సెక్స్ కోచ్: ‘శృంగారం గురించి భారతీయులు మాట్లాడుకోరు, అందుకే వారికి సాయం చేస్తున్నాను’

పల్లవి బర్నవాల్

ఫొటో సోర్స్, Pallavi Barnwal

భారత్‌లోని చాలా పాఠశాలల్లో సెక్స్ ఎడ్యుకేషన్ గురించి పాఠాలు చెప్పడంలేదు. సెక్స్, రిలేషన్‌షిప్స్ గురించి మీరే పిల్లలకు చెప్పాలని తల్లిదండ్రులపై భారం వేస్తున్నారు.

దీంతో ఏం చేయాలో తెలియక వారు తలలు పట్టుకుంటున్నారని సెక్స్ కోచ్ పల్లవి బర్నవాల్ చెబుతున్నారు. ఈ విషయంపై బీబీసీ ప్రతినిధి మేఘా మోహన్‌తో ఆమె మాట్లాడారు.

ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే, నేను సెక్స్ కోచ్‌గా మారడానికి నేను పుట్టి, పెరిగిన సంప్రదాయ కుటుంబ నేపథ్యమే కారణమని అనిపిస్తుంది.

తొలినాళ్లలో నాపై మా అమ్మానాన్నల రిలేషన్‌షిప్ చాలా ప్రభావం చూపింది. అయితే ఆ సమయంలో నాకది తెలియనే లేదు.

పల్లవి బర్నవాల్

ఫొటో సోర్స్, Pallavi Barnwal

మా అమ్మానాన్నల రిలేషన్‌షిప్‌పై చాలా పుకార్లు, వదంతులు వచ్చేవి. నాకు ఎనిమిదేళ్ల వయసున్నప్పటి నుంచే అవి నాకు ఎదురయ్యాయి. పార్టీల్లో, నేను ఒంటిరిగా ఉండేటప్పుడు, విపరీతమైన కుతూహలంతో ఆంటీలు నాపై ప్రశ్నల వర్షం కురిపించేవారు.

‘‘మీ అమ్మా నాన్న ఒకే గదిలో ఉంటారా?’’

‘‘వారి మాటలు నువ్వు ఎప్పుడైనా వింటావా?’’

‘‘మీ ఇంటికి పరాయి పురుషుడు ఎవరైనా రావడం చూశావా?’’

ఐస్ క్రీం తిందామని టేబుల్ దగ్గరకు వెళ్లినప్పుడు లేదా ఆడుకోవడానికి తోటి పిల్లల కోసం ఎదురుచూస్తున్నప్పుడు ఈ ఆంటీలు ఎదురయ్యేవారు. నాకు సమాధానాలు తెలియని ప్రశ్నలు వారు అడిగేవారు. నిజానికి ఆ ఆంటీల్లో చాలా మంది నాకు తెలియనే తెలియదు.

నేను విడాకులు తీసుకున్న తర్వాత, అసలు ఏం జరిగిందో మొత్తం కథ చెప్పింది మా అమ్మ. మా అమ్మానాన్నలకు పెళ్లైన కొత్తలో, నేను మా తమ్ముడు పుట్టకముందు, మా అమ్మ ఒక వ్యక్తిని చాలా ఇష్టపడింది. ఆ ఇష్టం శారీరక సంబంధంగా మారింది. అయితే తప్పు చేశారనే అపరాధ భావంతో ఆ బంధానికి మా అమ్మ తెర దించేసింది. కానీ, ఇక్కడి సంప్రదాయ కుటుంబాల్లో పక్కవారు ఏం చేస్తున్నారోనని చాలా మంది కళ్లప్పగించి చూస్తుంటారు. అలా పుకార్లు, వదంతులు పుట్టుకొచ్చి.. చివరకు మా నాన్న వరకు చేరాయి.

పోస్ట్‌ YouTube స్కిప్ చేయండి
Google YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of YouTube ముగిసింది

ఈ విషయం మా అమ్మను అడగడానికి మా నాన్నకు పదేళ్లు పట్టింది. అప్పటికే ఇద్దరు పిల్లలం పుట్టేశాం.

