సిరియా: ఇస్లామిక్ స్టేట్ శిబిరాలలో చిన్నారుల జీవితాలు మగ్గిపోవాల్సిందేనా, అక్కడ కూడా మతాన్ని నూరిపోస్తున్నారా

అల్ హాల్ క్యాంపులో వేలమంది చిన్నారులు తమ తల్లులతో కలిసి జీవిస్తున్నారు.

ఫొటో సోర్స్, JEWAN ABDI

ఫొటో క్యాప్షన్, అల్ హాల్ క్యాంపులో వేలమంది చిన్నారులు తమ తల్లులతో కలిసి జీవిస్తున్నారు.
    • రచయిత, పూనమ్ తనేజా
    • హోదా, బీబీసీ ఏసియన్ నెట్‌వర్క్

అది సిరియాలోని అల్ హాల్ క్యాంప్. అక్కడ పరిస్థితులు గందరగోళంగా, భయానకంగా ఉన్నాయి. విదేశాలలో ఉంటున్న ఐఎస్ తీవ్రవాదుల భార్యలు, పిల్లలు ఉండే ప్రాంతం అది.

అన్నీ టెంట్లు వేసి ఉన్నాయి. తీవ్రవాదుల కుటుంబాలన్నీ ఆ టెంట్లలో ఇరుక్కుని ఇరుక్కుని జీవిస్తున్నారు. టవర్ల మీద నుంచి గార్డులు నిత్యం పహారా కాస్తున్నారు. క్యాంప్ చుట్టూ కంచె వేసి ఉంది.

సిరియా-టర్కీ సరిహద్దు నగరం అల్‌ మలిఖ్యా పట్టణం నుంచి ఈ ఎడారి క్యాంప్‌కు చేరుకోవాలంటే నాలుగు గంటలు పడుతుంది.

లోపలున్న మహిళలు నల్లని దుస్తులు, తలకు హిజబ్ ధరించి ఉన్నారు. వారి కళ్లు మాత్రమే కనిపిస్తున్నాయి. వారిలో కొందరు ఒంటరిగా ఉంటున్నారు.

శిబిరం మూలన ఉన్న ఓ కూరగాయల మార్కెట్ దగ్గర కొందరు మహిళలు ఎండకు చేతులు అడ్డం పెట్టుకుంటూ ఏదో మాట్లాడుకుంటున్నారు. వారంతా తూర్పు యూరప్ ప్రాంతం నుంచి వచ్చారు.

మీరిక్కడికి ఎందుకు వచ్చారని వారిని ప్రశ్నించాను. ముక్తసరిగా మాట్లాడారు. తమ భర్తలతో కొన్ని వేల మైళ్ల దూరం ప్రయాణించి ఇక్కడ చిక్కుకుపోయామని వెల్లడించారు. భర్తలుగా ఎంచుకోవడంలో చేసిన పొరపాటు వల్లే తమకు ఈ గతి పట్టిందని వారు అన్నారు.

ఐఎస్ తీవ్రవాదుల భార్యల విషయంలో ఇది అందరికీ తెలిసిన విషయమే. చాలామంది మహిళలు తమ భర్త తీవ్రవాద చర్యలకు దూరంగా జరిగేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఐఎస్ కోసం పోరాటం చేయడానికి వెళ్లి వారి భర్తల్లో కొందరు చనిపోయి ఉండవచ్చు. లేదంటే జైలుకు వెళ్లి ఉండవచ్చు. దీంతో ఈ మహిళలంతా తమ పిల్లలతో సహా ఇక్కడ ఉండి పోవాల్సి వచ్చింది.

విదేశాల నుంచి వచ్చిన ఐఎస్ మిలిటెంట్లకు చెందిన 2,500 కుటుంబాలతో సహా దాదాపు 60,000 మంది ఈ క్యాంప్‌లో నివసిస్తున్నారు. 2019 లో బాఘుజ్‌ అనే జిహాదీ గ్రూపు ఓటమి తర్వాత చాలా మంది ఈ శిబిరంలో చేరాల్సి వచ్చింది.

