మధ్యప్రదేశ్: వర్షాల కోసం ఆరుగురు బాలికలను నగ్నంగా ఊరేగించిన గ్రామస్థులు - ప్రెస్‌రివ్యూ

బాలిక

ఫొటో సోర్స్, Getty Images

వర్షాలు కురవాలని పూజలు చేసి మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో ఆరుగురు బాలికలను నగ్నంగా ఊరేగించారని 'సాక్షి' పత్రిక పేర్కొంది.

''దమోహ్‌ జిల్లాలో జబేరా పోలీసు స్టేషన్‌ పరిధిలోని బనియా గ్రామంలో ఆదివారం ఈ దారుణం చోటుచేసుకుంది.

ఈ గ్రామంలో చాలా ఏళ్లుగా వర్షాలు పడక కరువు ఏర్పడింది. బాలికలతో నగ్నంగా ఊరేగింపు తీస్తే వరుణుడు కరుణించి, వర్షాలు కురిపిస్తాడన్న అంధ విశ్వాసంతో గ్రామ పెద్దలు ఇలా చేశారు.

ఈ ఘటనకు సంబంధించిన రెండు వీడియోలు బయటకొచ్చాయి. జిల్లా కేంద్రానికి కేవలం 50 కిలోమీటర్ల దూరంలో జరిగిన ఈ దారుణంపై తమకు సమాచారం అందిందని పోలీసులు చెప్పారు.

దీనిపై దర్యాప్తు ప్రారంభించామని, బాధ్యులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

నగ్నంగా ఊరేగించడానికి బాధిత బాలికల తల్లిదండ్రులు సైతం అంగీకరించినట్లు తమ దర్యాప్తులో తేలిందన్నారు.''

ఈ ఉదంతంపై జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై నివేదిక ఇవ్వాలని దమోహ్‌ జిల్లా అధికార యంత్రాంగాన్ని ఆదేశించినట్లు 'సాక్షి' వెల్లడించింది.

సుప్రీంకోర్టు

ఫొటో సోర్స్, Getty Images

నీట్ పరీక్ష వాయిదాకు సుప్రీం నో

ఈనెల 12న జరగాల్సిన నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (నీట్‌-2021) వాయిదాకు సుప్రీంకోర్టు నిరాకరించినట్లు 'వెలుగు' వార్తాపత్రిక వెల్లడించింది.

''మెడికల్ అండర్ గ్రాడ్యుయేట్‌ కోర్సుల కోసం నిర్వహించే ఈ పరీక్షలను వాయిదా వేయాలంటూ వేసిన పిటీషన్‌ను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. ఇతర ఎంట్రెన్స్‌ పరీక్షలు ఒకవైపు జరుగుతుండగా, అదే సమయంలో నీట్‌ పరీక్షలు నిర్వహించడాన్ని సవాలు చేస్తూ పిటిషన్‌ దాఖలైంది.

సీబీఎస్‌ఈ ఇంప్రూవ్‌మెంట్‌, కంపార్టుమెంటల్ పరీక్షలు కూడా జరుగుతున్నాయి.

ఈనెల 6న ఇంటర్మీడియట్ బయాలజీ, 9న ఫిజిక్స్‌ పరీక్షలు ఉన్నాయని.. ఆ వెంటనే 12న నీట్‌ పరీక్షలు నిర్వహించకుండా వాయిదా వేయాలని పిటీషనర్‌ సుప్రీంకోర్టును అభ్యర్థించారు.

వాదనలు విన్న జస్టిస్‌ ఖన్‌విల్కర్‌ నేతృత్వంలోని బెంచ్‌ పిటీషనర్ వినతిని తోసిపుచ్చింది.''

ఒకవేళ పలు పరీక్షలు ఉండే పక్షంలో... ఏ పరీక్షకు హాజరు కావాలో నిర్ణయించుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసినట్లు 'వెలుగు' తెలిపింది.

ట్రాఫిక్ చలానా

ఫొటో సోర్స్, Getty Images

జనగామ కలెక్టర్ వాహనంపై 23 చలాన్లు, 23 వేల జరిమానా

అతి వేగంగా ప్రయాణించిననందుకు జనగామ జిల్లా కలెక్టర్ వాహనం (టీఎస్27ఎ0001)పై గతేడాది ఫిబ్రవరి నుంచి ఈ ఏడాది ఆగస్టు 30 వరకు 23 చలాన్లు నమోదైనట్లు 'ఈనాడు' వెల్లడించింది.

'ఇందుకుగాను రూ. 22,905 చెల్లించాల్సి ఉన్నట్లుగా 'తెలంగాణ స్టేట్ పోలీస్ ఇంటిగ్రేటెడ్ ఇ- చలాన్ సిస్టం' వెబ్ సైట్‌లో పలువురు తనిఖీ చేయగా తేలింది.'

ఈ విషయం సోమవారం సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం కావడంతో జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారినట్లు 'ఈనాడు' తెలిపింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)