నిజం చెబితే మన రిలేషన్‌షిప్‌కు ఏమీకాదని నేను భరోసా ఇస్తున్నానని మా నాన్న అమ్మతో అన్నారు. మొత్తానికి వదంతులు పుట్టిన చాలా ఏళ్లకు ఆయనకు నిజం తెలిసింది. అయితే, ఆ పరాయి వ్యక్తితో గడిపిన రోజుల్లో, సెక్స్ కంటే సాన్నిహిత్యమే తాను ఎక్కువ కోరుకున్నట్లు నాన్నకు మా అమ్మ చెప్పింది. మన మధ్య బంధం వేళ్లూనుకోకముందే ఇదంతా జరిగిందని వివరించింది.

అయితే మా అమ్మ మాట్లాడటం ముగించిన వెంటనే పరిస్థితులు వేడెక్కాయి. అప్పుడే ఈ పెళ్లికి ముగింపు పలకాలని మా నాన్న నిర్ణయించుకున్నారు. ఎన్నో ఏళ్ల నుంచి మా నాన్న వింటున్న వదంతులు, పుకార్లు నిజమేనని మా అమ్మ ధ్రువీకరించడంతో.. వారి మధ్య నమ్మకానికి చోటు లేకుండా పోయింది. ఫలితంగా ఆ రిలేషన్‌షిప్ బీటలు వారింది.

సెక్స్, సాన్నిహిత్యాల గురించి మనం సరిగా మాట్లాడుకోకపోతే, కుటుంబాలు ముక్కలైపోతాయని దీని ద్వారా నాకు స్పష్టంగా తెలిసొచ్చింది.

పల్లవి బర్నవాల్

నేను బిహార్‌లో పుట్టి పెరిగాను. అది జనాభా ఎక్కువగా ఉండే ప్రాంతం. ఒకవైపు సరిహద్దుల్లో నేపాల్ ఉంటుంది. మరోవైపు గంగానది ప్రవహిస్తుంటుంది. కట్టుబాట్లు విపరీతంగా ఉండే సంప్రదాయ కుటుంబంలో నా బాల్యం గడిచింది. మేం ఎప్పుడూ సెక్స్ గురించి బహిరంగంగా మాట్లాడుకునేవాళ్లం కాదు. మా అమ్మానాన్నలు చేతిలో చేయివేసుకుని ప్రేమగా మాట్లాడుకోవడాన్ని నేను చూడలేదు. వారేకాదు, మా చుట్టుపక్కల ఎవరూ అన్యోన్యంగా ఉంటున్నట్లు నాకు కనిపించలేదు.

నాకు 14ఏళ్ల వయసున్నప్పుడు తొలిసారి సెక్స్ అంటే ఏమిటో తెలిసింది.

ఒకరోజు మధ్యాహ్నం, మా నాన్న కప్‌బోర్డ్‌లోని పుస్తకాలను చూస్తుండగా, ఆయన నవలల్లో నుంచి ఒక చిన్న పుస్తకం జారిపడింది. దానిలో చిన్నచిన్న కథలు ఉన్నాయి. ఎదుటివ్యక్తి శరీరాన్ని అణువణువూ గాలించే ఓ రహస్య ప్రపంచమే దానిలో ఉంది. అది సాహిత్యం కాదు. కచ్చితంగా ఓ చిలిపి పుస్తకమే. అందులో ఒక అమ్మాయి అయితే, పక్క గదిలో ఓ జంట మంచంపై ఏం చేస్తుందో చూసేందుకు, గోడకు రంధ్రం చేస్తుంది. ముందెప్పుడూ వినని ‘‘చుంబన్’’అనే హిందీ పదం అర్థం కోసం నేను డిక్షనరీ వెతికాను. అది ఫ్రెంచ్ కిస్ అని చివరకు తెలుసుకున్నాను.

నాకు చాలా సందేహాలు ఉండేవి. కానీ మాట్లాడటానికి ఎవరూ ఉండేవారు కాదు.

పల్లవి బర్నవాల్

ఫొటో సోర్స్, Pallavi Barnwal

ఇలాంటి విషయాల గురించి స్నేహితులతో కూడా నేను ఎప్పుడూ మాట్లాడలేదు.

ఆ చిన్న పుస్తకంలో మునిగిపోయిన నేను, బాహ్య ప్రపంచంలోకి రావడానికి చాలా సమయం పట్టింది. పక్క గదిలో నుంచి మా అమ్మ గట్టిగా పిలవడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాను.

