1971 గంగా హైజాక్: నకిలీ పిస్టల్, గ్రెనేడ్‌తో భారత విమానం హైజాక్ చేసిన ఇద్దరు కశ్మీర్ యువకులు.. ఇది భారత్ చేయించిన కుట్రా?

గంగా విమానం

ఫొటో సోర్స్, ZAHID HUSSEIN

    • రచయిత, షాహిద్ అస్లమ్
    • హోదా, జర్నలిస్ట్, లాహోర్
మీ అభిమాన భారతీయ క్రీడాకారిణికి ఓటు వేసేందుకు CLICK HERE

జనవరిలో చలిగా ఉన్న ఒక ఉదయం నగరాన్ని మంచు కప్పేసి ఉంది. 26 మంది ప్రయాణికులతో కలిసి ఇద్దరు యువకులు తమ సూట్‌కేసులతో ఒక చిన్న ఫోకర్ విమానంలో ఎక్కారు. కాసేపట్లోనే అది గాల్లోకి ఎగిరింది.

విమానం గమ్యానికి చాలా దగ్గరగా ఉంది. ఎయిర్ హోస్టెస్ ప్రయాణికులతో సీట్ బెల్ట్ పెట్టుకోమని చెప్పారు. అప్పుడే ఇద్దరిలో ఒక యువకుడు హఠాత్తుగా కాక్‌పిట్‌లోకి చొరబడి పైలెట్ తలకు పిస్టల్ పెట్టాడు. విమానాన్ని వేరే ఏ దేశానికైనా మళ్లించమన్నాడు.

ఇంకో యువకుడు చేతిలో హాండ్ గ్రెనేడ్‌తో ప్రయాణికులవైపు తిరిగాడు. ఎవరైనా ఎదురుతిరిగితే దాన్ని పేల్చేస్తానని బెదిరించాడు.

ఒక టాయ్ పిస్టల్, చెక్కతో చేసిన హాండ్ గ్రెనేడ్‌తో ఇద్దరూ ఆ విమానాన్ని హైజాక్ చేయగలిగారు. దాన్ని బలవంతంగా పక్క దేశానికి తీసుకెళ్లారు. అక్కడ జైళ్లలో ఉన్న తమ సహచరులు కొంతమందిని విడిపించాలని డిమాండ్ చేశారు.

హాలీవుడ్ యాక్షన్ సినిమాను తలపించే ఈ ఘటన ఇప్పటికి 50 ఏళ్ల క్రితం నిజంగానే జరిగింది. దీనిపై తర్వాత ఎన్నో ప్రశ్నలు వెల్లువెత్తినా, సమాధానాలు ఇప్పటికీ దొరకడం లేదు.

50 ఏళ్ల క్రితం 1971 జనవరి 30న ఇద్దరు కశ్మీర్ యువకులు(జమ్ము కశ్మీర్ డెమాక్రటిక్ లిబరేషన్ పార్టీ అధ్యక్షుడు మొహమ్మద్ హాషిమ్ ఖురేషీ, ఆయన దూరపు బంధువు అష్రఫ్ ఖురేషీ) గంగ అనే ఒక ఇండియన్ ఫ్రెండ్షిప్ ఫోకర్ విమానాన్ని శ్రీనగర్ నుంచి జమ్మూ వెళ్తుండగా హైజాక్ చేశారు. దానిని పాకిస్తాన్‌లోని లాహోర్‌కు తీసుకెళ్లారు.

అప్పుడు హాషిమ్ ఖురేషీ వయసు 17 ఏళ్లు కాగా, అష్రఫ్ ఖురేషీకి 19 ఏళ్లు. గంగ విమానాన్ని అప్పటికే సేవల నుంచి తప్పించారు. కానీ, ఈ హైజాక్ ఘటనకు కొన్ని వారాల ముందు హఠాత్తుగా దానికి మళ్లీ ఎగరడానికి అనుమతిచ్చారు.

హాషిమ్ ఖురేషీ

ఫొటో సోర్స్, ZAHID HUSSEIN

ఫొటో క్యాప్షన్, హాషిమ్ ఖురేషీ

విమానం హైజాక్ పథకం

1968లో జమ్ము కశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ అధ్యక్షుడు మక్బూల్ భట్, కశ్మీర్ విముక్తి కోసం జరిగిన సాయుధ పోరాటంలో ప్రముఖులు. అమర్ చంద్ అనే ఒక భారత అధికారిని హత్య చేసినందుకు ఆయనకు మరణ శిక్ష విధించారు. కానీ, ఆయన జైల్లోంచి తప్పించుకుని పాకిస్తాన్ పాలిత కశ్మీర్‌కు పారిపోయాడు.

మక్బూల్ భట్ పెషావర్‌లో ఉంటున్నప్పుడు హాషిమ్ ఖురేషీ ఆయన్ను కలిశారు. ఆయన ప్రేరణతో జమ్ము కశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్‌లో చేరాడు. పాకిస్తాన్, భారత్ రెండింటి నుంచీ కశ్మీర్‌కు స్వతంత్రం అందించడమే ఆ సంస్థ లక్ష్యం.

పార్టీ సందేశాన్ని వ్యాప్తి చేయడానికి ఆ యువకుడు తర్వాత శ్రీనగర్ వచ్చాడు. కొన్ని నెలల తర్వాత సియాల్ కోట్ దారిలో మళ్లీ పాకిస్తాన్ వెళ్లాడు. కానీ ఈసారీ పాకిస్తాన్‌లోకి వెళ్లడానికి అక్రమ పద్ధతులు ఉపయోగించాడు. ఒక బీఎస్ఎఫ్ అధికారి అతడికి సహకరించాడు.

