బీజేపీ నేతలపై కశ్మీర్‌లో దాడులు ఎందుకు పెరుగుతున్నాయి...

అన్వర్ ఖాన్

ఫొటో సోర్స్, MAJID JAHANGIR/BBC

ఫొటో క్యాప్షన్, బీజేపీ యువనేత మొహమ్మద్ అన్వర్ ఖాన్
    • రచయిత, మాజీద్ జహంగీర్
    • హోదా, బీబీసీ కోసం, శ్రీనగర్ నుంచి

శ్రీనగర్‌లో బీజేపీ యువనేత మొహమ్మద్ అన్వర్ ఖాన్ ఇంటి మెయిన్ గేటుకు, గోడలకు తగిలిన బుల్లెట్ రంధ్రాలు ఇప్పటికీ కనిపిస్తున్నాయి.

ఆయన ఇంటి మెయిన్ గేట్ లోపల నుంచి వేసి ఉంది. ఆ గేట్ లోపలున్న ఒక బంకర్‌లో పోలీసులు తుపాకులతో గస్తీ కాస్తున్నారు.

ఆరు రోజుల క్రితం ఖాన్ ఇంటి మీద తీవ్రవాదులు దాడి చేశారు. ఆ ఘటనలో ఆయన సెక్యూరిటీ సిబ్బందిలో ఒకరు చనిపోయాడు.

ఖాన్ ఆ సమయంలో ఇంట్లో లేకపోవడంతో సురక్షితంగా బయటపడ్డారు. కానీ, ఆ రోజు నుంచి ఇప్పటివరకూ ఆయన పిల్లలు స్కూలుకు కూడా వెళ్లలేకపోతున్నారు.

"మేం గత ఆరు రోజులుగా పిల్లలను స్కూలుకు పంపించడం లేదు. ఇంట్లో వాళ్లలో ఒక భయం లాంటిది ఏర్పడింది. వాళ్లు రిస్క్ వద్దనుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు జరిగితే, అలా భయం కలగడం మామూలే కదా" అని అన్వర్ ఖాన్ అన్నారు.

తీవ్రవాద సంస్థ లష్కరే తోయిబా ఈ దాడికి పాల్పడిందని పోలీసులు చెప్పారు.

అన్వర్ ఖాన్

ఫొటో సోర్స్, MAJID JAHANGIR/BBC

కారుకు, ఇంటికి బీజేపీ జెండా లేదు

అన్వర్ ఖాన్ బీజేపీ ఎగ్జిక్యూటివ్ మెంబర్. ఆయన లేహ్, కుప్వారా పార్టీ ఇన్‌ఛార్జ్ కూడా.

గత 8 ఏళ్లలో అన్వర్ ఖాన్ మీద దాడి జరగడం ఇది మూడో సారి. 2015లో కూడా ఆయనపై దాడి చేశారు. అప్పుడు ఒక పోలీస్ గాయపడ్డాడు. ఆ సమయంలో ఆయన పారిపోయి ప్రాణాలు దక్కించుకున్నారు.

దాడుల భయంతో తాను పార్టీ పనుల మీద ఎక్కడికీ వెళ్లకుండా ఇంట్లోనే ఉంటున్నట్లు అన్వర్ ఖాన్ చెప్పారు.

"నేను జనం ఎక్కువగా తిరిగే ప్రాంతాలకు దూరంగా ఉంటున్నాను. శుక్రవారం నమాజు చేయడానికి, పెళ్లిళ్లకు కూడా వెళ్లడం లేదు. మన భద్రత గురించి మనమే చూసుకోవాల్సుంటుంది కదా" అన్నారు.

ఖాన్ ఇంటి మీద, కారు మీద ఎలాంటి జెండాలు, పార్టీ అగ్ర నేతల ఫొటోలు ఏవీ కనిపించడం లేదు.

"నిజానికి, ఈమధ్య తనిఖీల కోసం, రిపోర్ట్ రాయడానికి ఇక్కడకు వివిధ విభాగాల వాళ్లు వస్తున్నారు. అందుకే, ప్రస్తుతానికి మేం జెండా దించేశాం" అన్నారు.