ఇదంతా 1990ల్లో జరిగింది. నేనేమైనా తప్పు చేశానో లేదో అప్పుడు నాకు తెలియదు. ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో పిల్లలు ఈ వయసులోనే సెక్స్, సాన్నిహిత్యం గురించి తెలుసుకుంటుంటారు. చాలావరకు స్కూళ్లలోనే వారికి పాఠాలు బోధిస్తారు. బెల్జియంలో అయితే ఆరేడేళ్ల వయసున్నప్పుడే పిల్లలకు సెక్స్ గురించి చెప్తారు.

కానీ భారత్‌లో అలా కాదు. ఇక్కడ సెక్స్ ఎడ్యుకేషన్ అనేది పాఠ్య ప్రణాళికలో తప్పనిసరికాదు. 2018లో కేంద్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ.. పాఠశాలల కోసం ‘‘సెక్స్ ఎడ్యుకేషన్’’ మార్గదర్శకాలు తీసుకొచ్చేవరకు అసలు ఇలాంటివి ఉంటాయని చాలా మందికి తెలియదు. ఇప్పటికీ దేశంలోని డజనుకుపైగా రాష్ట్రాలు ఈ మార్గదర్శకాలను అనుసరించడం లేదు. నిజానికి భారత్‌లోని గ్రామీణ ప్రాంతాల్లోని సగం కంటే ఎక్కువ మంది అమ్మాయిలకు రుతుక్రమం అంటే ఏమిటి? ఎందుకు నెలసరి వస్తుంది? లాంటి అంశాలకు సమాధానాలే తెలియదని టైమ్స్ ఆఫ్ ఇండియా అధ్యయనంలో తేలింది.

పల్లవి బర్నవాల్

ఫొటో సోర్స్, Pallavi Barnwal

ఆ చిన్న పుస్తకం దొరికిన తర్వాత, నా జీవితంలో పెద్ద మార్పులేవీ రాలేదు. ఎందుకంటే నేను ఇతర భారతీయ అమ్మాయిల్లానే దాన్ని మనుసులో దాచేసుకున్నాను. 25ఏళ్ల వయసులో నేను కన్యత్వాన్ని కోల్పోయాను. ఆ తర్వాత రెండేళ్లకు నాకు పెళ్లి జరిగింది. అప్పటికి నాకున్న అనుభవాలు, నైపుణ్యాలు అంతంత మాత్రమే.

నా మొదటిరాత్రి ఒక పీడకలలా జరిగింది. మా అత్తగారింట్లో పూలు, పళ్లతో సినిమాల్లో చూపించినట్లు మంచాన్ని అలంకరించారు. ఆ సన్నని గోడల నుంచి అవతల శబ్దాలు వినపడేవి. వేరే ప్రాంతాల నుంచి మా పెళ్లి కోసం వచ్చినవారు గదికి అవతలివైపు నిద్రపోతున్నారు. వారికి పడుకోవడానికి వేరే ఎక్కడా చోటు దొరకలేదు.

నేను కన్యనే అని నా భర్తకు చెప్పమని మా అమ్మ సూచించింది. కాస్త బిడియంగా, గందరగోళంగా ఉన్నట్లు నేను నటించాల్సి వచ్చింది. మేం పెద్దగా మాట్లాడుకోలేదు. కానీ అప్పుడే పడక గది వరకు రావాల్సి వచ్చింది. భార్యగా నా విధులు నేను నిర్వహించాలని అందరూ ఆశించేవారు. నేను కన్యను కాదు.. నేను సన్నద్ధంగా కూడా లేను. తొలిరాత్రి రోజు ఏం చేయాలో నాకు డజన్ల కొద్దీ సూచనలు చెప్పారు. కేవలం శారీరకంగానే కాదు.. మరీ ఎక్కువ బిడియంతో ఎలా ఉండకూడదు? మరీ ఎక్కువ అనుభవమున్నట్లు ఎలా ప్రవర్తించకూడదు? లాంటివి చెప్పారు.

