గూగుల్‌కు వ్యతిరేకంగా పోరాడి గెలిచిన మహిళ

- రచయిత, జేమ్స్ క్లేటన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ప్రతీ వ్యక్తికి సహనం నశించిపోయే క్షణం ఒకటి వస్తుంది. అది ఎంత చిన్న విషయమైనా కావొచ్చు, పెద్ద పోరాటానికి దారి తీస్తుంది.
షానన్ వెయిట్‌కు గూగుల్ సంస్థ ఇచ్చిన వాటల్ బాటిల్ మూత పగిలిపోయినప్పుడు ఆ క్షణం ఎదురైంది.
షానన్ పని చేస్తున్న డాటా సెంటర్ చాలా వేడిగా ఉంటుంది. దాంతో తనకు మరొక నీళ్ల సీసా కావాలని అడిగారు.
కానీ, గూగుల్ సబ్‌కాంట్రాక్టర్ మరొక బాటిల్ ఇవ్వనన్నారు.
అయితే, ఆ విషయం అక్కడితో ఆగిపోకుండా, గూగుల్ సంస్థ తమ ఉద్యోగుల బాగోగులకు సంబంధించిన ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకునే పరిస్థితి కల్పించింది.
తమ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు పని వాతావరణం, జీతం గురించి ఒకరితో ఒకరు చర్చించుకునే హక్కు ఉందని తెలుపుతూ గత వారం గూగుల్ ఒక ప్రకటన విడుదల చేసింది.
ఇది వింతగా అనిపించొచ్చు. గూగుల్‌లాంటి సంస్థ ఇలాంటి ప్రకటన చేయడం ఆశ్చర్యాన్ని కలిగించొచ్చు.
కానీ అదే నిజం. షానన్, గూగుల్‌తో చేసిన పోరాటం ఫలితమే ఈ ప్రకటన.

షానన్ ఎవరు? ఏం జరిగింది?
పెద్ద పెద్ద టెక్ కంపెనీల్లో మేనేజ్మెంట్ పద్ధతులెలా ఉంటాయో, ఒక్కోసారి అవి పరిధి దాటి ఎలా జోక్యం చేసుకుంటాయో షానన్ కథ తెలుపుతుంది.
షానన్ 2018లో డిగ్రీ పూర్తి అయిన తరువాత, సౌత్ కరోలినాలోని గూగుల్ డాటా సెంటర్‌లో గంటకు 15 డాలర్ల జీతానికి ఉద్యోగంలో చేరారు.
"సర్వర్ సమస్యలు పరిష్కరించడం, హార్డ్ డ్రైవ్‌లు, మదర్‌బోర్డులు మార్చడం, సుమారు 14 కేజీలున్న పెద్ద పెద్ద బ్యాటరీలను ఎత్తి పెట్టడం.. ఇది చాలా కష్టమైన పని" అని షానన్ తన ఉద్యోగం గురించి వివరించారు.
సాధారణంగా గూగుల్ ఆఫీసులు సృజనాత్మకంగా ఉండి, ఉల్లాసంగా పని చేసేందుకు కావలసిన సౌకర్యాలతో నిండి ఉంటాయని ప్రసిద్ధి. టేబుల్ టెన్నిస్, ఉచితంగా తినుబండాలు, మ్యూజిక్ రూమ్స్.. ఇలా ఫన్ యాక్టివిటీస్ కూడా ఉంటాయని చెప్తారు.
అయితే, అందరూ చెప్పుకుంటున్నట్లు గూగుల్ ఆఫీసులేమీ అంత ఆహ్లాదకరంగా ఉండవని షానన్ అంటున్నారు.
"సినిమాల్లో చూపించినట్టు ఉద్యోగులు రోజంతా సరదాగా గేమ్స్ అవీ ఆడుకుంటూ ఉండరు. డాటా సెంటర్ వాతావరణ పూర్తిగా వేరే" అని ఆమె అన్నారు.
షానన్ గూగుల్‌లో కాంట్రాక్ట్ పద్ధతిలో చేరారు. అంటే గూగుల్ నేరుగా ఆమెను ఉద్యోగంలో చేర్చుకోలేదు. మోడిస్ అనే సబ్‌కాంట్రాక్టర్ ద్వారా అందులో చేరారు. మోడిస్, అడెకో అనే మరో పెద్ద సంస్థలో భాగం.