అన్వర్ ఖాన్

ఫొటో సోర్స్, MAJID JAHANGIR/BBC

ఫొటో క్యాప్షన్, అన్వర్ ఇంటి గేటుకు బుల్లెట్ రంధ్రం

బీజేపీ నేతలకు ముప్పు

"లోయలో బీజేపీకి ఆదరణ పెరుగుతోంది. ఇప్పుడు, కశ్మీర్‌లో చాలా పంచాయతీల్లో పార్టీ సర్పంచులు ఉన్నారు. డీడీసీ, బీడీసీ ఎన్నికల్లో కూడా మా పార్టీ కార్యకర్తలు గెలిచారు" అని అన్వర్ చెప్పారు.

కానీ, బీజేపీ నేతలు, కార్యకర్తలు తీవ్రవాదులకు ఎందుకు లక్ష్యంగా మారారు. ఆర్టికల్ 370 రద్దు కూడా దీనికి కారణమా?

సమాధనంగా "అది కూడా కావచ్చు. ఆర్టికల్ 370 రద్దును తీవ్రవాదులు కూడా కోరుకోలేదు. ఆ ఆర్టికల్ తొలగించిన తర్వాత మా పార్టీ వారికి ముప్పు మరింత పెరిగింది" అంటారు అన్వర్.

బీజేపీ శ్రీనగర్ ఆఫీసులో నిశ్శబ్దం

శ్రీనగర్‌లోని జవహర్ నగర్‌లో ఉన్న బీజేపీ రెండు పార్టీ ఆఫీసుల్లో ఇప్పుడు నిశ్శబ్దం ఆవరించింది. ఆ రెండు కార్యాలయాల మీదా పార్టీ జెండా కూడా కనిపించడం లేదు.

"మా పార్టీ నేత ఒకరిని నేను జవహర్ నగర్ ఆఫీసులో కలవగలరా అని అడిగాను. తర్వాత ఆ ఆఫీసుకు వెళ్లద్దని ఆయనను సలహా ఇచ్చినట్లు తెలిసింది" అని అన్వర్ ఖాన్ చెప్పారు.

2019లో దక్షిణ కశ్మీర్ అనంతనాగ్‌లో బీజేపీ స్థానిక కార్యకర్త గుల్ మొహమ్మద్ మీర్ అలియాస్ అటల్ జీని కాల్చి చంపారు.

శ్రీనగర్‌లోని బీజేపీ కార్యాలయం

ఫొటో సోర్స్, MAJID JAHANGIR/BBC

ఫొటో క్యాప్షన్, శ్రీనగర్‌లోని బీజేపీ కార్యాలయం

ఆయన ఇద్దరు కొడుకులు ఇప్పటికీ పార్టీ వెంటే ఉన్నారు. గుల్ మొహమ్మద్ చిన్న కొడుకు షకీల్ అహ్మద్ శ్రీనగర్ పార్టీ కార్యాలయంలో పనిచేస్తుంటారు.

"మా నాన్నకు తగిన భద్రత కల్పించి ఉంటే, ఆయన బతికుండేవారు. మేం, ఆ విషయం అప్పటి పోలీసు అధికారులకు కూడా చెప్పాం. కానీ వాళ్లు పట్టించుకోలేదు. మా నాన్న హత్య జరిగాక, పార్టీ ఆ విషయాన్ని లేవనెత్తింది. కానీ, దానివల్ల ఏ ప్రయోజనం లేకుండాపోయింది" అని షకీల్ చెప్పారు.

ముస్తాక్ నౌరాబాదీ(48) కశ్మీర్‌లో ఎప్పటి నుంచో బీజేపీతో ఉన్నారు. ఆయన తనకు 22 ఏళ్ల వయసులోనే బీజేపీలో చేరారు.

కశ్మీర్‌లో బీజేపీ కార్యకర్తలపై దాడులు పెరగడంతో, ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నా ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నానని ఆయన చెబుతున్నారు.

కుల్‌గామ్ జిల్లా నౌరాబాద్‌లో ఉంటున్నప్పుడు 2014లో ముస్తాక్ ఇంటిపై దాడి జరిగింది. ఆ తర్వాత ఆయన కుటుంబంతో సహా శ్రీనగర్ వచ్చేశారు. ఆ రోజు దాడి జరిగినప్పుడు ముస్తాక్ ఇంట్లో లేరు.

"మసీదుకు, వేరే ఎక్కడకు వెళ్లి రావాలన్నా చాలా అప్రమత్తంగా ఉండాల్సి వస్తోంది. బీజేపీ నేతలపై దాడుల తర్వాత కచ్చితంగా ఒక భయం ఏర్పడింది. పోలీసులు కూడా ఎక్కువగా బయటకు వెళ్లకండని సూచించారు" అని ముస్తాక్ చెప్పారు.