హాషిమ్ ఖురేషీ శ్రీనగర్ లాల్ చౌక్ దగ్గర ఆ అధికారిని కలిశాడు. బోర్డర్ దాటిస్తే బదులుగా మక్బూల్ భట్ సమాచారం ఇవ్వడానికి ఒప్పుకున్నాడు.

సరిహద్దు దాటిన హాషిమ్ తర్వాత మక్బూల్ భట్‌ను కలిశాడు. భవిష్యత్ ప్లాన్ సిద్ధమైంది.

1969 జూన్ 18న మక్బూల్ భట్, హాషిమ్ ఖురేషీ, అమానుల్లా ఖాన్ రావల్పిండిలో కలిసి ఉన్నప్పుడు రేడియోలో ఎరిత్రియా స్వాతంత్ర్యం కోసం ముగ్గురు యువకులు ఇథియోపియా ప్రయాణికుల విమానంపై గ్రెనేడ్, టైం బాంబులతో దాడి చేశారనే వార్త విన్నారు.

కశ్మీర్ విముక్తి గళాన్ని మొత్తం ప్రపంచానికి వినిపించాలంటే ఇలాంటిది ఏదో చేయాలని, విమానాన్ని హైజాక్ చేయాలని వాళ్లకు ఆలోచన వచ్చింది.

శ్రీనగర్‌లో ఉన్న హాషిమ్ ఖురేషీ బీబీసీకి ఇచ్చిన ఒక స్పెషల్ ఇంటర్వ్యూలో "అప్పుడు మక్బూల్ భట్ అక్కడ అందరిలోకీ చిన్నవాడైన నావైపు చూసి 'హాషిమ్ నువ్వు అలా చేయగలవా' అన్నాడు. 'నేను కశ్మీర్ విముక్తి కోసం నా ప్రాణాలైనా ఇస్తానన్నాను'. నన్ను అందరూ మెచ్చుకున్నారు. తర్వాత విమానం హైజాక్ చేసే ప్లాన్ వేశాం" అని చెప్పారు.

గంగా విమానం

ఫొటో సోర్స్, ZAHID HUSSEIN

ఫొటో క్యాప్షన్, గంగా విమానం

విమానం హైజాక్ సన్నాహాలు

ప్లాన్ సిద్ధమయ్యాక హాషిమ్ ఖురేషీకి విమానం హైజాక్ చేయడానికి శిక్షణ ఇవ్వడానికి డాక్టర్ ఫారూక్ హైదర్ బావ జావేద్ మంటో(మాజీ పైలెట్)ను ఎంచుకున్నారు.

విమానం గురించి చెప్పడానికి ఆయన హాషిమ్‌ను రావల్పిండిలోని చక్‌లాలా విమానాశ్రయానికి తీసుకెళ్లేవారు. పైలెట్ ఎక్కడ కూచుంటాడు, కాక్‌పిట్‌ను ఎలా అదుపులోకి తెచ్చుకోవాలి. ప్రయాణికులతో ఎలా డీల్ చేయాలి అన్నీ చెప్పేవాడు. హాండ్ గ్రెనేడ్ ఎలా విసరాలి, బాంబు ఎలా తయారు చేయాలో కూడా నేర్పించాడు. ఆ ప్లాన్ అమలు చేసేందుకు హాషిమ్‌కు ఒక హాండ్ గ్రెనేడ్, ఒక పిస్టల్ ఇచ్చి శ్రీనగర్ పంపించారు.

హాషిమ్ సియాల్‌కోట్ సరిహద్దు నుంచి శ్రీనగర్‌లోకి వస్తున్నప్పుడు బీఎస్ఎఫ్ అతడిని పట్టుకుంది. పిస్టల్, హాండ్ గ్రెనేడ్ స్వాధీనం చేసుకుంది.

అరెస్ట్ చేయగానే మక్బూల్ భట్ ప్లాన్ గురించి హాషిమ్ బీఎస్ఎఫ్‌కు చెప్పేశాడు. శ్రీనగర్‌లో మరో ఇద్దరు ఈ మిషన్‌లో తనకు సాయం చేస్తారని చెప్పాడు.

"నిజానికి, అలా చెప్పాలనేది మక్బూల్ భట్ ప్లాన్‌లో భాగమే. నాతో మరో ఇద్దరు ఉన్నారని చెబితే, బీఎస్ఎఫ్ వాళ్లు కొట్టరని, మిగతా ఇద్దరి గురించి తెలుసుకోడానికి నీతో మంచిగా ప్రవర్తిస్తారని ఆయన నాకు చెప్పారు" అని హాషిమ్ ఖురేషీ ఇంటర్వ్యూలో చెప్పారు.

అలాగే జరిగింది. బీఎస్ఎఫ్‌ కోసం పనిచేస్తానని ఒప్పుకోవడంతో నన్ను వదిలేయడంతోపాటూ, బీఎస్ఎఫ్‌లో నాకు సబ్ ఇన్‌స్పెక్టర్‌ పోస్ట్ ఇచ్చారని ఆయన తెలిపారు.

మిగతా ఇద్దరు అనుమానిత హైజాకర్లను గుర్తించడానికి, హాషిమ్‌కు శ్రీనగర్ విమానాశ్రయంలో డ్యూటీ వేశారు. అక్కడ ఆయన తన ప్లాన్ అమలు చేయడానికి, విమానంలో ఎలా ఎక్కాలనేది రెక్కీ చేసేవారు.

మరోవైపు, హాషిమ్ ఖురేషీ తన దూరపు బంధువు అష్రఫ్ ఖురేషీకి మొత్తం ప్రాజెక్ట్ గురించి చెప్పడమే కాదు, అతడికి కూడా హైజాక్ ఎలా చేయాలో శిక్షణ ఇవ్వడం మొదలెట్టాడు.

