ఓబీసీ బిల్లు: 127వ రాజ్యాంగ సవరణతో ఎవరికి లాభం, కులాలకా, పార్టీలకా?

మోదీ, అమిత్ షా

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, రాఘవేంద్ర రావ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

పార్లమెంటులో పాలక, ప్రతిపక్షాల మధ్య ఏమాత్రం భిన్నాభిప్రాయం లేకుండా ఏకగ్రీవంగా ఒక బిల్లు ఆమోదం పొందడమనేది చాలా అరుదు.

పాలక, ప్రతిపక్షాల మధ్య ఎడతెగని ప్రతిష్టంభన ఉన్న సమయంలో ఇలాంటి ఏకాభిప్రాయం కుదరడం మరీ అరుదు.

ఇలాంటి అరుదైన సందర్భానికి భారత పార్లమెంటులోని లోక్‌సభ ఆగస్ట్ 10న సాక్ష్యంగా నిలిచింది. ఆ సభలో పాలక, విపక్షాలు ఎలాంటి భిన్నాభిప్రాయం వ్యక్తంచేయకుండా ఏకగ్రీవంగా '127వ రాజ్యాంగ సవరణ బిల్లు'ను ఆమోదించాయి.

ఇతర వెనుకబడిన తరగతులను(ఓబీసీ) నోటిఫై చేసే అధికారం రాష్ట్రాలకు తిరిగి దఖలు పరిచేదే ఈ '127వ రాజ్యాంగ సవరణ బిల్లు'

రాష్ట్రాలకు అధికారం దఖలు పరచడంతో దేశంలోని 671 వెనుకబడిన కులాలు ప్రయోజనం పొందుతాయి.

స్పీకర్ ఓం బిర్లా, మోదీ, సోనియా

ఫొటో సోర్స్, Ani

వచ్చే ఏడాది(2022) ప్రారంభంలో గోవా, మణిపుర్, ఉత్తరాఖండ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్నాయి.

ఇలాంటి తరుణంలో వెనుకబడిన తరగతుల ఓట్లను కోరుకునే ఏ రాజకీయ పార్టీ కూడా ఈ బిల్లును వ్యతిరేకించదు. ఆ కారణం వల్లే పార్టీలకతీతంగా అందరూ దీనిపై ఏకాభిప్రాయం వ్యక్తంచేశారు.

ఓబీసీకి సంబంధించి కొత్త సవరణ ఏమిటి?

2018లో పార్లమెంట్‌లో 102వ రాజ్యాంగ సవరణ చేపట్టారు. ఆ సవరణ ద్వారా రాజ్యాంగంలో మూడు కొత్త అధికరణలు చేర్చారు.

జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్‌ విధులు, అధికారాలకు సంబంధించిన ఆర్టికల్‌ 338బీ, ఒక ప్రత్యేక కులాన్నిఓబీసీగా ప్రకటించే రాష్ట్రపతి అధికారానికి సంబంధించిన 'ఆర్టికల్‌ 342ఏ'ను రాజ్యాంగంలో చేర్చారు. అందులోని మూడో కొత్త ఆర్టికల్ 366 (26 సీ) సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతులను నిర్వచిస్తుంది.

అయితే, తాజాగా చేసిన 127వ సవరణ తరువాత జాతీయ స్థాయి ఓబీసీ జాబితా ఉంటుందా ఉండదా అనే ప్రశ్న తలెత్తింది.

మరోవైపు రాష్ట్రాలు ఇదంతా ఎలా చేస్తాయనే విషయంలోనూ గందరగోళం ఏర్పడింది.

మరాఠాలకు ప్రత్యేక కోటా ఇవ్వడానికి సంబంధించిన కేసులో ఈ ఏడాది మే 5న సుప్రీంకోర్టు... కేంద్రం మాత్రమే ఓబీసీలను గుర్తిస్తుందని, రాష్ట్రాలకు ఆ హక్కు లేదని చెప్పింది. 2018 నాటి రాజ్యాంగ సవరణ ఆధారంగా కోర్టు ఆ ఆదేశాలిచ్చింది.

కానీ, పార్లమెంటు తాజాగా ఆమోదించిన సవరణ ప్రకారం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తమ సొంత ఓబీసీ జాబితాలను తయారుచేసుకోవచ్చు.

దేశ సమాఖ్య నిర్మాణాన్ని కొనసాగించడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం చెప్పింది.

