వింత నిరసనలు చేసిన తమిళ రైతులు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? ఏం చేస్తున్నారు?

తమిళనాడు రైతులు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, బాలసుబ్రమణ్యమ్ డి
    • హోదా, బీబీసీ ప్రతినిధి

‘‘అన్ని దార్లూ రోమ్‌కే వెళ్తాయి’’ అని ఇంగ్లిష్‌లో ఓ సామెత ఉంది. పూర్వం రోమన్ సామ్రాజ్యంలో రాజధానికి వెళ్లేలా రహదారులను అలా నిర్మించారని చెబుతారు.

అయితే, ఇప్పుడు భారత రాజధాని దిల్లీకి వెళ్లే రహదారులన్నీ నిరసనలు, ఆందోళనలతో అట్టుకుడుతున్నాయి.

పంజాబ్, హరియాణాల నుంచి పెద్ద ఎత్తున రైతులు వచ్చి, ఈ రహదారులపైకి చేరుకున్నారు. వీరిని అడ్డుకునేందుకు దిల్లీ రహదారులను ప్రభుత్వం మూసివేసింది.

ఈ స్థాయిలో కాకపోయినా, ఇదివరకు తమిళనాడు రైతులు కూడా దిల్లీలో నిరసనలు చేశారు.

నేషనల్ సౌత్ ఇండియన్ రివర్ ఇంటర్‌లింకింగ్ అగ్రికల్చరిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు అయ్యాకన్ను నేతృత్వంలో దిల్లీలోని జంతర్‌మంతర్‌లో కొన్ని నెలలపాటు ఈ నిరసన ప్రదర్శనలు సాగాయి.

తమిళనాడు రైతులు

నిరసనకారుల సంఖ్య తక్కువ కావడంతో అప్పట్లో వాళ్లు జనం దృష్టిని ఆకర్షిచేందుకు చిత్ర విచిత్రమైన పద్ధతుల్లో నిరసనలు తెలిపారు. అర్ధనగ్న ప్రదర్శనలు చేశారు. ఎలుకలను తిన్నారు. మూత్రం తాగారు. ఇలా రకరకాలుగా తమ ఆందోళనను తెలియజేశారు.

అయితే, వారిని ప్రభుత్వం చర్చలకు పిలవలేదు. ఆ రైతు సంఘానికి బలం లేదని, అయ్యాకన్ను ధనిక రైతు అని విమర్శలు వచ్చాయి.

ప్రస్తుతం దిల్లీలో నిరసన తెలుపుతున్న రైతులు... కేంద్రం కొత్తగా తెచ్చిన మూడు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వీరి డిమాండ్లలో ప్రధానమైంది ‘పంటకు కనీస మద్దతు ధర’.

అయితే, మొదటగా కనీస మద్దతు ధర గురించి డిమాండ్ చేసిన తమిళ రైతులు మాత్రం ప్రస్తుతం దిల్లీలో జరుగుతున్న నిరసనల్లో కనిపించడం లేదు.

దీనికి కారణం ఏంటి? అయ్యాకన్ను ఎక్కడున్నారు? కొత్త చట్టాల గురించి ఆయన ఏమనుకుంటున్నారు? తమిళనాడులోని మిగతా రైతు సంఘాల అభిప్రాయాలేంటి?

తమిళనాడు రైతులు

ఫొటో సోర్స్, Reuters

భారత రైతుల సంఘానికి తమిళనాడులో శాఖ ఉంది. ఇది రాష్ట్రమంతటా విస్తరించింది. పెద్ద ఎత్తున దీనికి సభ్యులు ఉన్నారు.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా చేపడుతున్న నిరసనల్లో ఆల్ ఇండియా కిసాన్ సంఘర్షణ్ కోఆర్టినేషన్ కమిటీ కీలక పాత్ర పోషిస్తోంది. ఈ కమిటీ హెడ్ హన్నన్ మోలా దిల్లీ నిరసనల్లో ప్రధాన వ్యక్తుల్లో ఒకరిగా కనిపిస్తున్నారు.

తమిళనాడు నుంచి దిల్లీ నిరసనలకు రైతులను ఎందుకు పంపలేదన్న విషయాన్ని ఈ సంఘం రాష్ట్ర కార్యదర్శి పి.షణ్ముగంను మేం ప్రశ్నించాం.

‘ఆరు రాష్ట్రాల రైతులు పాల్గొనాలన్నది ప్రణాళిక’

‘‘దిల్లీలో జరుగుతున్న నిరసనలకు సంఘీభావంగా మేం తమిళనాడు వ్యాప్తంగా నిరసనలు చేపడుతున్నాం. దశలవారీగా వీటిని నిర్వహించనున్నాం. దిల్లీ నిరసనల్లో మేం నేరుగా పాల్గొనకపోవడానికి ప్రత్యేకంగా కారణమేదీ లేదు. పంజాబ్, హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రైతులతో వీటిని నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే జరిగింది’’ అని షణ్ముగం చెప్పారు.

‘‘ఇప్పుడు మహారాష్ట్ర రైతులు కూడా ఈ నిరసనల్లో చేరారు. కానీ, ప్రభుత్వం దీన్ని పంజాబీ రైతుల ఆందోళనలుగా మాత్రమే చూపించాలని ప్రయత్నం చేస్తోంది. అందుకే ఇక రైతు సంఘాలు అన్ని రాష్ట్రాల ప్రతినిధులను పిలవాలని నిర్ణయం తీసుకున్నాయి’’ అని ఆయన చెప్పారు.

