దక్షిణ కోస్తా రైల్వే జోన్: ప్రకటించి రెండేళ్లు అవుతున్నా పనులు ఎందుకు మొదలు కాలేదు... అడ్డం పడుతున్నదేంటి ?

విశాఖ రైల్వే స్టేషన్
    • రచయిత, శ్రీనివాస్ లక్కోజు
    • హోదా, బీబీసీ కోసం
మీ అభిమాన భారతీయ క్రీడాకారిణికి ఓటు వేసేందుకు CLICK HERE

విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ను 2019 ఫిబ్రవరి 27న కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. విజయవాడ, గుంటూరు,గుంతకల్ రైల్వే డివిజన్లు ఇందులో భాగంగా ఉంటాయి.

అనేక ఆందోళనలు, డిమాండ్ ల తర్వాత కేంద్రం జోన్ ను ప్రకటన చేసింది. అయితే అది ప్రకటనకే పరిమితమైంది. జోన్ ఏర్పాటు తర్వాత జరగాల్సిన పనులేవీ ఇంత వరకు మొదలు కాలేదు.

దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రకటనకు ముందు విశాఖపట్నంలోని దువ్వాడ నుండి విశాఖపట్టణం మీదుగా ఇచ్ఛాపురము వరకు, విజయనగరం మొదలు పార్వతీపురము మీదుగా కూనేరు వరకు, కొత్తవలస నుండి అరకు మీదుగా కొరాపుట్ వరకు తూర్పు కోస్తా రైల్వే జోన్ పరిధి. దీని జోనల్ హెడ్ క్వార్టర్ భువనేశ్వర్ లో ఉంది.

"విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ప్రకటించినా...ఎటువంటి పనులు ప్రారంభం కాకపోవడంతో ఇంకా తూర్పుకోస్తా రైల్వేగానే విశాఖ జోన్ కొనసాగుతోంది. విశాఖ‌ప‌ట్నం కేంద్రంగా ద‌క్షిణ‌ కోస్తా రైల్వే జోన్ డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్ (డీపీఆర్) ను కేంద్ర రైల్వే బోర్డుకు స‌మ‌ర్పించి 16 నెల‌లైంది.

2019 మార్చి 8న సౌత్ కోస్ట్ రైల్వే జోన్ కు ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డీ) నియమాకం జరిగింది. 2019 సెప్టెంబ‌ర్ మొద‌టి వారంలో ద‌క్షిణ కోస్తా రైల్వే జోన్ కు సంబంధించిన డీపీఆర్ ను రైల్వే బోర్డుకు అంద‌జేశారు. డీపీఆర్ అంద‌జేసిన 60 రోజుల్లో ప‌నులు ప్రారంభించాల్సి ఉంటుంది" అని ఉత్తరాంధ్ర హక్కుల పోరాట సమితి ప్రతినిధి రాము అన్నారు.

జోన్ ప్రకటించిన ఏడాది గడుస్తున్నా పనులు ఇంకా ప్రారంభం కాలేదు
ఫొటో క్యాప్షన్, జోన్ ప్రకటించిన ఏడాది గడుస్తున్నా పనులు ఇంకా ప్రారంభం కాలేదు

వాల్తేరు లేని జోన్ వద్దు

2019లో కేంద్రం ప్రకటించిన దక్షిణ కోస్తా రైల్వే జోన్ లో వాల్తేరు డివిజన్ ను రద్దు చేసింది. ఈ డివిజన్ లోని కొంత భాగంతో ఒడిశాలోని రాయగడ కేంద్రంగా ఒక డివిజన్ ఏర్పాటు చేసింది.

మిగిలిన భాగాన్ని,అంటే విశాఖ నగరంతో సహా విజయవాడ డివిజన్లో కలిపింది. విజయవాడ,గుంటూరు,గుంతకల్లు డివిజన్లతో కొత్త జోన్ ప్రకటించింది.

"125 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న వాల్తేరు రైల్వే డివిజన్ పరిధిలో విశాఖపట్నం,విజయనగరంతోపాటు ఒడిషాలోని అనేక ప్రాంతాలు ఉన్నాయి. ప్రధాన స్టేషన్లలో ఎక్కువగా ఒడిషా రాష్ట్రం పరిధిలోకి వస్తాయి. ఒడిశా వాసులను సంతృప్తి పరిచేందుకు కేంద్రం రాయగడ డివిజన్ ను ప్రకటించి వాల్తేరు డివిజన్ ను చరిత్రలో కలిపేసింది.

దక్షిణకోస్తా పేరుతో కొత్త రైల్వే జోన్ ఇవ్వడం మంచిదే. కానీ ప్రధాన ఆదాయ వనరైన వాల్తేరు డివిజన్ లేకుండా చేయడం సరైన చర్య కాదు" అని టీడీపీ సీనియర్ లీడర్ బండారు సత్యనారాయణ అన్నారు.