రిజర్వేషన్లు కావాలంటూ నిరసన

ఫొటో సోర్స్, Getty Images

అభివృద్ధికి దూరంగా ఉన్న కులాలకు ప్రయోజనం

అలహాబాద్‌లోని గోవింద్ వల్లభ్ పంత్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్‌కు చెందిన ప్రొఫెసర్ బద్రి నారాయణతో బీబీసీ ఈ అంశంపై మాట్లాడింది.

ఆయన ఈ కొత్త సవరణపై సానుకూలంగా స్పందించారు. ఇది ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే నిర్ణయమని అన్నారు.

నిర్ణయాధికారాన్ని వికేంద్రీకరించడమనేది మంచి విషయమని ఆయన అన్నారు.

''రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు మరింత దగ్గరగా ఉంటాయి. ఓబీసీ జాబితాలో ఉండాలని కోరుకునే వర్గాల గురించి రాష్ట్రాల వద్ద గణాంకాలు, మరింత సమచారం ఉంటాయి. అభివృద్ధికి దూరంగా ఉన్న కొన్ని కులాలకు ఇప్పుడు ప్రయోజనం చేకూరుతుంది'' అన్నారు బద్రి నారాయణ.

ఒకవేళ ఆధిపత్య కులాలను ఓబీసీల్లో చేర్చితే దాని వల్ల ఇతర కులాలకు నష్టం కలగకుండా చూడాలన్నారాయన. ఆధిపత్య కులాలకు పోటీలో నిలిచే సామర్థ్యం ఉన్నందున అలాంటి వారిని ఓబీసీల్లో తెచ్చే విషయంలో ఆచితూచి వ్యవహరించాలన్నారు.

రిజర్వేషన్లు కావాలంటూ ఉద్యమం

ఫొటో సోర్స్, Getty Images

50 శాతం పరిమితి

తాజా సవరణతో ఓబీసీ జాబితాల రూపకల్పన అధికారం రాష్ట్రాలకు దఖలు పడడం స్వాగతించదగినదే అయినా, రిజర్వేషన్ల పరిమితి 50 శాతం కంటే పెంచితేనే ప్రయోజనం ఉంటుందని ప్రతిపక్షాలు అంటున్నాయి. 50 శాతం పరిమితిని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.

అయితే, 127వ రాజ్యాంగ సవరణ బిల్లుపై చర్చ సమయంలోనే సామాజిక న్యాయం, సాధికారత మంత్రి వీరేంద్ర కుమార్ లోక్‌సభలో మాట్లాడుతూ రిజర్వేషన్ పరిమితిని 50 శాతం కంటే పెంచాలని సభ్యులు డిమాండ్ చేస్తున్నారని.. కానీ, ఇది రాజ్యాంగపరమైన చిక్కులు ఉన్నందున జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన అంశమని అన్నారు.

అయితే, 102వ రాజ్యాంగ సవరణ సమయంలో రాష్ట్రాల అధికారాలను కొల్లగొట్టిన కేంద్రం ఆ తప్పును సరిదిద్దుకోవడానికి ఇప్పుడీ సవరణ చేసిందని పలువురు విపక్ష సభ్యులు అన్నారు.

ప్రస్తుత మార్గదర్శకాల ప్రకారం అఖిల భారత స్థాయి నియామకాలలో షెడ్యూల్డ్ కులాలకు 15 శాతం, షెడ్యూల్డ్ తెగలకు 7.5 శాతం, ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లు ఉన్నాయి.

మరోవైపు ఎలాంటి పరిస్థితుల్లోనూ 50 శాతాన్ని దాటి రిజర్వేషన్లు కల్పించే హక్కు రాష్ట్రాలకు లేదు.

50 శాతాన్ని మించి రాష్ట్రాలు రిజర్వేషన్లు కల్పించిన ప్రతిసారీ కోర్టులు ఆ నిర్ణయాలను రద్దు చేశాయి.

ఓబీసీ ఉద్యమాలు

ఫొటో సోర్స్, Getty Images

రాష్ట్రాలు, ఓబీసీ స్టేటస్

దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలోనూ వివిధ కులాలు ఓబీసీ జాబితాలో తమను చేర్చాలంటూ చాలాకాలంగా డిమాండ్ చేస్తున్నాయి.

హరియాణాలో జాట్‌లు, మహారాష్ట్రలో మరాఠాలు, గుజరాత్‌లో పటేల్‌లు, కర్ణాటకలో లింగాయత్‌లు ఇందుకోసం కొన్నేళ్లుగా డిమాండ్ చేస్తున్నారు.

ఇలాంటి కొన్ని డిమాండ్‌లు ఉద్యమాలుగా హింసారూపం దాల్చిన సందర్భాలూ ఉన్నాయి.

