రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా: ఈ షేర్ మార్కెట్ ఇన్వెస్టర్ ఎందుకంత ప్రత్యేకం

ఫొటో సోర్స్, FACEBOOK/RAKESHJHUNJHUNWALAS
- రచయిత, రాఘవేంద్ర రావ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్ రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా అక్టోబర్ 5న తన భార్య రేఖా ఝున్‌ఝున్‌వాలాతో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు.
ఆయన కలిసిన తర్వాత ప్రధానమంత్రి మోదీ... "రాకేశ్ ఝున్‌ఝున్‌వాలాను కలవడం చాలా సంతోషంగా ఉంది. ఆయన భారత్ పట్ల చాలా ఆశావాదం కలిగినవారు" అంటూ ట్వీట్ చేశారు.
ఇది జరిగిన కొన్ని రోజులకే, అక్టోబర్ 11న రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా భాగస్వామ్యం ఉన్న 'ఆకాశ ఎయిర్' సంస్థ అల్ట్రా-లో కాస్ట్ విమాన సేవలు ప్రారంభించేందుకు పౌర విమానయాన శాఖ నుంచి ప్రాథమిక అనుమతులు వచ్చాయి.
ఆకాశ ఎయిర్ విమానాలు వచ్చే ఏడాది వేసవిలో తమ సేవలు ప్రారంభించవచ్చని భావిస్తున్నారు.
రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా ఆ ఎయిర్ లైన్స్ సంస్థలో 3.5 కోట్ల డాలర్లు(సుమారు రూ. 264 కోట్లు) పెట్టుబడులు పెడతామని చెప్పారు. ఆయన ఈ ఎయిర్‌లైన్స్ కోసం 70 విమానాలు కొనుగోలు చేస్తాననీ చెప్పారు.

ఫొటో సోర్స్, Twitter/sanjaynirupam
అయితే, ‘ఆకాశ ఎయిర్’కు అనుమతులు రావడానికి... ఝున్‌ఝున్‌వాలా ప్రధాన మంత్రి మోదీని కలవడానికి సంబంధం ఉందా?
మోదీ వ్యతిరేక రాజకీయ వర్గాలు మాత్రం ఈ రెండింటికి ముడిపెట్టి చూస్తున్నాయి.
రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా, మోదీ సమావేశానికి సంబంధించిన ఓ ఫొటోపైనా విపక్షాలు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నాయి.
రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా కుర్చీలో కూర్చుని ఉండగా ప్రధాని మోదీ ఆయనకు ఎదురుగా చేతులు ముడుచుకుని నిల్చుని మాట్లాడుతుండడం ఆ ఫొటోలో కనిపిస్తోంది.
అయితే, రాకేశ్ అనారోగ్య సమస్యలతో వీల్ చెయిర్‌కు పరిమితం కావడం వల్లే ఆ ఫొటోలో ఆయన కూర్చుని ఉండగా మోదీ నిల్చుని మాట్లాడుతున్నట్లు ఉందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.
ఈ మొత్తం విషయంలో అందరి కళ్లూ రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా మీదే ఉన్నాయి. ప్రధాని మోదీ పొగడ్తలు కురిపించేటంత ప్రత్యేకత రాకేశ్‌లో ఏముంది అనే ప్రశ్నలూ వస్తున్నాయి.