ఇలాంటి వ్యవహారాలు గూగుల్‌లో సర్వ సాధారణం. గూగుల్‌లో పని చేస్తున్న సగం మంది ఇలాగే మరొక కంపెనీ ద్వారా కాంట్రాక్ట్ పద్ధతిలో చేరిన వారేనని రిపోర్టులు చెబుతున్నాయి.
అయితే ఇంత క్లిష్టమైన వ్యవస్థలో తప్పు జరిగితే దాని భారం ఎవరి మీద పడుతుంది అనేది మరింత సంక్లిష్టమైన వ్యవహరం అవుతుంది.
ప్రస్తుతం షానన్ కథలో అలాంటి సమస్యే ఉత్పన్నమైంది.
కోవిడ్ 19 ప్రారంభమైనప్పటి నుంచీ, పని భారం బాగా పెరిగిందని షానన్ తెలిపారు. షిఫ్ట్‌లో పని బాగా పెరిగిందని, అయితే అందులో కొంత ఆహ్లాదకరమైన సంగతులూ ఉన్నాయని ఆమె చెప్పారు.
"2020 మే వచ్చేటప్పటికి, ఉద్యోగుల విలువ, గౌరవాన్ని దృష్టిలో పెట్టుకుని కోవిడ్ మహమ్మారిని ఎదుర్కొంటామని గూగుల్ ప్రకటించింది.
కాంట్రాక్ పద్ధతిలో చేరిన వారితో సహా గూగుల్ ఉద్యోగులందరికీ బోనస్ ఇస్తామని తెలిపింది.
అయితే, మేము బోనస్ డబ్బుల కోసం ఎదురు చూస్తూనే ఉన్నాంగానీ మా బ్యాంక్ అకౌంట్లలో ఆ డబ్బులు పడలేదు. ఆ డబ్బు ఏమైంది, ఎందుకు చేతికి అందట్లేదనే ఆందోళన మొదలైంది" అని షానన్ వివరించారు.
అప్పుడే ఆ సంస్థలో పని చేస్తున్నవాళ్లంతా దీని గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఎవరెవరికి ఎంతెంతె బోనస్ రావాలి, ఎప్పటికల్లా రావాలి లాంటి విషయాలన్నీ చర్చించుకుంటూ ఉన్నారు.
"మేమంతా జీతాలు, బోనస్‌ల గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. అయితే, ఈ విషయం మేనేజ్మెంట్‌కి తెలిసినప్పుడల్లా ఒకరి జీతాల గురించి ఒకరితో మాట్లాడుకోవద్దని హెచ్చరించారు" అని షానన్ చెప్పారు.
"మీకు వచ్చే బోనస్‌లు, పరిహారాల గురించి మీ తోటి ఉద్యోగులతో మాట్లాడడం సరైన పని కాదు" అని చెప్తూ షానన్‌కు ఒక మేనేజర్ దగ్గర నుంచి వ్యక్తిగత సందేశం కూడా వచ్చింది.

అయితే, కొన్ని రోజుల తరువాత షానన్‌కు రావలసిన బోనస్ వచ్చింది.
కానీ, తనకు అప్పటివరకూ ఉన్న భ్రమలన్నీ తొలగిపోయాయని ఆమె అన్నారు.
గూగుల్‌లో ఎప్పటికైనా తనకు ఫుల్-టైమ్ ఉద్యోగం వస్తుందని షానన్ ఆశిస్తూ వచ్చారు.
కానీ, అక్కడ "పెర్మా-టెంప్స్" అనే ఒక కల్చర్ ఉందని ఆమె గమనించారు. అంటే, కాంట్రాక్ట్ పద్ధతిలో తాత్కాలిక ఉద్యోగాల్లో చేరినవారు ఎంత కష్టపడినాగానీ అక్కడ ఫుల్-టైమ్ ఉద్యోగం సంపాదించలేరు.