తమిళ రైతులు దిల్లీ వెళ్లకపోవడానికి దిల్లీలో బాగా చల్లటి వాతావరణం ఉండటం కూడా ఓ కారణమని షణ్ముగం అన్నారు.

‘‘తమిళనాడు రైతులకు అలాంటి వాతావరణం అలవాటు లేదు. వాళ్లు అంత చలిని తట్టుకోగలరా అన్న సందేహం కూడా ఉంది’’ అని ఆయన చెప్పారు.

తమిళనాడు రైతులు

ఫొటో సోర్స్, Reuters

ఇక జంతర్ మంతర్‌లో నిరసనలతో గుర్తింపు తెచ్చుకున్న అయ్యాకన్ను కూడా ఈ విషయంపై స్పందించారు.

‘‘దిల్లీ చాలా దూరం. రైలు వసతులు కూడా సరిగ్గా లేవు. ఓ చిన్న బృందంగా దిల్లీ వెళ్లేందుకు ప్రయత్నిస్తే, పోలీసులు బలప్రయోగంతో అడ్డుకున్నారు. 300 మంది రైల్లో వెళ్లాలని నిర్ణయించుకుని, టికెట్లు కూడా తీసుకున్నాం. మమ్మల్ని గృహ నిర్బంధంలో పెట్టారు. అలా మూడు లక్షల రూపాయలు నష్టపోయాం. ‘దిల్లీ వెళ్లేందుకైనా అనుమతించండి లేదంటే అసెంబ్లీ ముందు నిరసన తెలిపేందుకైనా అనుమతివ్వండి’ అని మేం పోలీసులను కోరాం’’ అని అయ్యాకన్ను చెప్పారు.

దిల్లీలో ఇదివరకు వారు చేపట్టిన నిరసనలు ఫలితాలనిచ్చాయా అని మేం అయ్యాకన్నును అడిగాం. కానీ, ఆయన సూటిగా సమాధానం చెప్పలేదు.

‘‘2014లో బీజేపీ అధికారంలోకి వచ్చేంతవరకూ నేను ఆ పార్టీలో ఉన్నా. తాను అధికారంలోకి వస్తే, రైతుల లాభాలు రెట్టింపు అవుతాయని మోదీ హామీ ఇచ్చారు. మోన్‌శాంటో లాంటి బహుళజాతి సంస్థలను రానివ్వనని అన్నారు. కానీ, కొత్త చట్టాల్లో కనీస మద్దతు ధర ప్రస్తావనే లేదు. భవిష్యతులో అది ఉండదు కూడా. ప్రైవేటు సంస్థలతో ఒప్పందం చేసుకుని రైతులు పంటలు వేయాలని చట్టాలు చెబుతున్నాయి? నాణ్యతను ఎవరు నిర్ణయిస్తారు? పంట కొనుగోలు సమయంలో ధర తక్కువ చెబితే, మేం ఎవరిని అడగాలి?’’ అని అయ్యాకన్ను ప్రశ్నించారు.

రైతులు తమ పంటను దేశంలో ఎక్కడైనా అమ్ముకునే స్వేచ్ఛ కొత్త చట్టాలతో వస్తుంది కదా అని ప్రశ్నకు... ‘‘రైతులు వారు పండించిన కాస్త పంటను సుదూరాలకు వెళ్లి అమ్ముకోలేరు. బహుళ జాతి సంస్థలు కాంట్రాక్టుల పేరుతో జన్యుమార్పిడి విత్తనాలు ఉపయోగించేలా రైతులపై ఒత్తిడి తెస్తాయి. ఈ కొత్త చట్టాలతో రైతులకు, వినియోగదారులకు ఏ ప్రయోజనమూ లేదు. మధ్యలోనివాళ్లే లాభపడతారు’’ అని అన్నారు.

తమిళనాడు రైతులు

ఫొటో సోర్స్, DELHI POLICE

దిల్లీ వచ్చిన అయ్యాకన్ను..

దిల్లీలో నిరసన తెలుపుతున్న రైతులకు సంఘీభావం తెలిపేందుకు, నిరసనల్లో పాల్గొనేందుకు అయ్యాకన్ను, మరికొందరు రైతు సంఘాల ప్రతినిధులు సోమవారం రాత్రి తిరుచ్చి నుంచి దిల్లీ వచ్చారు.

అయితే కరోల్‌భాగ్‌ ప్రాంతంలో ఒక హోటల్‌లో ఉన్న వీరిని దిల్లీ పోలీసులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. మంగళవారం ఉదయం వారు బయటకు వెళుతుండగా పోలీసులు వారిని అడ్డుకుని, ప్రశ్నించారు. సేలమ్ 8 లైన్ల రోడ్డు కేసు విచారణకు హాజరయ్యేందుకు సుప్రీంకోర్టుకు వెళ్లాలని వారు చెప్పగా.. పోలీసులు తమ వాహనంలోనే రైతు సంఘాల ప్రతినిధులను సుప్రీంకోర్టుకు తీసుకెళ్లారు.

టీవీ చానెళ్లతో మాట్లాడేందుకు కూడా పోలీసులు అనుమతి ఇవ్వటం లేదని, తమకు నీడలాగా వెంటే ఉంటున్నారని, కాబట్టి దిల్లీ సరిహద్దుల్లో జరుగుతున్న రైతుల నిరసన కార్యక్రమాలకు తాము హాజరు కాలేకపోతున్నామని తమిళనాడు రైతు సంఘాల ప్రతినిధులు వెల్లడించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)