అమెజాన్, ఫేస్‌బుక్, గూగుల్, యాపిల్: ఈ సంస్థలు చైనాకు అనుకూలంగా పనిచేస్తున్నాయా

ఫొటో సోర్స్, GETTY IMAGES/EPA/REUTERS
అమెజాన్, యాపిల్, ఫేస్‌బుక్, గూగుల్... ఈ నాలుగు అమెరికన్ సంస్థలను కలిపి టెక్ వ్యాపార ప్రపంచంలో ‘బిగ్ ఫోర్’గా పిలుస్తుంటారు.
ఈ సంస్థలు ప్రపంచమంతటా విస్తరించాయి. టెక్ రంగంలో వీటికున్న స్థాయి వల్ల వచ్చిన అపారమైన శక్తిని... విస్తరణ కోసం ఇవి దుర్వినియోగపరుస్తున్నాయని, తమకు పోటీ లేకుండా, రాకుండా చేసుకుంటున్నాయని చాలా రోజులుగా చర్చ జరుగుతోంది.
ఇదే విషయమై అమెరికన్ కాంగ్రెస్ కమిటీ బుధవారం ఈ బిగ్ ఫోర్ టెక్ సంస్థల సీఈఓలను విచారించింది.
దాదాపు ఐదు గంటలపాటు ఈ విచారణ సాగింది.

ఫొటో సోర్స్, EPA
అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్, యాపిల్ సీఈఓ టిమ్ కుక్, ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఈ కాంగ్రెస్ విచారణకు హాజరయ్యారు.
ప్రపంచానికి భారీ సంస్థలు అవసరం ఉందని జెఫ్ బెజోస్ కాంగ్రెస్ ముందు వాదిస్తే... తమ సంస్థల వల్ల కొత్త ఆవిష్కరణలకు మరింత ప్రోత్సాహం లభించిందని టిమ్ కుక్, జుకర్‌బర్గ్, సుందర్ అన్నారు.
ఈ బిగ్ ఫోర్ టెక్ సంస్థలు పోటీతత్వానికి సంబంధించి సమస్యలకు కారణమవుతున్నాయని అమెరికా ప్రతిపక్ష డెమోక్రటిక్ పార్టీ నేతల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఆ సంస్థలు సమాచారాన్ని ఎలా నిర్వహిస్తున్నాయి, సంప్రదాయవాద అభిప్రాయాలపై వివక్ష చూపుతున్నాయా అనే విషయాలపై అధికార రిపబ్లికన్ పార్టీ నేతల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది.
బిగ్ ఫోర్ టెక్ సంస్థల సీఈఓలను విచారించిన కమిటీకి డెమోక్రటిక్ నాయకుడు, కాంగ్రెస్ సభ్యుడు డేవిడ్ సిసిలిన్ నేతృత్వం వహించారు.
ఈ కమిటీ దాదాపు ఏడాది కాలం దర్యాప్తు జరిపి... ఈ సంస్థలు ‘తాము విస్తరించేందుకు విధ్వంసకరమైన, హానికరమైన మార్గాల్లో తమకున్న శక్తులను వాడుకున్నాయ’ని గుర్తించింది.
ఈ సంస్థలు గుత్తాధిపత్యం సాగిస్తున్నాయని, వీటిపై చర్యలు అవసరమని డేవిడ్ అన్నారు.
ఈ భారీ సంస్థలను చిన్న సంస్థలుగా విడగొట్టాలని కొందరు విమర్శకులు అభిప్రాయపడుతున్నారు.
‘‘కొన్ని సంస్థలను చిన్నవిగా విడగొట్టాలి. అన్నింటిపై సరైన నియంత్రణ తేవాలి’’ అని విచారణ ముగింపు సమయంలో డేవిడ్ వ్యాఖ్యానించారు.
అమెరికా మూలాలు, విలువలకు తమ సంస్థలు కట్టుబడి ఉన్నాయని, చట్ట విరుద్ధంగా తాము ఏమీ చేయట్లేదని జుకర్‌బర్గ్, జెఫ్ బెజోస్, సుందర్ పిచాయ్, టిమ్ కుక్ అన్నారు.

