పాకిస్తాన్‌లో హిందూ ఆధ్యాత్మిక గురువు సమాధిపై మూక దాడి.. ధ్వంసం

- రచయిత, షుమైలా జాఫ్రి
- హోదా, బీబీసీ ప్రతినిధి
పాకిస్తాన్ ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని కరక్ జిల్లాలో హిందూ మత గురువు పరమహంస జీ మహారాజ్ సమాధిపై స్థానిక మూక దాడిచేసి ధ్వంసం చేసింది.
సమాధి పక్కనే ఓ హిందూ నాయకుడు ఇంటిని నిర్మిస్తుండటంతో ఆగ్రహించిన టెరీ గ్రామవాసులు సమాధిని కూల్చివేశారని పోలీసులు తెలిపారు.
‘‘ఇక్కడ స్థానిక నాయకుడు సిరాజుద్దీన్ నిర్మాణపు పనులు చేపట్టడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తంచేశారు.
మొదటి నుంచి ఈ ప్రాంతం వివాదాస్పదమైనదే. ఇక్కడ హిందూ జనాభా చాలా తక్కువగా ఉంటుంది’’అని కరక్ జిల్లా పోలీసు అధికారి ఇర్ఫానుల్లా మార్వాట్ బీబీసీతో చెప్పారు.
నిరసనలపై తమకు ముందే సమాచారం ఉందని, తాము భద్రతా ఏర్పాట్లు చేశామని ఆయన వివరించారు.
‘‘నిరసనల గురించి మాకు తెలుసు. అంతా శాంతియుతంగా జరుగుతుందని మేం భావించాం. కానీ ఒక మతగురువు ప్రసంగాలతో స్థానికుల్ని రెచ్చగొట్టాడు. దీంతో పరిస్థితులు నియంత్రణ తప్పిపోయాయి. కానీ ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదు’’అని ఆయన పేర్కొన్నారు.
ప్రస్తుతం పరిస్థితులు అదుపులోకి వచ్చాయని, దీనికి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి కేసు నమోదు చేయలేదని, అయితే బాధ్యులపై త్వరలోనే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని అన్నారు.
కారణం ఏమిటి?
పరమహంస జీ మహారాజ్ సమాధి విషయంలో వివాదం ఇక్కడ కొత్తేమీ కాదు. మొదట్నుంచీ కొందరు అతివాదులు దీన్ని వ్యతిరేకిస్తూనే ఉన్నారు. ఇంతకుముందు 1997లో ఈ సమాధిపై స్థానికులు దాడిచేశారు.
అయితే, సుప్రీం కోర్టు ఆదేశాలపై ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రభుత్వం ఈ సమాధిని పునర్నిర్మించింది.
సమాధిని పునర్నిర్మించాలని కోర్టు ఆదేశాలు ఇచ్చినా, స్థానిక ప్రభుత్వం నిర్మాణానికి సిద్ధమైనా.. పరిస్థితులు మాత్రం శాంతించలేదు.
దీంతో సమాధిని మళ్లీ నిర్మించే ముందు టెరీలోని అతివాద నాయకులతో అధికారులు సుదీర్ఘ మంతనాలు చేపట్టారు.
ఈ అంశంపై 2015లో పాక్ సుప్రీం కోర్టుకు అడిషనల్ అడ్వొకేట్ జనరల్ వాఖర్ అహ్మద్ ఖాన్ ఓ నివేదిక కూడా సమర్పించారు.

ఐదు షరతులపై హిందు, ముస్లిం వర్గాల మధ్య సయోధ్య కుదిరిందని, ఆ తర్వాతే సమాధిని పునర్నిర్మించేందుకు అంగీకారం కుదిరిందని నివేదికలో పేర్కొన్నారు.
టెరీలో ఎలాంటి మతపరమైన కార్యక్రమాలు కూడా కొనసాగించమని హిందువులు ఇచ్చిన అంగీకారం కూడా షరతుల్లో ఒకటి.