ఇక్కడున్న మహిళలు ఆచితూచి మాట్లాడుతున్నారు. తమ వ్యాఖ్యల వల్ల అనూహ్య పరిస్థితులు ఏర్పడే ప్రమాదాన్ని కొని తెచ్చుకోవాలని వారు భావించడం లేదు.

వారి భయమంతా చుట్టూ ఉన్న గార్డుల గురించి కాదు. ఐఎస్ నిబంధలను కఠినంగా పాటించే ఇతర మహిళల గురించే. కొందరు మహిళలు ఇక్కడ ఇస్లామిక్ నిబంధనలను కఠినంగా అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఆ రోజు తెల్లవారుజామునే అక్కడ ఓ మహిళ హత్యకు గురైంది.

సిరియా క్యాంపులో మౌలిక సదుపాయాలు నామమాత్రంగా కనిపిస్తాయి.

ఫొటో సోర్స్, JEWAN ABDI

ఫొటో క్యాప్షన్, సిరియా క్యాంపులో మౌలిక సదుపాయాలు నామమాత్రంగా కనిపిస్తాయి.

రోజూహత్యలు

ఇక్కడ సాగుతున్న మత కార్యాక్రమాలు, రాడికలైజేషన్ ప్రయత్నాలు, క్యాంపు నిర్వహాకులలైన సిరియన్ డెమొక్రాటిక్ సైన్యానికి పెను సమస్యగా మారింది.

మత ఛాందసవాదులైన ఐఎస్‌ గ్రూప్‌కు చెందిన కొందరు మహిళలు, క్యాంప్ మీద ఆధిపత్యం చెలాయిస్తున్నారన్న విషయాన్ని ఈశాన్య సిరియాలోని కుర్దిష్ ప్రభుత్వంలో విదేశాంగ మంత్రిగా పని చేస్తున్న డాక్టర్ అబ్దుల్ కరీం ఒమర్ అంగీకరించారు.

ఇక్కడ జరుగుతున్న హింసకు ఆ మహిళలే కారణమని ఆయన అన్నారు.

" అక్కడ రోజూ హత్యలు జరుగుతున్నాయి. ఐఎస్ భావజాలాన్ని అంగీకరించని వారి గుడారాలను తగలబెడుతున్నారు" అని ఆయన వెల్లడించారు.

"వారు తమ పిల్లలకు కూడా అదే భావజాలాన్ని నూరిపోస్తున్నారు. ఆసియా, యూరప్, ఆఫ్రికాల నుంచి చాలామంది తమ పిల్లలను ఐఎస్‌లో చేర్చడానికి తీసుకువచ్చారు'' ఆయన ఆరోపించారు.

అక్కడ నివసిస్తున్న వారిలో చాలామందికి పెద్దగా పని లేదు. మేం విదేశీ విభాగానికి చెందిన క్యాంప్‌ గుండా వెళుతుండగా, కొందరు పిల్లలు మాపై రాళ్లు విసిరారు. ఇలాంటి పరిస్థితులు అక్కడ సర్వసాధారణమని తెలిసింది.

కొందరు పిల్లలు మాత్రం టెంట్ల ముందు నిర్లిప్తంగా కూర్చుని కనిపించారు. ఐఎస్ సంస్థ ఇరాక్, సిరియాలలో తమ భూభాగాల కోసం పోరాడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇక్కడ దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి.

ఇక్కడ ఉంటున్న వారిలో చాలామందికి యుద్ధం తప్ప మరేమీ తెలియదు. స్కూలుకు వెళ్లే పరిస్థితి లేదు. చాలామంది ఒంటి మీద గాయాలతో కనిపిస్తారు. ఒక కాలు పోగొట్టుకున్న బాలుడు అటుగా నడిచి వెళుతుండగా నేను చూశాను.

ఇక్కడి చాలామంది పిల్లలు తమ తల్లినో, తండ్రినో కోల్పోయిన వారే.

శిబిరంలో పెరుగుతున్న హింసను నియంత్రించడానికి ఇక్కడ క్రమం తప్పకుండా సెక్యూరిటీ చెక్‌లు జరుగుతుంటాయి. చాలాకాలంగా ఉంటున్న బాలలే ప్రమాదకరంగా మారుతున్నట్లు తెలిసింది. బాల్యం నుంచి కౌమారంలోకి అడుగు పెట్టాక వీరిని మరింత సెక్యూరిటీ ఉన్న డిటెన్షన్ సెంటర్లకు పంపుతారు.