పల్లవి బర్నవాల్

ఫొటో సోర్స్, Pallavi Barnwal

నా భర్తతో నేను ఐదేళ్లు కలిసి ఉన్నాను. నేను సరైన వ్యక్తిని పెళ్లి చేసుకోలేదని మొదట్లోనే నాకు తెలిసొచ్చింది. ఆయనతో సెక్స్‌లో పాల్గొనడమంటే భయానకంగా అనిపించేది. ఆ సమయంలోనే నాతో పనిచేస్తున్న ఓ సహోద్యోగిపై మనసు పడ్డాను. అప్పుడే నా వివాహ జీవితం పూర్తిగా కోలుకోలేని రీతిలో ఎలా దెబ్బతిందో అర్థమైంది. అలా నా వివాహ జీవితం ముగిసింది.

32ఏళ్ల వయసులో ఇప్పుడు నా బిడ్డను నేను ఒక్కదాన్నే పెంచుతున్నాను. నాపై ఎలాంటి ఒత్తిడీ లేదు. సమాజం దృష్టిలో నేనొక విడాకులు తీసుకున్న, దిగజారిన మహిళను. ఇప్పుడు నేను దిల్లీలో నివసిస్తున్నాను. ఇక్కడ ఎలాంటి భవిష్యత్తూ కనపడని కొన్ని లైంగిక రిలేషన్‌షిప్‌లలోనూ అడుగుపెట్టాను. పెళ్లైన, వయసు పైబడిన వారితోనూ రిలేషన్‌షిప్‌లలో ఉన్నాను. నేను మరింత ఓపెన్ అవుతుంటే, నేను మాట్లాడే తీరులోనూ మార్పు కనిపించింది. నాతోటి స్నేహితులు.. సూచనలు, సలహాల కోసం నా దగ్గరకు వస్తున్నారు. నా స్వతంత్రాన్ని చూసి మా అమ్మ కూడా స్ఫూర్తి పొందింది. సామాజిక కట్టుబాట్లను వ్యతిరేకించే ఆమె కూడా ఇప్పుడు మాతోనే ఉంటోంది.

సెక్స్, మహిళ హక్కుల గురించి నా చుట్టూ చాలా చర్చలు జరుగుతుంటాయి. దిల్లీలో 2012లో ఓ యువతిపై జరిగిన సామూహిక అత్యాచారం ఇక్కడ ప్రకంపనలే సృష్టించింది.

అయితే, సెక్స్‌ను ఆస్వాదించకుండా.. హింస అనే కోణంలో చూడటం తప్పని నేనంటాను. నిజానికి చాలా మంది భారతీయ మహిళలు పురుషులతో సాన్నిహిత్యాన్ని ఆస్వాదించరు. అది వారి నియంత్రణలో ఉండాలని కూడా కోరుకోరు. ఈ అంశాలపై చాలావరకు అందరూ మౌనం పాటిస్తారు. ఇది మాట్లాడకూడని అంశంగా భావిస్తారు. నిజానికి చాలా మంది తమపై జరిగే అకృత్యాలను గుర్తించకపోవడానికి కూడా ఇదే కారణం.

గ్రాఫిక్ చిత్రం

మహిళలపై నేరాలు

  • భారత్‌లో 2019లో రోజుకు 87 అత్యాచార కేసులు నమోదయ్యాయి. బాలలపై అకృత్యాల కేసులైతే రోజుకు వందకుపైనే ఉన్నాయి.
  • మొత్తంగా 2019లో మహిళలపై నేరాలకు సంబంధించి 405861 కేసులు నమోదయ్యాయి.
  • తలసరి లైంగిక నేరాల విషయంలో భారత్ అట్టడుగు దేశాల్లో ఉందని 2020 వరల్డ్ పాపులేషన్ రివ్యూ అధ్యయనంలో తేలింది.

మొదట్లో నేను కస్టమర్ సేల్స్ విభాగంలో పనిచేసే దాన్ని. అప్పుడే కెరియర్ మారాలని నిర్ణయించుకున్నాను.

రేప్ ఫైల్ ఫోటో

ఫొటో సోర్స్, Getty Images

ముఖ్యంగా సెక్స్ గురించి ఎవరు ఏమన్నా పట్టించుకోకుండా హాయిగా మాట్లాడే, ప్రజలు తమ సందేహాలను నివృత్తి చేసుకునే వేదిక ఏర్పాటుచేసే అవకాశం నాకు దొరికింది.