షానన్ సహనం నశించిన క్షణం
ఇలా అనేక రకాలుగా అక్కడి మేనేజ్మెంట్ పద్ధతులతో షానన్ విసిగిపోయారు. ఆమె సహనం నశించింది.
"డాటా సెంటర్‌లో చాలా వేడిగా ఉంటుంది. అందుకని, గూగుల్ నాకొక వాటర్ బాటిల్ ఇచ్చింది. అయితే, దాని మూత విరిగిపోయింది.
నా తోటి ఉద్యోగికి కూడా అదే జరిగింది. తను ఫుల్-టైం ఉద్యోగి. తనకు కొత్త బాటిల్ ఇచ్చారుగానీ నాకివ్వలేదు. దాంతో ఆరోజు ఇంటికెళ్లిన తర్వాత ఫేస్బుక్‌లో ఒక పోస్ట్ పెట్టాను. ఇంక భరించలేను అనిపించింది.
మర్నాడు ఆఫీస్‌కు వెళ్లాక నన్ను మీటింగ్ రూమ్‌లోకి పిలిచారు. అక్కడ మేనేజర్లు అందరూ కూర్చుని ఉన్నారు.
నేను రాసిన ఫేస్బుక్ పోస్టు సంస్థ నియమావళిని ఉల్లంఘించించని చెప్పారు. నావలన సంస్థ భద్రతకు ముప్పు ఉందని చెప్తూ నా బ్యాడ్జ్, ల్యాప్‌టాప్ వెంటనే వెనక్కి ఇచ్చేయమని చెప్పారు. నన్ను దగ్గరుండి మరీ ఆఫీస్ నుంచి బయటకు పంపించారు" అని షానన్ వివరించారు.
2021 జనవరిలో గూగుల్ ఉద్యోగుల కోసం 'ఆల్ఫాబెట్ వర్కర్స్ యూనియన్' ఏర్పడినప్పటికీ దాన్ని అమెరికా నేషనల్ లేబర్ రిలేషన్స్ బోర్డు గుర్తించలేదు.
అంతేకాకుండా, మెజారిటీ గూగుల్ ఉద్యోగులు ఇందులో సభ్యులుగా చేరలేదు.
కానీ, షానన్ ఇందులో ఉన్నారు. తన కేసును ఈ బోర్డ్ టేకప్ చేసింది.
ఫిబ్రవరిలో ఈ యూనియన్, షానన్ తరుపున న్యాయవిరుద్ధమైన కార్మిక చట్టాల కింద రెండు కేసులు వేసింది.
ఒకటి, అన్యాయంగా ఆమెను ఉద్యోగంలోంచి తీసేశారని, రెండోది, జీతాలు, బోనస్‌ల గురించి మాట్లాడొద్దని తన మేనేజర్లు హెచ్చరించారని.
ఫలితంగా, కిందటి నెల గూగుల్, మోడిస్, ఆల్ఫాబెట్ వర్కర్స్ యూనియన్ మధ్య ఒక ఒప్పందం కుదిరింది.
షానన్ సస్పెన్షన్ ఉపసంహరించారు.
అలాగే, "తమ సంస్థ ఉద్యోగులకు వేతనాలు, బోనస్‌లు, పని వాతావరణం గురించి చర్చించుకునే హక్కులు ఉంటాయని" పేర్కొంటూ గూగుల్ ఒక ఒప్పంద పత్రంలో సంతకం చేసింది.
ఇది షానన్‌కు, కొత్తగా ఏర్పడిన యూనియన్‌కు కూడా ఒక గొప్ప విజయం.

"ఇలాంటి పెద్ద పెద్ద మల్టినేషనల్ కంపెనీల వేర్‌హౌస్, డాటా సెంటర్లలో పని చేసే ఉద్యోగులకు, వారి చిన్న చిన్న హక్కులు పొందే భాగ్యం కూడా ఉండదు. ఈ విషయంలో అందరూ విసిగిపోతున్నారు. ఈ కంపెనీలు మా బాధలను పట్టించుకోవట్లేదని గ్రహించాం. అందుకే, వాళ్లు మా బాధలు వినేలా చేస్తాం" అని షానన్ అన్నారు.