పార్టీని తీవ్రవాదులు లక్ష్యంగా మార్చుకోవడానికి, ఇటీవల ఎన్నికల్లో కనిపించిన ప్రభావమే కారణం అని ముస్తాక్‌కు కూడా అనిపిస్తోంది. హిందుత్వ అమలు చేస్తోందని బీజేపీకి ఒక ఇమేజ్ వచ్చిందని, అది నిజం కాదని ఆయన అంటున్నారు.

కశ్మీర్ బీజేపీ

ఫొటో సోర్స్, Getty Images

నిపుణులు ఏం చెబుతున్నారు

2019 ఆగస్టు 5న జమ్ము-కశ్మీర్‌ నుంచి ఆర్టికల్ 370ని కేంద్రం రద్దు చేయడంతో, రాష్ట్ర ప్రత్యేక ప్రతిపత్తి ముగిసింది. అది జమ్ము-కశ్మీర్, లద్దాఖ్ అనే రెండు వేరు వేరు కేంద్ర పాలిత ప్రాంతాలుగా మారింది.

ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్ము-కశ్మీర్‌లో తీవ్రవాదం కూడా అంతం అవుతుందని మోదీ ప్రభుత్వం చెప్పింది.

బీజేపీ గ్రీవెన్స్ సెల్ అధ్యక్షులు డాక్టర్ రఫీ... పార్టీ నేతలపై జరిగే ఈ దాడులను బీజేపీ వైపు నుంచి తీసుకున్న ఎన్నో పెద్ద నిర్ణయాలతో జోడించి చూస్తున్నారు.

"బీజేపీ ప్రభుత్వం జమ్ము-కశ్మీర్ ఆర్టికల్ 370 రద్దు చేయడం లేదా కొన్ని చట్టాలను మార్చడం లాంటి వాటిని కశ్మీర్ ప్రజలు నెగటివ్‌గా తీసుకున్నారు. అయితే, కశ్మీర్ ప్రజల మెరుగైన భవిష్యత్తు కోసమే పార్టీ ఈ చర్యలు తీసుకుంది. మేం ప్రజల ఆలోచన మార్చాల్సిన అవసరం ఉంది" అని చెప్పారు.

డాక్టర్ రఫీ మాత్రం కశ్మీర్ లోయలో బీజేపీ నేతలకు తగిన భద్రత కల్పించడం లేదని ఆరోపిస్తున్నారు.

"కశ్మీర్‌లో బీజేపీకి సంబంధించిన వారు దాదాపు 100-150 మంది ఉన్నారు. వారు కశ్మీర్‌లో బీజేపీకి ఒక గుర్తింపుగా నిలిచారు. దురదృష్టవశాత్తూ వారికి మెరుగైన భద్రత అందించడం లేదు. ప్రభుత్వానికి అది పెద్ద సమస్య కాదు. కశ్మీర్‌లో బీజేపీ వారిపై దాడులు, హత్యలతో మేం చాలా భయం భయంగా జీవిస్తున్నాం" అన్నారు.

"2019 ఆగస్టు 5న జమ్ము-కశ్మీర్‌కు సంబంధించి బీజేపీ తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్రంలోని మిగతా ప్రధాన పార్టీలు కూడా వ్యతిరేకించాయి. తీవ్రవాదులు దాని గురించి ఎన్నో ప్రకటనలు విడుదల చేస్తుంటారు, వారి మనసులో ఏముందో చెప్పడం కూడా కష్టమే" అని విశ్లేషకులు, జర్నలిస్ట్ హారూన్ రెషీ అన్నారు.

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కశ్మీర్‌లోని తమ పార్టీ నేతలు, కార్యకర్తలను కాపాడుకోవడంలో విఫలమవుతోందని చెప్పవచ్చు. గత రెండేళ్లలో కశ్మీర్‌లో బీజేపీకి చెందిన ఎంతోమందిని చంపేశారు.

2019 ఆగస్టు 5 నుంచి ఇప్పటివరకూ కశ్మీర్లో దాదాపు 13 మంది నేతలు, సాధారణ కార్యకర్తలు దాడుల్లో ప్రాణాలు కోల్పోయారని కశ్మీర్ మీడియా సెల్ అధ్యక్షుడు మంజూర్ అహ్మద్ చెప్పారు.

