విశాఖకు రైల్వే జోన్: సౌత్ కోస్ట్ రైల్వేగా నామకరణం

పీయూష్ గోయల్

ఫొటో సోర్స్, Getty Images

విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. రైల్వే మంత్రి పీయూష్ గోయల్ కొద్దిసేపటి క్రితం ఈ ప్రకటన చేశారు.

ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్టం 2014లోని అంశాల ప్రకారం... కొత్త రైల్వే జోన్ ఏర్పాటుకు భారత రైల్వేలు పరిశీలించాలని ఉంది. ఈ అంశాన్ని అన్ని కోణాలనుంచి పూర్తిగా పరిశీలించిన తర్వాత విశాఖ పట్నం కేంద్రంగా సౌత్ కోస్ట్ జోన్ (ఎస్‌సీఓఆర్) పేరుతో కొత్త జోన్ ఏర్పాటుకు అంగీకారం తెలిపిందని మంత్రి తెలిపారు.

ప్రస్తుత దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్, సికింద్రాబాద్, నాందేడ్ డివిజన్లతో కొనసాగుతుందని చెప్పారు.

ఈరోజు దీనిపై నిర్ణయం తీసుకున్నాం, దీనికి అవసరమైన తదుపరి చర్యలు కొనసాగుతాయి అని గోయల్ ప్రకటించారు.

విశాఖ రైల్వే జోన్

ఫొటో సోర్స్, Indian Railway

ఫొటో క్యాప్షన్, విశాఖ రైల్వే జోన్ ప్రకటన

ఆంధ్ర ప్రదేశ్ అంతా ఒకటే జోన్

ఇకపై ఉత్తరాంధ్ర ప్రాంతం కూడా ఈ కొత్త జోన్లో ఉండబోతోంది. అంటే దాదాపు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం అంతా ఈ దక్షిణ కోస్తా జోన్ పరిధిలోకి రాబోతోంది.

నిజానికి విశాఖ వాసుల చిరకాల కోరిక వాల్తేరు డివిజన్‌ను భువనేశ్వర్ కేంద్రంగా ఉన్న తూర్పు కోస్తా రైల్వే నుంచి విభజించి సికింద్రాబాద్ కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య రైల్వేలో కలపాలని.

రాష్ట్ర విభజన తరువాత ఆ డిమాండ్ మారింది. ఏపీకి కొత్తగా ఇస్తామన్న జోన్‌ను విశాఖలోనే ఏర్పాటు చేయాలన్న డిమాండ్ మొదలైంది. వాస్తవానికి రైల్వేలకు విజయవాడ పెద్ద కేంద్రం. అక్కడ ఒక కొత్త జోన్ ఏర్పాటు చేయడానికి తగినన్ని వసతులు కూడా ఉన్నాయి. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా విశాఖలోనే కొత్త జోన్ పెట్టాలనడంతో ఆ డిమాండుకు మరింత బలం పెరిగింది.

తాజా నిర్ణయంతో వాల్తేరు రైల్వే డివిజన్ రద్దవుతుంది. ఈ డివిజన్ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలతో పాటూ ఒడిశా, ఛత్తీస్‌ఘఢ్‌లోని భాగాలను కవర్ చేస్తుంది. ఇప్పుడు దీన్ని రెండుగా విభజించి, అందులో సగ భాగాన్ని విజయవాడ డివిజన్లో కలుపుతారు. మిగిలిన సగంతో రాయగడ కేంద్రంగా కొత్త డివిజన్ ఏర్పాటు చేసి తూర్పు కోస్తా రైల్వేలో కలుపుతున్నారు.

ఒక రైల్వే జోన్ ఏర్పాటు చేయాలంటే కనీసం మూడు డివిజన్లు ఉండాలి. వాల్తేరు డివిజన్ తీసేస్తే తమకు ఇబ్బంది అని ఇప్పటి వరకూ తూర్పు కోస్తా రైల్వే భావిస్తూ వచ్చేది. ఇప్పుడు ఆ సమస్య లేకుండా రాయగడ కొత్త డివిజన్ ఏర్పాటైంది.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)