భార్యాభర్తలకు ఇష్టం లేకున్నా కాపురం చేయాలని కోర్టులు బలవంతం చేయవచ్చా

కాపురాలు చేయమని బలవంతం చేసే నిబంధనలు ఎంత వరకు సబబు అన్న ప్రశ్న వినిపిస్తోంది

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కాపురాలు చేయాలంటూ బలవంతం చేసే నిబంధనలు ఎంత వరకు సబబు అన్న ప్రశ్న వినిపిస్తోంది.
    • రచయిత, దివ్య ఆర్య
    • హోదా, బీబీసీ కరస్పాండెంట్

భార్యాభర్తల మధ్య శారీరక సంబంధం లేకపోవడం, వారు కలిసి జీవించలేకపోవడం వంటి సమస్యలను ఆ దంపతులే పరిష్కరించుకోవాలా లేక ఆ విషయాన్ని కోర్టులు నిర్ణయిస్తాయా?

ఈ విషయంలో న్యాయస్థానాల జోక్యం వారి వ్యక్తిగత విషయాలలో చొరబాటు కాదా? ఈ సమస్యపై ఉన్న చట్టపరమైన నిబంధనలు మహిళలపై గృహహింసకు కారణం కావా?

ఈ ప్రశ్నలను గుజరాత్ నేషనల్ లా యూనివర్శిటీకి చెందిన ఇద్దరు విద్యార్థులు ఓ పిటిషన్ ద్వారా సుప్రీంకోర్టును అడిగారు. దీనిపై కోర్టు కేంద్ర ప్రభుత్వానికి నోటీసు జారీ చేసి అభిప్రాయం చెప్పాల్సిందిగా కోరింది.

హిందూ వివాహ చట్టం-1955లోని సెక్షన్ 9, స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ 1954లోని సెక్షన్ 22 ప్రకారం, ఒక పురుషుడు లేదా స్త్రీ తన భార్య లేదా భర్త తన నుంచి దూరంగా ఉన్నప్పుడు అతను లేదా ఆమెను కాపురానికి రావాల్సిందిగా ఆదేశాలు ఇవ్వాలంటూ కోర్టుకు వెళ్లవచ్చు.

''వైవాహిక బంధాన్ని పునరుద్ధరించడానికి చట్టంలో ఉన్న నిబంధనలు రాజ్యాంగ విరుద్ధం. కాబట్టి వాటిని తొలగించాలి'' అని ఇప్పుడు ఈ ఇద్దరు విద్యార్థులు తమ పిటిషన్‌లో కోరారు.

కాపురానికి వెళ్లాలని బలవంతం చేయడం వ్యక్తిగత స్వేచ్ఛకు భంగమని స్త్రీవాద ఉద్యమకారులు అంటున్నారు

ఫొటో సోర్స్, HINDUSTAN TIMES

ఫొటో క్యాప్షన్, కాపురానికి వెళ్లాలని బలవంతం చేయడం వ్యక్తిగత స్వేచ్ఛకు భంగమని స్త్రీవాద ఉద్యమకారులు అంటున్నారు

ప్రస్తుత చట్టం ఏం చెబుతోంది?

'హిందూ వివాహ చట్టం-1955', 'స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ 1954' ప్రకారం భార్యాభర్తలలో ఎవరైనా తనతో కాపురం చేయాలంటూ మరొకరిపై జిల్లా కోర్టులో ఫిర్యాదు చేయవచ్చు.

తనతో శారీరక సంబంధం కొనసాగించేలా, కలిసి జీవించేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును అర్థించి ఆ ఆదేశాలు పొందవచ్చు.

అయితే తాము విడిపోవడానికి చట్టపరంగా సరైన కారణం లేదని ఫిర్యాదు చేసిన వ్యక్తి నిరూపించాల్సి ఉంటుంది. అలాంటి పరిస్థితిలో వైవాహిక బంధాన్ని కొనసాగించాలంటూ కోర్టు ఆదేశాలు జారీ చేయవచ్చు. ధిక్కరిస్తే శిక్ష కూడా విధించవచ్చు.

