రాహుల్ గాంధీ

ఫొటో సోర్స్, Getty Images

‘‘యువనేతలతో రాహుల్ పార్టీని నడిపించాలని అనుకుంటున్నారని కాంగ్రెస్‌లో అందరికీ తెలుసు. సుష్మితా దేవ్, జతిన్ ప్రసాద్, జ్యోతిరాదిత్య సింధియా లాంటి నాయకులు తన జట్టులో ఉండాలని రాహుల్ భావిస్తున్నారు. అయితే, వీరంతా ఒక్కక్కరుగా పార్టీని వీడిపోతున్నారు. ఇప్పుడు ఎన్ఎస్‌యూఐ అధ్యక్షుడు నీరజ్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బీవీ శ్రీనివాస్, కేసీ వేణుగోపాల్ లాంటి వారి పేర్లు మాత్రమే ప్రధానంగా వినిపిస్తున్నాయి.’’

‘‘మరోవైపు అధ్యక్ష పదవి చేపట్టేందుకు ఇది సరైన సమయంకాదని రాజకీయ నిపుణులు కూడా రాహుల్‌కు సూచిస్తున్నారు. ఉత్తర్ ప్రదేశ్, గుజరాత్, పంజాబ్, ఉత్తరాఖండ్‌లకు త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి. పంజాబ్‌లో మాత్రం పార్టీ గెలిచే అవకాశముంది. అయితే, అక్కడ పార్టీలో అంతర్గత విభేదాలు కనిపిస్తున్నాయి. పరిస్థితులు కాస్త మెరుగుపడే వరకు రాహుల్ వేచిచూస్తే మేలని నిపుణులు సూచిస్తున్నారు.’’

ఈ ఊహాగానాలు, వార్తల నడుమ రానున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ పార్టీ అధ్యక్ష పదవిని రాహుల్ చేపట్టబోరనే సంకేతాలు వస్తున్నాయి.

రాహుల్ గాంధీ

ఫొటో సోర్స్, Getty Images

ఎప్పుడు అవుతారు?

ఇంతకీ రాహుల్ సిద్ధంగా ఉన్నారా? ఈ అంశంపై జతిన్ గాంధీ మాట్లాడుతూ.. ‘‘కాంగ్రెస్‌లో అనుకూల వాతావరణం కోసం ఆయన ఎదురుచూస్తున్నారు’’అని అన్నారు.

‘‘రాహుల్ అనధికార నేతృత్వంలో కాంగ్రెస్.. 2008నాటి వామపక్షాల్లా ప్రవర్తిస్తోంది. ఆనాడు ప్రజల నాడి పట్టుకోవడంలో వామపక్షాలు విఫలమైనట్టే ఇప్పుడు కూడా జరుగుతోంది. నేడు రాహుల్ అధ్యక్ష పదవిని చేపట్టాల్సిన పరిస్థితులు అనివార్యమయ్యాయి. అయితే, పార్టీలో సీనియర్లు జోక్యం చేసుకోకూడదని రాహుల్ భావిస్తున్నారు. మరోవైపు ఒకటి రెండు అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ మెరుగైన పనితీరు చూపిస్తే, అధ్యక్ష పదవిని చేపడదామని ఎదురుచూస్తున్నారు. బీజేపీ కాస్త వెనుకబడినా బావుండు అని ఆయన చూస్తున్నారు.’’

‘‘తనను అధ్యక్షుణ్ని చేయాలనే యూత్ కాంగ్రెస్ ప్రతిపాదనకు రాహుల్ సిద్ధంగానే ఉన్నారు. అయితే, అనువైన పరిస్థితుల కోసం ఎదురుచూస్తున్నారు. అందుకే ఆయన మళ్లీ పగ్గాలు చేపట్టేందుకు ఆలస్యం అవుతోంది.’’

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)