''వాళ్లు ఒక వయసుకు వచ్చాక కంట్రోల్ చేయడం కష్టం. అందుకే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డిటెన్షన్ సెంటర్లకు పంపుతున్నాం'' అని మంత్రి డాక్టర్ ఒమర్ వెల్లడించారు.

అంతర్జాతీయ రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో వారిలో కొందరు పిల్లలను తమ కుటుంబాలతో, తల్లులతో మాట్లాడగలుగుతున్నారు.

తమ పిల్లలకు మంచి భవిష్యత్తు కోసం తల్లులు ఎదురు చూస్తున్నారు.

ఫొటో సోర్స్, JEWAN ABDI

ఫొటో క్యాప్షన్, తమ పిల్లలకు మంచి భవిష్యత్తు కోసం తల్లులు ఎదురు చూస్తున్నారు.

'పిల్లలు ఎదుగుతున్నారు...ఏం చేయాలి'

అల్-హాల్‌కు ఉత్తరాన రోజ్ అనే మరో చిన్న శిబిరం ఉంది. ఇక్కడ కూడా ఐఎస్ ఫైటర్ల భార్యలు, పిల్లలు ఉంటారు. కాకపోతే హింసాత్మక ఘటనలు కాస్త తక్కువ. బ్రిటన్‌కు చెందిన షమీమా బేగం, నికోల్ జాక్ తదితరులు తమ పిల్లలతో కలిసి ఉంటున్నారు.

ఇక్కడి క్యాంప్‌ను ఇనుప కంచెలతో విభజించారు. నేను కరీబియన్ ద్వీపం ట్రినిడాడ్ అండ్ టొబాగో నుండి వచ్చిన మహిళల బృందాన్ని కలిశాను. ట్రినిడాడ్ ప్రాంతంలో ఐఎస్ రిక్రూట్‌మెంట్‌ అధికంగా ఉందని చెబుతారు.

ఇక్కడున్న మహిళల్లో ఒకరికి 10 ఏళ్ల బాబు ఉన్నాడు. భర్త చనిపోయిన తర్వాత ఆమె ఈ శిబిరంలో చేరారు. ఎదిగిన పిల్లలను ఇక్కడి నుంచి తీసుకెళుతున్నారని, తన కొడుకును కూడా అలా తీసుకెళతారేమోనని ఆమె భయపడుతున్నారు.

క్యాంపులో పరిసరాల పరిశుభ్రత నామమాత్రంగా ఉంది. మరుగుదొడ్లు, స్నానపు గదులు బహిరంగంగానే ఉన్నాయి. మంచినీటి కోసం ట్యాంకులు ఏర్పాటు చేశారు.

క్యాంప్‌లో పిల్లలు ఆడుకోవడానికి బొమ్మలు, ఆహారం, దుస్తులు అమ్మేందుకు చిన్న మార్కెట్ ఉంది. ఇక్కడ ఉంటున్న కుటుంబాలు నెల నెలా ఆహార పదార్ధాల ప్యాకెట్లు అందుకుంటారు.

కొందరు ఉమ్మడి కుటుంబంగా జీవిస్తున్నారు. ఐఎస్ పాలనతో కొందరు పురుషులు ఇద్దరు భార్యలను పెళ్లి చేసుకోగా, వారిలో ఒకరు ఇంటి పనులు, రెండో వారు పిల్లల బాధ్యతలను చూసుకునే వారు. ఇక్కడి క్యాంపులలో కూడా వారు అదే విధానాన్ని పాటిస్తున్నారు.

సిరియా క్యాంప్: కొందరు పిల్లలు దూకుడుగా, మరికొందరు నిరాసక్తంగానూ కనిపిస్తున్నారు

ఫొటో సోర్స్, JEWAN ABDI

ఫొటో క్యాప్షన్, కొందరు పిల్లలు దూకుడుగా, మరికొందరు నిరాసక్తంగానూ కనిపిస్తున్నారు

మార్పు కనిపిస్తోందా?