ఫొటో సోర్స్, KUNAL PATIL/HINDUSTAN TIMES VIA GETTY IMAGES
రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా ఎవరు?
1960 జులై 5న ముంబయిలో పుట్టిన రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా అక్కడే పెరిగారు. ఆయన తండ్రి ఆదాయ పన్ను శాఖ అధికారి. యువకుడుగా ఉన్నప్పుడే స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులపై ఆయనకు ఆసక్తి మొదలైంది.
దాంతో, రోజంతా వచ్చే వార్తల వల్ల షేర్ మార్కెట్‌పై ఎలాంటి ప్రభావం పడుతుందో గమనించాలని తండ్రి ఆయనకు సలహా ఇచ్చారని చెబుతారు.
షేర్ మార్కెట్ మీద ఝన్‌ఝున్‌వాలా ఆసక్తి అంతకంతకూ పెరిగింది. 1985లో ఆయన సిడెన్‌హామ్ కాలేజీలో చదువుతున్న సమయంలోనే షేర్ మార్కెట్‌లో డబ్బులు పెట్టడం ప్రారంభించారు.
చార్టెడ్ అకౌంటన్సీ పూర్తి చేసిన తర్వాత తనకు షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టాలని ఉందని ఆయన తన తండ్రికి చెప్పారు.
అయితే, "నన్ను, నా స్నేహితులను డబ్బు అడగద్దు" అని ఆయన కొడుకుతో కచ్చితంగా చెప్పేశారు. నువ్వు షేర్ మార్కెట్లో సక్సెస్ కాకపోతే చార్టెడ్ అకౌంటెంట్‌గా నీ కెరియర్ కొనసాగించాలంటూ మాట కూడా తీసుకున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా కేవలం రూ.5 వేలతో షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం ప్రారంభినట్లు చెబుతారు. ఫోర్బ్స్ వివరాల ప్రకారం ఇప్పుడు ఆయన మొత్తం సంపద విలువ 600 కోట్ల డాలర్లు(సుమారు రూ.45,328 కోట్లు).
ఫోర్బ్స్ వివరాల ప్రకారం ఆయన అత్యంత విలువైన లిస్టెడ్ హోల్డింగ్స్‌లో గడియారాలు, ఆభరణాలు తయారు చేసే టైటన్ ఉంది. ఇది టాటా గ్రూప్‌లో భాగం. స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్, మెట్రో బ్రాండ్స్, కాన్‌కార్డ్ బయోటెక్ లాంటి ప్రైవేటు కంపెనీల్లో కూడా ఝున్‌ఝున్‌వాలాకు భారీగా వాటాలు ఉన్నాయి.
1986లో ఝున్‌ఝున్‌వాలా ఒక కంపెనీకి సంబంధించిన 5 వేల షేర్లు కొనుగోలు చేశారు. ఆయన వాటిని ఒక్కో షేర్ రూ.43 చొప్పున కొన్నారు. కానీ మూడు నెలల్లోనే ఆ షేర్ ధర ఒక్కక్కటి రూ.143 రూపాయలకు పెరిగింది. షేర్ మార్కెట్లో ఆయన విజయాలలో అది మొదటిది.

ఫొటో సోర్స్, FACEBOOK/RAKESHJHUNJHUNWALAS
ఇండియన్ వారన్ బఫెట్
వారెన్ బఫెట్‌ను ప్రపంచంలో ఇప్పటివరకూ అత్యంత విజయవంతమైన పెట్టుబడిదారుడుగా భావిస్తారు. ఫోర్బ్స్ వివరాల ప్రకారం ప్రస్తుతం బఫెట్ మొత్తం సంపద విలువ 10,200 కోట్ల డాలర్లు(దాదాపు రూ.7.70 లక్షల కోట్లు)
బఫెట్ గురించి ఇంకోకటి కూడా చెబుతారు. ఆయన కేవలం 11 ఏళ్ల వయసులోనే షేర్లు కొనడం మొదలుపెట్టారని, 13 ఏళ్ల వయసులో ఆయన మొదటిసారి పన్ను చెల్లించాడని అంటారు.
అందుకే, రాకేశ్ ఝున్‌ఝున్‌వాలాను కూడా తరచూ భారత వారెన్ బఫెట్‌గా అభివర్ణిస్తుంటారు. అయితే ఝున్‌ఝున్‌వాలాకు తనను బఫెట్‌తో పోల్చడం నచ్చదు.
"అది సరైన పోలిక కాదు. సంపద అయినా, విజయాలు అయినా, పరిపక్వత విషయంలో అయినా అన్ని విషయాల్లో బఫెట్ నాకంటే ఎంతో ఎత్తున ఉన్నారు" అని ఝున్‌ఝున్‌వాలా 2012లో రాయిటర్స్‌కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో అన్నారు.
"నేను ఎవరికీ క్లోన్ కాదు. నేను రాకేశ్ ఝున్‌ఝున్‌వాలాను. నేను నాకు తగినట్లు జీవిస్తున్నాను. నాకు నచ్చింది నేను చేస్తా. నేను ఏం చేసినా, దాన్ని ఆస్వాదిస్తాను" అని ఆయన అదే ఇంటర్వ్యూలో చెప్పారు.

