గూగుల్: నకిలీ రివ్యూలపై న్యాయపోరాటం చేస్తానంటున్న కార్ల కంపెనీ యజమాని- Newsreel

గూగుల్ లోగో

ఫొటో సోర్స్, Reuters

తన వ్యాపారానికి నష్టం కలిగించేలా గూగుల్‌లో ఉన్న నకిలీ రివ్యూలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని ఒక కార్ల కంపెనీ యజమాని తెలిపారు.

రిచర్డ్ బోట్ రైట్‌ అనే వ్యక్తికి చెందిన కంపెనీ యుకెలోని ఎస్సెక్స్ బ్రెయిన్ ట్రీలో ఉంది. తన సంస్థ గురించి కొంత మంది రాసిన సమీక్షలను తొలగించేందుకు గూగుల్ అంగీకరించకపోవడంతో తనకు చాలా నిస్సహాయంగా అనిపించిందని ఆయన చెప్పారు.

ఈ రివ్యూలన్నీ కల్పితమని ఆధారాలు చూపించినప్పటికీ గూగుల్ పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు. అయితే, వినియోగదారులు రాసే సమీక్షలను తాము ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉంటామని గూగుల్ అంటోంది.

గూగుల్ మ్యాప్ సర్వీసులలో ఈ కార్ల కంపెనీ సేవలు బాలేవని రాస్తూ సింగిల్ (1) స్టార్ రివ్యూలున్నాయి. "ఈ కంపెనీ సేవలు తీసుకున్న నేను చాలా దురదృష్టవంతుడిని" అంటూ కొందరు రివ్యూలు రాశారు.

ఇలాంటి సమీక్షలు "కనిపించకుండా దాడి చేస్తాయి’’ అని బోట్ రైట్ అంటున్నారు. "ఈ సమీక్షలు రాసేవారు నకిలీ వ్యక్తులు. ఏం చేయాలో కూడా అర్ధం కాదు. చాలా నిస్సహాయంగా అనిపిస్తోంది" అని ఆయన అన్నారు. గూగుల్ వినియోగదారులు రోజుకు 2 కోట్ల రివ్యూలు పోస్టు చేస్తారు. వారు రాసే రివ్యూలు నిజమైనవని అంటూ, ఇవి చాలా ఉపయోగకరంగా ఉంటాయని గూగుల్ అంటోంది. గూగుల్ నియమాలను ఉల్లఘించే సమాచారాన్ని 24 గంటలూ తాము పర్యవేక్షిస్తూనే ఉంటామని తెలిపింది.

నకిలీ రివ్యూలు ప్రపంచవ్యాప్తంగా వివిధ వేదికలపై ఉన్నాయని, వినియోగదారుల క్రయ విక్రయ నిర్ణయాలను ఈ రివ్యూలు ప్రభావితం చేస్తాయని వినియోగదారుల హక్కుల సంస్థకు చెందిన ఆడమ్ ఫ్రెంచ్ చెప్పారు.

నకిలీ రివ్యూలను నిరోధించడానికి గూగుల్ లాంటి సంస్థలు ఏమైనా చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు.

వినియోగదారులు కేవలం స్టార్ రేటింగ్‌లను మాత్రమే కాకుండా రివ్యూలను పూర్తిగా చదవాలని సూచించారు. అలాగే, రివ్యూల కోసం కేవలం ఒక్క సైటు మీదే ఆధారపడవద్దన్నారు.

hyderabad police

ఫొటో సోర్స్, ugc

ఎలాంటి ట్రాఫిక్ అంతరాయం లేకుండా రికార్డు వేగంతో గుండెను ఒక ఆసుపత్రి నుంచి మరో ఆసుపత్రికి తరలించి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు మరోసారి వార్తల్లో నిలిచారు.