ఫొటో సోర్స్, REUTERS
సమస్య ఏంటి?
యెల్ప్ లాంటి చిన్న సంస్థల సమాచారాన్ని గూగుల్ దొంగలించి, ఆ వెబ్ పేజీలకు యూజర్లు వెళ్లకుండా చేసిందని విచారణ సందర్భంగా కాంగ్రెస్ సభ్యులు ఆరోపించారు.
తమ వేదికపై ఉండే విక్రయదార్లతో అమెజాన్ వ్యవహరిస్తున్న తీరుపైనా అభ్యంతరం వ్యక్తం చేశారు.
తమకు పోటీగా వచ్చిన ఇన్‌స్ట్రాగ్రామ్ లాంటి సంస్థలను ఫేస్‌బుక్ కొనుగోలు చేస్తుండటంపై, యాపిల్ సంస్థ యాప్ స్టోర్ గురించి కూడా ప్రశ్నలు లేవనెత్తారు.
అమెజాన్ విక్రయదార్లకు వేదికగా ఉంటూనే, వాళ్లకు పోటీగా అలాంటి ఉత్పత్తులనే సొంతంగా అమ్ముతోందని డేవిడ్ అన్నారు. ఇది పరస్పర విరుద్ధ ప్రయోజాలు పొందడం అవుతుందని, యురోపియన్ నియంత్రణ సంస్థల విచారణ పరిధిలోకి కూడా ఈ అంశం వస్తుందని అన్నారు.
‘‘అమెజాన్ ఇలా రెండు పాత్రలు పోషిస్తుండటం, మౌలికంగా పోటీతత్వానికి వ్యతిరేకంగా ఉంది. కాంగ్రెస్ కచ్చితంగా చర్యలు తీసుకోవాలి’’ అని వ్యాఖ్యానించారు.
అయితే, ఈ పెద్ద సంస్థల విభజనకు గానీ, అమెరికా పోటీతత్వ చట్టాలను పూర్తిగా మార్చడానికి గానీ తాము సన్నద్ధంగా లేమని కొందరు రిపబ్లికన్ సభ్యులు సంకేతాలిచ్చారు.
‘‘భారీగా ఉండటం తప్పేమీ కాదు’’ అని కమిటీలోనే ఉన్న ఓ రిపబ్లికన్ సభ్యుడు వ్యాఖ్యానించారు.
అయితే, ఈ సంస్థలు రాజకీయంగా తమపై వివక్ష చూపుతున్నాయని, సంప్రదాయవాద అభిప్రాయాలను అణిచివేస్తున్నాయన్న వాదనపై రిపబ్లికన్ సభ్యులు ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చారు.
‘‘నేను అసలు విషయానికి వస్తా. ఈ పెద్ద టెక్ సంస్థలు సంప్రదాయవాదులపైనే పడ్డాయి’’ అని రిపబ్లిక్ పార్టీకి చెందిన కాంగ్రెస్ సభ్యుడు జిమ్ జోర్డాన్ అన్నారు.
ప్రశ్నలు, ఆరోపణల వర్షం
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ విచారణ జరిగింది.
ఈ టెక్ సంస్థలపై ప్రస్తుతమున్న విశ్వసనీయత చట్టాల ద్వారా సరైనంత నియంత్రణ ఉందా అనే విషయాన్ని పరిశీలించడం దీని ఉద్దేశం.
కానీ, వాస్తవ పరిస్థితికి వచ్చేసరికి ప్రశ్నల వర్షంలా ఈ విచారణ మారిపోయింది. కమిటీలోని సభ్యుల్లో ఒక్కొక్కరికి ఐదు నిమిషాల చొప్పున సమయం ఇచ్చారు.
సంస్థలు తమకున్న శక్తిని ఉపయోగించుకుని పోటీదారులకు ప్రతికూలమైన పరిస్థితులు సృష్టిస్తున్నాయని, కొన్ని సందర్భాల్లో వాటిని మొత్తంగా కొనేస్తున్నాయని డెమోక్రాట్లు అభిప్రాయం వ్యక్తం చేశారు..
