ఈక్వెడార్: గలాపగోస్ దీవుల నుంచి 185 పిల్ల తాబేళ్ళ అక్రమ రవాణా

మూడు నెలల వయసుకూడా లేని పిల్ల తాబేళ్ల అక్రమ రవాణా

ఫొటో సోర్స్, Aeropuerto Ecológico de Galápagos

ఫొటో క్యాప్షన్, మూడు నెలల వయసుకూడా లేని పిల్ల తాబేళ్ల అక్రమ రవాణా

ఈక్వెడార్ లోని గలాపగోస్ దీవుల నుంచి సూట్ కేసులో ప్యాక్ చేసి అక్రమంగా బయటకు తరలిస్తున్న 185 పిల్ల తాబేళ్లను కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు.

ఈ తాబేళ్లను ప్లాస్టిక్‌తో చుట్టి తరలిస్తుండగా బాల్ట్రా దీవుల ఎయిర్ పోర్టులో తమ విధి నిర్వహణలో భాగంగా చేస్తున్న తనిఖీలలో అధికారులు వీటిని కనిపెట్టారు.

అందులో 10 తాబేళ్లు చనిపోయినట్లు అధికారులు చెప్పారు.

జంతువులను సేకరించేవారికి, విదేశీ పెంపుడు జంతువులను ఇష్టపడేవారి కోసం గలాపగోస్ తాబేళ్లను అక్రమంగా రవాణా చేస్తుంటారు. అది ఈ జాతి తాబేళ్లకు పెద్ద ముప్పుగా మారింది.

గలాపగోస్ దీవులు

ఫొటో సోర్స్, Aeropuerto Ecológico de Galápagos

ఫొటో క్యాప్షన్, ఎక్స్ రే మెషీన్ ఆపరేటర్‌కు అనుమానం వచ్చి సూట్‌కేస్ తెరిపించి చూశారు

బాల్ట్రా ఎయిర్ పోర్టులో పట్టుకున్న తాబేళ్లు మూడు నెలల వయసులోపే ఉంటాయని అంచనా వేస్తున్నారు.

అప్పుడే పుట్టిన పిల్ల ప్రాణులు 5000 డాలర్లకు పైగా ఖరీదు చేస్తాయని వన్య ప్రాణుల అక్రమ రవాణాను అరికట్టే అధికారులు చెప్పారు.

ఈ పిల్ల తాబేళ్లను కదలకుండా చేయడానికే వాటిని ప్లాస్టిక్ తో చుట్టారని కానీ, ఎక్స్‌రే మెషీన్ నిర్వాహకులకు వాటిని చూసి అనుమానం వచ్చిందని చెప్పారు.

ఎయిర్ పోర్టు దగ్గరకు ఈ సూట్ కేసును ఒక రవాణ సంస్థ పంపించి అందులో కొన్ని జ్ఞాపికలు ఉన్నట్లు పేర్కొందని ఎయిర్ పోర్టు వర్గాలు తెలిపాయి.

గలాపగోస్ దీవులు

ఫొటో సోర్స్, Aeropuerto Ecológico de Galápagos

ఇప్పటి వరకు ఈ విషయంలో ఎవరినీ అరెస్టు చేయలేదు. కానీ, ఆ సూట్ కేసును అప్పగించిన రవాణా సంస్థ ఉద్యోగులను మాత్రం ప్రశ్నించేందుకు అదుపులోకి తీసుకున్నట్లు ప్రకటనలో తెలిపారు.

ఇది దేశ వన్య ప్రాణులకు, సహజ వారసత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఘోరమని ఈక్వెడార్ పర్యావరణ శాఖ మంత్రి మార్సెలో మాత అన్నారు.

ఈక్వెడార్ తీరానికి 1000 కిలోమీటర్ల దూరంలో పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న గలాపగోస్ దీవుల్లో ఉండే చాలా రకాల మొక్కలు, జంతువులు విభిన్నమైనవి అని చెబుతారు.

ఇక్కడ ఉండే భారీ తాబేళ్లు చాలా ప్రసిద్ధి చెందినవి. ఇవి 30- 40 లక్షల సంవత్సరాల క్రితం వోల్కానిక్ దీవుల నుంచి వచ్చి ఉంటాయని అంటారు.

గలాపగోస్ కి చెందిన జంతువులను అక్రమ రవాణా చేస్తే 1 - 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉండవచ్చు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)