నవంబరు 21న సజీవంగా ఉన్న గుండెను అంబులెన్సులో బంజారాహిల్స్‌లోని కేర్ హాస్పిటల్ నుంచి సికింద్రాబాద్ యశోద హాస్పిటల్‌కు తీసుకెళ్లేందుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు గ్రీన్ ఛానల్‌ని ఏర్పాటు చేశారు. ఈ రెండు ఆసుపత్రుల మధ్య 9 కిలోమీటర్ల దూరాన్ని అంబులెన్సు 8 నిమిషాల్లో చేరుకోగలిగింది.

హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల సహకారంతో రోగి ప్రాణాలు కాపాడగలిగామని హాస్పిటల్ వర్గాలు తెలిపాయి. ఇలా ఈ ఏడాది ఇప్పటి వరకు 14 సార్లు అవయవాలను హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఒక ఆస్పత్రి నుంచి మరో ఆస్పత్రికి సురక్షితంగా, వేగంగా తరలించారు.

సల్మాన్ రావి

బీబీసీ జర్నలిస్ట్‌ సల్మాన్ రావికి ఏషియన్ మీడియా అవార్డ్

బీబీసీ ఇండియా జర్నలిస్ట్ సల్మాన్ రావి లాక్‌డౌన్ సమయంలో అందించిన ఒక రిపోర్ట్‌కు గానూ ఆయనకు బ్రిటన్‌కు చెందిన ప్రతిష్టాత్మక ఏషియన్ మీడియా అవార్డ్ లభించింది.

ఈ అవార్డులను బ్రిటిష్ మీడియా ఇండస్ట్రీలో అత్యుత్తమ ప్రతిభను కనబరచిన ఆసియా జర్నలిస్టులకు అందిస్తారు.

2020 మేలో సల్మాన్ రావి నిర్వహించిన ఒక ఫేస్‌బుక్ లైవ్ కార్యక్రమానికి ఈ సన్మానం లభించింది.

ఆ లైవ్ కార్యక్రమంలో దిల్లీ మీదుగా తమ గ్రామాలకు నడిచి వెళుతున్న వలస కూలీలతో రావి మాట్లాడారు.

హరియాణాలోని అంబాలా నుంచి తమ కుటుంబంతో సహా నడిచి వెళ్తున్న వలసకూలీలను సల్మాన్ రావి దిల్లీలో కలిశారు. వారు దిల్లీ మీదుగా మధ్యప్రదేశ్‌లోని వారి గ్రామానికి నడిచి వెళ్తున్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

అందులో ఒకరు మండుటెండల్లో చెప్పులు లేకుండా నడవడం గమనించిన సల్మాన్ రావి అక్కడికక్కడే తన చెప్పులను వారికి ఇచ్చేసారు.

ఈ సంఘటనను "వరల్డ్ న్యూస్ మూమెంట్స్"గా ఏషియన్ మీడియా అవార్డ్స్ అభివర్ణించింది.

"ఈ కార్యక్రమం లాక్‌డౌన్‌లో వలస కూలీల కష్టాలకు అద్దం పట్టింది. సల్మాన్ రావి చూపించిన సహానుభూతి అభినందనీయం" అని ఆ సంస్థ పేర్కొంది.

ఈ లైవ్ కార్యక్రమానికి బీబీసీ ప్లాట్‌ఫామ్‌లలోనే కాకుండా ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో కూడా లక్షల్లో వ్యూస్ వచ్చాయి.

ఈ వీడియో కార్యక్రమాన్ని వీడియో జర్నలిస్ట్ పీయూష్ నాగ్‌పాల్ చిత్రీకరించారు.

సల్మాన్ రావి

ఫొటో సోర్స్, ASIANMEDIAAWARDS.COM

సల్మాన్ రావి ప్రస్తుతం బీబీసీ హిందీలో సీనియర్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ఆయన గత 30 ఏళ్లుగా జర్నలిజం వృత్తిలోనే ఉంటూ రేడియో, టీవీ, ఆన్‌లైన్ ప్రసార మాధ్యమాలన్నిట్లోనూ పనిచేసారు.