పిస్టల్, హాండ్ గ్రెనేడ్ బీఎస్ఎఫ్ స్వాధీనం చేసుకోవడంతో మళ్లీ ఆయుధాలు సంపాదించాలి. కానీ అది సాధ్యం కాదు. దాంతో, హాషిమ్ ఖురేషీ ఆయుధాల కోసం మరో ప్లాన్ వేశాడు.

అప్పట్లో శ్రీనగర్‌లో వార్తా పత్రిల్లో దొంగల నుంచి కాపాడుకోడానికి అసలు పిస్టల్‌లాగే కనిపించే నకిలీ పిస్టల్ ప్రకటనలు వచ్చేవి.

హాషిమ్ ఖురేషీ అలాంటి ఒక పిస్టల్‌కు ఆర్డర్ ఇచ్చాడు. డెలివరీకి ఒక షాప్ అడ్రస్ ఇచ్చాడు. పది రోజుల తర్వాత అది వచ్చింది. అది నల్లగా నిగనిగలాడుతూ నిజమైన పిస్టల్‌లాగే ఉంది.

ఇక హాండ్ గ్రెనేడ్ కావాలి. అది ఎలా ఉంటుందో హాషిమ్ కాగితంపై ఒక బొమ్మ వేసి అష్రఫ్‌కు చూపించాడు. ఇదేం కష్టం కాదు, మనమే చేసుకుందామని తను అన్నాడు.

తర్వాత చెక్కతో హాండ్ గ్రెనేడ్‌లా కూడా చేశారు. అది ఐరన్‌లా కనిపించేలా రంగు వేశారు.

ప్రధాని ఇందిరాగాంధీ కొడుకు, ఆరోజుల్లో పైలెట్‌ అయిన రాజీవ్ గాంధీ అప్పుడప్పుడూ శ్రీనగర్ వచ్చేవారు. జనవరి 30న రాజీవ్ శ్రీనగర్ వస్తున్నట్లు వాళ్లకు తెలిసింది.

అదే రోజు హైజాక్ ప్లాన్ అమలు చేయాలని, రాజీవ్ గాంధీ ఉన్న విమానాన్నే చేయాలని నిర్ణయించుకున్నట్లు హాషిమ్ ఖురేషీ చెప్పారు.

ఇద్దరికీ టికెట్లు కొన్న అష్రఫ్.. హాషిమ్ టికెట్ మాత్రం మహమ్మద్ హుస్సన్ పేరుతో కొన్నాడు.

మక్బూల్ భట్

ఫొటో సోర్స్, MAQBOOL BUTT FACEBOOK PAGE

ఫొటో క్యాప్షన్, మక్బూల్ భట్

విమానం హైజాక్ ప్లాన్ అమలు

1971 జనవరి 30 శనివారం. యువకులు ఇద్దరూ విమానాశ్రయం చేరుకున్నారు. కానీ, ఏదో కారణం వల్ల రాజీవ్ గాంధీ ఆరోజు రాలేదని తెలిసింది. దీంతో, ప్లాన్ ప్రకారం అక్కడ ఉన్న విమానంలో ఎక్కేశారు.

అష్రఫ్ దగ్గర బ్రీఫ్‌కేసులో నకిలీ హాండ్ గ్రెనేడ్, పిస్టల్ ఉన్నాయి. వాళ్లు వాటితో సులభంగా విమానంలోకి ఎక్కేశారు. అప్పట్లో, విమానం ఎక్కే ప్రయాణికులను పెద్దగా తనిఖీలు చేసేవారు కాదు.

విమానం ఉదయం సుమారు 11.30కు జమ్మూకు బయల్దేరింది. అప్పట్లో శ్రీనగర్ నుంచి జమ్మూ వెళ్లడానికి అరగంట లేదా ముప్పావు గంట పట్టేది.

కాసేపట్లో విమానం జమ్మూలో దిగబోతోందని ఎయిర్ హోస్టెస్ అనౌన్స్ చేస్తుండగానే.. హాషిమ్ ఖురేషీ తన సీట్లోంచి లేచి కాక్‌పిట్‌లోకి వెళ్లారు. తన చేతిలోని నకిలీ పిస్టల్‌ను ఎడమవైపు కూర్చున్న విమానం కెప్టెన్ ఎంకే కాచ్రో తలకు పెట్టారు. విమానం పాకిస్తాన్ తీసుకెళ్లాలని చెప్పారు.

పైలెట్ ఓబెరాయ్ కుడివైపు ఉన్నారు. ఆయనకు పిస్టల్ అసలుదా, నకిలీదా అర్థం కాలేదు. విమానం వేరే గమ్యం దిశగా తిరిగింది.

"నేను కాక్‌పిట్‌లోకి వెళ్లగానే, అష్రఫ్ తన సీటులోంచి లేచి గ్రెనేడ్ చేత్తో పట్టుకున్నాడు. కాక్‌పిట్ తలుపు దగ్గరకు వచ్చి ప్రయాణికులవైపు తిరిగి నిలుచుకున్నాడు. అందరూ చేతులు పైకెత్తండి, లేదంటే గ్రెనేడ్ విసురుతా అని భయపెట్టాడు" అని హాషిమ్ తన ఇంటర్వ్యూలో చెప్పారు.

విమానంలో ఇండియన్ ఆర్మీ అధికారి ఒకరున్నారు. ఆయన అష్రఫ్‌తో ఇదేం గ్రెనేడ్ అన్నాడు. దానికి అష్రఫ్ "పేల్చనా.. తర్వాత నీకే తెలుస్తుంది" అన్నాడు. దాంతో ఎవరూ ఏం మాట్లాడలేదు.

"నేను విమానాన్ని రావల్పిండి తీసుకెళ్లాలనుకున్నా.. కానీ, చలి కాలం, మంచు పడుతోంది. పైలెట్‌తో విమానం రావల్పిండి తీసుకెళ్లు అన్నా. తను పెట్రోల్ తక్కువ ఉందని, దగ్గరగా ఉన్న లాహోర్ వరకే వెళ్లగలం అన్నారు, దాంతో నేను అక్కడికే తీసుకెళ్లమన్నా" అని హాషిమ్ చెప్పారు.