వీడియో క్యాప్షన్, ఒకే జంట.. ఒకే రోజు... మూడు సార్లు పెళ్లి చేసుకున్నారు.. ఎందుకంటే

ఆదేశాలు జారీ అయిన ఏడాదిలోపు కోర్టు ఆదేశాలను పాటించకపోతే, ఆ వ్యక్తి ఆస్తిని ఫిర్యాదుదారుడికి బదిలీ చేయవచ్చు. అలాగే జైలులో కూడా పెట్టవచ్చు. ఈ కారణాలను చూపుతూ ఫిర్యాదుదారుడి విడాకుల విజ్ఞప్తిని కూడా ఆమోదించవచ్చు.

ప్రస్తుతం భారతీయ చట్టాలలో ఉన్న ఈ నిబంధనలు బ్రిటీష్ పాలకులు రూపొందించినవి. భార్యను తన ఆస్తిగా భర్త భావించిన రోజులలో తయారు చేసిన చట్టాలివి.

వైవాహిక బంధాన్ని పునరుద్ధరించాలన్న నిబంధనను 'మ్యాట్రిమోనియల్ ప్రొసీడింగ్స్ యాక్ట్ -1970' ద్వారా బ్రిటన్ తమ చట్టాల నుంచి తొలగించింది. కానీ, బ్రిటీష్ వారు ప్రవేశపెట్టిన ఆ చట్టం భారతదేశంలో ఇప్పటికీ అమలులో ఉంది.

బ్రిటీష్ కాలం నాటి వైవాహిక బంధం పునరుద్ధరణ చట్టాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, బ్రిటీష్ కాలం నాటి వైవాహిక బంధం పునరుద్ధరణ చట్టాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి.

ఈ నిబంధనలను ఎలా వాడుకుంటున్నారు?

వివాహ బంధం తెగిపోకూడదన్న ఉద్దేశంతో రూపొందించిన ఈ చట్టం విషయంలో ఉన్న అతి పెద్ద సమస్య అది వ్యక్తుల ప్రైవేట్ జీవితంతో ముడిపడి ఉండటం.

ఒక వివాహంలో భార్యాభర్తల మధ్య సంబంధాలు చెడిపోతే, వారు కలిసి జీవించే పరిస్థితి లేకపోతే, వారిద్దరి మధ్య శారీరక సంబంధం తెగిపోతే, కోర్టు తన ఉత్తర్వులతో బలవంతంగా వారిని కలపడం ఎంత వరకు సబబు అన్నది ఇక్కడ ప్రధాన ప్రశ్న.

వీడియో క్యాప్షన్, చైనాలో పెళ్లిళ్ల సంత

వాస్తవంలో దీనిని వైవాహిక బంధం పునరుద్ధరణ కన్నా, ఇతర ప్రయోజనాల కోసం ఉపయోగించిన సందర్భాలు ఎక్కువగా ఉన్నాయి.

ఉదాహరణకు, భార్య భర్త నుంచి భరణం కోరినప్పుడు, దాన్ని చెల్లించకుండా తప్పించుకునేందుకు భర్త ఈ నిబంధనలను ఆశ్రయించే అవకాశం ఉంటుంది.

భారతీయ విడాకుల చట్టం ప్రకారం విడిపోయిన భర్త నుంచి భార్య, పిల్లలు, తల్లిదండ్రుల నెలవారీ భరణం పొందే అవకాశం ఉంది. భార్య సంపాదనపరురాలైతే ఆమెకు కూడా ఈ నిబంధన వర్తిస్తుంది.

విడాకులు కోరడానికి భార్య లేదా భర్తకు సరైన కారణం లేనప్పుడు ఇద్దరి మధ్యా శారీరక సంబంధం లేదని, తామిద్దరు కలిసి ఉండటం లేదంటూ విడాకులు కోరుతున్నారు.

హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 9 దుర్వినియోగమవుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఫొటో సోర్స్, SAM PANTHAKY/GETTYIMAGES

ఫొటో క్యాప్షన్, హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 9 దుర్వినియోగమవుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

చట్టంలో భార్యాభర్తలకు సమాన హోదా

ఈ చట్టం భార్యాభర్తలకు సమాన హోదా ఇస్తుంది. అంటే, ఇద్దరిలో ఎవరైనా వైవాహిక సంబంధాన్ని పునరుద్ధరించమని కోరవచ్చు. కానీ, స్త్రీ, పురుషుల అసమానతల కారణంగా భార్య హక్కులను హరించే విధంగా భర్తలు ఈ చట్టాన్ని ఎక్కువగా ఉపయోగించుకుంటున్నట్లు అనేక ఉదాహరణలున్నాయి.

