ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ: రిజర్వేషన్లను ఉప కులాల వారీగా పంచుతారా?

ఎస్సీ, ఎస్టీ

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, రాజేశ్ పెదగాడి
    • హోదా, బీబీసీ ప్రతినిధి

రిజర్వేషన్లలో భాగంగా షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు(ఎస్సీ, ఎస్టీ)లను వర్గీకరించకూడదని 2005లో ఇచ్చిన తీర్పును సమీక్షిస్తామని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు తెలిపింది.

''ఎస్సీ, ఎస్టీలందరూ ఒకేలా లేరు. ప్రభుత్వ ఉద్యోగాలు, ఉన్నత విద్యలో రిజర్వేషన్ల ప్రయోజనాలు అందరికీ దక్కేలా చూసేందుకు వీరిని వర్గీకరించొచ్చు. ముఖ్యంగా బలహీన వర్గాల అభ్యున్నతికి ప్రయోజనాలు చేకూరేలా వర్గాలుగా విభజించొచ్చు''అని జస్టిస్ అరుణ్ మిశ్ర నేతృత్వంలోని ఐదుగురు సభ్యులుగల ధర్మాసనం వ్యాఖ్యానించింది.

''ఎస్సీ, ఎస్టీలలోని కొన్ని వర్గాల్లో అసమానతలు కనిపిస్తున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అందరికీ ప్రయోజనాలు చేకూరేలా నిర్ణయాలు తీసుకోవచ్చు''

ఎస్సీ ఎస్టీల వర్గీకరణ, ఎస్సీ ఎస్టీల క్రీమీలేయర్ విధానాలపై చర్చలకు ఈ నిర్ణయం నాంది పలికే అవకాశముందని న్యాయ నిపుణులు, రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఎస్సీ, ఎస్టీ

ఫొటో సోర్స్, Getty Images

కోర్టు ఏం చెప్పింది?

''అన్ని కులాలు, తెగలకు రావాల్సిన ప్రయోజనాలు కొందరికే లబ్ధి చేకూరిస్తే మనమే అసమానతలను కలగజేసినట్లు అవుతుంది. ఆకలి అందరికీ ఉంటుంది. అందరి కడుపూ నిండాలి. అందరినీ సమానంగా చూస్తున్నామనే పేరుతో ప్రయోజనాలన్నీ బలమున్నవారికే ఇవ్వకూడదు''అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

''రిజర్వేషన్లు ఎప్పటికీ ఇలానే ఉండాలని రాజ్యాంగ నిర్మాతలు భావించలేదు. మారుతున్న సామాజిక సమీకరణాలకు అనుగుణంగా వీటిలో మార్పులు చేయాలి''

ఎస్సీ, ఎస్టీలు ఒకే గ్రూప్ కిందకు వస్తారని, వారిని వర్గీకరించకూడదని 2004లో ఈవీ చిన్నయ్య వర్సెస్ ఆంధ్రప్రదేశ్ కేసులో ఇచ్చిన తీర్పును సమీక్షించేందుకు ఏడుగురు సభ్యులుగాగల ధర్మాసనం ఏర్పాటు చేయాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏఎస్ బోబ్డేకు సూచించింది.

ఎస్సీ, ఎస్టీ

ఫొటో సోర్స్, Getty Images

ఈ అంశం ఎందుకు తెరపైకి వచ్చింది?

ప్రభుత్వ ఉద్యోగాలు, ఉన్నత విద్యలో ఖాళీలను 50 శాతం బాల్మీకీ, మజబీ సిక్కులకు కేటాయిస్తూ 2006లో పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక చట్టం తీసుకొచ్చింది.

పంజాబ్ షెడ్యూల్ కాస్ట్, అండ్ బ్యాక్‌వార్డ్ క్లాస్ రిజర్వేషన్ ఇన్ సర్వీస్ యాక్ట్‌ చట్టాంలోని సెక్షన్ 4(5) పేరుతో ఈ నిబంధన తీసుకొచ్చింది. దీన్ని ఎస్సీల్లో ఒక వర్గమైన శిక్రిబంద్ ప్రతినిధులు.. పంజాబ్, హరియాణా హైకోర్టులో సవాల్ చేశారు.

దీంతో ఈ నిబంధన రాజ్యాంగ విరుద్ధమని, చిన్నయ్య కేసు తీర్పును ఈ నిబంధన వ్యతిరేకిస్తోందని కోర్టు తీర్పునిచ్చింది.

అయితే, దీనిపై దవీందర్ సింగ్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. 2014లో ఈ కేసును సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీచేసింది. ప్రస్తుతం ఈ కేసు విచారణలో భాగంగానే చిన్నయ్య కేసు తీర్పును సమీక్షించాలని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది.