"కాసేపటి తర్వాత కింద జనం కనిపించారు. ఎక్కడికి తీసుకెళ్తున్నావ్ అని పైలెట్‌ను అడిగా. ఆయన పంజాబీలో నిన్ను మోసం చేయను మిమ్మల్ని లాహోరే తీసుకెళ్తాం అన్నారు".

పైలెట్ ఓబెరాయ్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు వైర్‌లెస్‌లో కోడ్ వర్డ్ ద్వారా ఒక సందేశం పంపించారు. లాహోర్ లాహోర్ అన్నారు. కానీ అవతలి వైపు నుంచి ఇది లాహోర్ కాదు, అమృత్‌సర్ అని వినిపించింది.

దాంతో తమను మోసం చేస్తున్నారని హాషిమ్ ఓబెరాయ్‌ను గట్టిగా చెంపపై కొట్టాడు. ఆయన చేతిలోని వాకీటాకీ లాక్కున్నాడు.

మక్బూల్ భట్, విమానం హైజాక్ చేసిన హషీమ్ కురేషీ(మధ్యలో)

ఫొటో సోర్స్, MAQBOOL BUTT FACEBOOK PAGE

ఫొటో క్యాప్షన్, మక్బూల్ భట్, విమానం హైజాక్ చేసిన హాషీమ్ ఖురేషీ(మధ్యలో)

పాకిస్తాన్‌లో దిగిన విమానం

"తర్వాత విమానం లాహోర్ వెళ్లింది. అక్కడ విమానాశ్రయంలో దిగడానికి పాకిస్తాన్ టవర్ కంట్రోల్‌ను కాంటాక్ట్ అయ్యాక, వాళ్లకు మేమిద్దరం కశ్మీరీ ముజాహిదీన్లమని చెప్పాం. భారత విమానాన్ని హైజాక్ చేశామని, అందులో ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారన్నాం. మాకు దిగడానికి అనుమతి ఇవ్వాలన్నాం.

అధికారులను సంప్రదించిన తర్వాత మాకు లాండింగ్ అనుమతి ఇచ్చారు. విమానం దాదాపు 1.30కు లాహోర్‌లో దిగింది. వెంటనే భద్రతా దళాలు విమానాన్ని చుట్టుముట్టాయి".

"మా దగ్గరికి వచ్చిన సెక్యూరిటీ వాళ్లతో మేం ఇది లాహోరేనా అన్నాం. వాళ్లు అవును అన్నారు. మీరు నిజం చెబుతున్నారని నమ్మకం ఏంటి అన్నా. వాళ్లు తమ సర్వీస్ కార్డ్, పాకిస్తాన్ జెండా కూడా చూపించారు. అవి నకిలీవేమో అన్నాను. దాంతో వాళ్లు నమాజు చదివి వినిపించారు. తర్వాత మేం లాహోర్‌లోనే దిగామని నమ్మకం వచ్చింది".

హైజాకర్లను మీ డిమాండ్లు ఏంటని అడిగినపుడు, వాళ్లు కశ్మీర్ విముక్తి అన్నారు. జైళ్లలో ఉన్న తమ సహచరులు కొందరిని విడుదల చేస్తే, విమానంలో ఉన్నవారిని వదులుతామని షరతు పెట్టారు.

మహిళలు, పిల్లలను అయినా విడుదల చేయమని కోరారు. కానీ హైజాకర్లు మొదట మక్బూల్ భట్‌తో తమను మాట్లాడించాలని అడిగారు.

"సెక్యూరిటీ గార్డులు నన్ను లాంజ్‌లోకి తీసుకెళ్లారు. కానీ మక్బూల్ భట్‌ను కాంటాక్ట్ కాలేకపోయాం. తర్వాత నాతో డాక్టర్ ఫారూఖ్ హైదర్‌తో మాట్లాడించారు. ఆయనతో 'నేను ఫిరోజ్‌ను మేం పరిందా(పక్షి) తీసుకుని లాహోర్ వచ్చాను' అన్నాను" అని హాషిమ్ చెప్పారు.

హాషిమ్ ఖురేషీ కోడ్ నేమ్ ఫిరోజ్ అయితే, ఆపరేషన్ కోడ్ నేమ్ పరిందా(పక్షి)

విమానంలో మహిళలు భయంతో, పిల్లలు ఆకలితో ఏడుస్తున్నారు. హైజాకర్లు అనుమతించడంతో అధికారులు ప్రయాణికులకు నీళ్లు అందించారు. తర్వాత హాషిమ్, అష్రఫ్ ఇద్దరూ చర్చించుకుని లాండ్ అయిన రెండు గంటలకు మహిళలు, పిల్లల్ని వదిలేశారు.

తర్వాత భద్రతా బలగాలు మళ్లీ వచ్చాయి. డాక్టర్ ఫారూఖ్ మిగతా ప్రయాణికులను వదిలేసి, విమానాన్ని మా స్వాధీనంలోకి తీసుకోమని మెసేజ్ వచ్చిందని చెప్పారు. దానికి ఒప్పుకున్న హైజాకర్లు సాయంత్రానికి ప్రయాణికులందరినీ వదిలేశారు.

"ప్రయాణికులు లేకుండా విమానాన్ని మా స్వాధీనంలో పెట్టుకోవడం పిల్లలాటలాగే ఉంటుంది. అలా మేం బలంగా డిమాండ్ చేసే పరిస్థితి ఉండదు. కానీ, అప్పట్లో మేం చిన్నవాళ్లమే" అన్నారు హాషిమ్.