ఫొటో సోర్స్, Twitter/sebi
వివాదాలతో సహవాసం
ఝన్‌ఝున్‌వాలా అప్పుడప్పుడూ షేర్ మార్కెట్‌కు సంబంధించి కొన్ని వివాదాల్లో కూడా నిలిచారు.
ఆప్టెక్ లిమిటెడ్ షేర్లలో ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు సంబంధించిన కేసులో ఇదే ఏడాది జులైలో రాకేశ్, ఆయన భార్య రేఖా ఝున్‌ఝున్‌వాలా, మరో 8 మంది రూ.37 కోట్లకు పైగా చెల్లించారు.
ఈ మొత్తంలో సెటిల్‌మెంట్ రుసుము, తప్పుడు సంపాదనలో లాభాల చెల్లింపులు, వడ్డీ చార్జీలు కూడా ఉన్నాయి.
ఇన్‌సైడర్ ట్రేడింగ్ అనేది షేర్ మార్కెట్‌లో ఒక మార్గం. ఇందులో రహస్య సమాచారం ద్వారా తమ ప్రయోజనాల కోసం షేర్ మార్కెట్లో ట్రేడింగ్ చేస్తారు.
ఝున్‌ఝున్‌వాలా సెబీకి లక్ష్యంగా మారడం ఇది మొదటిసారికాదు. 2018లో మరో కంపెనీలో అనుమానిత ఇన్‌సైడర్ ట్రేడింగ్ కేసులో సెబీ ఆయనను విచారించింది. ఝున్‌ఝున్‌వాలా ఆ తర్వాత రూ.2.48 లక్షలు చెల్లించి సెటిల్మెంట్ చేసుకుని ఆ కేసు నుంచి బయటపడ్డారు.
అంటే, ఇన్‌సైడర్ ట్రేడింగ్ కేసుల్లో ఝున్‌ఝున్‌వాలా పేరు బయటపడడం ఆయన ఇమేజ్ మీద మరకగా భావించవచ్చా?
"అది సగం నిండిన, సగం ఖాళీగా ఉన్న గ్లాసులా ఉంటుంది. శిక్ష విధించాల్సిన వారే ఈ కేసులో పోరాడడం వల్ల మీ సమయం, డబ్బులు వృథా అవుతాయని వారికి చెబుతారు. మీ మిగతా సంస్థలపై ఆ ప్రభావం పడవచ్చని కూడా అంటారు. అందుకే, వాటిని అడ్డుకోడానికే జరిమానా విధిస్తున్నామని చెబుతారు. మరోవైపు, ఆ కేసులో కచ్చితంగా అలాంటిది ఏదోఒకటి ఉంటుంది, అందుకే, ఆ భయంతో వారు జరిమానా చెల్లించేస్తారు" అని సీనియర్ ఫ్రీలాన్స్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ ఆలమ్ శ్రీనివాస్ చెప్పారు.
"ఇన్‌సైడర్ ట్రేడింగ్ కేసులు చాలావరకూ జటిలంగా ఉంటాయి. వాటిలో ఒకరిని దోషి, లేదా నిర్దోషి అని చెప్పడం చాలా కష్టం. ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందని నిరూపించడమే చాలా కష్టం అవుతుంది" అన్నారు.

ఫొటో సోర్స్, Ani
పట్టిందల్లా బంగారం అవుతుందా
రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా గురించి మాట్లాడే వారు ఆయన పట్టిందల్లా బంగారం అవుతుందని భావిస్తారు.
షేర్ మార్కెట్లో లభించిన విజయం ఆయనకు ఒక సెలబ్రిటీ హోదాను ఇచ్చింది. దేశంలో ఝున్‌ఝున్‌వాలాను ఇంటర్వ్యూ చేయని బిజినెస్ పత్రిక, న్యూస్ చానల్ బహుశా లేదు.
రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా 'ఇంగ్లిష్-వింగ్లిష్', 'కీ అండ్ కా', 'షమితాబ్' లాంటి హిందీ సినిమాలు కూడా నిర్మించారు.
ఇటీవల జీ మీడియాలో ఒక బోర్డ్ రూం వివాదం తలెత్తడంతో, జీ షేర్లు కొనుగోలు చేసిన ఝున్‌ఝున్‌వాలా వాటి నుంచి దాదాపు 50 శాతం లాభాలు ఆర్జించారు.
2017లో 'ఈటీ నౌ' న్యూస్ చానల్లో నటి అలియా భట్‌తో మాట్లాడిన ఝున్‌ఝున్‌వాలా షేర్ మార్కెట్ తీరు గురించి చెప్పారు.
"షేర్ మార్కెట్లో సైకాలజీ అనేది రియాలిటీలో ఎంత ఉంటుందో అంతే ఉంటుంది. మనం షేర్ మార్కెట్‌లో సర్దుకుపోయే స్వభావం లేకపోతే, మనం దాన్లో విజయం సాధించలేరు. ఇక్కడ మార్కెట్ మాత్రమే రాజు. మార్కెట్లో రాజులు ఎవరూ లేరు. షేర్ మార్కెట్లో రాజులు కావాలని ప్రయత్నించిన వారంతా ఆర్థర్ రోడ్ జైలుకు వెళ్లారు" అన్నారు.
ఝున్‌ఝున్‌వాలా తన సంస్థ 'రేర్ ఎంటర్‌ప్రైజెస్' ద్వారా ట్రేడింగ్ చేస్తారు. ఆయన తన పేరు, తన భార్య రేఖ పేర్లలోని మొదటి రెండు అక్షరాలు కలిపి దానికి రేర్ అనే పేరు పెట్టారు.

