నరేంద్ర మోదీ, గులాం నబీ ఆజాద్‌లు పార్లమెంటులో ఎందుకు కన్నీరు పెట్టుకున్నారు... 2006లో కశ్మీర్‌లో ఏం జరిగింది?

ఫొటో సోర్స్, RSTV
ప్రధానమంత్రి నరేంద్రమోదీ మంగళవారం నాడు పార్లమెంటులో.. తన రాజకీయ ప్రత్యర్థి, కాంగ్రెస్ నేత, రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు గులాం నబీ ఆజాద్‌కు వీడ్కోలు చెప్తూ భావోద్వేగానికి లోనయ్యారు. మోదీ, ఆజాద్ ఇరువురూ ఒక సంఘటనను గుర్తుచేసుకుని కన్నీరు పెట్టుకున్నారు.
గులాంనబీ ఆజాద్ రాజ్యసభ పదవీ కాలం 2021 ఫిబ్రవరి 15వ తేదీతో ముగుస్తుంది. ఈ సందర్భంగా రాజ్యసభలో మోదీ ప్రసంగిస్తూ.. తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా, ఆజాద్ జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు చోటుచేసుకున్న ఒక ఉదంతాన్ని పంచుకున్నారు.
జమ్మూకశ్మీర్‌లో 2006లో జరిగిన ఒక ఉగ్రవాద దాడి గురించి ప్రస్తావించారు. ఆ సంఘటన గురించి తనకు మొట్టమొదటిగా తెలియజేసింది ఆజాదేనని, ఆ విషయం చెప్తున్నపుడు ఆజాద్ కన్నీళ్లు ఆగలేదని చెప్పారు. అలా చెప్తూ.. తన కన్నీళ్లను ఆపుకోవటానికి మోదీ ప్రయత్నించారు.
‘‘జమ్మూకశ్మీర్‌లో ఉన్న గుజరాత్ పర్యాటకులు ఉగ్రవాద దాడి కారణంగా అక్కడ చిక్కుబడిపోయినప్పుడు.. ఆజాద్, ప్రణబ్ ముఖర్జీ చేసిన కృషిని నేను ఎన్నటికీ మరువను. ఆ రాత్రి గులాం నబీ జీ నాకు ఫోన్ చేశారు...’’ అంటూ ఆగి కన్నీటిని తుడుచుకుని మంచినీరు తాగారు.
‘‘మనం మన కుటుంబ సభ్యుల గురించి ఎంత ఆందోళన చెందుతామో ఆయన అంతగా ఆందోళన చెందుతున్నట్లు కనిపించారు. ఆయన చూపిన అభిమానం అటువంటిది’’ అని చెప్పారు. సభికులు బల్లలు చరుస్తూ హర్షం వ్యక్తంచేశారు.
‘‘అధికారం వస్తుంది, పోతుంది. కానీ దానిని నిర్వహించటమనేది...’’ అని వ్యాఖ్యానిస్తూ ఆజాద్‌కు సెల్యూట్ చేశారు మోదీ. ‘‘అది నాకు చాలా భావోద్వేగభరిత క్షణం’’ అని చెప్పారు.
ఆజాద్ నిజమైన మిత్రుడని మోదీ అభివర్ణించారు. ‘‘మిమ్మల్ని నేను రిటైర్ కానివ్వను. మీ సలహా తీసుకోవటం కొనసాగిస్తాను. నా తలుపులు మీకోసం ఎల్లప్పుడూ తెరిచే వుంటాయి’’ అని ఆజాద్‌ను ఉద్దేశించి పేర్కొన్నారు.
ప్రధాని మోదీ వ్యక్తిగత సంబంధాలను పార్టీ రాజకీయాలకు దూరంగా ఉంచుతారని ఆజాద్ ప్రశంసించారు. ‘‘మేం సభలో పోట్లాడుకుంటాం. సుదీర్ఘ వాదోపవాదాలు చేసుకున్నాం. కానీ మీరు వ్యక్తిగత అనుబంధాల మీద వాటి ప్రభావం పడనివ్వరు’’ అని చెప్పారు.
‘‘పండుగల సమయంలో ఇద్దరు వ్యక్తులు నాకు ఎల్లప్పుడూ శుభాకాంక్షలు చెప్తారు - కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ప్రధాని మోదీ’’ అని తెలిపారు.