సమాధి దగ్గర భారీ స్థాయిలో జనాలు గుమిగూడమని, ఎలాంటి నిర్మాణ కార్యక్రమాలూ చేపట్టం అని కూడా హిందువులు అంగీకరించారు.
అంతేకాదు ఈ పరిసరాల్లో స్థలాలు కొనుగోలు చేయమని కూడా ఒప్పుకొన్నారని వార్తలు వచ్చాయి.
ఈ సమాధి ఓ ప్రభుత్వ ట్రస్టు ఆధీనంలో ఉంది. పరమహంస మరణించిన చోటే దీన్ని నిర్మించారు.
ఇక్కడే 1919లో మరణించిన ఆయన సమాధి ఉంది. ఆయనకు పూజలు చేసేవారు ఇక్కడకు వస్తుంటారు. అయితే 1997లో దీన్ని స్థానికులు కూల్చివేశారు.
అప్పటి నుంచి ఇక్కడ పరమహంస దేవాలయాన్ని పునర్నిర్మించేందుకు హిందువులు ప్రయత్నిస్తూనే ఉన్నారు. అయితే, స్థానిక మతగువురు రెచ్చగొట్టడంతో స్థానికులు సమాధిని పూర్తిగా కూల్చివేశారని హిందువులు ఆరోపిస్తున్నారు.
‘‘ఇక్కడి హిందువులు కూడా పాక్ పౌరులే. వారు ఎక్కడైనా భూములు కొనుగోలు చేయొచ్చు.
అయితే సమాధిని మరింత విస్తరిస్తారేమోననే ఆందోళనతోనే స్థానికులు దీన్ని కూల్చేసి ఉండొచ్చు’’అని మార్వాట్ చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్: ఈ గవర్నమెంటు స్కూల్లో సీట్లు లేవు
- సిలికాన్ వాలీ తల్లిదండ్రులు తమ పిల్లలను టెక్నాలజీకి దూరంగా ఉంచుతున్నారు.. ఎందుకు?
- ‘కాందహార్’ విమానం హైజాక్: 21 ఏళ్ల క్రితం అదంతా ఎలా జరిగింది?
- నార్వే: జీతాల దాపరికంలేని దేశం
- బాయ్‌ఫ్రెండ్ వల్ల గర్భం వచ్చింది.. భర్తకు తెలియకుండా బిడ్డకు జన్మనిచ్చింది.. ఆ తర్వాత...
- ‘మర్చంట్ ఆఫ్ డెత్’: దేశాల మధ్య శత్రుత్వం పెంచి ఆయుధాలు విక్రయించి ధనవంతుడైన వ్యాపారి
- రైతు ఆత్మహత్యలు: ‘మా అమ్మను వ్యవసాయం చేయనివ్వను’
- అప్పు త్వరగా తీర్చేయాలని పాకిస్తాన్‌ను సౌదీ ఎందుకు అడుగుతోంది?
- ‘మా ఇంట్లో అమిత్ షా భోంచేశారు, కానీ నాతో మాట్లాడలేదు’
- అనిల్‌కపూర్ : పెద్ద హీరోలు వద్దన్న పాత్రలు చేయడానికి ఏ మాత్రం సిగ్గుపడని హీరో
- ఒక ఉల్కను అమ్మేసి, రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అవుదామనుకున్నాడు. కానీ...
- కరోనావైరస్: బాబా రామ్‌దేవ్ ‘కరోనిల్’ కోవిడ్ నుంచి రక్షిస్తుందా? - బీబీసీ పరిశోధన
- "పార్లమెంటుకు పట్టని అన్నదాతల వ్యథలు· "జీరో బడ్జెట్ వ్యవసాయం అంటే ఏమిటి? కేంద్ర ఆర్ధికమంత్రి ఏపీని ఎందుకు ప్రస్తావించారు...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