బీజేపీ నేతలతో షకీల్ ముస్తాక్

ఫొటో సోర్స్, MAJID JAHANGIR/BBC

ఫొటో క్యాప్షన్, బీజేపీ నేతలతో షకీల్ ముస్తాక్

లోయలో బీజేపీకి పెరిగిన ఆదరణే కారణమా?

బీజేపీ నేతలపై కశ్మీర్లో జరుగుతున్న దాడుల అంశం గురించి జమ్ము-కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ దగ్గర కూడా లేవెత్తామని పార్టీ ప్రతినిధి అల్తాఫ్ ఠాకూర్ చెప్పారు. పార్టీ పదాధికారులకు పూర్తి భద్రత కల్పిస్తామని ఆయన భరోసా ఇచ్చారని తెలిపారు.

అల్తాఫ్ ఠాకూర్ కశ్మీర్ బీజేపీ నేతలకు పూర్తి భద్రత ఎందుకు కల్పించకపోతున్నామో కూడా చెప్పారు.

"జమ్మూ కశ్మీర్‌లో పార్టీకి ఐదు లక్షల మందికి పైగా సభ్యులు ఉన్నారు. ప్రతి ఒక్కరికీ రక్షణ అందించడం సాధ్యం కాదు. అయితే, పదవుల్లో ఉన్నవారికి కచ్చితంగా భద్రత కల్పించాం. ప్రస్తుతం లేని వారికి అది అందించే ప్రయత్నాలు చేస్తున్నాం" అన్నారు.

"కశ్మీర్‌లో మా పార్టీ రోజు రోజుకూ బలోపేతం అవుతోంది. అది గమనిస్తున్న పాకిస్తాన్, తమ వైపు నుంచి అలజడులు సృష్టించి, బీజేపీ జాతీయవాద గళాన్ని నొక్కయాలని అనుకుంటోంది. అది అసాధ్యం" అని ఠాకూర్ చెప్పారు.

లోయలో బీజేపీ నేతలపై దాడి, వారి భద్రత గురించి మాట్లాడేందుకు కశ్మీర్ జోన్ ఐజీ విజయ్ కుమార్‌కు బీబీసీ చాలాసార్లు ఫోన్ చేసింది. వాట్సాప్‌లో ప్రశ్నలు కూడా పంపించాం. కానీ ఇప్పటికీ ఆయన నుంచి ఏ సమాధానం అందలేదు.

జమ్ము-కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా కార్యాలయానికి కూడా ఈమెయిల్ ద్వారా బీజేపీ నేతల భద్రతకు సంబంధించి కొన్ని ప్రశ్నలు పంపించాం. ఆయన దగ్గర నుంచి కూడా ఇప్పటివరకూ జవాబు రాలేదు.

కశ్మీర్‌లో గస్తీ

1990వ దశకంలో కశ్మీర్‌లో సాయుధ పోరాటం మొదలైన తర్వాత నుంచి, ఇప్పటివరకూ వందలాది రాజకీయ పార్టీల నేతలు, కార్యకర్తలు చనిపోయారు. మృతుల్లో ఎక్కువగా నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీకి చెందిన నేతలు ఉన్నారు.

జమ్ము-కశ్మీర్‌లో ఇటీవల జరిగిన జిల్లా పరిషత్(డీడీసీ) ఎన్నికల్లో కూడా బీజేపీ మొదటిసారి కశ్మీర్‌లో మెరుగైన ప్రదర్శన చూపడంలో విజయం సాధించింది.

బీజేపీ నేతలపై రాష్ట్రంలో జరుగుతున్న దాడులను కశ్మీర్‌లోని మిగతా రాజకీయ పార్టీలు కూడా ఖండిస్తున్నాయి. ఇది చాలా ఆందోళనకరమైన విషయంగా చెబుతున్నాయి.

"ఏ పార్టీ అయినా, నేత లేదా కార్యకర్త ఎవరైనా.. వారిపై దాడి చేయడం సరి కాదు. మేం దానిని తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాంటి దాడులు చేసేవారికి, ఆ పైవాడు మంచి బుద్ధి ఇవ్వాలని వేడుకుంటున్నా" అని జమ్ము-కశ్మీర్ అప్నీ పార్టీ చీఫ్ అల్తాఫ్ బుఖారీ అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)