గత వారం, అలబామాలోని అమెజాన్ సంస్థలో వర్కర్స్ యూనియన్ ఏర్పాటుపై ఎన్నికలు జరిగాయి. అది ఏర్పడకూడదని అమెజాన్ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఆ ఎన్నికల ఫలితాలు త్వరలో ప్రకటించనున్నారు. బిగ్ టెక్ కంపెనీకి, దాని ఉద్యోగులకు మధ్య జరుగుతున్న సంఘర్షణల్లో ఇది తాజా సంఘటన.
"ఈ మొత్తం విషయంలో ప్రజలు గ్రహించవలసింది ఏమిటంటే.. గూగుల్ ఉద్యోగులందరికీ ఏడంకెల జీతం రాదు. అలాగే, చాలా కింది స్థాయి ఉద్యోగులు కూడా బలంగా నిలబడగలరు. వారి శక్తిని తక్కువ అంచనా వేయకూడదు" అని షానన్ అన్నారు.

గూగుల్ ఏమంటోంది?
ఈ విషయంలో తమ తప్పొప్పుల గురించి గానీ, కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాల గురించిగానీ గూగుల్ ఏమీ వ్యాఖ్యానించలేదు.
షానన్ కేసుపై గూగుల్ అభిప్రాయాన్ని బీబీసీ కోరగా.. అదనంగా చెప్పడానికేమీ లేదని తెలిపింది.
అడెకో సంస్థ మాత్రం బీబీసీ అభ్యర్థనకు స్పందించలేదు.
షానన్ మళ్లీ గూగుల్ డాటా సెంటర్‌లో చేరాలని అనుకోవట్లేదు.
చరిత్రలో పీహెచ్‌డీ చేయాలన్నది ఆమె ఆకాంక్ష.
అయితే, ఒక పెద్ద టెక్ కంపెనీ మీద ఒక చిరు ఉద్యోగి సాధించిన అరుదైన విజయంగా ఇప్పటికే ఆమె కథ చరిత్రలో స్థానం సంపాదించుకుంది.
ఇవి కూడా చదవండి:
- గూగుల్ ‘గుత్తాధిపత్యం’ మీద కేసు నమోదు చేసిన అమెరికా ప్రభుత్వం
- కరోనావైరస్: భారత్‌లో 10 కోట్ల డోసులు దాటిన వ్యాక్సినేషన్
- బీజేపీ నేతలపై కశ్మీర్లో దాడులు ఎందుకు పెరుగుతున్నాయి...
- వైయస్ షర్మిల: 'రెండంచుల కత్తి' పార్టీ లక్ష్యం ఏమిటి? - అభిప్రాయం
- సెక్సువల్ హెల్త్: 'నేను సెక్స్ చేస్తున్నానని మా అమ్మకు చెప్పలేను... జాగ్రత్తగా ఎలా ఉండాలో నాకు తెలుసు'
- ట్రాన్స్లేటర్ల ఉద్యోగాలకు కంప్యూటర్లు ఎసరు పెట్టగలవా?
- కరోనావైరస్: భారత్‌లోని 18 రాష్ట్రాల్లో ‘డబుల్ మ్యూటెంట్ వేరియంట్’.. తెలుగు రాష్ట్రాల్లో 104 మందిలో యూకే, 20 మందిలో దక్షిణాఫ్రికా వేరియంట్
- గూగుల్‌లో నకిలీ రివ్యూలపై న్యాయపోరాటం చేస్తానంటున్న కార్ల కంపెనీ యజమాని
- కుతుబ్ మినార్ స్థానంలో అంతకు ముందు హిందూ దేవాలయం ఉండేదా?
- వీగర్ ముస్లిం జాతిని చైనా సమూలంగా తుడిచిపెట్టేస్తోందా? బ్రిటన్ నివేదికలో ఏం బయటపడింది?
- తమిళనాడు ఎన్నికల వల్లే శ్రీలంక వ్యతిరేక తీర్మానంపై ఓటింగ్‌కు భారత్ గైర్హాజరయ్యిందా...
- న్యూజీలాండ్ ప్రభుత్వం 'తల్లుల' కోసం చేసిన చట్టంపై చర్చ ఎందుకు... భారత్‌లో పరిస్థితి ఏంటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








