నడి రోడ్డు మీద భర్తే భార్యను చంపుతుంటే ఒక్కరూ ఆపలేదు ఎందుకు

గృహహింస
    • రచయిత, దివ్య ఆర్య
    • హోదా, బీబీసీ ప్రతినిధి

అది పెళ్లి చేసుకున్న భర్త కావచ్చు, ప్రేమిస్తున్నానని వెంటపడే వ్యక్తి కావచ్చు. తనకు ఇష్టం లేదు అంటే ఆ మాటను సహించలేని తత్వం పెరిగిపోతోంది. తమను ఇష్టపడని వారిని చంపడానికి కూడా కొందరు వెనకాడటం లేదు.

దిల్లీలోని ఓ మార్కెట్లో పట్టపగలు అందరూ చూస్తుండగానే ఓ భర్త తన భార్యను కత్తితో పొడిచాడు. సంఘటన జరుగుతున్న సమయంలో అక్కడ షాపులన్నీ తెరిచే ఉన్నాయి.

ఈ గొడవ జరుగుతుండగా పక్క బిల్డింగ్‌లో ఉన్న కొందరు వ్యక్తులు బయటకు వచ్చి చూశారు. కానీ వెంటనే తలుపులు వేసుకున్నారు. తన వాహనం ముందే దాడి జరుగుతుండగా...ఓ వ్యక్తి తన బైక్‌ను హడావుడిగా స్టార్ట్‌ చేసుకుని వెళ్లిపోయాడు.

గృహహింస

వైరల్‌గా వాట్సాప్ వీడియో

దిల్లీలో ఓ మహిళపై జరిగిన ఈ హత్యాయత్నం తర్వాత నిందితుడు, "ఈమె నా భార్య. మా ఇద్దరి గొడవల్లో ఎవరూ తలదూర్చవద్దు" అంటూ అరుస్తూ కనిపిస్తాడు.

ఆ వ్యక్తి ఆ మహిళను విచక్షణ రహితంగా పొడుస్తుంటే చుట్టూ ఉన్నవారు ఎవరూ ఆపలేదు. ఘటనా ప్రాంతానికి వచ్చిన ఓ కారు పక్కకు తప్పుకుని వెళ్లిపోయింది. ఓ వ్యక్తి బైక్‌కు గబగబా కిక్‌ కొట్టి అక్కడి నుంచి వెళ్లిపోగా, మరో వ్యక్తి ఈ తతంగాన్ని చూసుకుంటూనే తన వాహనంపై వెళ్లిపోయాడు.

పైగా ఈ గొడవనంతా ఓ వ్యక్తి మొబైల్‌ కెమెరాలో రికార్డ్‌ చేశాడు. దాదాపు పది పన్నెండు మంది అక్కడే ఉన్నా, ఒక్కరు కూడా ఈ హత్యాయత్నాన్ని ఆపలేదు. ఎందుకంటే ఇది ఇది భార్యాభర్తల వ్యవహారం .

గృహహింస

ఫొటో సోర్స్, Science Photo Library

గృహహింస

నా భార్య, నా ఇష్టం అంటూ ఇంట్లో జరిగే హింస రోడ్డు మీద కూడా కనిపించింది. నాలుగో జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం భారతదేశంలో 33 శాతం మహిళలు భర్త చేతిలో హింసకు గురవుతున్నారు.

అంటే ప్రతి పది మందిలో ముగ్గురు బాధితులుగా తేలారు.

వీరిలో 80 శాతం మంది తమపై జరిగే హింసను ఎవరికీ చెప్పుకోలేదు. బహుశా తమకు న్యాయం జరుగుతుందని వారు భావించి ఉండరు.

కేవలం 14 శాతం మంది మాత్రమే ఇతరుల నుంచి సహాయం కోరారు. అది కూడా ఎక్కువగా ఆ మహిళ సొంత కుటుంబం నుంచి, భర్త కుటుంబం, స్నేహితుల నుంచి మాత్రమే సాయం కోరారు. కేవలం 3 శాతం మహిళలే పోలీస్‌ స్టేషన్‌ వరకు వెళ్లారు.

