కోవిషీల్డ్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ ఆమోదం

ఫొటో సోర్స్, SOPA Images
భారత్‌లో కోవిడ్-19 టీకా పంపిణీకి ముందడుగు పడిందని, ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం సౌజన్యంతో సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ (సీడీఎస్‌సీవో) ఆధ్వర్యంలోని నిపుణుల బృందం పచ్చజెండా ఊపిందని ఈనాడు ఒక కథనాన్ని ప్రచురించింది.
శుక్రవారం సమావేశమైన ఈ బృందం.. ఈ టీకాకు షరతులతో కూడిన వినియోగానికి అనుమతివ్వాలని భారత ఔషధ నియంత్రణ సంస్థ(డీసీజీఐ)కు సిఫార్సు చేసింది.
కోవిషీల్డ్‌తో పాటు భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్ టీకా అత్యవసర వినియోగం కోసం దాఖలైన దరఖాస్తులపై డిసెంబరు 9, 30 తేదీల్లో నిపుణుల కమిటీ చర్చించింది. మూడోదశ క్లినికల్ ప్రయోగాలపై మధ్యంతర ఫలితాలను సమర్పించాలని భారత్ బయోటెక్‌ను, బ్రిటన్ ప్రభుత్వం ఇచ్చిన అనుమతులను అందించాలని సీరం ఇన్‌స్టిట్యూట్‌ను అప్పట్లో కోరింది.
ఆక్స్‌ఫర్డ్ వర్సిటీ, ఆస్ట్రాజెనెకాలు అభివృద్ధి చేసిన టీకాకు బ్రిటన్ ప్రభుత్వం డిసెంబరు 30న అనుమతులు ఇచ్చింది. అదే సమాచారాన్ని సీరం సంస్థ.. నిపుణుల కమిటీకి సమర్పించడంతో దాని అత్యవసర వినియోగ అనుమతులకు మార్గం సుగమమైంది. శుక్రవారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఈ కమిటీ విస్తృతంగా చర్చించింది. అనంతరం అనుమతులకు సిఫార్సు చేసింది.
మరోవైపు భారత్ బయోటెక్ దరఖాస్తుపైనా పరిశీలన జరిపింది. 25,800 మంది వాలంటీర్లతో ఈ సంస్థ ప్రస్తుతం చేపట్టిన క్లినికల్ ప్రయోగం అతిపెద్దదని పేర్కొంది. వీరిలో 22వేల మంది ఎంపిక పూర్తయిందని తెలిపింది. వీరిలో ఇతరత్రా ఆరోగ్య సమస్యలు ఉన్నవారినీ ఎంచుకున్నారని వివరించింది. ఈ టీకా భద్రత ఇప్పటికే రుజువైందని తెలిపింది. అయితే దాని సమర్థత ఇంకా వెల్లడి కావాల్సి ఉందని పేర్కొంది.
‘‘ఈ నేపథ్యంలో సవివర చర్చల అనంతరం భారత్ బయోటెక్‌కు కొన్ని సూచనలు చేస్తున్నాం. కోవాగ్జిన్‌పై ప్రస్తుతం సాగుతున్న క్లినికల్ ప్రయోగాల్లో వాలంటీర్ల ఎంపికను వేగవంతం చేయాలి. ఆ టీకా సమర్థతపై మధ్యంతర విశ్లేషణను నిర్వహించాలి. వాటి ఆధారంగా ఈ వ్యాక్సిన్‌కు కూడా అత్యవసర వినియోగ అనుమతినిచ్చే అంశాన్ని పరిశీలిస్తాం’’ అని నిపుణుల కమిటీ తెలిపిందని ఈనాడు రాసింది.

ఫొటో సోర్స్, nitingadkary
భారత్ మాల ప్రాజెక్టులో భాగంగా తెలంగాణలో నాలుగు వరుసల జాతీయ రహదార్లు
రాష్ట్రంలో తొలిసారి భారీ ఎత్తున నాలుగు వరుసల రోడ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైందని, భారత్ మాల ప్రాజెక్టులో భాగంగా తెలంగాణలో ఒకేసారి రూ. 24 వేల కోట్లతో ఏకంగా 1,076 కిలోమీటర్ల మేర నాలుగు వరుసల జాతీయ రహదా రులను నిర్మించనుందని సాక్షి ఒక కథనంలో తెలిపింది.