ఓబీసీలో చేర్చాలనే కొన్ని వర్గాల డిమాండ్‌లపై అభ్యంతరాలూ ఉంటున్నాయి. ఇందుకు ఉదాహరణ జాట్‌లు. దేశంలోని ప్రభావవంతమైన, ధనిక సమాజాలలో ఒకటిగా జాట్‌లకు గుర్తింపు ఉంది. అలాంటి సామాజిక స్థాయి ఉన్న కులాన్ని ఓబీసీలో చేర్చవచ్చా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.

పటేల్‌లు, మరాఠాల విషయంలోనూ మిగతా కులాల నుంచి అభ్యంతరాలున్నాయి.

9 రాష్ట్రాలలో జాట్‌లను ఓబీసీ కేటగిరీలో చేర్చాలన్న కేంద్ర నిర్ణయాన్ని 2015లో సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఏదైనా కులానికి వెనుకబడిన హోదా ఇవ్వడానికి వారికి చారిత్రకంగా జరిగిన అన్యాయం ప్రాతిపదిక కారాదని ఆ సందర్భంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.

జన సంఖ్య

ఫొటో సోర్స్, Getty Images

కుల ఆధారిత జనాభా గణనకు డిమాండ్‌లు

ఓబీసీల జాబితా రూపకల్పన అధికారం రాష్ట్రాలకు మళ్లీ రావడంతో కుల ఆధారిత జనగణన డిమాండ్ మళ్లీ వినిపిస్తోంది.

2021లో నిర్వహించే జనగణనలో కులాల జనభా లెక్కల సేకరిస్తామని 2018లో హోంమంత్రిత్వ శాఖ చెప్పింది. అయితే, అలాంటి నిర్ణయమేమీ జరగలేదని 2019లో అదే శాఖకు చెందిన అధికారులు చెప్పారు.

షెడ్యూల్డ్ కులాలు, తెగలు తప్ప మిగతా జనాభాకు సంబంధించి కులాల అధారంగా జనాభా లెక్కలు సేకరించరాదని విధానపరమైన నిర్ణయం తీసుకున్నామని జులై 20న పార్లమెంటులో ఓ ప్రశ్నకు సమాధానంగా ప్రభుత్వం తెలిపింది.

కాగా, కోవిడ్ కారణంగా ఈ ఏడాది(2021)లో జరగాల్సిన జనాభా లెక్కలు వాయిదా పడ్డాయి.

సమాజ్‌వాది పార్టీ, తెలుగుదేశం, జనతాదళ్(యు), అప్నాదళ్ వంటి పార్టీ కుల గణన చేయాలని కోరుతున్నాయి.

2011లో నిర్వహించిన సామాజిక-ఆర్థిక కుల గణనకు సంబంధించిన డాటాను ప్రభుత్వం విడుదల చేయాలని డీఎంకే వంటి పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి.

లాలూ, ములాయం

ఫొటో సోర్స్, LALU PRASAD YADAV

రాజకీయ ప్రభావం

పార్లమెంటులో ఎంత ప్రతిష్టంభన ఉన్నప్పటికీ ఈ బిల్లు విషయంలో రాజకీయ పార్టీలన్నీ ఒకే తాటిపైకి రావడమనేది దీని ప్రాధాన్యాన్ని చెప్పకనే చెబుతోంది.

మొన్నటి విస్తరణ తరువాత మోదీ మంత్రివర్గంలోని 27 మంది ఓబీసీ వర్గానికి చెందినవారే. అందులో అయిదుగురు కేబినెట్ మంత్రులు.

ఆగస్టు 11న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఓ భారీ కార్యక్రమం ఏర్పాటు చేసి కేంద్రంలోని ఓబీసీ మంత్రులందరినీ సత్కరించారు.

ఓబీసీ కేంద్ర మంత్రులు ఈ నెలలో 'ఆశీర్వాద యాత్ర'ల పేరుతో రాష్ట్రాలలో యాత్రలు చేపట్టనున్నారు. వెనుకబడిన కులాలను ఆకర్షించేందుకు ఇదో ఎత్తుగడగా చెబుతున్నారు.

ప్రొఫెసర్ బద్రి నారాయణ మాట్లాడుతూ, 'ఏ పార్టీ ఏ కులానికి ఓబీసీ హోదా ఇస్తుందో ఆ పార్టీ ప్రయోజనం పొందుతుంది. అది బీజేపీ కావొచ్చు, ఇంకేదైనా పార్టీ కావొచ్చు. ఇది అందరికీ రాజకీయ అవకాశమే'' అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)