భారత దేశంలో గృహ హింసను నివారించడానికి రెండు చట్టాలు ఉన్నాయి. ఒకటి భారతీయ శిక్షా స్మృతి(ఐపీసీ) లోని సెక్షన్ 498(ఎ), రెండోది గృహ హింస చట్టం 2005. ఈ రెండు మాత్రమే మహిళలకు రక్షణగా ఉన్నాయి.

గృహ హింసను సమాజం పెద్ద సమస్యగా భావించడం లేదు. పురుషుల కంటే ఎక్కువగా మహిళలే గృహ హింసను సమర్ధిస్తారు. సర్వే చేసిన వారిలో దాదాపు 40 శాతం మంది పురుషులు, 50 శాతం మంది మహిళలు, భర్తకు భార్య అవిధేయంగా ఉండడం వల్లే హింస జరుగుతుందని చెప్పారు.

అవిధేయత అంటే వాళ్ల దృష్టిలో.. భర్తకు చెప్పకుండా ఇంటి నుంచి బయటకు వెళ్లడం, సరిగ్గా ఆహారం అందించకపోవడం, సెక్స్ చేయటానికి నిరాకరించడం, మరొక వ్యక్తితో సంబంధం పెట్టుకోవడం వంటివి.

ఇలాంటి సందర్భాలలో భర్త భార్యను హింసించడాన్ని, కొట్టడాన్ని చాలామంది సమర్ధిస్తారు.

జనాభాలో దాదాపు సగంమంది గృహహింస తప్పుకాదని భావించినప్పుడు, అది బయట జరిగినా, ఇంట్లో జరిగినా పెద్ద తేడా లేదని, దాన్ని ఆపాల్సిన అవసరం లేదని చాలామంది భావిస్తున్నారు.

గృహహింస

పెళ్లికి ఒప్పుకోలేదని హత్య

దిల్లీ హత్య ఘటనలో ఆ మహిళ తన భర్త నుంచి ఎదురవుతున్న హింసను అడ్డుకోవడానికి ప్రయత్నించినా ఆమెపై దాడి కొనసాగింది.

ఆమె చనిపోయేలా కత్తితో దాడి చేస్తున్నా ఎవరూ ఆ దాడిని అడ్డుకోవడానికి ప్రయత్నించ లేదు. ఈ వీడియోను చూసిన వారు ఈ ఘటనను అంత త్వరగా మర్చిపోవడం సాధ్యం కాదు.

ఐదేళ్ల క్రితం సరిగ్గా ఇలాగే ఓ ప్రేమికుడు 21 ఏళ్ల యువతిని చంపిన ఘటన సీసీ కెమెరాలో రికార్డయింది. దిల్లీలో పట్టపగలు జరిగిన ఈ హత్యను చాలామంది చూసినా, అడ్డుకునే ప్రయత్నం చేయలేదు.

గృహహింస

బాధితురాలి కుటుంబం చెప్పిన దాని ప్రకారం నిందితుడిని పెళ్లి చేసుకోవడానికి బాధితురాలు ఒప్పుకోలేదు. అయిన అతను వెంటాడుతూనే ఉన్నాడు. పోలీసులకు ఫిర్యాదు చేసినా అతను దారికి రాలేదు.

నేషనల్‌ క్రైమ్ స్టాటిస్టిక్స్ బ్యూరో 2019 గణాంకాల ప్రకారం, భారతదేశంలో ప్రతి గంటలకు ఇలాంటి దాడి కేసు నమోదవుతోంది. ఇష్టం లేదని తిరస్కరించిన మహిళలపై దాడులు జరుగుతున్నాయి.

ఒక అమ్మాయి ప్రేమ కోసం వెంటపడటం సమాజంలో పెద్ద తప్పు కాదు. సినిమాలలో కూడా ఈ తరహా ప్రవర్తనను సమర్ధించడం కనిపిస్తుంది. అలా వెంటపడే వారిని అడ్డుకోవడం, నిరాకరించడం సదరు ప్రేమికులకు తప్పుగా కనిపిస్తుంది. అవసరమైతే వారు దాడి చేయడానికి, చంపడానికి కూడా వెనకాడరు.

ఇలాంటి హింసను సమర్థించే ఆలోచనా విధానం మారే వరకు ఈ తరహాల నేరాలు జరుగుతూనే ఉంటాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)