ఎస్సీ, ఎస్టీ

ఫొటో సోర్స్, Getty Images

చిన్నయ్య కేసు ఎలా వచ్చింది?

రిజర్వేషన్ల ప్రయోజనాలు అందరికీ అందుతున్నాయో లేదో చూడాలని 1996లో అప్పటి ఆంధ్రప్రదేశ్‌లోని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఓ కమిషన్‌ను ఏర్పాటుచేసింది. ఎస్సీల్లో రిజర్వేషన్లు అందని వర్గాలను గుర్తించాలని కమిషన్‌కు ప్రభుత్వం సూచించింది.

వెనుకబాటు ప్రాతిపదికన ఎస్సీలను నాలుగు వర్గాలుగా విభజించాలని కమిషన్ సూచించింది. 15 శాతం రిజర్వేషన్లను గ్రూప్-ఏకు ఒకశాతం, గ్రూప్ బీకు ఏడు శాతం, గ్రూప్ సీకు ఆరు శాతం, గ్రూప్ డీకు ఒక శాతంగా విభజించాలని చెప్పింది. ఈ సూచనలను ప్రభుత్వం ఆమోదించింది.

ఈ మార్పులను ఒక ఆర్డినెన్సుగా తీసుకొచ్చింది. తర్వాత ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ కాస్ట్ (రేషనలైజేషన్ ఆఫ్ రిజర్వేషన్) యాక్ట్-2000ను రూపొందించింది.

దీన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిని హైకోర్టు కొట్టిపారేసింది. దీంతో పిటిషన్‌దారులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

ఈ పిటిషన్లను విచారించిన అనంతరం ఎస్సీలను వర్గీకరించకూడదని సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. అంతేకాదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాన్ని కొట్టివేసింది.

ఎస్సీ, ఎస్టీ

ఫొటో సోర్స్, Getty Images

కొన్నిచోట్ల అలా..

ఎస్సీల్లో కొన్ని వర్గాలు బాగా వెనుకబడి ఉన్నాయని, అందుకే ఈ ''కోటాలో కోటా(రిజర్వేషన్లలో రిజర్వేషన్లు)'' తీసుకురావాలని కొన్ని రాష్ట్రాలు అభిప్రాయపడుతున్నాయి.

2000లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎస్సీలను వర్గీకరించేటప్పుడు జస్టిస్ రామచంద్ర రాజు కమిషన్ నివేదికను ఆధారంగా చూపించింది.

మరోవైపు తమిళనాడులోనూ అరుంధతియార్ వర్గానికి ఇలానే రిజర్వేషన్ కల్పించారు. వీరు ఎస్సీ జనాభాలో 16 శాతం ఉన్నప్పటికీ ఉద్యోగాల విషయంలో వీరి ప్రాతినిధ్యం 0-5 శాతం వరకు మాత్రమే ఉందని జస్టిస్ ఎంఎస్ జనార్థనమ్ కమిటీ నివేదించింది. దీంతో వీరికి ఎస్సీ రిజర్వేషన్‌లో మూడు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం చట్టం తీసుకొచ్చింది. ప్రస్తుతం ఇది సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉంది.

2007లో ఎస్సీల్లో వెనుకబడిన వారిని గుర్తించాలని బిహార్ కూడా మహాదళిత్ కమిషన్‌ను ఏర్పాటుచేసింది.

ఎస్సీ, ఎస్టీ

ఫొటో సోర్స్, Getty Images

కచ్చితంగా వర్గీకరణ జరుగుతుంది: మంద కృష్ణ మాదిగ

సుప్రీం కోర్టు వ్యాఖ్యలను సంపూర్ణంగా స్వాగతిస్తున్నామని ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. ''ఈ తీర్పుతో వేలాది మందికి ఊరట కలిగించింది. తాత్కాలికంగా కొన్ని అడ్డంకులు రావొచ్చు. అంతిమ విజయం మాత్రం ధర్మానిదే''

''వర్గీకరణ కచ్చితంగా జరుగుతుంది. ఎస్సీల్లో రిజర్వేషన్‌ ప్రయోజనాలు పొందలేకపోతున్న ఉపకులాల ప్రజలు చాలా మంది రిజర్వేషన్లలో వర్గీకరణ కోసం దశాబ్దాల తరబడి పోరాటం చేస్తున్నారు. అయితే కొందరు తమ జనాభా నిష్పత్తికి మించి ఏకపక్షంగా రిజర్వేషన్లు అనుభవిస్తున్నారు. స్వార్థంతో వర్గీకరణకు అడుగడుగునా అడ్డుతగులుతున్నారు''అని ఆయన వ్యాఖ్యానించారు. మాల కులస్థులకే రిజర్వేషన్లు ఎక్కువ దక్కుతున్నాయని, మాదిగతోపాటు మరికొన్ని కులాలు నష్టపోతున్నాయని 26ఏళ్లుగా ఎమ్మార్పీఎస్ పోరాటం చేస్తోంది.

