భారత్- పాకిస్తాన్‌లు ఏటా జనవరి 1న అణ్వాయుధాల జాబితాను ఎందుకు ఇచ్చిపుచ్చుకుంటాయి?

ఫొటో సోర్స్, Kagenmi/getty images
శుక్రవారం భారత్, పాకిస్తాన్‌లు తమ అణు వ్యవస్థాపనలు, సదుపాయాల జాబితాను పరస్పరం ఇచ్చిపుచ్చుకున్నాయి.
గత 30 ఏళ్లుగా ప్రతీ ఏడాది జనవరి 1న ఇరు దేశాల మధ్య ఈ కార్యక్రమం ఒక ఆనవాయితీగా జరుగుతూ వస్తోంది.
న్యూ దిల్లీ, ఇస్లామాబాద్‌లలోని భారత, పాకిస్తాన్ దౌత్యవేత్తలు తమ దేశాల అణు వ్యవస్థాపనలు, సదుపాయాల జాబితాను ఇచ్చిపుచ్చుకున్నారు. అణు కేంద్రాలపై పరస్పర దాడలను నిషేధించేందుకు చేసుకున్న ద్వైపాక్షిక ఒప్పందం ప్రకారం ఈ కార్యక్రమం జరిగింది.
1988 డిసెంబర్ 31న భారత్, పాకిస్తాన్ ఈ ఒప్పందం మీద సంతకం చేశాయి. 1991 జనవరి 27 నుంచి ఇది అమలులోకి వచ్చింది.
"ఈ ఒప్పందం ప్రకారం, ఇరు దేశాలూ తమ అణు వ్యవస్థాపనల గురించి పరస్పరం తెలియజేస్తాయి. మొట్టమొదటిసారిగా 1991 జనవరి 1న భారత్, పాకిస్తాన్‌లు అణు వ్యవస్థాపనల జాబితాను పరస్పరం ఇచ్చిపుచ్చుకున్నాయి. అప్పటి నుంచీ ఇప్పటివరకూ ఈ ప్రక్రియ కొనసాగుతోంది" అని శుక్రవారం భారత విదేశాంగ శాఖ విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది.
ఈ ఒప్పందం ప్రకారం రెండు దేశాలూ ఒకదాని అణు వ్యవస్థాపనలపై ఒకటి దాడి చేయకూడదు.
ఈ జాబితాను పాకిస్తాన్ కాలమానం ప్రకారం జనవరి 1 ఉదయం 11 గంటలకు ఇస్లామాబాద్‌లోని భారత హై కమిషన్ ప్రతినిధికి అందజేశారని, అలాగే భారత కాలమానం ప్రకారం అదే రోజు ఉదయం 11 గంటలకు దిల్లీలోని పాకిస్తాన్ హై కమిషన్ ప్రతినిధికి భారత విదేశాంగ కార్యాలయం ఈ జాబితాను అందజేసిందని పాకిస్తాన్ విదేశాంగ శాఖ తెలిపింది.
ప్రస్తుతం భారత్, పాకిస్తాన్‌ల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నప్పటికీ ఈ ఆనవాయితీని కొనసాగించారు.
2019 ఫివ్రవరిలో పుల్వామా దాడికి జవాబుగా పాకిస్తాన్‌లోని బాల్‌కోట్‌లో వైమానిక దాడులు చేసిన దగ్గర నుంచి రెండు దేశాల మధ్య పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేస్తూ ఆర్టికల్ 370 తొలగిస్తున్నట్లు భారత్ ప్రకటించిన దగ్గరనుంచీ ఈ ఉద్రిక్తతలు పెరుగుతూ వచ్చాయి.
ఆ సందర్భంలో పాకిస్తాన్, భారత హై కమిషన్‌ను బహిష్కరించింది. అయితే, ఇది తమ దేశ అంతర్గత విషయమని భారత్ స్పష్టం చేసింది.

ఫొటో సోర్స్, Getty Images
ఎవరి వద్ద ఎన్ని అణ్వాయుధాలు ఉన్నాయి?