ఈ టెక్ సంస్థలు తగినంత దేశభక్తి చూపుతున్నట్లు ఆనవాళ్లు లేవని, చైనాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నాయని రిపబ్లికన్లు ఆరోపించారు.
భావ వ్యక్తీకరణ విషయంలో ఈ సంస్థల తీరుపై రెండు పార్టీల నేతల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. విద్వేషపూరిత, తప్పుడు సమాచారాన్ని తొలిగించే విషయంలో ఈ సంస్థలు చేయాల్సినంత చేయడం లేదని డెమోక్రాట్లు ఆరోపించారు. ఇక సంప్రదాయవాదులపై మాత్రమే సెన్షార్ఫిప్ అమలు చేస్తున్నారని రిపబ్లికన్లు ఆందోళన వ్యక్తం చేశారు.
పెద్ద సంస్థలు సమస్యేనని చాలా మంది నాయకులు అభిప్రాయానికి వచ్చినా, దీనికి వారు ఓ పరిష్కారం చూపే అవకాశాలు మాత్రం కనపడటం లేదు.
ఇటు విచారణలో పాల్గొన్న సంస్థల అధినేతలు ప్రశాంతంగానే కనిపించారు.

సంస్థల వాదన ఇదీ
తమ ఉత్పత్తులు చిన్న వ్యాపారాలకు తోడ్పాటు అందించాయని, కొత్తగా వస్తున్న సంస్థలతో తాము కూడా పోటీ ఎదుర్కొంటున్నామని ఈ బిగ్-4 టెక్ సంస్థలు వాదించాయి.
‘‘స్మార్ట్ ఫోన్ల మార్కెట్ విషయంలో పోటీ ఎంత తీవ్రంగా ఉందంటే, దీన్ని నేను వీధి పోట్లాటగా వర్ణిస్తా’’ అని యాపిల్ సంస్థ సీఈఓ టిమ్ కుక్ అన్నారు.
అమెజాన్ వివిధ పాత్రలు పోషిస్తుండటం పరస్పర విరుద్ధ ప్రయోజనాల కిందకు వస్తుందన్న వాదనను ఆ సంస్థ సీఈఓ జెఫ్ బెజోస్ తిరస్కరించారు.
అయితే, అమెజాన్ వెబ్‌సైట్‌లో సేల్స్ డేటా (అమ్మకాల సమాచారం) నిర్వహణను మాత్రం సమీక్షిస్తున్నట్లు ఆయన అంగీకరించారు.
బాగా అమ్ముడుపోతున్న ఉత్పత్తులు ఏంటో తెలుసుకుని, సొంతంగా అలాంటివాటిని తీసుకువచ్చి విక్రయాలు జరిపేందుకు అమెజాన్ ఈ సేల్స్ డేటాను వినియోగించుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఇతర విక్రయ సంస్థల సేల్స్ డేటా తమ సిబ్బంది చూడకూడదని అమెజాన్‌లో నిబంధనలు ఉన్నట్లు బెజోస్ చెప్పారు. కొందరు ఉద్యోగులు దీన్ని ఉల్లంఘించి ఉండొచ్చని కూడా అన్నారు. దీనిపై విచారణ జరుపుతున్నట్లు తెలిపారు.
వాల్మార్ట్ లాంటి సంస్థల నుంచి తాము విపరీతమైన పోటీ ఎదుర్కొంటున్నామని, కొత్త రంగాల్లోకి విస్తరించే ప్రయత్నంలో తమ సంస్థ కొన్నేళ్లుగా డబ్బులు కూడా పోగొట్టుకుందని బెజోస్ అన్నారు.