"రైల్వే బోర్డు తక్ష‌ణం స్పందించి డీపీఆర్ కు ఆమోద ముద్ర వేసి కార్య‌క‌లాపాలు మొదలుపెట్టాలి. ద‌క్షిణ మ‌ధ్య రైల్వేలో ఉన్న గుంత‌క‌ల్, విజ‌య‌వాడ‌, గుంటూరు డివిజ‌న్ల‌ను మాత్ర‌మే క‌లుపుతూ ద‌క్షిణ కోస్తా రైల్వే జోన్ ను ఏర్పాటు చేయ‌డం స‌రికాదు. ఎంతో చ‌రిత్ర ఉన్న తూర్పుకోస్తా రైల్వేలో ఉన్న వాల్తేరు డివిజ‌న్ ను య‌థావిధిగా కొన‌సాగిస్తూ...దక్షిణ కోస్తా రైల్వో జోన్ ఏర్పాటు చేయాలి" అని ఉత్తరాంధ్ర రక్షణ వేదిక అధ్యక్షులు శివ‌శంక‌ర్ అన్నారు.

జోన్ పనుల కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నామని ఉత్తరాంధ్ర ఎంపీలు చెబుతున్నారు
ఫొటో క్యాప్షన్, జోన్ పనుల కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నామని ఉత్తరాంధ్ర ఎంపీలు చెబుతున్నారు

రాజకీయ ఒత్తిడితోనే సాధ్యం

విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఉత్తరాంధ్రవాసుల దశాబ్ధాల కల. రాష్ట్ర విభజన సమయంలో విశాఖ రైల్వే జోన్ ఉద్యమం ఊపందుకుంది. అప్పటీ నుంచి తీవ్రస్థాయిలో జరిగిన అందోళనలు,ఉద్యమాలతో దక్షిణ కోస్తా రైల్వే పేరుతో విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ ని 2019లో కేంద్రం ప్రకటించింది.

"రైల్వే జోన్ వ్యవహారంలో ఏదీ చేయాలన్నా...అది కేవలం రైల్వే బోర్డుతోనే మాత్రమే సాధ్యమవుతుంది. రైల్వే బోర్డుని ప్రభావితం చేయగలిగేది రాజకీయ లాబీయింగ్ మాత్రమే. రైల్వే మినిస్ట్రీ కేవలం ఆలోచనలు చేయడం వరకే పరిమితం.

అందుకే విశాఖ రైల్వే జోన్ కార్యక్రమాలు వెంటనే మొదలవ్వాలంటే మన ఎంపీలు,ముఖ్యమంత్రి తీవ్రంగా ప్రయత్నం చేయాలి. గత 30ఏళ్లుగా విశాఖ ఎంపీలుగా ఎన్నికైన వాళ్లేవరూ కూడా స్థానికులు కాకపోవడం కూడా రాజకీయ ప్రయత్నంలో నిర్లక్ష్యానికి ఒక కారణం" అని రైల్వే ఉద్యోగ సంఘం ప్రతినిధి ఎస్.గంగారామ్ బీబీసీతో అన్నారు.

రైల్వే జోన్

సింగిల్ బెడ్ రూం ప్లాట్ చాలు

కొత్త రైల్వే జోన్ ఏర్పాటు ప్రకటన తరువాత...ఓఎస్డీదే ప్రధాన పాత్ర. జోన్ పరిధిలో ఉన్న..అలాగే జోన్ ను ఏర్పాటుకి సహకారం అందించే డీఆర్ఎంలతో మాట్లాడుతూ సమన్వయం చేయాలి. కానీ... విశాఖ రైల్వే జోన్ కి ప్రత్యేకంగా ఓఎస్డీ కూడా లేరు. విజయవాడ డీఆర్ఎంకే...విశాఖ రైల్వే జోన్ ఓఎస్డీగా అదనపు బాధ్యతలు అప్పగించారు.

"ఒక జోన్ కి ఏర్పాడాలంటే కనీసం మూడు డివిజన్లు ఉండాలి. అందుకే విజయవాడ,గుంటూరు,గుంతకల్లు డివిజన్ చేశారు. జోన్ పనులు ప్రారంభించాలంటే ముందు జోనల్ హెడ్ క్వార్టర్ రావాలి. దానికి పెద్ద పెద్ద బిల్డింగులు, భవంతులు అవసరం లేదు. హెడ్ క్వార్టర్ పేరుతో సింగిల్ బెడ్ రూం ప్లాట్ లో ఆఫీసు ప్రారంభించినా చాలు " అని వాల్తేరు డివిజన్ లో ఉన్నతాధికారిగా ఉద్యోగ విరమణ చేసిన తాతారావు బీబీసీతో అన్నారు.

‘‘విజయవాడ డీఆర్ఎంకి అదనపు బాధ్యతలు అందించడం సరైన విధానం కాదు. ఇది జోన్ పట్ల చిత్తశుద్ధి లేదనే విషయాన్ని స్పష్టం చేస్తుంది’’ అన్నారాయన.