మోదీ ప్రస్తావించిన సంఘటన గురించి ఆజాద్ కూడా తన భయానక జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.
ఆజాద్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రెండు రోజులకే ఆ ఉగ్రవాద దాడి జరిగింది. ‘‘విమానాశ్రయంలో కుటుంబ సభ్యులను కోల్పోయిన పిల్లలు నా కాళ్లకు అల్లుకుపోయారు. ‘దేవుడా.. ఎంతపని చేశావు? ఈ పిల్లలకు నేను ఎలా సమాధానం చెప్పాలి? ఇక్కడ విహారానికి వచ్చిన వీరు తమవారి మృతదేహాలను తీసుకుని వెళుతున్నారు’ అంటూ నేను పెద్దగా ఏడ్చేశాను’’ అంటూ ఆయన కూడా కన్నీళ్లు తుడుచుకున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
2006 జమ్మూకశ్మీర్ దాడిలో ఏం జరిగింది?
పార్లమెంటులో మోదీ, ఆజాద్‌లు 2006 నాటి ఘటనను గుర్తుచేసుకున్న నేపథ్యంలో ఏఎన్ఐ వార్తా సంస్థ.. నాడు జమ్మూకశ్మీర్ విమానాశ్రయంలో మృతుల కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న ఆజాద్ వీడియోను ట్విటర్‌లో పోస్ట్ చేసింది.
‘‘పండ్లు, పూలు ఇచ్చి పంపాలని అనుకున్నాం. కానీ మీ పిల్లల శవాలను పంపిస్తున్నాను. చాలా దుఃఖంగా ఉంది. మమ్మల్నందరిని క్షమించండి’’ అంటూ బాధిత కుటుంబ సభ్యులకు చేతులు జోడించి చెప్తుండటం ఈ వీడియోలో కనిపిస్తుంది.
మోదీ, ఆజాద్‌లు ప్రస్తావించిన ఆ సంఘటన 2006 మే 25వ తేదీ సాయంత్రం ఆరు గంటలకు జరిగింది.
గుజరాత్‌కు చెందిన పర్యాటకులతో ప్రయాణిస్తున్న ఒక బస్సు లోకి.. శ్రీనగర్‌లోని జకూరా వద్ద బాటాపోరా ప్రాంతంలో మిలిటెంట్లు గ్రెనేడ్ విసిరారు. ఆ దాడిలో నలుగురు పర్యాటకులు చనిపోయారు. మరో ఆరుగురు గాయపడ్డారు.
ఈ దాడికి ముందు అదే రోజు.. నాటి ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ దాల్ సరస్సు ఒడ్డున గల షేర్-ఇ-కశ్మీర్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ సెంటర్ (ఎస్‌కేఐసీసీ)లో జరిగిన ఒక రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని వెనుదిరిగారు.

ఫొటో సోర్స్, RSTV
గుజరాత్ పర్యాటకులతో ఉన్న టూరిస్టు బస్సు మామూలుగా అయితే.. దాల్ సరస్సు వెంట ఉన్న బోల్వార్డ్ రోడ్ మీదుగా ప్రయాణించాల్సి ఉంది. అయితే.. ఎస్‌కేఐసీసీలో రౌండ్ టేబుల్ సదస్సు కారణంగా ఆ రోడ్డును మూసివేయటంతో ఆ బస్సు ప్రత్యామ్నాయ మార్గంలో ప్రయాణించాల్సి వచ్చింది.
మన్మోహన్ వెనుదిరిగిన తర్వాత కొన్ని గంటలకే గుజరాత్ పర్యాటకుల బస్సు మీద మిలిటెంట్లు గ్రెనేడ్ దాడిచేశారు. బస్సు ముఘల్ గార్డెన్స్‌కు మరికొన్ని కిలోమీటర్ల దూరంలో ఉండగా దాడి జరిగింది.
ఈ దాడిలో గుజరాత్ పర్యాటకుల బృందంలోని ఎనిమిదేళ్ల బాలుడు రాబిన్, అతడి సోదరి కిష్నా, టీనేజర్లు ఖుష్బూ, ఫెనాయ్ చనిపోయారు. గాయపడిన వారిలో గోపి, షివాన్ కుమార్, హిమాంత్, రిత్నేష్ కుమార్ ఉన్నారు.