‘‘చిన్న వ్యాపారాలను నెలకొల్పేవారంటే నాకూ ఇష్టమే. ఒకప్పుడు నేను కూడా అలాంటివాడినే. ప్రపంచానికి చిన్న సంస్థల అవసరం ఉన్నట్లే, పెద్ద సంస్థల అవసరం కూడా ఉంది. కొన్ని పనులు చిన్న సంస్థలు చేయలేవు’’ అని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, Reuters
డోనల్డ్ ట్రంప్ ఏమన్నారు?
అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ అమెజాన్ సంస్థను చాలా కాలంగా విమర్శిస్తున్నారు.
‘‘కాంగ్రెస్ కొన్నేళ్ల క్రితమే ఈ భారీ సంస్థల్లో పారదర్శకత తీసుకురావాల్సింది. వారు చేయలేకపోతే, కార్యనిర్వాహక ఆదేశాల ద్వారా నేనే స్వయంగా ఆ పని చేస్తా’’ అని ట్రంప్ ట్వీట్ చేశారు.
కాంగ్రెస్ విచారణను శ్వేత సౌధ అధికారులు దగ్గరగా గమనిస్తున్నారని ట్రంప్ పాత్రికేయులతో అన్నారు.
‘‘ఈ పెద్ద సంస్థలు పెద్ద తప్పు చేస్తున్నాయనడంలో సందేహమే లేదు’’ అని కూడా వ్యాఖ్యానించారు.
‘‘వాషింగ్టన్‌లో ‘తుఫాను మేఘాలు’ కమ్ముకున్నా, ఈ టెక్ సంస్థలను మార్చేలా కాంగ్రెస్ కొత్త చట్టం చేసే పరిస్థితి లేదు. ఈ సంస్థల వ్యాపార నిర్వహణ సామర్థ్యాలపై పరిమితులు విధించడానికి చట్టమే మార్గం. అది అధిక పన్నుల రూపంలో గానీ, మార్కెట్ కేంద్రీకరణ విషయంలో కొత్త నిబంధనల రూపంలో గానీ చేయొచ్చు’’ అని వెడ్‌బుష్ సెక్యూరిటీస్ సంస్థకు చెందిన టెక్ విశ్లేషకుడు డాన్ ఐవ్స్ అన్నారు.
చట్టం లేకుండా, సంస్థలపై నియంత్రణలో అర్థవంతమైన మార్పులేవీ రావని అభిప్రాయపడ్డారు.
‘‘రాబోయే రోజుల్లో ఈ సంస్థలు చేపట్టే టేకోవర్లపై చాలా లోతుగా పరిశీలన జరిగే అవకాశాలున్నాయి. టేకోవర్లు మరింత కష్టం కావొచ్చు’’ అని అన్నారు.
ఇవి కూడా చదవండి:
- మీ వ్యక్తిగత సమాచారాన్ని ఇంటర్నెట్ నుంచి ఇలా తొలగించండి
- అంతరిక్షం నుంచి అందరికీ ఇంటర్నెట్.. కొత్త ఉద్యోగాలు వస్తాయ్
- ఇంటర్నెట్లో అమ్మభాషనే కోరుకుంటున్న 92 శాతం తెలుగువారు: గూగుల్ అధ్యయనంలో వెల్లడి
- శృంగారం సాంకేతిక అభివృద్ధికి ఎలా దోహదపడింది...
- ప్రాణాలు కాపాడిన వీడియోకాల్
- డార్క్ వెబ్: డ్రగ్స్, గన్స్.. అన్నీ డోర్ డెలివరీ!
- పల్లెపల్లెకూ బ్రాడ్‌బ్యాండ్: మోదీ ప్రభుత్వం ఏంచెప్పింది? ఏం సాధించింది?
- నెట్ సరే.. న్యూట్రాలిటీ సంగతేంటి?
- పోర్న్ వెబ్సైట్లపై ప్రభుత్వం పట్టు బిగించగలదా?
- వికాస్ దుబే ఎవరు? ఒక రైతు కొడుకు 'గ్యాంగ్‌స్టర్' ఎలా అయ్యాడు?
- తెలంగాణలో నియంత్రిత సాగుపై రైతులు ఏమంటున్నారు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