ప్రయాణికులందరినీ కట్టుదిట్టమైన భద్రత మధ్య లాహోర్‌లోనే ఉన్న ఒక హోటల్‌కు తీసుకెళ్లారు. అక్కడ కొన్నిరోజులు ఉంచాక వాళ్లను తిరిగి భారత్ పంపించారు.

"దాదాపు రాత్రి 9 గంటలకు మక్బూల్ భట్, జావేద్ సాగర్, కె.ఖుర్షీద్ మిగతావారు లాహోర్ చేరుకున్నారు. అప్పుడు విమానాశ్రయంలో హైజాకర్లను చూడాలని ఎంత భారీగా జనం గుమిగూడారంటే విమానం నుంచి జనాలను దూరంగా తరమడానికి రెండు మూడు సార్లు లాఠీచార్జి చేశారు" అని హాషిమ్ చెప్పారు.

జనవరి 30 సాయంత్రానికి లాహోర్ సహా మొత్తం పాకిస్తాన్‌ అంతటా విమానం హైజాక్ వార్త వ్యాపించింది.

తర్వాతరోజు ఉదయానికి భారత విమానం హైజాక్ చేసిన ఇద్దరినీ చూడాలని దేశంలో సుదూర ప్రాంతాలవారు, పాక్ పాలిత కశ్మీర్ ప్రజలు కూడా విమానాశ్రయానికి చేరుకున్నారు.

"జనవరి 31న పాకిస్తాన్ అధికారులు జావేద్ సాగర్, మా మరో సహచరుడిని విమానంలోకి రావడానికి అనుమతించారు. మేం నిద్రపోయినా విమానం మా అదుపులో ఉండేలా చూసుకున్నాం. అదే రోజు భద్రతా ఏజెన్సీ వాళ్లు విమానంలో ఉన్న లెటర్స్ తీసుకుని వెళ్లారు. అప్పట్లో ఆ విమానం దిల్లీ నుంచి శ్రీనగర్ వరకూ వెళ్లేది. ఇండియన్ ఆర్మీ లెటర్లు కూడా అందులోనే వెళ్లేవి. బహుశా, వాళ్లు ఆ లెటర్లు చదవాలని అనుకున్నారు" అని హాషిమ్ చెప్పారు.

తర్వాత రోజు ఫిబ్రవరి 1న ఇద్దరు పాకిస్తాన్ సైనికాధికారులు లెటర్లతో తిరిగి వచ్చారు. హాషిమ్‌తో వీటి సీల్ సరిగా పడలేదు. వీటిని తెరిచినట్లు సులభంగా తెలిసిపోతుంది, అందుకే లెటర్లు కాల్చేయండి అన్నారు. తర్వాత వాళ్లందరూ లెటర్లు తగలబెట్టి కశ్మీరీ వంటకం వాజ్వాన్‌ను వేడిచేశారు. దానిని ఇద్దరు అధికారులు, హైజాకర్లు అందరూ తిన్నారు.

"ఆరోజు నేను ఒక సైనికాధికారి పొట్టపై పిస్టల్ పెట్టి, సరదాగా 'హాండ్సప్' అన్నాను. ఆయన భయంతో చేతులు పైకెత్తారు. తర్వాత నేను ఇది నకిలీది అని చెప్పాను. ఆరోజు మేం గంగా విమానాన్ని నకిలీ పిస్టల్‌, గ్రెనేడ్‌తో హైజాక్ చేశామని మొదటిసారి చెప్పాను. అప్పటివరకూ అది ఎవరికీ తెలీదు" అని హాషిమ్ బీబీసీ ఇంటర్వ్యూలో చెప్పారు.

జుల్ఫికర్ అలీ భుట్టో

ఫొటో సోర్స్, ZAHID HUSSEIN

ఫొటో క్యాప్షన్, జుల్ఫికర్ అలీ భుట్టో

ఫిబ్రవరి 2న హైజాకర్లతో మాట్లాడిన భుట్టో

అదే సమయంలో పీపుల్స్ పార్టీ వ్యవస్థాపకుడు జుల్ఫికర్ అలీ భుట్టో 1970 డిసెంబర్‌లో జరిగిన ఎన్నికల్లో పశ్చిమ పాకిస్తాన్‌లో మెజారిటీ సాధించారు. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి తూర్పు పాకిస్తాన్‌లో మెజారిటీ సాధించిన అవామీ లీగ్ చీఫ్ షేక్ ముజీబ్‌ మద్దతు కోరడానికి ఢాకాలో ఉన్నారు.

1971 ఫిబ్రవరి 2న లాహోర్ వచ్చిన తర్వాత భుట్టోకు విమానం హైజాక్ విషయం తెలిసింది.

ఆరోజు జరిగిన ఘటన గురించి పాక్ సీనియర్ జర్నలిస్ట్ ఖాలిద్ హసన్ 2003లో ఫ్రైడే టైమ్స్‌లో ఒక ఆర్టికల్ రాశారు.

"భుట్టో లాహోర్ చేరుకున్నప్పుడు ఆయనకు శుభాకాంక్షలు చెప్పడానికి విమానాశ్రయం దగ్గరకు వచ్చిన జనం, ఆయన హైజాకర్లను కూడా కలవాలని పట్టుబట్టారు. కానీ, ఆయన ఖాలిద్.. వాళ్లెవరో నాకు తెలీదు. నేను కలవను అన్నారు. కానీ జనం ఆయన్ను హైజాకర్లు ఉన్న విమానం వైపు నెట్టారు. అక్కడ వాళ్లను కలిసిన భుట్టో, వాళ్లతో కాసేపు మాట్లాడారు" అని రాశారు.

ఫిబ్రవరి 2న పాకిస్తాన్ మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీ హెచ్ ఖుర్షీద్‌ను విమానాశ్రయానికి వచ్చారు. ఆయన మక్బూల్ భట్‌తో కలిసి హాషిమ్ ఖురేషీని కలిశారు. ఆ విమానాన్ని తగలబెట్టేయాలని చెప్పమని తనకు సూచించారని హైజాకర్లతో అన్నారు.

