సుప్రీం కోర్టు: బ్రిటిష్ కాలం నాటి దేశద్రోహం చట్టం ఇప్పటికీ అవసరమా?

ఫొటో సోర్స్, Getty Images
స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన తర్వాత కూడా 'దేశద్రోహ చట్టం' అవసరమా అని సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న వారిపై బ్రిటిష్ వాళ్లు ఈ చట్టాన్ని ఉపయోగించేవారని, మహాత్మాగాంధీ, బాలగంగాధర తిలక్ లాంటి వారిపై ఉపయోగించిన ఈ చట్టాన్ని ఎందుకు రద్దు చేయకూడదని చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
‘‘కాలం తీరిన ఎన్నో చట్టాలను మీ ప్రభుత్వం రద్దు చేసింది. కానీ, దేశద్రోహం అభియోగాన్ని మోపే ఐపీసీలోని 124 ఎ సెక్షన్‌ను ఎందుకు తొలగించ లేదో అర్దం కావడం లేదు’’ అని జస్టిస్ రమణ అటార్నీ జనరల్ కె.కె.వేణుగోపాల్‌ను ఉద్దేశించి అన్నారు.
''ఇది బ్రిటిష్ వారు తెచ్చిన చట్టం. స్వతంత్రం వచ్చి 75 ఏళ్లు గడిచింది. ఈ సెక్షన్ అవసరం ఇప్పటికీ ఉందని అనుకుంటున్నారా?'' అని సుప్రీం కోర్టు ప్రశ్నించింది.
సెక్షన్ 124ఎ రాజ్యాంగ బద్ధతను ప్రశ్నిస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు పరిశీలిస్తుందని చీఫ్ జస్టిస్ రమణ అన్నారు. ''వాస్తవంలో పరిస్థితి దారుణంగా ఉంది. ఒకరు చెప్పిన మాట అవతలి వ్యక్తి వినకపోతే వారి మీద సెక్షన్ 124 ఎ ఉపయోగిస్తున్నారు. ఇది వ్యక్తులు, సంస్థల మనుగడకు ప్రమాదంగా మారింది'' అని చీఫ్ జస్టిస్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
కొన్ని చట్టాలను దుర్వినియోగం చేయడంపై, బాధ్యతారహితంగా వ్యవహరించడంపైనే తమ ఆందోళన అని చీఫ్ జస్టిస్ రమణ అన్నారు. ఇటీవల రద్దు చేసిన 66ఎ సెక్షన్ కింద ఇంకా కేసులు నమోదవుతున్న సంఘటనలను ఈ సందర్భంగా సుప్రీం ధర్మాసనం గుర్తు చేసింది.
అయితే, సెక్షన్ 124 ఎ ను ఇప్పటికిప్పుడు రద్దు చేయాల్సిన అవసరం లేదని, దానిని చట్టబద్దంగా వినియోగించేందుకు కొన్ని విధివిధానాలు( గైడ్‌లైన్స్) తయారు చేస్తే సరిపోతుందని అటార్నీ జనరల్ వేణుగోపాల్ కోర్టుకు తెలిపారు.
సెక్షన్ 124 ఎ కింద నమోదవుతున్న కేసుల్లో నేర నిరూపణ రేటు చాలా తక్కువగా ఉందన్న విషయాన్ని కూడా సుప్రీం కోర్టు ఈ సందర్భంగా ప్రస్తావించింది.
''ఐటీ యాక్ట్ లోని సెక్షన్ 66 ఎ నే తీసుకుంటే, దీనిని తొలగించిన తర్వాత కూడా కేసులు నమోదు చేస్తున్నారు. పోలీసులు ఒక వ్యక్తిని నిర్బంధించాలనుకుంటే 124ఎ సెక్షన్ కింద కేసులు పెడుతున్నారు. ఈ సెక్షన్ కింద కేసు అంటేనే చాలామంది భయపడి పోతున్నారు. ఇలాంటి వాటన్నింటినీ గమనంలోకి తీసుకోవాలి. దుర్వినియోగం అవుతున్నందువల్లే దీని గురించి మేం ఆలోచించాల్సి వస్తోంది'' అన్నారు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ.