దక్షిణ కోస్తా రైల్వే జోన్

రూ. 3 కోట్లతో ముద్ర పడింది

రాష్ట్ర విభజన హామీల్లో భాగంగా ఆర్భాటంగా విశాఖకి రైల్వే జోన్ ని ప్రకటించిన కేంద్రం నిధులు విడుదల చేయడంలో మాత్రం అలసత్వం వహిస్తోందని స్థానికులు విమర్శిస్తున్నారు. ఇప్పటి వరకు దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ కోసం కేవలం రూ. 3 కోట్లు మాత్రమే కేటాయించింది.

"అరకొర నిధులిచ్చి పనులు ప్రారంభించకుండా అలస్యం చేయడం కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయంగానే భావించాలి. మన ఎంపీలు లాబీయింగ్ లేకపోవడం వల్లే కేంద్రం కూడా విశాఖ రైల్వే జోన్ పనులు ప్రారంభించడంలో అలసత్వం చూపుతోంది. వాల్తేరు డివిజన్ తో కూడిన విశాఖ రైల్వే జోన్ ఏర్పడేలా కేంద్రంపై ఎంపీలు ఒత్తిడి తేవాలి" అని ఏయూ జర్నలిజం విభాగాధిపతి డీవీఆర్ మూర్తి అన్నారు.

డీపీఆర్ ఓకే అయితే చాలు

దక్షిణ కోస్తా జోన్ పనులు ప్రారంభం కాకపోవడంపై రైల్వేశాఖ సీనియర్ అధికారులతో మాట్లాడింది బీబీసీ. " జోన్ ఏర్పాటుకు ఉన్న సౌకర్యాలు,సమస్యలు,భూ సేకరణ, ఉద్యోగుల బదిలీలు వంటి అంశాలతో కూడిన డీపీఆర్ రైల్వే బోర్డు పరిశీలనలో ఉంది. దానికి త్వరలోనే అమోద ముద్రపడుతుందని అనుకుంటున్నా. డీపీఆర్ ఆమోదం పొందడమే ప్రధానం’’ అని దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ బాధ్యతలు చూస్తున్న ఎస్.ఎస్ శ్రీనివాస్ అన్నారు.

‘‘ రాబోయే బడ్జెట్ లో దక్షిణ కోస్తా రైల్వే జోన్ కు నిధులు కేటాయింపు జరుగుతుందని ఆశిస్తున్నాను" అని శ్రీనివాస్ బీబీసీతో అన్నారు.

దక్షిణ కోస్తా రైల్వే జోన్

మేం ప్రయత్నిస్తూనే ఉన్నాం: ఉత్తరాంధ్ర ఎంపీలు

రైల్వే జోన్ పనులు ప్రారంభం కాకపోవడానికి ప్రధాన కారణం రాజకీయంగా ఒత్తిడి తీసుకురాలేక పోవడమేనని పలువురు అభిప్రాయపడుతుండగా, ఈ అభిప్రాయం తప్పు అంటున్నారు ఉత్తరాంధ్ర ఎంపీలు.

" ప్రధానితోపాటు రైల్వే బోర్డు, రైల్వే మంత్రిత్వ శాఖ అధికారులను కలిశాం. వాల్తేరుతో కూడిన జోన్ కావాలని డిమాండ్ చేశాం. ఎంపీలందరం ప్రధానికి నివేదిక కూడా ఇచ్చాం. రానున్న బడ్జెట్‌లో నిధులు వస్తాయని, వెంటనే పనులు ప్రారంభమవుతాయని మేం భావిస్తున్నాం" అని శ్రీకాకుళం ఎంపీ రామ్మెహన్ నాయుడు అన్నారు.

"ఎంపీలు ఒత్తిడి చేయకపోవడం వల్లే జోన్ పనులు మొదలు కాలేదనే మాట అవాస్తవం. ఎంపీగా నేను విశాఖ రైల్వే జోన్ పనులు ప్రారంభం కోసం చాలా ప్రయత్నాలు చేశా. ఇప్పటికీ చేస్తున్నా" అని విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ బీబీసీతో అన్నారు.

‘జోన్ వస్తుందని నమ్మకం లేదు’

రైల్వేని ప్రైవేటీకరణ చేసేందుకు అడుగులు వేస్తున్న ఎన్డీయే ప్రభుత్వం దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుకు సహకరిస్తుందని భావించడం లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సి.హెచ్.నర్సింగరావు అన్నారు.

"డీపీఆర్ ని అమోదించడం లేదంటే దాని అర్థం జోన్ పట్ల కేంద్రానికి చిత్తశుద్ధి లేదని. ప్రజారవాణా వ్యవస్థలను ప్రైవేటీకరించేందుకు మోడీ సర్కార్ ప్రయత్నిస్తోంది. రైల్వే జోన్లను కుదించేందుకు చూస్తున్న ఈ ప్రభుత్వం కొత్తజోన్ ను ఏర్పాటు చేయదు" అని నర్సింగరావు అభిప్రాయపడ్డారు.

BBC Iswoty

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)