ఫొటో సోర్స్, NARENDRA MODI/FACEBOOK
తెర వెనుక చాలా శక్తివంతులు
రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా ఒక తెలివైన పెట్టుబడిదారుడు అంటారు సీనియర్ జర్నలిస్ట్ శ్రీనివాస్. ఆయన పెట్టుబడులు పెట్టే విధానం ద్వారా అది తెలుస్తుందని అన్నారు.
కార్పొరేట్, ఆర్థిక, షేర్ మార్కెట్ రంగంలో ఝున్‌ఝున్‌వాలా చాలా ప్రభావవంతమైన వ్యక్తి అని ఆయన చెబుతున్నారు.
"ఆయన ఏదో ఒక కంపెనీలో 5 నుంచి 15 శాతం వాటాలు కొనుగోలు చేసి, అందులో చాలా ముఖ్యమైన షేర్ హోల్డర్ అయిపోతారు. దాంతో, కంపెనీ మేనేజ్‌మెంట్‌కు ఆయన ఏం చెబితే అది వినాల్సిన పరిస్థితి వస్తుంది. ఆయన తెరవెనుక ఉంటారు. కానీ చాలా శక్తివంతుడు" అని శ్రీనివాస్ చెప్పారు.
ఝున్‌ఝున్‌వాలా కార్పొరేట్, ఆర్థిక ప్రపంచంలో బాగా కనెక్టయి ఉండడంతో రాజకీయ వర్గాల్లో కూడా ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయని శ్రీనివాస్ అన్నారు.
"షేర్ మార్కెట్లో ఆయన పేరుతో షేర్లు పైకీ కిందికీ అవుతుంటాయి. ఝన్‌ఝున్‌వాలా స్టాక్ కొంటున్నారని వదంతులు వస్తే షేర్లు వాటంతట అవే పైకి దూసుకెళ్తాయి. ఆయన అమ్మేస్తున్నారని పుకార్లు రాగానే షేర్ల ధరలు పడిపోతాయి. రాకేశ్ ఎక్కువగా షేర్లు అమ్మరు. కొనుగోలు చేస్తుంటారు" అని శ్రీనివాస్ చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- సెన్సెక్స్ జోరుకు, ఆర్థిక వ్యవస్థ బేజారుకు కారణాలు ఏంటి?
- అఫ్గానిస్తాన్: తమకు శిక్షలు విధించిన మహిళా జడ్జిలను వెంటాడుతున్న తాలిబాన్లు
- అఫ్గానిస్తాన్: సేనల ఉపసంహరణ తర్వాత తొలిసారి తాలిబాన్లతో అమెరికా చర్చలు
- ఉత్తర కొరియాలో డ్రగ్స్, తీవ్రవాదం, ఆయుధ విక్రయాల గుట్టు విప్పిన ఒక సీక్రెట్ ఏజెంట్
- కోవిడ్-19: మా అమ్మను డాక్టర్లు గినియా పిగ్లా భావించి ప్రయోగాలు చేశారు
- నీళ్లపైనే నగరాలు.. భవిష్యత్తు ఇదేనా? యూరప్ దేశాల్లో ఈ ప్రయోగాలు ఎందుకు జరుగుతున్నాయి?
- కశ్మీర్లో భయాందోళనల్లో హిందువులు.. శాంతి, భద్రతలపై ప్రభుత్వానివి ఉత్తి మాటలేనా?
- లిపులేఖ్ రోడ్డు విషయంలో భారత్ తీరుపై నేపాల్‌లో ఆగ్రహం ఎందుకు
- కాలాపానీ: నేపాల్ సరిహద్దులోని 35 చ.కి.మీ భూమి సమస్యను వాజ్‌పేయి నుంచి మోదీ వరకు ఎవ్వరూ ఎందుకు పరిష్కరించలేదు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