సల్మాన్ రావి ఏషియన్ మీడియా అవార్డ్స్‌తో మాట్లాడుతూ... "ఆ రోజు జర్నలిస్ట్‌గా నేను చాలా ఆవేదన చెందాను. లైవ్ షోలో నేను వారికి డబ్బులివ్వలేను. అందుకే నాకు చేతనైనంత సహాయం చేశాను. వాళ్లు 200 కిలోమీటర్లు నడిచి వెళ్ళడానికి సిద్ధపడ్డారు. ఆ తండ్రి చిన్నపిల్లని చేతిలో ఎత్తుకుని కాళ్లకు చెప్పులు లేకుండా ఎండలో నడుస్తున్నారు. ఈ మాత్రమైనా సహాయం చెయ్యలేకపోతే ఎలా అనిపించింది. అందుకే నా చెప్పులు ఇచ్చేశాను" అని తెలిపారు.

ఈ ఏడాది ఏషియన్ మీడియా అవార్డ్స్ ప్రదానం నవంబర్ 19 గురువారం నాడు ఆన్‌లైన్‌లో జరిగింది.

సల్మాన్ రావితో పాటూ జర్నలిస్టులు కృష్ణన్ గురుమూర్తి, వారిస్ హుస్సేన్, మెహదీ హసన్, నీనా వాడియా, అనితా రాణి, శోభనా గులాటీ, ఫైసల్ ఇస్లాంలకు కూడా ఈ అవార్డ్ లభించింది.

line

దేవీప్రియ మృతి.. అనారోగ్యంతో కన్నుమూసిన ప్రముఖ కవి, జర్నలిస్టు

దేవీప్రియ

ప్రముఖ కవి, జర్నలిస్టు, రచయిత దేవీప్రియ శనివారం కన్నుమూశారు. ఆయన వయసు 71 సంవత్సరాలు.

కొంతకాలంగా మధుమేహంతో బాధపడుతున్న దేవీప్రియ ఆరోగ్య పరిస్థితి కొద్ది రోజుల కిందట విషమించిందని ఆయన కుటుంబసభ్యులు తెలిపారు. దీంతో నవంబర్ 6వ తేదీన హైదరాబాద్‌లోని ఒక ఆస్పత్రిలో చేర్చారు. శనివారం నాడు అదే ఆస్పత్రిలో ఆయన తుదిశ్వాస విడిచారు.

దేవీప్రియ పేరుతో రచనలు చేస్తూ అదే పేరుతో సుపరిచితుడైన ఆయన అసలు పేరు షేక్‌ ఖ్వాజా హుస్సేన్‌. 1949 ఆగస్టు 15న గుంటూరులో పుట్టారు.

చిన్నప్పటి నుంచే దేవీప్రియ కవితలు, గేయాలు, పద్యాలు రచించేవారు. గత యాబై ఏళ్లుగా హైదరాబాద్‌లో స్థిరపడ్డారు.

ప్రజాతంత్ర, హైదరాబాద్‌ మిర్రర్‌ వంటి పలు పత్రికలకు సంపాదకుడిగా పనిచేశారు. ఉదయం, ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి పత్రికల్లో రన్నింగ్‌ కామెంటరీ పేరుతో కవితలు రాశారు.

అమ్మచెట్టు, గరీబు గీతాలు, నీటిపుట్ట, అరణ్య పురాణం తదితర 12 పుస్తకాలు రచించారు. మా భూమి, రంగుల కల, దాసి తదితర సినిమాలకు పాటలు రాశారు.

దేవీప్రియ

ఆయన రచించిన 'గాలి రంగు' కవితా సంకలనానికి గాను 2017వ సంవత్సరంలో ప్రతిష్టాత్మకమ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది.

అర్థ శతాబ్ద కాలంగా వివిధ రంగాల్లో రాణించిన దేవీప్రియ మృతికి పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు.

ఆల్వాల్‌లోని ఆయన స్వగృహం నుంచి అంతిమయాత్ర నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

తిరుమలగిరి విద్యుత్ దహన వాటికలో అంత్యక్రియలు జరుగుతాయని సన్నిహితులు తెలిపారు.

ఇవి కూడాచదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)