తగలబడిన తర్వాత గంగా విమానం

ఫొటో సోర్స్, ZAHID HUSSEIN

కానీ మక్బూల్ భట్ హైజాకర్లకు విమానం అద్దాలు పగలగొట్టి కిందికి రావాలని, దాన్ని రిపేర్ చేయడానికి నాలుగైదు రోజులు పడుతుంది. అలా కొన్ని రోజులు మీకు పబ్లిసిటీ వస్తుందని హాషిమ్‌కు చెప్పారు.

వాళ్లు వెళ్లిపోగానే లాహోర్ ఎస్ఎస్‌పీ, కొంతమంది భద్రతా బలగాలు హాషిమ్ ఖురేషీ దగ్గరకు వెళ్లి విమానాన్ని తగలబెట్టడానికి మక్బూల్ భట్ పెట్రోల్ పంపించినట్లు చెప్పారు.

"వాళ్లు చెప్పింది నిజమేనా అని, నేను ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. అలా, 80 గంటల పాటు మా అదుపులో ఉన్న విమానానికి చివరకు నిప్పుపెట్టాం" అని హాషిమ్ ఖురేషీ చెప్పారు.

విమానానికి నిప్పుపెట్టాక, బయటికి వెళ్లే తలుపు వెంటనే తెరుచుకోకపోవడంతో ఇద్దరికీ చేతులు కాలాయి. మంటల నుంచి తప్పించుకోడానికి అష్రఫ్ విమానం నుంచి దూకేశాడు. గాయపడ్డ ఇద్దరినీ ఆస్పత్రిలో చేర్పించారు.

ఆస్పత్రిలో హాషిమ్ ఖురేషీ

ఫొటో సోర్స్, ZAHID HUSSEIN

ఫొటో క్యాప్షన్, ఆస్పత్రిలో హాషిమ్ ఖురేషీ

హైజాక్ జరిగిన తర్వాత లాహోర్‌లో విమానం ఉన్న 80 గంటల సమయంలోనూ పాకిస్తాన్ ఏజెన్సీలు గానీ, అధికారులు గానీ ఆ హైజాకర్లను బంధించాలని ఒక్కసారి కూడా ప్రయత్నించలేదు.

విమానం తగలబెట్టాక ఇద్దరు యువకులను విమానాశ్రయం బయటకు తీసుకొచ్చారు. అప్పటికే, వారిని అభినందించడానికి లాహోర్ వీధుల్లో భారీగా జనం గుమిగూడారు. వారికి స్వాగతం పలుకుతూ బ్యానర్లు కట్టారు. పూలు చల్లుతూ నినాదాలు చేస్తూ వారికి స్వాగతం పలికారు.

పీపుల్స్ పార్టీ నేత అహ్మద్ రజా కసూరీ, మరికొందరు నేతలు కూడా ప్రత్యేక ట్రక్కుల్లో ప్రయాణిస్తూ యువకులను ప్రశంసిస్తున్నారు. తర్వాత బీబీసీతో మాట్లాడిన అహ్మద్ రజా హైజాకర్లకు స్వాగతం పలకడానికి తనను పార్టీ నాయకత్వమే పంపించిందని చెప్పారు.

తర్వాత లాహోర్‌లోని ఇస్తాంబుల్ చౌక్ దగ్గర ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. అందులో మక్బూల్ భట్, హాషిమ్ ఖురేషీ, అహ్మద్ రజా కసూరీ, ఇంకా చాలామంది ప్రసంగించారు.

గాయపడి ఆస్పత్రిలో కొన్ని రోజులు చికిత్స పొందుతున్నప్పుడు పాకిస్తాన్‌లో అన్ని వర్గాలకు చెందిన ఎంతోమంది తనను చూడ్డానికి వచ్చేవాళ్లని, హైజాక్ చేసినందుకు మెచ్చుకునేవాళ్లని హాషిమ్ ఖురేషీ ఇంటర్వ్యూలో చెప్పారు.

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత వాళ్లను మక్బూల్ భట్, మిగతా నేతలతోపాటూ పాకిస్తాన్ పాలిత కశ్మీర్‌లోని మీర్పూర్ జిల్లాకు పంపించారు. దారిలో వారికి వేలమంది స్వాగతం పలికారు.

కానీ ఆ సంబరాలు, హైజాకర్లకు ప్రశంసలు ఎంతోకాలం కొనసాగలేదు.

హైజాక్ చేసిన వారికి ప్రశంసలు

ఫొటో సోర్స్, ZAHID HUSSEIN

పాకిస్తాన్ కుట్రా, లేక పాకిస్తాన్‌కు వ్యతిరేక కుట్రా

గంగా విమానం హైజాక్ ఘటనతో సీరియస్ అయిన భారత్, హైజాకర్లను అందరూ ప్రశంసిస్తున్న సమయంలోనే 1971 ఫిబ్రవరి 4న పాక్ విమానాలు తమ గగనతలం మీదుగా తూర్పు పాకిస్తాన్ వెళ్లడం నిషేధించింది. అది 1976 వరకూ కొనసాగింది.

విమానాన్ని పాకిస్తాన్ సాయంతో హైజాక్ చేసి, లాహోర్‌లో తగలబెట్టారని భారత్ ఆరోపించింది. సరిగ్గా అదే సమయంలో తూర్పు, పశ్చిమ పాకిస్తాన్‌లు అధికారం కోసం పరస్పరం పోటీ పడుతున్నాయి. తూర్పు పాకిస్తాన్‌లో వేర్పాటువాద ఉద్యమం కూడా జోరందుకుంటోంది.

