కరోనావైరస్: భారత్‌లో 10 కోట్ల డోసులు దాటిన వ్యాక్సినేషన్

ఫొటో సోర్స్, Getty Images
భారత్‌లో ఇప్పటివరకు 10 కోట్ల డోసుల కరోనా టీకా వేశారు.
మరోవైపు దేశంలో ఏప్రిల్ 1 నుంచి రోజుకు సగటున 90 వేల కేసులు నమోదవుతున్నాయి.
ఇప్పుడు భారత్‌లో 45 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ కరోనా వ్యాక్సీన్ వేయించుకోవచ్చు. ఆస్పత్రుల్లో, వ్యాక్సినేషన్ సెంటర్లలో వీటిని వేస్తున్నారు.
ఫ్రంట్‌లైన్ సిబ్బందికి, 60 ఏళ్లు పైబడిన వారిలో చాలా మందికి ఇప్పటికే కోవిడ్ టీకా ఇచ్చారు.
"ప్రపంచంలో అత్యంత వేగంగా 10 కోట్ల డోసుల టీకాలు ఇచ్చిన దేశంగా భారత్ నిలిచింది. 10 కోట్ల డోసులు ఇవ్వడానికి అమెరికాలో 89 రోజులు, చైనాలో 102 రోజులు పడితే, భారత్ 85 రోజుల్లో పూర్తి చేసింది" అని ఆరోగ్య మంత్రిత్వ శాఖ చెప్పింది.
అయితే, ప్రపంచంలో అతిపెద్ద వ్యాక్సీన్ కార్యక్రమానికి ఇబ్బందులు ఎదురవుతున్నట్లు కనిపిస్తోంది. టీకా నిల్వలు తగినంత ఉన్నాయని కేంద్రం చెబుతున్నా, దేశంలో సగం రాష్ట్రాలు వ్యాక్సీన్ కొరత ఉందని ఈ వారంలో చెప్పాయి.
వ్యాక్సీన్ కొరత ఉందనే ఆరోపణలు నిరాధారమని ప్రభుత్వం చెబుతోంది. తమ దగ్గర 4 కోట్లకు పైగా డోసులు నిల్వ ఉన్నాయని చెప్పింది.
దేశంలో జులై కల్లా 25 కోట్ల మందికి టీకాలు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ ఆ లక్ష్యాన్ని అందుకోవాలంటే వ్యాక్సినేషన్ వేగం పెంచాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు.

భారత్‌లో కోవిడ్-19 కేసులు వేగంగా పెరుగుతున్న దశలో ఏప్రిల్ 1 నుంచి వ్యాక్సీన్ మూడో దశ మొదలైంది.
ఏప్రిల్ 4న భారత్‌లో ఒకే రోజు లక్ష కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది అమెరికా తర్వాత అలా ఒకే రోజు లక్ష కొత్త కేసులు నమోదైన రెండో దేశం భారత్.
వాటిలో సగానికి పైగా మహారాష్ట్రలోనే నమోదయ్యాయి.
ఈ ఏడాది ప్రారంభంలో వ్యాక్సినేషన్ మొదలైనప్పుడు భారత్‌లో కేస్ లోడ్ వేగంగా పడిపోతూ వచ్చింది. అది రోజుకు 15 వేల కేసుల కంటే దిగువకు వచ్చింది. కానీ మార్చిలో మళ్లీ కేసులు పెరిగాయి.
పరీక్షలు ఎక్కువగా చేయకపోవడం, ట్రాకింగ్ సరిగా చేయకపోవడం, సేఫ్టీ ప్రొటోకాల్స్ పాటించకపోవడం వల్లే ఇది జరిగింది.
ప్రజల అజాగ్రత్త, ప్రభుత్వం నుంచి వచ్చిన మిశ్రమ సందేశాల వల్లే భారత్‌లో సెకండ్ వేవ్ తీవ్రమైందని నిపుణులు చెబుతున్నారు.
మహమ్మారి మొదలైనప్పటి నుంచి భారత్‌లో కోటీ 20 లక్షలకు పైగా కేసులు, లక్షా 67 వేల మరణాలు నమోదయ్యాయి. అత్యధిక కోవిడ్ కేసుల్లో అమెరికా, బ్రెజిల్ తర్వాత భారత్ మూడో స్థానంలో నిలిచింది.

వ్యాక్సినేషన్ ఎలా సాగుతోంది?
జనవరి 16న భారత్‌లో వ్యాక్సినేషన్ మొదలైంది. తొలి దశల్లో ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్ లైన్ సిబ్బందికి వ్యాక్సీన్లు ఇచ్చారు. భారత్‌లో తొలి వ్యాక్సీన్‌ను పారిశుద్ధ్య సిబ్బందికి ఇచ్చారు.
మార్చి 1 నుంచి 60ఏళ్లు పైబడిన వారికి, ఇతర అనారోగ్యాలతో బాధపడుతున్న 45ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సీన్లు ఇవ్వడం మొదలుపెట్టారు.