‘‘ఓ భారీ విస్ఫోటన శబ్దం వినిపించింది. ఆ తర్వాత మాకేమీ తెలియలేదు’’ అని గాయపడ్డ పర్యాటకుల్లో ఒకరు ఆ తర్వాత చెప్పారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
నిజానికి ఆ వారంలో పర్యాటకులు లక్ష్యంగా జరిగిన రెండో పెద్ద దాడి ఇది. ప్రధానమంత్రి రౌండ్ టేబుల్ సదస్సు నేపథ్యంలో మిలిటెంట్లు తమ దాడులను తీవ్రం చేశారు.
గుజరాత్ పర్యాటకుల బస్సు మీద దాడికి ముందు సౌరా వద్ద మరో వద్ద మరో టూరిస్టు బస్సు మీద మిలిటెంట్లు కాల్పులు జరిపారు. ఆ దాడిలో బస్సు డ్రైవర్ చనిపోగా, నలుగురు పర్యాటకులు గాయపడ్డారు. దానికి ముందు రోజు ఆరు గ్రెనేడ్ దాడులు జరిగాయి.
మిలిటెంట్లు పర్యాటకులను, అందులోనూ చిన్నారులను చంపటం కశ్మీర్‌లో ఆగ్రహావేశాలను రగిల్చింది. ఆజాద్ ఈ దాడులను ఖండించి క్షతగాత్రులకు చికిత్స అందించేందుకు చర్యలు చేపట్టారు.
మృతుల శరీరాలను ప్రత్యేక విమానం ద్వారా గుజరాత్ పంపించేందుకు ఏర్పాట్లు చేశారు. 2006 మే 26వ తేదీన మృతదేహాలను స్వయంగా దగ్గరుండి విమానాశ్రయానికి తీసుకెళ్లారు.
పర్యాటక శాఖకు చెందిన ఒక అధికారిని కూడా మృతదేహాలను దగ్గరుండి అప్పగించాలని గుజరాత్‌లోని బరోడా వరకూ పంపించారు ఆజాద్.

ఇవి కూడా చదవండి:
- ఆర్టికల్ 370 సవరణ: 'కశ్మీర్‌కు భారత్ ద్రోహం చేసింది, పాకిస్తాన్‌ను కాదని భారత్‌లో విలీనమై మేం తప్పు చేశాం'
- 'కశ్మీరీల మంచికే అయితే... మమ్మల్ని జంతువుల్లా బంధించడం ఎందుకు? - మెహబూబా ముఫ్తీ కుమార్తె సనా
- మనుమరాలిని తొమ్మిది నెలలు కడుపులో మోసి జన్మనిచ్చిన 61 ఏళ్ల బామ్మ
- పంజాబ్ రైతుల మాదిరిగా.. వేరే రాష్ట్రాల రైతులు ఎందుకు ఆందోళనలు చెయ్యట్లేదు?
- చిదంబరం నటరాజ ఆలయం.. భూ అయస్కాంత క్షేత్రం నడిబొడ్డున ఉందా?
- ఎడారిలో అంతుచిక్కని లోహస్తంభం... అకస్మాత్తుగా ప్రత్యక్షం.. అదే తీరులో అదృశ్యం.. ఏలియన్స్ పనా?
- ఆ రోజు ఈ ఫొటో తీసింది ఎవరు? కసబ్ గురించి ఆ ఫొటో జర్నలిస్టు ఏమంటున్నారు?
- బిచ్చగాడు అనుకుని దానం చేయబోయారు.. ఆయనెవరో తెలిసి సెల్యూట్ చేశారు
- కరోనావైరస్: కేరళలో దాచి పెట్టిన కోవిడ్ మరణాల గుట్టు రట్టు చేసిన వలంటీర్లు
- పొగాకు వదిలి తీపి పంట వైపు మళ్లిన రైతులు.. లాభాల దిశగా పయనం
- కన్యత్వాన్ని పునరుద్ధరిస్తామంటూ క్లినిక్‌ల అనైతిక వ్యాపారం
- 2,000 ఏళ్ల కిందటి రోమ్ సామ్రాజ్యపు యజమాని, బానిస... బయటపడ్డ బూడిద శిలలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