స్త్రీ హక్కుల ఉద్యమకారుల అభిప్రాయం ప్రకారం ''కుటుంబాలలో మహిళలపై హింస, వివాహంలో అత్యాచారాలను నిరోధించేలా చట్టంలో ఎలాంటి నిబంధనలు లేవు. దీనివల్ల వారిపై హింస, అత్యాచారాలు కొనసాగుతాయి''

ఈ నిబంధనల దుర్వియోగం గురించి 2015 సంవత్సరంలో ఏర్పాటు చేసిన 'హై లెవెల్ కమిటీ ఆన్ స్టేటస్ ఆఫ్ విమెన్ ఇన్ ఇండియా' విస్తృతంగా చర్చించింది.

''భర్త నుంచి భార్య భరణం కోరినప్పుడు భర్త దాని నుంచి తప్పించుకోవడానికి ఈ వైవాహిక సంబంధాల పునరుద్ధరణ దావా వేస్తారు. ఇది మానవహక్కులకు విరుద్ధం. ఎవరినైనా మరొకరితో కలిసి జీవించమని బలవంతం చేయడం తప్పు'' అని పేర్కొంది.

భార్యకు భరణం ఇవ్వకుండా తప్పించుకునేలా హిందూ వివాహ చట్టంలోని కొన్ని నిబంధనలు ఉన్నాయని కొందరు వాదిస్తున్నారు.

ఫొటో సోర్స్, Alamy

ఫొటో క్యాప్షన్, భార్యకు భరణం ఇవ్వకుండా తప్పించుకునేలా హిందూ వివాహ చట్టంలో కొన్ని నిబంధనలు ఉన్నాయని కొందరు వాదిస్తున్నారు.

ఈ నిబంధనలను తొలగించాలని డిమాండ్‌

వైవాహిక బంధం పునరుద్ధరణ నిబంధనలను తొలగించాలంటూ 2018లో 'ఫ్యామిలీ లా రీఫార్మ్స్ ఇన్ ఇండియా' ప్రచురించిన కన్సల్టేషన్ పేపర్‌లో లా కమిషన్ సిఫారసు చేసింది.

'హై లెవెల్ కమిటీ ఆన్ స్టేటస్ ఆఫ్ విమెన్ ఇన్ ఇండియా' నివేదికతో ఏకీభవించిన లా కమిషన్ "స్వతంత్ర భారత దేశంలో ఇటువంటి నిబంధనలు అవసరం లేదు. ఇద్దరి మధ్యా శారీరక సంబంధం లేకపోతే విడాకులు పొందడానికి చట్టంలో నిబంధన ఉంది. ఇప్పడు స్త్రీ, పురుషులు ఇద్దరూ ఆర్థికంగా సమర్దులుగా మారారు. ఈ పరిస్థితుల్లో ఒకరి స్వేచ్ఛను హరించే ఇటువంటి ఆంక్షలు, ఆదేశాలు అనుమతించకూడదు'' అని పేర్కొంది.

ఈ రెండు నివేదికలను సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో విద్యార్థులు ప్రస్తావించారు. ఈ నిబంధనలను తొలగించాలని కోరారు.

''చూడటానికి ఇది ఇద్దరి పట్ల సమానత్వం చూపుతున్నట్లుగా కనిపిస్తుంది. కానీ, ఇక్కడ మహిళ తనకు ఇష్టం లేకపోయినా అత్తవారింటికి వెళ్లాలి. అక్కడ ఆమెను భర్త తన ఆస్తిగా పరిగణిస్తారు. భార్యభర్తల వ్యక్తిగత ఇష్టాయిష్టాలకు భంగం కలుగుతుంది. వివాహ వ్యవస్థ వ్యక్తిగత భద్రత కన్నా అధిక స్థాయిలోకి వెళుతుంది'' అని వారు తమ పిటిషన్‌లో పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)