ఫొటో సోర్స్, Mansi Thapliyal
ఆస్ట్రాజెనెకా, ఆక్స్‌ఫర్డ్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన కోవిషీల్డ్, దేశీయ సంస్థ భారత్ బయోటెక్ తయారుచేసిన కోవాగ్జిన్ టీకాలకు భారత ఔషధ ప్రాధికార సంస్థ ఆమోదం తెలిపింది. మరికొన్ని టీకాలు కూడా ఇక్కడ క్లినికల్ ట్రయల్స్ దశలో ఉన్నాయి.
ప్రస్తుతం వేగంగా పెరుగుతున్న కరోనావైరస్ కేసులను కట్టడి చేసేందుకు వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని భారత్ భావిస్తోంది. ఇటీవల ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా వ్యాక్సీన్ ఎగుమతులపై కూడా నిలుపుదల ఆదేశాలు ఇచ్చారు. ఈ వ్యాక్సీన్‌ను భారత్‌లో సీరమ్ ఇనిస్టిట్యూట్ తయారు చేస్తోంది.
''కేసులు పెరుగుతున్నాయంటే, దేశంలో వ్యాక్సినేషన్‌ను కూడా వేగవంతం చేయాల్సి ఉంటుంది. దీనికి మరిన్ని టీకాలు అవసరం అవుతాయి''అని భారత విదేశాంగ శాఖలోని వర్గాలు బీబీసీకి తెలిపాయి.
అన్ని దేశాలకూ వ్యాక్సీన్లు అందజేయడమే లక్ష్యంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) చేపడుతున్న కోవాక్స్ కార్యక్రమానికి ఇప్పటివరకు భారత్ 60 మిలియన్ డోసులను అందించింది. వీటిలో ఎక్కువ శాతం ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా టీకాలే ఉన్నాయి.

ఎంత మందికి వ్యాక్సీన్లు ఇచ్చారు?
గురువారం వరకు మొత్తంగా 5.6 కోట్ల మంది తొలి డోసు తీసుకున్నారు. 90 లక్షల మంది రెండు డోసులనూ తీసుకున్నారు.
ప్రపంచంలో అతిపెద్ద టీకా కార్యక్రమాలను దశాబ్దాల తరబడి భారత్ నడిపిస్తోంది. నవజాత శిశువులు, గర్భిణులకు మిలియన్ల సంఖ్యలో వ్యాక్సీన్లు వేస్తోంది.
వ్యాక్సీన్ల పంపిణీలో అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని భారత్ మెరుగ్గా టీకాలు వేస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే, వ్యాక్సీన్ల పంపిణీ ఊహించిన స్థాయిలో జరగడం లేదు. వ్యాక్సీన్లపై అనుమానాలు, గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన లేమే దీనికి ప్రధాన కారణం.
వ్యాక్సీన్లకు ఎలా రిజిస్టర్ చేసుకోవాలో చాలా మంది పేదలకు తెలియడం లేదు. ఫోన్లు, ఇంటర్నెట్ ఉపయోగించడం తెలియని వారికి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ పెద్ద సవాల్‌గా మారుతోంది.
''పేద ప్రజలు, కార్మికులకు అర్థమయ్యేలా పెద్దగా ఎలాంటి ప్రచారాలు చేపట్టడం లేదు''అని ప్రజారోగ్య నిపుణురాలు రాధా ఖాన్ చెప్పారు.
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మార్చి 1న వ్యాక్సీన్ తీసుకున్నారు. దేశీయ వ్యాక్సీన్ కోవాగ్జిన్‌ను ఆయన తీసుకున్నారు.
తమ వంతు వచ్చినప్పుడు, అందరూ వ్యాక్సీన్లు వేసుకోవాలని ఆయన అభ్యర్థించారు.
జులై నాటికి ప్రాధాన్య వర్గాలుగా గుర్తించిన 25 కోట్ల మందికి 50 కోట్ల డోసులను పంపిణీ చేయాలని ప్రభుత్వం లక్ష్యం నిర్దేశించుకుంది.
వ్యాక్సీన్ల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెండు యాప్‌ల ద్వారా ఇప్పటివరకు 5.6 కోట్ల మంది నమోదు చేసుకున్నారు. కొన్ని రాష్ట్రాల్లో పురుషుల కంటే మహిళలే ఎక్కువ మంది వ్యాక్సీన్లు తీసుకున్నారు. దీనికి స్పష్టమైన కారణాలు తెలియడం లేదు.

