‘ఇంటర్నెట్ కనెక్షన్‌ కావాలంటే రూ.కోటి ఖర్చు చేయాల్సిందే’

ఇంటర్నెట్

ఫొటో సోర్స్, Getty Images

బ్రిటన్‌లో విస్‌బెక్ ఒక చిన్న పట్టణం. ఇక్కడ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ చాలా మందికి అందని ద్రాక్షే.

2003లో ప్రశాంతంగా జీవితం గడిపేందుకు పాల్ బ్రెట్ ఇక్కడికి వచ్చారు. ఆయన ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. ఆయనకు ఫాస్ట్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ తప్పనిసరి.

ఇది అంత గ్రామీణ ప్రాంతం కాదు. ఆయన ఇంటి నుంచి పట్టణం కూడా కనిపిస్తుంది. అయితే ఇంటర్నెట్‌కు మాత్రం ఆయన చాలా కష్టపడాల్సి వచ్చింది. ఇక్కడకు వచ్చిన మొదట్లో 0.5 ఎంబీపీఎ‌స్‌తో ఆయన నెట్టుకురావాల్సి వచ్చింది. అయితే నెమ్మదిగా ఇది 5 ఎంబీపీఎస్‌కు పెరిగింది. చాలా దేశాలతో పోలిస్తే.. ఇది అతి తక్కువ వేగం.

ఫైబర్ టు ద క్యాబిటెన్ (ఎఫ్‌టీటీసీ) టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో 21 శతాబ్దపు టెక్నాలజీ యుగంలోకి తానూ అడుగుపెట్టొచ్చని పాల్ కలలు కన్నారు.

కానీ ఆయనకు నిరాశే ఎదురైంది. ఆ టెక్నాలజీ ఆయనకు ఉపయోగపడలేదు.

‘‘నా ఇంటర్నెట్ వేగం సగానికి పడిపోయింది. అప్‌గ్రేడ్ అవ్వడానికి బదులు.. స్పీడ్ మరింత పడిపోయింది. దీంతో వెంటనే కనెక్షన్‌ను రద్దుచేసుకున్నాను. డబ్బులు కూడా వెనక్కి ఇచ్చేశారు’’అని ఆయన వివరించారు.

ఎఫ్‌టీటీసీ పేరుకు తగ్గట్టుగానే నోడ్‌ వరకు మాత్రమే చేరుతుంది. అక్కడి నుంచి ఇళ్లలోకి రావాలంటే బ్రాడ్‌బ్యాండ్ కాపర్ వైర్ల సాయం అవసరం. అంటే నోడ్ నుంచి ఎంతదూరం ఉంటే.. స్పీడ్ అంత తగ్గుతుంది.

ఇంటర్నెట్

ఫొటో సోర్స్, Getty Images

దాదాపు రూ.20 లక్షల డిస్కౌంట్

అయితే, పాల్ నిరాశ చెందలేదు. ఇరుగుపొరుగు వారితో కలిసి ఎలాగైనా 1జీబీపీఎస్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్‌ను తన వీధి వరకు తెప్పించుకోవడానికి ప్రయత్నించారు.

బ్రిటన్‌లో బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్లకు సంబంధించి మౌలిక సదుపాయాలు కల్పించే బ్రిటిష్ టెలికాం సబ్సిడరీ సంస్థ ఓపెన్‌రీచ్ నుంచి వారు కొటేషన్ కూడా తీసుకున్నారు. అయితే ఆ కొటేషన్ చూడగానే పాల్ షాకయ్యారు.

‘‘వారు దాదాపు రూ.కోటి (1,01,855 పౌండ్లు) కోట్ చేశారు. చాలా ఎక్కువ అనిపించింది’’అని ఆయన వ్యాఖ్యానించారు.

రూ. కోటి ఎందుకో సవివర లెక్కలు ఓపెన్‌రీచ్ వెల్లడించలేదు. అయితే ఒక్కో ఇంటికి దాదాపు రూ.6 లక్షలు (5991 పౌండ్లు) ఖర్చవుతుందని పేర్కొన్నారు. అదే సమయంలో కొన్ని వోచర్ల కింద రూ.20 లక్షల వరకు డిస్కౌంట్ ఇస్తామని వివరించారు.

పాల్ అంచనాల ప్రకారం అతని ఇల్లు.. తిన్నగా లైన్ వేసుకుంటూ వెళ్తే నోడ్ నుంచి 1.4 కి.మీ. దూరం ఉంటుంది. కానీ బ్రిటిష్ టెలికాం ఫైబర్ లైన్ల అంచనాల ప్రకారం ఇంకొంచెం ఎక్కువే ఉండొచ్చు.

అసలు ఎందుకు ఇంత ఖర్చు అవుతుందో ఓపెన్‌రీచ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ డైరెక్టర్ మాథ్యూ బేట్‌మన్ వివరించారు.

ఇంటర్నెట్

ఫొటో సోర్స్, Getty Images

‘‘మేము ఫైబర్ కేబుల్‌ను రోడ్లు, పొలాల వెంబడి తీసుకెళ్లాలి. దీని కోసం భూగర్భ మార్గంతోపాటు స్తంభాల సాయమూ తీసుకోవాలి. అంటే దీని కోసం కొన్ని స్తంభాలను వేయాలి. రోడ్లను తవ్వి పూడ్చాలి. ఇవన్నీ చాలా పెద్ద ఖర్చులు’’అని ఆయన వివరించారు.

చాలా మంది మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో ఉండటంతోపాటు కోవిడ్-19 వ్యాప్తి నడుమ ఎక్కువ మంది వర్క్ ఫ్రమ్ హోమ్‌ను ఎంచుకోవడంతో బ్రిటిష్ టెలికాం కొత్త మార్గాలను అన్వేషించాలని ఆయన అన్నారు.

బ్రిటన్‌లో దాదాపు ఆరు లక్షల ఇళ్లకు బ్రాడ్‌బ్యాండ్ స్పీడ్ 10 ఎంబీపీఎస్ కంటే తక్కువే ఉంటుందని ఓపెన్‌రీచ్ అంచనావేసింది.

మరోవైపు ఇంగ్లండ్‌లోని కంబ్రియాకు చెందిన మైక్ హూపర్‌కు కూడా ఇలాంటి కొటేషనే వచ్చింది. ఆరు ఇళ్లకుగాను దాదాపు రూ.1.5 కోట్లు (1,52,821 పౌండ్లు) చెల్లించమని సూచించారు. దీంతో నవ్వి ఊరుకున్నానని ఆయన చెప్పారు.

‘‘ఇది హాస్యాస్పదంగా ఉంది. అంత మేమైతే కట్టలేం’’అని ఆయన వ్యాఖ్యానించారు.

ఇక్కడ 2025నాటికి అందరికీ 1జీబీపీఎస్ వేగంతో బ్రాడ్‌బ్యాండ్ చేరేలా ప్రభుత్వం 5 బిలియన్ పౌండ్లను వెచ్చించాలని ప్రణాళికలు రచిస్తోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)