స్పష్టమైన మెజారిటీ ఉన్నప్పటికీ అవామీ లీగ్‌కు అధికారం దక్కలేదు. దీంతో తూర్పు పాకిస్తాన్‌లో అంతర్యుద్ధం లాంటి పరిస్థితి ఏర్పడింది.

భారత గగనతలంపై తమ విమానాలు ఎగరకుండా నిషేధం విధించడంతో పశ్చిమ పాకిస్తాన్ నుంచి సైనికులను, ఆయుధాలను అక్కడికి పంపించడం కష్టమైపోయింది.

దాంతో, పశ్చిమ పాకిస్తాన్ నుంచి విమానాలు హిందూ మహా సముద్రం మీదుగా ఎగురుతూ, రీఫ్యూయలింగ్ కోసం మొదట శ్రీలంక వెళ్లేవి, అక్కడ నుంచి తూర్పు పాకిస్తాన్ వెళ్లేవి. ఇలా చుట్టు తిరిగి వెళ్లడం వల్ల పాకిస్తాన్ సమయం, డబ్బు రెండూ నష్టపోయింది.

1971లో హైజాక్ చేసిన భారత విమానం గంగ దగ్గర మక్బూల్ భట్, అతడి అనుచరులు

ఫొటో సోర్స్, MAQBOOL BUTT FACEBOOK PAGE

ఫొటో క్యాప్షన్, 1971లో హైజాక్ చేసిన భారత విమానం గంగ దగ్గర మక్బూల్ భట్, అతడి అనుచరులు

భారత నిఘా ఏజెన్సీ రా అధికారి, రా యాంటీ టెర్రరిస్ట్ విభాగం మాజీ చీఫ్ బి.రమన్ తన 'ద కౌబాయ్స్ ఆఫ్ రా: డౌన్ మెమరీ లేన్‌'లో దీని గురించి చాలా వివరంగా రాశారు.

"తూర్పు పాకిస్తాన్‌కు సాయం అందించడానికి నిఘా ఆపరేషన్ నిర్వహించాం. గంగా విమానం హైజాక్ ఘటనతో దానిని విజయవంతంగా అమలు చేశాం, జమ్ముకశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ ఇద్దరు సభ్యులు ఒక ఇండియన్ ఎయిర్ లైన్స్ విమానాన్ని హైజాక్ చేసినందుకు ప్రతీకారంగా ఇందిరాగాంధీ భారత గగనతలంలో పాకిస్తాన్ విమానాలపై ఆంక్షలు విధించాలని నిర్ణయించారు. దాంతో పశ్చిమ పాకిస్తాన్ నుంచి సాయుధ దళాలను తూర్పు పాకిస్తాన్‌కు పంపించి, అక్కడ పరిస్థితిని నియంత్రించడం కష్టమైంది. అలా తూర్పు పాకిస్తాన్‌లో మా విజయానికి మార్గ సుగమమైంది" అని చెప్పారు.

పాకిస్తాన్ విమానాల మీద భారత్ ఆంక్షలు విధించిన తర్వాత, గంగా హైజాకింగ్ పథకం ప్రకారం జరిగిందా, ఈ ఘటన సాకుతో గగనతలంపై ఆంక్షలు విధించడమే భారత్ లక్ష్యమా అని పాకిస్తాన్ అధికారులకు సందేహం కలిగింది.

అప్పటి మార్షల్ లా ప్రభుత్వం గంగా హైజాక్ ఘటన వెనుక ఉద్దేశాలను తెలుసుకోడానికి ఏక సభ్య కమిషన్ కూడా నియమించింది.

హాషిమ్ ఖురేషీ

ఫొటో సోర్స్, HASHIM QURESHI

ఫొటో క్యాప్షన్, హాషిమ్ ఖురేషీ

కొన్ని రోజుల తర్వాత ఆ కమిషన్ గంగా హైజాక్ ఘటన ప్రధానంగా భారత్ చేసిన ఒక కుట్ర అని, హాషిమ్ ఖురేషీ భారత ఏజెంట్ అని, దీనిని అమలు చేయడానికి ఆయన్ను బీఎస్ఎఫ్‌లో కూడా చేర్చుకున్నారని చెప్పింది.

పాకిస్తాన్ విమానాల మీద నిషేధం విధించి, తూర్పు పాకిస్తాన్‌లో ఆందోళనలను అణచివేయకుండా అడ్డంకులు సృష్టించాలనే ఇదంతా చేశారని కమిషన్ తన రిపోర్టులో పేర్కొంది.

కమిషన్ రిపోర్టు వచ్చిన కొన్ని వారాల్లోనే, పాకిస్తాన్‌ అంతటా ప్రశంసలు అందుకున్న హాషిమ్ ఖురేషీ ఆయన బృందం హఠాత్తుగా దేశంలోని ప్రభుత్వ ఏజెన్సీలకు నచ్చనివారుగా మారిపోయారు.

ఈ ఘటనతో సంబంధం ఉన్న మక్బూల్ భట్, డాక్టర్ ఫారూఖ్ హైదర్, అమానుల్లాహ్ ఖాన్, జావేద్ సాగర్, మిగతా వారిని కుట్ర ఆరోపణలతో అరెస్ట్ చేశారు.

ఈ కేసులో హాషిమ్ దాదాపు 9 ఏళ్లు జైల్లో ఉన్నారు. హైజాకింగ్, విమానం తగలబెట్టిన ఆరోపణల్లో వీరందరిపై విచారణలు నడిచాయి. ఈ కేసు కోసం ప్రత్యేక కోర్టు కూడా ఏర్పాటు చేశారు.

