ప్రపంచ కుబేరులు ముకేశ్ అంబానీ - జెఫ్ బెజోస్ 'ఢీ'.. మధ్యలో బియానీ.. ఏమిటి గొడవ?

జెఫ్ బెజోస్, ముకేశ్ అంబానీ

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, ఆలోక్ జోషి
    • హోదా, బీబీసీ కోసం

ప్రపంచంలోనే అత్యంత సంపన్నులు తలపడుతున్నారు. వారి మధ్యలో రిటెయిల్ కింగ్ కిశోర్ బియానీ, ఆయన కంపెనీ బిగ్ బజార్ ఒప్పందం చిక్కుకుపోయాయి.

బిగ్ బజార్ అనే పేరే ఒక పెద్ద బ్రాండ్. అయితే ఈ ఒప్పందం అంతకంటే పెద్దది. దీనిపై భారీ అంచనాలు కూడా ఉన్నాయి.

ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు అమెజాన్ జెఫ్ బెజోస్. ఈసారీ ఆయనతో భారత టాప్, ప్రపంచంలో నాలుగో స్థానంలో ఉన్న సంపన్నుడు అయిన రిలయన్స్ ముకేష్ అంబానీ ఢీ అంటున్నారు.

కిషోర్ బియానీ, ఆయన ఫ్యూచర్ గ్రూప్ ఇద్దరి మధ్యా ఈ గొడవకు కారణమైంది.

ఫ్యూచర్ గ్రూప్ తన వ్యాపారాన్ని రిలయన్స్ గ్రూప్‌కు విక్రయించడం కుదరదని గత ఆదివారం సింగపూర్ అంతర్జాతీయ మధ్యవర్తిత్వ సంస్థ సింగపూర్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ నుంచి అమెజాన్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయించింది.

అలా ఎందుకు, అసలు ఏమైంది తెలుసుకోవాలంటే, మనం మొదట అసలు ఈ ఒప్పందం ఏంటో తెలుసుకోవాలి.

బియానీ ఫ్యూచర్ గ్రూప్ తన మొత్తం రిటెయిల్, హోల్‌సేల్ వ్యాపారాన్ని రిలయన్స్ గ్రూప్ కంపెనీ రిలయన్స్ రిటెయిల్ వెంచర్స్ లిమిటెడ్‌కు విక్రయించే ఒప్పందంపై సంతకాలు చేసింది.

దానికోసం రిలయన్స్ సుమారు 24,700 కోట్లు చెల్లించనుందని ఆగస్టులో ఈ రెండు కంపెనీలు ప్రకటించాయి.

ముకేశ్ అంబానీ

ఫొటో సోర్స్, Getty Images

రిటెయిలర్స్ కళ్లన్నీ ఫ్యూచర్ గ్రూప్ మీదే

అయితే కిశోర్ బియానీ ఈ ఒప్పందం ఎందుకు చేసుకుంటున్నారు అనే ప్రశ్న కూడా వస్తుంది.

ఈ ఒప్పందం ద్వారా ఆయన తన ఫేవరెట్ బ్రాండ్ బిగ్ బజార్‌తోపాటూ, మొత్తం రిటెయిల్, హోల్‌సేల్ వ్యాపారాన్ని విక్రయిస్తారు. అలా చేసినా ఆ కంపెనీ లేదా ప్రమోటర్ మొత్తం రుణాలు తీరేలా లేవు.

దీన్ని అర్తం చేసుకోవడం కష్టమేం కాదు. గత కొన్నేళ్లుగా కొత్త వ్యాపారాన్ని నిలబెట్టడానికి ఆయన కంపెనీ చాలా ఖర్చు చేసింది.

దానికోసం ప్రమోటర్ అంటే బియానీ కుటుంబం స్వయంగా తమ షేర్లు కుదువ పెట్టింది. మార్కెట్ త్వరగా కోలుకుంటుందని, సంపాదన పెరుగుతుందని, రుణాలు తీర్చేసి షేర్లు విడిపించుకోవచ్చని భావించింది.

కిశోర్ బియానీ చాలా కాలం నుంచీ ప్రపంచంలోని ఒక పెద్ద రిటెయిలర్‌తో చేతులు కలపాలనే ప్రయత్నాల్లో ఉన్నారు. వాల్‌మార్ట్ తో కూడా ఆయన సుదీర్ఘ చర్చలు నడిచాయి. ప్రపంచంలో చాలా దిగ్గజాలతో మాట్లాడారు. ఫ్రాన్స్ కారెఫోర్‌తో పదేళ్ల క్రితం ఆయన ఒప్పందం కూడా పతాక శీర్షికల్లో నిలిచింది.