నేను సెక్స్, న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ కోచ్‌గా శిక్షణ తీసుకున్నాను. ఆ తర్వాత ఒక ఇన్‌స్టాగ్రామ్ పేజీని క్రియేట్ చేశాను. దీని ద్వారా ఏదైనా అడగండి చెబుతానని ప్రజల్ని ప్రోత్సహించడం మొదలుపెట్టాను. ప్రజలను ప్రోత్సహించేందుకు ముందు నా లైంగిక అనుభవాలను పేజీలో పోస్ట్ చేశాను.

ఈ విధానం పనిచేసింది. లైంగికపరమైన కోరికలు, హస్త ప్రయోగాలు, శృంగారంలేని వివాహాలు, లైంగిక హింస ఇలా చాలా రకాల అంశాలపై ప్రజలు సలహాలు, సూచనల కోసం నన్ను ప్రశ్నలు అడగడం మొదలుపెట్టారు. చాలావరకు ఈ ప్రశ్నలు తల్లిదండ్రుల నుంచే వస్తున్నాయి.

రెండేళ్ల క్రితం టెడ్ టాక్‌లో ప్రసంగించాలని నన్ను ఆహ్వానించారు. ముఖ్యంగా సెక్స్, లైంగిక సమ్మతిల గురించి పిల్లలతో తల్లిదండ్రులు ఎందుకు మాట్లాడాలో చెప్పమని కోరారు.

వీడియో క్యాప్షన్, 'రేప్ చేశారని కేసు పెడితే నన్నే జైల్లో పెట్టారు'

నేను చీర కట్టుకొని వేదికపై మాట్లాడాను. కేవలం ఆధునిక భావాలున్న మహిళలు మాత్రమే సెక్స్ చేయరని, అందరూ దీని గురించి మాట్లాడుకోవాలని చెప్పేందుకే అలా వెళ్లాను. 2019లో పోర్న్‌హబ్ విడుదల చేసిన డేటాను అప్పుడు వివరించాను. ప్రపంచంలో అశ్లీల వీడియోలు ఎక్కువగా చూస్తున్న దేశాల్లో భారత్ మొదటిదని, ఇక్కడ అశ్లీల సైట్లపై నిషేధం ఉన్నప్పటికీ వీక్షకుల సంఖ్య పెరుగుతోందని వివరించాను. ఇక్కడ సెక్స్‌ అనేది రహస్య ఘట్టంగా చూస్తున్నారని, దీని వల్ల ఎవరికీ ఉపయోగం ఉండదని చెప్పాను.

ఆ ప్రసంగం తర్వాత, రోజుకు 30కిపైగా ప్రశ్నలు, సందేహాలను ప్రజలు నన్ను అడుగుతున్నారు.

సెక్స్ టాయ్‌ను ఎలా ఉపయోగించాలని ఓ మహిళ అడగొచ్చు. కోవిడ్ నుంచి కోలుకున్నాక హస్త ప్రయోగం చేసుకోవచ్చా అని ఓ యువకుడు అడగొచ్చు. ఇలా భిన్న రకాలుగా ప్రశ్నలు ఉంటాయి.

మన జీవితంలో అత్యంత కీలకమైన అంశాలపై ఎలాంటి చర్చా లేకుండా ఎలా ముందుకు వెళ్తున్నామో ఈ ప్రశ్నలు ఒక్కోసారి నాకు గుర్తుచేస్తుంటాయి. ఇక్కడ చాలాసార్లు సెక్స్ గురించి మాట్లాడటాన్ని ఒక అంశంగా కూడా పరిగణించరు. జీవితంలో సహజంగా చోటుచేసుకునే పరిణామాల గురించి సరిగ్గా మాట్లాడుకోలేకపోవడం వల్లే నా తల్లిదండ్రుల వివాహ బంధం వీడిపోయింది. నా భర్త, నేను పెద్దగా మాట్లాడుకోకపోవడమే, మా మధ్య శృంగార లేమికి ప్రధాన కారణం.

ఇప్పుడు నా కొడుకు వయసు ఎనిమిదేళ్లు. కొన్నేళ్లలో అన్నింటి గురించి తెలుసుకోవాలనే కుతూహలం తనలో పెరుగుతుంది. నా కొడుక్కి పాలు ఇవ్వడం ఆపేసే ముందు నేనొక విషయం చెప్పాను. మహిళ శరీరంలో కొన్ని భాగాలను పట్టుకోకూడని వయసు నీకు వచ్చిందని వివరించాను. తను అప్పుడు చిన్నోడే. కానీ అర్థం చేసుకున్నాడు. తనకు తగిన వయసు వచ్చినప్పుడు లైంగిక పరమైన అన్ని విషయాలు తెలుసుకునే వాతావరణం కల్పిస్తాను.