ఈ రోడ్ల నిర్మాణ పనులను ఈ ఆర్థిక సంవత్సరంలోనే చేపట్టేందుకు ప్రణాళిక రచిస్తోంది. అన్నీ సవ్యంగా జరిగితే వచ్చే రెండేళ్లలోనే ఈ పనులు పూర్తికానున్నాయి.
దేశవ్యాప్తంగా రోడ్ నెట్‌వర్క్‌ను పెంచడం ద్వారా పారిశ్రామికాభివృద్ధికి బాటలు వేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. చాలా ప్రాంతాల్లో పరిశ్రమలు ఏర్పాటు కావటానికి మౌలికవసతుల కొరతే అడ్డంకిగా మారింది. మంచి రోడ్ నెట్‌వర్క్ ఏర్పాటైతే కొత్త ప్రాంతాల్లోనూ భారీగా పెట్టుబడులు పెట్టేందుకు సంస్థలు ముందు కొస్తాయి. ఈ నేపథ్యంలో భారత్ మాలా ప్రాజెక్టు కింద భారీగా రోడ్ల అభివృద్ధికి కేంద్రం సిద్ధమైంది. ఇందులో భాగంగా ఈ ఆర్థిక సంవత్సరంలో తెలంగాణలో రూ.27 వేల కోట్ల మేర రోడ్ల అభివృద్ధికి ఖర్చు చేసేందుకు సమాయత్తమవు తోంది. ఇందులో రూ. 24 వేల కోట్లతో నాలుగు వరుసల రోడ్లను నిర్మించనుండగా మరో రూ.3 వేల కోట్లతో జాతీయ రహదారులను వెడల్పు చేయనుందని ఈ వార్తలో రాసారు.
రోడ్ల నిర్మాణానికి అవసరమైన భూసేకరణను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాలని కేంద్రం సూచించింది. అందుకయ్యే వ్యయాన్ని కేంద్రమే భరించనుంది. కావాల్సిన భూములను సేకరించి కేంద్రానికి కేటాయిస్తే వెంటనే రోడ్ల నిర్మాణం చేపట్టనున్నట్టు కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ తాజాగా తేల్చి చెప్పారు. ఈ విషయంలో సీఎం కేసీఆర్‌తో ప్రత్యేకంగా భేటీ కానున్నట్లు కూడా ఆయన తెలిపారని ఈ కథనంలో పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Reuters
ఏపీలోని 13 జిల్లాల్లో కోవిడ్ వ్యాక్సీన్ డ్రై రన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 13 జిల్లాల్లోనూ వ్యాక్సినేషన్ డ్రై రన్ నిర్వహించేందుకు ఆరోగ్యశాఖ సిద్ధమైందని ఆంధ్రజ్యోతి ఒక కథనంలో తెలిపింది.
శనివారం(జనవరి 2న) ప్రతి జిల్లాలోని మూడు ప్రదేశాల్లో డ్రై రన్ నిర్వహించేందుకు 39 ప్రదేశాలను గుర్తించారు. ప్రతి జిల్లాలో ఒక ప్రభుత్వాసుపత్రి, ఒక ప్రైవేటు ఆస్పత్రితోపాటు గ్రామాల్లోని ‘కామన్ ప్రదేశం’లో డ్రై రన్ నిర్వహిస్తారు. దీనిపై జిల్లాస్థాయి టాస్క్‌ఫోర్సు సమావేశాన్ని కలెక్టర్లు గురువారమే నిర్వహించారు. వ్యాక్సీన్ లబ్ధిదారులను ముందుగానే గుర్తించి కొవిన్ వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. సూచించిన సమయానికి వ్యాక్సినేషన్ సెంటర్‌కు చేరుకోవాలి.
