ప్యూ సర్వే: మతాంతర వివాహాలను మెజార్టీ భారతీయులు వ్యతిరేకిస్తున్నారు

మతాంతర వివాహాలు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, లెబో డిసెకో
    • హోదా, గ్లోబల్ రిలీజియన్ కరస్పాండెంట్

చాలా మంది భారతీయులు తాము ఇతర మతాల వారితో కలిసి మెలసి ఉంటామని, తమ దేశంలో మత సామరస్యం ఉందని భావిస్తున్నట్లు ప్యూ రీసెర్చ్ సెంటర్ చేపట్టిన సర్వేలో వెల్లడించారు. అయితే, మతాంతర వివాహాలకు మాత్రం తాము వ్యతిరేకమని స్పష్టంచేశారు.

మతాంతర వివాహాలను అడ్డుకోవడం తమ తొలి ప్రాధాన్యమని ప్యూ రిసెర్చ్ సెంటర్ చేపట్టిన సర్వేలో భారత్‌లోని భిన్న మతాల వారు తమ అభిప్రాయం వ్యక్తంచేశారు.

మతాంతర వివాహాలను అడ్డుకోవడమే లక్ష్యంగా కొన్ని రాష్ట్రాలు చట్టాలను తీసుకొచ్చిన నేపథ్యంలో తాజా అధ్యయన ఫలితాలు వెల్లడయ్యాయి.

ఈ అధ్యయనం కోసం భారత్‌లో 17 భాషలు మాట్లాడే 30,000 మందిని ప్యూ సెంటర్ ప్రతినిధులు ఇంటర్వ్యూ చేశారు.

ఈ 30వేల మందిలో 26 రాష్ట్రాలు, మూడు కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన వారు ఉన్నారు.

వేరే మతాల వారిని పెళ్లిచేసుకోకుండా అడ్డుకోవడం చాలా ముఖ్యమని ఈ సర్వేలో పాల్గొన్న 80 శాతం మంది ముస్లింలు అభిప్రాయపడ్డారు. హిందువుల విషయంలో ఇది 65శాతంగా ఉంది.

మత విశ్వాసాలు, జాతీయత మధ్య సంబంధంపైనా సర్వేలో ప్రశ్నలు అడిగారు.

అయితే, జాతీయత భావన, మతం అనేవి రెండూ విడదీయరానివని ఎక్కువశాతం హిందువులు అభిప్రాయం వ్యక్తంచేశారు.

నిజమైన భారతీయుడు అనిపించుకోవాలంటే ముందు హిందువు అయ్యుండటం ముఖ్యమని 64 శాతం మంది హిందువులు అభిప్రాయపడ్డారు.

మతాంతర వివాహాలు

ఫొటో సోర్స్, Getty Images

కొన్ని విలువలు, మత నమ్మకాలు ఒకేలా ఉన్నప్పటికీ.. తమ మధ్య సారూప్యతలు అంత ఎక్కువగా లేవని దేశంలోని ప్రధాన మతాలకు చెందిన వారు చెప్పారు.

‘‘తాము మత సామరస్యంతో ఉంటామని భారతీయులు చెబుతున్నారు. అయితే, కొన్ని మతాలవారిని మాత్రం దూరం పెట్టేందుకే వారు ఇష్టపడుతున్నారు’’ అని అధ్యయనం పేర్కొంది.

‘‘చాలా మంది కొన్ని మతాలకు చెందిన వారి విషయంలో చాలా కచ్చితంగా ఉంటున్నారు. ఆ మతాలకు చెందినవారు తమ నివాస ప్రాంతాలు లేదా గ్రామాలకు దూరంగా ఉంటే మేలని భావిస్తున్నారు’’ అని ఈ అధ్యయనం చెబుతోంది.

చాలావరకు సంప్రదాయ భారతీయ కుటుంబాలు హిందూ, ముస్లింల మధ్య వివాహాలకు అనుమతించవు. ఇప్పుడైతే న్యాయపరమైన చిక్కులు కూడా ఎదురవుతున్నాయి.

మతాంతర వివాహాలు చేసుకునే జంటలకు ఇక్కడ 30 రోజుల నోటీస్ పిరియడ్ తప్పనిసరని స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ చెబుతోంది. అంటే ఈ 30 రోజుల్లో ఎవరైనా అభ్యంతరాలు వ్యక్తంచేస్తే, వాటిపై విచారణ పూర్తయ్యేవరకు చట్టపరంగా పెళ్లికి అంగీకరించరు.

కొన్ని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) పాలిత రాష్ట్రాల్లో బలవంతపు మత మార్పిడిలను అడ్డుకునేందుకు ప్రత్యేక చట్టాలను కూడా తీసుకొచ్చారు.

హిందూ మహిళలను ఇస్లాంలోకి మత మార్పిడి చేయడమే లక్ష్యంగా కొందరు ముస్లిం యువకులు కుట్రలు పన్నుతున్నారని కొన్ని హిందూ అతివాద సంస్థలు ఆరోపిస్తున్నాయి. ఇలాంటి కేసుల్ని లవ్ జీహాద్‌గా పిలుస్తున్నాయి.

ముస్లిం మహిళ

ఫొటో సోర్స్, EPA

మతాంతర వివాహాల వ్యతిరేకత ఎలా ఉంటుందో సుమిత్ చౌహాన్, ఆజ్రా పర్వీన్ ప్రత్యక్షంగా అనుభవించారు. చౌహాన్ దళిత కుటుంబానికి చెందిన హిందువు. పర్వీన్ ముస్లిం.

‘‘ముస్లింల గురించి మా హిందూ బంధువులకు అంతమంచి అభిప్రాయం లేదు. అయితే మా అమ్మ, చెల్లి, అన్నయ్యను నేను ఒప్పించగలిగాను’’ అని చౌహాన్ వివరించారు.

కానీ పర్వీన్ విషయంలో ఇది అంత తేలికగా జరగలేదు. కుటుంబం నిరాకరించడంతో, ఎవరికీ తెలియకుండా ఆమె చౌహాన్‌ను పెళ్లి చేసుకున్నారు. దీంతో మూడేళ్లు పర్వీన్‌తో ఆమె కుటుంబ సభ్యులు మాట్లాడలేదు.

ఇప్పుడు మాట్లాడుతున్నప్పటికీ, తమ తల్లిదండ్రులు తమ వివాహం గురించి బయటివారి ముందు మాట్లాడేందుకు ఇష్టపడరని పర్వీన్ వివరించారు.

‘‘గత ఏడాది నా భార్య చెల్లెలి వివాహం జరిగింది. కానీ మమ్మల్ని పిలవలేదు. మనకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి మనం మతం మార్చుకోవాల్సిన పనిలేదు’’ అని చౌహాన్ వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)