ఫొటో సోర్స్, Getty Images
ఇదిలా ఉండగా, దేశద్రోహ చట్టం రాజ్యాంగ బద్ధతను ప్రశ్నిస్తూ మాజీ సైనికాధికారి ఒకరు దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు కేంద్రానికి నోటీసులు పంపింది. ఇదే అంశంపై దాఖలైన మరికొన్ని పిటిషన్‌లను కూడా దీనికి జత చేసింది.
ఈ పిటిషన్ వేసిన సైనికాధికారి తన జీవితాన్ని దేశం కోసం త్యాగం చేశారని, ఆయన పిటిషన్‌ను దురుద్దేశపూర్వకంగా వేసిన పిటిషన్‌గా భావించలేమని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది.
భావ ప్రకటనా స్వేచ్ఛకు ఈ చట్టం అడ్డుగా నిలుస్తోందని, ప్రాథమిక హక్కులను అడ్డుకుంటోందంటూ దీని రాజ్యాంగ బద్ధతను పరిశీలించాల్సిందిగా మేజర్ జనరల్(రిటైర్డ్) ఎస్.జి. వొంబాత్కేరే సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 124 ఎ సెక్షన్ రాజ్యాంగ విరుద్ధమని, దీన్ని వెంటనే రద్దు చేయాలని ఆయన తన పిటిషన్‌లో కోరారు.
ఈ సెక్షన్ రాజ్యాంగబద్ధతను ప్రశ్నిస్తూ ఇద్దరు జర్నలిస్టులు వేసిన పిటిషన్‌ను పరిశీలించిన సుప్రీం కోర్టుకు చెందిన మరో ధర్మాసనం, దీనిపై వివరణ ఇవ్వాలంటూ కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.

ఫొటో సోర్స్, PTI
అరుణ్ శౌరీ పిటిషన్
కేంద్ర ఐటీ శాఖ మాజీ మంత్రి అరుణ్ శౌరీ కూడా దేశద్రోహం చట్టాన్ని సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. భారత శిక్షాస్మృతి (1860)లోని 124-ఏ సెక్షన్ రాజ్యాంగ విరుద్ధమని, అది రాజ్యాంగంలోని 14, 19 ఆర్టికల్స్‌కు విరుద్ధమని ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు.
సెక్షన్ 124-ఏ రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించేందుకు తగిన ఆదేశాలు ఇవ్వాలంటూ లాయర్ ప్రశాంత్ భూషణ్ ద్వారా ఆయన ఈ పిటిషన్ వేశారు.
ఇప్పటికీ, ఈ రకమైన పిటిషన్‌లను విచారణకు స్వీకరించిన సుప్రీం కోర్టు దీనిపై తదుపరి విచారణను జూలై 27కు వాయిదా వేసింది.
ఇవి కూడా చదవండి:
- గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్: 'ఇంటర్నెట్ స్వేచ్ఛపై దాడి జరుగుతోంది'
- దక్షిణాఫ్రికా: జాకబ్ జుమాను జైలుకు పంపడంపై అల్లర్లు, 72 మంది మృతి
- కోవిడ్-19: చైనా వ్యాక్సీన్లను ఇస్తున్న దేశాల్లో మళ్లీ కేసులు ఎందుకు పెరుగుతున్నాయి?
- ‘12 ఏళ్ల వయసులో పొట్ట పెరుగుతుంటే ఎందుకో అనుకున్నా, గర్భవతినని గుర్తించలేకపోయాను’
- 24 ఏళ్ల నిరీక్షణ, 5 లక్షల కి.మీ.ల ప్రయాణం-ఎట్టకేలకు కొడుకును కలుసుకున్న తండ్రి
- ‘సెక్స్ గురించి భారతీయులు మాట్లాడుకోరు, అందుకే నేను వారికి సాయం చేస్తున్నాను’
- ఆంధ్రప్రదేశ్: శ్రీశైలంలో రహస్యంగా డ్రోన్లు ఎందుకు ఎగరేస్తున్నారు ? అనుమతి లేకుండా వీటిని వాడితే ఏం జరుగుతుంది?
- బండ్ల శిరీష: రిచర్డ్ బ్రాన్సన్ వర్జిన్ గెలాక్టిక్ స్పేస్ ఫ్లైట్‌లో గుంటూరు అమ్మాయి రోదసి యాత్ర విజయవంతం
- పీవీ సింధు ఈసారి ఒలింపిక్ గోల్డ్ మెడల్ గెలవడం ఖాయమేనా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