భారత్, పాకిస్తాన్‌లలో గత పదేళ్లుగా అణు బాంబుల సంఖ్య రెండింతలకు పైగా పెరిగిందని, ఇటీవలి కాలంలో పాకిస్తాన్, భారత్‌కన్నా అధికంగా అణు బాంబులను ఉత్పత్తి చేసిందని స్వీడన్‌కు చెందిన స్టాక్‌హోం ఇంటర్నేషనల్ పీస్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎస్ఐపీఆర్ఐ) కొత్త వార్షిక నివేదిక తెలిపింది.
ప్రపంచం మొత్తంలో అణ్వాయుధాల ఉత్పత్తి తగ్గింది కానీ దక్షిణ ఆసియాలో ఇది పెరుగుతోందని ఎస్ఐపీఆర్ఐలో న్యూక్లియర్ డిసార్మెంట్, ఆర్మ్స్ కంట్రోల్ అండ్ నాన్ ప్రొలిఫరేషన్ ప్రోగ్రాం డైరెక్టర్ షానన్ కైల్ తెలిపారు.
"2009లో భారత్ వద్ద 60 నుంచి 70 దాకా అణు బాంబులు ఉన్నాయని మేము చెప్పాం. ఆ సమయంలో పాకిస్తాన్ దగ్గర కూడా సుమారు 60 అణు బాంబులు ఉన్నాయి. ఈ పదేళ్లల్లో ఇరు దేశాలూ రెట్టింపు అణు బాంబులకు ఉత్పత్తి చేశాయి" అని కైల్ చెప్పారు.
"మాకొచ్చిన సమాచారం ప్రకారం ప్రస్తుతం భారత్ దగ్గర 130 నుంచి 140 అణు బాంబులు ఉన్నాయని, పాకిస్తాన్ దగ్గర 150 నుంచి 160 అణు బాంబులు ఉన్నాయని చెప్పగలం. ఒక పక్క రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. మరో పక్క ఇరు దేశాల్లోనూ అణు బాంబుల ఉత్పత్తి పెరుగుతోంది. అయితే, ప్రచ్చన్న యుద్ధ సమయంలో అమెరికా, రష్యాల మధ్య కనిపించినంత న్యూక్లియర్ పోటీ భారత్, పాకిస్తాన్‌ల మధ్య లేదు.
దీన్ని స్ట్రాటజిక్ ఆర్మీ కాంపిటీషన్ లేదా రివర్స్ మోషన్ న్యూక్లియర్ ఆర్మీ రేస్ అని చెప్పొచ్చు. భవిష్యత్తులో కూడా ఈ పరిస్థితిలో ఎలాంటి మార్పూ ఉండదని అనిపిస్తోంది" అని కైల్ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- పాకిస్తాన్లో హిందూ ఆధ్యాత్మిక గురువు సమాధిపై మూక దాడి.. ధ్వంసం
- కోవిషీల్డ్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ ఆమోదం
- మీరు ఎంతటి తెలివిగలవాళ్లైనా, ప్రతిభావంతులైనా సరే లెక్కల్లో ఈ చిన్న తేడా మిమ్మల్ని ముంచేస్తుంది..
- ఏపీలో కుక్కలు పెంచాలంటే లైసెన్స్ తప్పనిసరి.. ఈ జీవోపై విమర్శలకు కారణమేంటి
- "ఆమె అందగత్తె, తెలివైన అమ్మాయి. కానీ, భారతీయురాలు"
- 72,000 టన్నుల వజ్రాలు నిక్షిప్తమైన సుందర నగరం
- కరోనావైరస్ చరిత్రను చైనా ప్రభుత్వం తనకు అనుకూలంగా రచించుకుంటోందా?
- లేడీ బైక్ మెకానిక్: 'అబ్బాయిల పనులు ఎందుకన్నారు... అయినా ఎందుకు చేస్తున్నానంటే...'
- వెలగపూడిలో మాల వర్సెస్ మాదిగ: మధ్యలో చిక్కుకున్న అంబేడ్కర్-జగ్జీవన్ రాం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