2గంటల వ్యవధిలో 25 మంది హెల్త్‌కేర్ వర్కర్లకు టైం శ్లాట్ ఇవ్వాలి. ఒకటవ వ్యాక్సినేషన్ ఆఫీసర్ లబ్ధిదారుల పేర్లు, అడ్ర్‌సలు, వివరాలు పరిశీలిస్తారు. రెండవ వ్యాక్సినేషన్ ఆఫీసర్ కొవిన్ వెబ్‌సైట్‌లో లబ్ధిదారుల వివరాలు పరిశీలిస్తారు. అనంతరం డమ్మీ వ్యాక్సిన్ ఇస్తారు. వ్యాక్సినేషన్ పూర్తి అయినట్లు కొవిన్‌లో రిపోర్టు చేస్తారు. మూడవ వ్యాక్సినేషన్ ఆఫీసర్ క్రౌడ్ మేనేజ్‌మెంట్ చేస్తారు. వ్యాక్సిన్ పొందినవారు 30 నిమిషాల పాటు విశ్రాంతి గదిలో వేచి ఉండాలి. ఈ విధంగా వ్యాక్సిన్ ప్రక్రియను పూర్తి చేస్తారని ఈ వార్తలో రాశారు.

ఫొటో సోర్స్, fb
2020 దాదా సాహెబ్ ఫాల్కే అవార్డులు... సౌత్ కేటగిరీలో అవార్డ్ దక్కించుకున్న నాని జెర్సీ
2020 ఏడాదికిగాను దాదా సాహెబ్ ఫాల్కే అవార్డులను ప్రకటించారు. సౌత్ కేటగిరీలో బెస్ట్ మూవీగా జెర్సీ నిలిచిందని నమస్తే తెలంగాణ ఒక కథనంలో తెలిపింది.
ఇక బెస్ట్ యాక్టర్ అవార్డును యంగ్ యాక్టర్ నవీన్ పోలిశెట్టి దక్కించుకున్నారు. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ మూవీకిగాను నవీన్‌కు ఈ అవార్డు దక్కింది. ఇక ఉత్తమ నటిగా రష్మిక మందానా ఎంపికైంది. డియర్ కామ్రేడ్ సినిమాలో నటనకుగాను ఆమెకు ఈ అవార్డు రావడం విశేషం.
భారీ బడ్జెట్‌తో సాహో మూవీని తెరకెక్కించిన సుజీత్ బెస్ట్ డైరెక్టర్ అవార్డు సొంతం చేసుకున్నారు. అల వైకుంఠపురంలో వంటి మ్యూజికల్ హిట్‌తో అభిమానులను అలరించిన థమన్.. బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అవార్డు అందుకోనున్నారు. ఇక మోస్ట్ వర్సటైల్ యాక్టర్ అవార్డు అక్కినేని నాగార్జునకు దక్కింది.
ఇవి కూడా చదవండి:
- మీరు ఎంతటి తెలివిగలవాళ్లైనా, ప్రతిభావంతులైనా సరే లెక్కల్లో ఈ చిన్న తేడా మిమ్మల్ని ముంచేస్తుంది..
- ఏపీలో కుక్కలు పెంచాలంటే లైసెన్స్ తప్పనిసరి.. ఈ జీవోపై విమర్శలకు కారణమేంటి
- "ఆమె అందగత్తె, తెలివైన అమ్మాయి. కానీ, భారతీయురాలు"
- 72,000 టన్నుల వజ్రాలు నిక్షిప్తమైన సుందర నగరం
- కరోనావైరస్ చరిత్రను చైనా ప్రభుత్వం తనకు అనుకూలంగా రచించుకుంటోందా?
- లేడీ బైక్ మెకానిక్: 'అబ్బాయిల పనులు ఎందుకన్నారు... అయినా ఎందుకు చేస్తున్నానంటే...'
- వెలగపూడిలో మాల వర్సెస్ మాదిగ: మధ్యలో చిక్కుకున్న అంబేడ్కర్-జగ్జీవన్ రాం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








