గూగుల్: ఇంటర్నెట్ సెర్చ్, ఆన్‌లైన్ యాడ్‌ల మీద గూగుల్ ‘గుత్తాధిపత్యం’ అంటూ అమెరికా కేసు నమోదు

గూగుల్ లోగో

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, యూరోపియన్ యూనియన్‌లో గూగుల్ మీద భారీ జరిమానాలు విధించారు

నిబంధనలకు విరుద్ధంగా ఇంటర్నెట్‌ సెర్చ్‌, ఆన్‌లైన్‌ అడ్వర్టయిజింగ్‌లో గుత్తాధిపత్యానికి ప్రయత్నిస్తోందంటూ అమెరికా ప్రభుత్వం గూగుల్ సంస్థపై ఫిర్యాదు చేసింది.

అమెరికా ప్రభుత్వం ఒక టెక్ దిగ్గజ సంస్థపై చేసిన అతి పెద్ద ఆరోపణగా ఈ కేసును చెబుతున్నారు.

అమెరికా నుంచి దేశీయంగా, విదేశాలలో బిజినెస్‌లు చేస్తున్న సంస్థల వ్యాపార శైలిపై ప్రభుత్వం ఏడాది కాలంగా నిఘా పెట్టింది.

అయితే ఈ ఆరోపణల్లో నిజం లేదని, అనేక లోపాలున్నాయని గూగుల్ వ్యాఖ్యానించింది.

కస్టమర్‌ ఫస్ట్‌ నినాదంతో ప్రత్యర్ధి సంస్థల నుంచి ఆరోగ్యకరమైన పోటీ వాతావరణంలో వ్యాపారం నిర్వహిస్తున్నామని గూగుల్ అన్నది.

“గూగుల్ ఉత్పత్తులు వాడాలంటూ కస్టమర్లను ఎవరూ ఒత్తిడి చేయడం లేదు. వాళ్లే స్వచ్ఛందంగా మా ఉత్పత్తులను వాడుతున్నారు’’ అని గూగుల్ స్పష్టం చేసింది.

గూగుల్ అన్న పదం ఒక పేరులా కాకుండా సెర్చ్ ఇంజిన్ కు పర్యాయపదంలా మారింది

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, గూగుల్ అన్న పదం ఒక పేరులా కాకుండా సెర్చ్ ఇంజిన్ కు పర్యాయపదంలా మారింది

గుత్తాధిపత్య ఆరోపణలు

అమెరికా ప్రభుత్వ న్యాయ విభాగంతోపాటు 11 రాష్ట్రాలు గూగుల్‌పై ఈ ఆరోపణలు చేశాయి. మొబైళ్లు, కంప్యూటర్లు, ఇతర గాడ్జెట్లలో గూగుల్‌ సెర్చ్‌ ఇంజిన్‌ను డీఫాల్ట్‌గా ఇన్‌స్టాల్‌ చేసినందుకు పలు సంస్థలకు గూగుల్‌ ఏటా బిలియన్ల డాలర్లను చెల్లిస్తోందని ఈ ఫిర్యాదులో ఆరోపించారు.

పలు సంస్థలతో గూగుల్ చేసుకున్న ఒప్పందాల కారణంగా ఇంటర్నెట్‌కు గూగుల్‌ కాపలాదారుగా మారిందని ఆరోపించారు. సెర్చ్‌ చానెల్స్‌లో 80 శాతాన్ని గూగుల్ నియంత్రిస్తోందని ఈ ఆరోపణల్లో పేర్కొన్నారు.

“ఇంటర్నెట్‌లో గూగుల్‌ ప్రత్యర్ధులు లేకుండా చేసుకుంది. మిగతా సెర్చ్‌ ఇంజిన్‌లకు ఇక్కడ అవకాశమే లేకుండా పోయింది. అవి గూగుల్‌ను సవాల్‌ చేసే స్థితిలో లేవు’’ అని ఫిర్యాదులో పేర్కొన్నారు.

“చివరకు ఈ సంస్థ ఆధిపత్యం ఏ స్థాయిలో ఉందంటే గూగుల్ అన్న పదం ఒక కంపెనీ పేరులాగా కాక, సెర్చ్‌ ఇంజిన్‌ అనే మాటకు పర్యాయ పదంలా మారింది’’ అని ఈ లా సూట్‌లో ఆరోపించారు.

ప్రభుత్వానికి, కంపెనీకి మధ్య ఘర్షణ సృష్టించే స్థాయిలో ఉన్న ఈ ఫిర్యాదు, అమెరికాలో ఒక భారీ టెక్‌ కంపెనీ ఆధిపత్యాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లలో మొదటిది కావచ్చన్న అభిప్రాయం వ్యక్తమైంది.

అమెరికా అధ్యక్ష ఎన్నికలు మరికొన్ని వారాల్లో జరగనున్న తరుణంలో నమోదైన ఈ ఫిర్యాదు, తాము రెండోసారి అధికారంలోకి వస్తే ప్రజలను ప్రభావితం చేసే సంస్థలను అవసరమైతే సవాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని ట్రంప్‌ ప్రభుత్వం సందేశం ఇచ్చినట్టుగా ఉందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

అయితే ఈ కేసును విచారించడానికి తమకు తొందరేమీ లేదని అధికారులు చెబుతున్నారు. “ మేం ఈ కేసులో వచ్చిన ఆరోపణలను పరిశీలిస్తున్నాం’’ అని డిప్యూటీ అటార్నీ జనరల్ జెఫ్రీ రోసెన్ అన్నారు.

గతంలో యూరోపియన్‌ యూనియన్‌ నుంచి కూడా గూగుల్‌పై ఇదే తరహా ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఈయూ 8.2 బిలియన్ యూరోల జరిమానా విధించింది.

గూగుల్ లోగో

ఫొటో సోర్స్, Reuters

నిజం తేల్చటం అంత త్వరగా జరగదు: విశ్లేషణ

రోరీ సెల్లాన్‌, బిజినెస్‌ కరస్పాండెంట్‌

ఇది గత దశాబ్దకాలంలో గూగుల్‌ లాంటి టెక్‌ సంస్థల మీద చేసిన అతి పెద్ద ఫిర్యాదు. గత ఏడాది కాలంగా ఈ కంపెనీ ఇలాంటి వ్యవహారాలకు పాల్పడిందా లేదా అన్నదానిపై దాని తర్వాతి పరిణామాలు ఆధారపడి ఉంటాయి.

టెక్నాలజీ దిగ్గజాల మీద ఆరోపణలు చేయడం యూరోపియన్‌ యూనియన్‌తో మొదలైంది. అయితే ఇప్పుడు అమెరికాలోనే కేసు నమోదు కావడంతో స్వదేశంలో కూడా ఆ సంస్థకు ఇబ్బందులు ఉన్నట్లు అర్ధం.

గతంలో స్టార్టప్‌ కంపెనీలను దెబ్బతీస్తోందని గూగుల్ మీద ఆరోపణలు రాగా, ఇప్పుడు ఇంటర్నెట్‌ను కంట్రోల్ చేస్తోందని విమర్శలు వినిపిస్తున్నాయి.

గుత్తాధిపత్యం కోసం గూగుల్ ప్రయత్నిస్తోందని ఆరోపణలు వినిపిస్తుండగా, తాము ఎవరినీ బలవంతం చేసి తమ ఉత్పత్తులు వాడాలని బలవంతం చేయడం లేదని గూగుల్ వాదిస్తోంది.

ఈ రెండు వాదనల్లో ఏది నిజమో తేల్చడం అంత త్వరగా జరిగే పని కాదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)