‘సేవ్ ది చిల్డ్రన్’ సంస్థ నిర్వహిస్తున్న తాత్కాలిక స్కూళ్లకు చాలామంది పిల్లలు హాజరవుతున్నారు. "మేం చాలా కథలు వింటున్నాం. వాటిలో ఏవీ పాజిటివ్‌ గా లేవు. కానీ, మా పిల్లలు మళ్లీ ఇంటికి వెళ్లి సాధారణ బాల్యం గడపాలని ఆరోగ్యంగా, సురక్షితంగా ఉండాలనేది మా ఆశ" అని సారా రష్దాన్ అనే మహిళ చెప్పారు.

"పిల్లల ప్రవర్తనలో మార్పులను గమనించాం. గతంలో వాళ్లు యుద్ధాలు, విధ్వంసాలు, బాంబుల బొమ్మలు గీసేవారు. ఇప్పుడు పూలు, తోటలు, ఇళ్ల బొమ్మలు వేస్తున్నారు'' అన్నారామె. కానీ, ఈ పిల్లలు ఇక్కడి నుంచి ఎలా బయటపడతారు, భవిష్యత్తు ఎలా ఉంటుందనే దానిపై స్పష్టత లేదు.

కొన్ని పాశ్చాత్య దేశాలు ఐఎస్ విదేశీ ఫైటర్ల భార్యలను తమ భద్రతకు ముప్పుగా భావిస్తున్నాయి. ఇదే కారణంతో చాలామంది మహిళలను వారు తిరస్కరించారు. అసలు ఐఎస్ బాధితులైన యాజిదీ మహిళల గురించి కూడా ఇదే ధోరణి. వారి గురించి చర్చించడానికి కూడా ఇష్టపడటం లేదు.

ఇక్కడ ఉంటున్న మహిళల్లో చాలామంది ఐఎస్ గ్రూప్ పాల్పడ్డ హింస గురించి తమకు తెలియదని చెబుతుంటారు. తాము ఖలీఫేట్‌ పాలనలో గడిపినా, శిరచ్ఛేదాలు, మారణహోమాల గురించి తాము వినలేదని వెల్లడించారు.

అయితే, ఐఎస్‌లో చేరిన వారు చాలామంది ఇలాంటి మాటలు చెబుతుంటారు. వారి మాటల్లో నిజాయితీ ఉందని చెప్పే పరిస్థితి లేదు.

బాల్యం దాటిన పిల్లలను ఇక్కడే ఉంచడం ప్రమాదకరమని సిరియా ప్రభుత్వం భావిస్తోంది.

ఫొటో సోర్స్, JEWAN ABDI

ఫొటో క్యాప్షన్, బాల్యం దాటిన పిల్లలను ఇక్కడే ఉంచడం ప్రమాదకరమని సిరియా ప్రభుత్వం భావిస్తోంది.

స్వదేశానికి చేరేదెప్పుడు?

ఇక్కడున్న వారు బాహ్య ప్రపంచానికి దూరంగా జీవిస్తున్నారు. తమ దేశంలో ప్రజలు తమ గురించి ఏమనుకుంటున్నారో వాళ్లకు తెలుసు. స్వీడన్, జర్మనీ, బెల్జియం వంటి కొన్ని ఐరోపా దేశాలు తమ దేశానికి చెందిన పిల్లలను, వారి తల్లులనే స్వదేశానికి తరలిస్తున్నాయి.

శిబిరాలలో పరిస్థితులు దారుణంగా మారుతుండటంతో వీరిని తీసుకెళ్లాలని కుర్దిష్ అధికారులు కూడా ఆయా దేశాలను కోరుతున్నారు.

"ఇది ఒక అంతర్జాతీయ సమస్య. కానీ అంతర్జాతీయ సమాజం తన విధులను, బాధ్యతలను నిర్వర్తించడం లేదు" అని డాక్టర్ ఒమర్ అన్నారు.

"ఇది ఇలాగే కొనసాగితే మేం కూడా నియంత్రించలేనంత పెను ముప్పుగా మారుతుంది'' అని ఒమర్ అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)