ఎస్సీ, ఎస్టీ

ఫొటో సోర్స్, Getty Images

ఓటు బ్యాంకు రాజకీయాలకే..

సుప్రీం కోర్టు తాజా వ్యాఖ్యలపై మాల మహానాడు జాతీయ ప్రధాన కార్యదర్శి జీ చెన్నయ్య తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. ఎస్సీలను వర్గీకరిస్తే ఓటు బ్యాంకు రాజకీయాలకు ఆజ్యం పోసినట్లు అవుతుందని ఆయన అన్నారు.

''ఎస్సీల వర్గీకరణను మేం పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. అవును.. కొందరు వెనుకబడిన మాట వాస్తవమే. అయితే దానికి రిజర్వేషన్లను వర్గీకరించడం పరిష్కారం కాదు. ఇదివరకు ఉషా మెహరా కమిటీ సూచించినట్లు వారికి ప్యాకేజీ ఇవ్వాలి. అంతేకానీ వర్గీకరించకూడదు''

''ఒక వేళ వర్గీకరణ చేయాల్సి వస్తే.. వందల కులాలు ఉన్నాయి. ఎవరికి ఎంత శాతం కేటాయిస్తారు? అందరూ కొట్టుకు చస్తారు. ముఖ్యంగా ఓట్ల కోసం ప్రభుత్వం కొన్ని వర్గాలకు రిజర్వేషన్లను ఎరగా వేసే అవకాశముంది''.

''సుప్రీం కోర్టు ఈ విషయంలో పూర్తి తీర్పు వెలువరించాక.. మేం అప్పీలు చేసుకుంటాం''.

వీడియో క్యాప్షన్, రీనో ఆదివాసీ తెగలో మహిళలదే అధికారం.

మాకు మాత్రం న్యాయం జరగదు

రిజర్వేషన్లను వర్గీకరించినా లేదా జనాభా ప్రాతిపదికన పంచినా తమకు ఎలాంటి న్యాయమూ జరగదని ఆదిలాబాద్ ఎంపీ, ఆదివాసీల హక్కుల పోరాట సమితి (తుడుం దెబ్బ) నాయకుడు సోయం బాబూరావు అన్నారు.

''లంబాడాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లో మరో 33 జాతులు ఎస్టీ జాబితాలో ఉన్నాయి. లంబాడాలు మాత్రం మహారాష్ట్రలో బీసీలు. తెలంగాణలో ఎస్టీలు. 1976లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెంగళరావు హయాంలో లంబాడాలను మొదటిసారిగా ఎస్టీ జాబితాలో చేర్చారు. 1971 జనాభా లెక్కల ప్రకారం.. లంబాడాల జనాభా 1.32 లక్షలు మాత్రమే. కానీ ఒక్క దశాబ్దంలోనే వారి జనాభా 11 లక్షలకుపైనే అయిపోయింది. అక్రమంగా ఎస్టీ రిజర్వేషన్ హోదా కోసం భారీగా లంబాడాలు తెలంగాణకు వలస వచ్చారు. అందుకే వారిని ఎస్టీ జాబితా నుంచి తొలగించాలి. అప్పుడే అదివాసీలకు న్యాయం జరుగుతుంది''అని ఆయన వివరించారు.

మరోవైపు, రిజర్వేషన్లను జనాభా ప్రాతిపదికన విభజిస్తే తమకు ఎలాంటి అభ్యంతరమూలేదని లంబాడీ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు తెజావత్ బెల్లయ్య నాయక్ వ్యాఖ్యానించారు.

''తెలంగాణ గణాంకాల ప్రకారం రాష్ట్రంలో 9.08 శాతం మంది ఎస్టీలున్నారు. వీరిలో లంబాడాల వాటా 65 శాతానికిపైగానే ఉంటుంది. ప్రస్తుత జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వాలి''అని ఆయన చెప్పారు.

అయితే, బలహీన వర్గాల రిజర్వేషన్లను వర్గీకరించాలా లేదా ప్రస్తుత విధానాన్నే కొనసాగించాలా అనే అంశంపై ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పు వెలువరించిన తర్వాతే రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)