ఫొటో సోర్స్, EPA
వ్యాక్సీన్ల ఖర్చు ఎవరు భరిస్తున్నారు?
వ్యాక్సీన్ తీసుకోవడం తప్పనిసరికాదు. ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రులు ఉచితంగానే ఈ వ్యాక్సీన్లు ఇస్తున్నాయి. ప్రైవేటు క్లీనిక్‌లలో రూ.250 చెల్లించి వ్యాక్సీన్ తీసుకోవచ్చు.
ఆసుపత్రులు, ప్రజారోగ్య కేంద్రాల్లో ఉచిత వ్యాక్సినేషన్ కోసం కేంద్రం 5 బిలియన్ డాలర్లను వెచ్చిస్తోంది.

ఫొటో సోర్స్, MaNSI THAPLIYAL
ఏమైనా దుష్ప్రభావాలు కనిపిస్తున్నాయా?
వ్యాక్సీన్లు వేసుకున్న తర్వాత కొందరిలో దుష్ప్రభావాలు కనిపిస్తున్నాయి.
ఇలాంటి దుష్ప్రభావాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు భారత్‌లో 34ఏళ్లనాటి పటిష్ఠమైన వ్యవస్థ అందుబాటులో ఉంది. దుష్ప్రభావాలను ఎప్పటికప్పుడు గుర్తించి, అవగాహన కల్పించకపోతే ప్రజల్లో భయాందోళనలు పెరిగే అవకాశముందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఫిబ్రవరి వరకు 8,483 మందిలో దుష్ప్రభావాలు కనిపించినట్లు భారత్ తెలిపింది. వీటిలో చాలా వరకు తీవ్రత తక్కువగా ఉండే ఆందోళన, తలనొప్పి, జ్వరం, ఒళ్లు నొప్పులు ఉన్నాయని వివరించింది.
తీవ్రమైన దుష్ప్రభావాలు 412 మందిలో కనిపించాయని, వీటిలో 79 మంది మరణించారని ఓ సీనియర్ అధికారి తెలిపారు.
హృద్రోగాలు, రక్తపోటు, మధుమేహం తదితర అనారోగ్యాలుండే వారి విషయంలోనే ఈ మరణాలు సంభవించాయని విచారణల్లో తేలింది.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: భారత్‌లోని 18 రాష్ట్రాల్లో ‘డబుల్ మ్యూటెంట్ వేరియంట్’.. తెలుగు రాష్ట్రాల్లో 104 మందిలో యూకే, 20 మందిలో దక్షిణాఫ్రికా వేరియంట్
- కుతుబ్ మినార్ స్థానంలో అంతకు ముందు హిందూ దేవాలయం ఉండేదా?
- వీగర్ ముస్లిం జాతిని చైనా సమూలంగా తుడిచిపెట్టేస్తోందా? బ్రిటన్ నివేదికలో ఏం బయటపడింది?
- తమిళనాడు ఎన్నికల వల్లే శ్రీలంక వ్యతిరేక తీర్మానంపై ఓటింగ్‌కు భారత్ గైర్హాజరయ్యిందా...
- న్యూజీలాండ్ ప్రభుత్వం 'తల్లుల' కోసం చేసిన చట్టంపై చర్చ ఎందుకు... భారత్‌లో పరిస్థితి ఏంటి?
- భారత్-పాక్ సరిహద్దు: కచ్ నిర్బంధ కేంద్రంలో అయిదుగురు పాకిస్తానీలు ఎలా చనిపోయారు?
- మహిళల మోకాళ్లు, చిరిగిన జీన్స్‌పై ఎందుకింత చర్చ జరుగుతోంది
- 15 వందల మంది భారత సైనికుల భీకర పోరాటం రెండో ప్రపంచ యుద్ధ గతిని ఎలా మార్చిందంటే..
- 'ఒకవేళ నేను చనిపోతే మన బిడ్డను జాగ్రత్తగా చూసుకోండి'
- వరల్డ్ హ్యాపీనెస్ డే: అత్యంత సంతోషకర దేశంగా ఫిన్లాండ్, 139వ స్థానంలో భారత్
- మహాశివరాత్రి: పురుష లింగాకారానికి పూజలు చేసే అరుదైన ఆలయం.. గుడిమల్లం
- సిద్దిక్ కప్పన్: రేప్ కేసు రిపోర్ట్ చేయడానికి ప్రయత్నించినందుకు జైల్లో పెట్టి 'హింసిస్తున్నారు'
- ముస్లిం, క్రైస్తవ మతాలకు చెందిన మృతుల ఖననానికి మారుమూల దీవిని ఎంపిక చేసిన శ్రీలంక
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