నాలుగేళ్ల బాలికపై అత్యాచారం

ఫొటో సోర్స్, Getty Images

తల్లిదండ్రులకు సూచనలు

అసలు పిల్లలకు సెక్స్ గురించి చెప్పడం ఎందుకు అవసరమో మీరు మొదట తెలుసుకోవాలి.

‌సెక్స్, సెక్యువాలిటీ లాంటి అంశాల గురించి మాట్లాడటం ద్వారా భవిష్యత్‌లో పిల్లలు ఎదుర్కొనే చాలా సమస్యలను మనం పరిష్కరించొచ్చు. ఆత్మన్యూనతా భావం, శరీరాకృతి గురించి ఆందోళన, లైంగిక పరమైన హింస, అనారోగ్యకర రిలేషన్‌షిప్‌లు ఇలా చాలా అంశాల గురించి మనం అవగాహన కలిగించొచ్చు.

మొదట మీ సొంత అనుభవాల గురించి పిల్లలకు చెప్పండి.

తల్లిదండ్రుల కథలకు పిల్లలు బాగా కనెక్ట్ అవుతారు. మీరు ఎలా పెరిగారో తెలుసుకోవాలని వారు అనుకుంటారు. అందరిలానే చిన్నప్పుడు మీరు తప్పులుచేసి ఇప్పుడు మెరుగ్గా ఉన్నారని వారు తెలుసుకోవాలని భావిస్తారు. ఈ అంశాల గురించి మాట్లాడితే, మీ పిల్లలతో మీ బంధాలు కూడా బలపడతాయి.

వీడియో క్యాప్షన్, ఎన్ని చట్టాలున్నా నేరాలు ఎందుకు తగ్గడం లేదు

మీ అభిప్రాయాలను పంచుకోండి..

లైంగిక విలువల గురించి పిల్లలతో మాట్లాడండి. నగ్నంగా ఉండటం, డేటింగ్, ఎల్‌జీబీటీ అంశాలు, స్కలింగ సంపర్కుల వివాహాలు, గర్భస్రావాలు, గర్భనిరోధకాలు, వివాహేతర సంబంధాలు, ఆరోగ్యకర రిలేషన్‌షిప్‌ల గురించి చెప్పండి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి.. మీరు మీ పిల్లలకు విలువలు నేర్పిస్తున్నారు. అంతేకానీ, ఆ పనులు చేయమని చెప్పడం లేదు.

ఎప్పుడు ఏం చెప్పాలి?

ఏ వయసులో వారికి ఎలాంటి విషయాలు చెప్పాలో మొదట తెలుసుకోండి. మీ పిల్లలు 10 నుంచి 14 ఏళ్ల వయసున్నప్పుడు ఈ కింద విషయాలు తెలియజేయాలి.

  • సెక్స్ నుంచి ఆశించే అంశాలు, విలువలు
  • పురుషులు, మహిళల శరీరాల్లోని అవయవాల పేర్లు, వాటి విధులు
  • లైంగిక చర్య అంటే ఏమిటి? గర్భం ఎలా వస్తుంది?
  • టీనేజీలో వచ్చే శారీరక, భావోద్వేగ పరమైన మార్పులు
  • రుతుక్రమ విధానాలు, పనితీరు
  • ఎల్‌జీబీటీ రిలేషన్‌షిప్‌లు, హస్త ప్రయోగాలు, గర్భస్రావాలు
  • కుటుంబ నియంత్రణ అంటే ఏమిటి?
  • సెక్సువల్లీ ట్రాన్స్‌మిటెడ్ డిసీజెస్ లేదా సుఖవ్యాధులు అంటే ఏమిటి? అవి ఎలా వ్యాపిస్తాయి?
  • లైంగిక హింస అంటే ఏమిటి? అలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ఏం చేయాలి?
  • ఈ సమాచారం మొత్తం వయసుకు తగినట్లుగా పిల్లలకు చెప్పాల్సి ఉంటుంది. ఎంత చెప్పాలి? ఎలా చెప్పాలి? లాంటివి మీరే నిర్ణయించుకోవాలి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)