దీనిపై బీబీసీతో మాట్లాడిన హాషిమ్ ఖురేషీ "పాకిస్తాన్‌లోని షాహీ కోట జైల్లో ఉన్నప్పుడు నన్ను చాలా హింసించారు. దారుణంగా కొట్టారు. ఒక లిఖిత వాంగ్మూలంపై నాతో బలవంతంగా సంతకం చేయించుకున్నారు. అందులో భారత ప్రధాని ఇందిరాగాంధీ చెప్పినందుకే గంగా విమానం హైజాక్ చేశామని ఒప్పుకున్నట్టు ఉంది. కొట్టడం వల్ల మేం దానిపై సంతకం చేశాం. కానీ, ట్రయల్ కోర్టులో మాతో బలవంతంగా దానిపై సంతకం పెట్టించుకున్నారని చెప్పాం" మని ఆయన తెలిపారు.

పాక్ అప్పటి ప్రధాని జుల్ఫికర్ అలీ భుట్టో(కుడి చివర)తో మక్బూల్ భట్(ఎడమ చివర)

ఫొటో సోర్స్, MAQBOOL BUTT FACEBOOK PAGE

ఫొటో క్యాప్షన్, పాక్ అప్పటి ప్రధాని జుల్ఫికర్ అలీ భుట్టో(కుడి చివర)తో మక్బూల్ భట్(ఎడమ చివర)

హాషిమ్ కేసు 1971 డిసెంబర్ నుంచి 1973 మే వరకూ నడిచింది. అన్ని ఆధారాలూ పరిశీలించిన ట్రయల్ కోర్ట్ హైజాక్ కేసులో ఆయనను ప్రధాన నిందితుడుగా తేల్చింది. హాషిమ్‌పై గూఢచర్యం సహా చాలా ఆరోపణలు నమోదవడంతో, అన్నింటికీ కలిపి మొత్తం 19 ఏళ్ల జైలు శిక్ష విధించారు.

అష్రఫ్, మిగతావారికి మాత్రం చిన్న శిక్షలు విధించారు. దీనిపై హాషిమ్ ఇప్పటికీ ఆశ్చర్యం వ్యక్తం చేస్తారు. అష్రఫ్, మరో ఇద్దరితో కలిసి తాను హైజాక్ చేసినపుడు, శిక్షలు వేరువేరుగా ఎలా ఉంటాయని అన్నారు.

అష్రఫ్ ఖురేషీ విడుదలైన తర్వాత పంజాబ్ యూనివర్సిటీలో ఉన్నత విధ్య అభ్యసించారు. అక్కడే ప్రొఫెసర్‌గా పనిచేసి 2012లో చనిపోయారు.

హాషిమ్ ఖురేషీ మాత్రం తన విడుదల కోసం మరింత కాలం వేచిచూడాల్సి వచ్చింది. ఆయన తన శిక్షను సవాలు చేస్తూ అపీల్ చేసుకున్నారు. దానిపై తీర్పు రావడానికి ఏళ్లు పట్టింది. శిక్ష అనుభవిస్తున్నప్పుడు ఆయన్ను పాకిస్తాన్‌లోని వేరు వేరు జైళ్లలో ఉంచారు.

1980 మేలో సుప్రీంకోర్టు ముగ్గురు సభ్యుల ధర్మాసనం హాషిమ్ ఖురేషీకి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. తర్వాత ఆయన్ను జైలు నుంచి విడుదల చేశారు.

విడుదలైన తర్వాత కొన్నేళ్లు పాకిస్తాన్‌లోనే ఉన్న హాషిమ్ తర్వాత విదేశాలకు వెళ్లిపోయారు. ఇంగ్లండ్‌లో శాశ్వత నివాసి అయ్యారు. 2000లో తిరిగి శ్రీనగర్ వచ్చారు. ఆయన్ను న్యూ దిల్లీలో అరెస్ట్ చేశారు.

అధికారులు హాషీమ్‌పై పాకిస్తాన్ ఏజెంట్‌గా ముద్ర వేశారు. ఆయనపై గంగా విమానం హైజాక్ కేస్ నమోదు చేశారు. 20 ఏళ్లు గడిచినా ఆ కేసులో తీర్పు రాలేదు. ఆయన ఇప్పటికీ బెయిల్ మీద ఉన్నారు.

"భారత్‌లో పాకిస్తాన్ ఏజెంట్ అని, పాకిస్తాన్‌లో భారత ఏజెంట్ అని కేసులు నమోదైన ఏకైక వ్యక్తిని బహుశా నేనేనేమో" అంటారు హాషిమ్..

తాను ఏ దేశానికీ ఏజెంట్ కానని, రెండు దేశాల నుంచి కశ్మీర్‌కు విముక్తి కల్పించడానికే విమానం హైజాక్ చేశానని ఆయన చెప్పారు.

రా అధికారి రమన్ తన పుస్తకంలో రాసిన విషయాల గురించి మాట్లాడిన హాషిమ్.. బంగ్లాదేశ్ స్వాతంత్ర్యం కోసమే ఆ విమానాన్ని హైజాక్ చేసుంటే తనిప్పుడు బెంగాలీలకు హీరో అయ్యుండేవాడినని అంటారు.

హాషిమ్ ఏజెంటా లేక డబుల్ ఏజెంటా అనేది తాను చెప్పలేనని, కానీ, గంగా హైజాకింగ్ వల్ల పాకిస్తాన్‌ చాలా నష్టపోయిందని, తూర్పు పాకిస్తాన్‌లో జరిగిన వేర్పాటువాద ఉద్యమంపై దీని ప్రభావం చాలా ఉందని హాషిమ్ లాయర్ మంటో బీబీసీకి చెప్పారు.

"గంగా విమానం హైజాక్ ఘటన నుంచి రెండు దేశాలూ లబ్ధి పొందాలని చూశాయి. కానీ నిజానికి భారత్‌ మాత్రమే దానిని తనకు అనుకూలంగా మార్చుకోగలిగింది" అంటారు మంటో.

BBC Iswoty

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)