క్లుప్తంగా చెప్పాలంటే ప్రపంచంలోని పెద్ద పెద్ద రిటెయిలర్స్ కళ్లన్నీ ఫ్యూచర్ గ్రూప్ మీదే ఉన్నాయి. ఎందుకంటే అది అప్పటికి దేశంలోని అతిపెద్ద రిటెయిల్ కంపెనీ. ఫ్యూచర్ గ్రూప్ మేనేజ్‌మెట్ కూడా టాటా, బిర్లా రిలయన్స్ లాంటి కంపెనీలతో పోటీపడ్డానికి తమకు ఏదైనా పెద్ద భాగస్వామ్యం కావాలని అనుకునేది.

కిశోర్ బియానీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కిశోర్ బియానీ

కానీ ఆ కంపెనీకి ఒక అడ్డంకి, ముఖ్యంగా భారత విదేశాంగ విధానం వల్ల ఒక అడ్డంకి ఎదురైంది. రిటెయిల్ వ్యాపారంలో విదేశీ పెట్టుబడుల గురించి అన్ని ప్రభుత్వాలూ బాగా ఆలోచించి అడుగు వేస్తాయి.

కంపెనీపై నియంత్రణ సాధించేలా, కనీసం వాటిపై ఒత్తిడి తీసుకొచ్చేలా తగిన వాటా దక్కించుకునేవరకూ ఏ విదేశీ పెట్టుబడిదారుడైనా ఒక భారత కంపెనీలో డబ్బులు పెట్టడానికి వెనకాడుతూనే ఉంటాడు.

రిటెయిల్ వ్యాపారంలో నియమాలు దీనిని చాలా కష్టంగా మార్చాయి. అయితే కొన్ని షరతులతో ఇప్పుడు సింగిల్ బ్రాండ్ రిటెయిల్‌లో 100 శాతం వరకూ, మల్టీ-బ్రాండ్ రిటెయిల్‌లో 51 శాతం వరకూ వాటాను విదేశీ కంపెనీ కొనుగోల చేయవచ్చు. కానీ అది కూడా అంత సులభం కాదు.

ఇక రెండో పెద్ద అడ్డంకి. ఆన్‌లైన్ రిటెయిలర్, అంటే ఈ-కామర్స్ కంపెనీలకు ఈ నియమాలు పూర్తి భిన్నంగా ఉంటాయి.

మినహాయింపులు లభించినా ఏ ఈ-కామర్స్ కంపెనీ అయినా, భారత్‌లో ఒక రిటెయిల్ కంపెనీలో 10 శాతం కంటే ఎక్కువ వాటా తీసుకోలేదు.

ఈ నిబంధన వింతగా ఉంటుంది. ఎందుకంటే ఒక వైపు అమెజాన్ భారత్‌లో జోరుగా వ్యాపారం చేస్తుంటే, మరోవైపు భారత్‌లో మొదలైన ఫ్లిప్‌కార్ట్ ఇప్పుడు వాల్‌మార్ట్ చేతుల్లోకి చేరుకుంది. కానీ అమెజాన్‌కు ఫ్యూచర్ గ్రూప్ లేదా అలాంటి ఒక కంపెనీలో వాటాలు కొనడం ఇప్పటికీ కష్టమే.

జెఫ్ బెజోస్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, జెఫ్ బెజోస్

ప్రపంచంలో అతిపెద్ద ఆన్ లైన్ రిటెయిలర్ అమెజాన్

అందుకే బహుశా రిటెయిలర్ల తమ భాగస్వాములను వెతుకుతూ ఉంటారు. వ్యవస్థలో మార్పులు రాగానే ఒప్పందం చేసుకోడానికి సిద్ధంగా ఉంటారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం అంచనా ప్రకారం 2030 నాటికి అమెరికా, చైనా తర్వాత భారత్ ప్రపంచంలో అతిపెద్ద రిటెయిల్ మార్కెట్ కాబోతుండడమే దానికి కారణం.

ప్రపంచంలోని అతిపెద్ద ఆన్ లైన్ రిటెయిలర్ అమెజాన్ కూడా భారత మార్కెట్లో పెద్ద వాటా దక్కించుకోవాలని కోరుకోవడానికి కూడా కారణం ఇదే.

గత ఏడాది 2019లో ఆగస్టులో అమెజాన్ ఫ్యూచర్ గ్రూప్‌ కంపెనీ, ఫ్యూచర్ కూపన్స్ లిమిటెడ్‌లో 49 శాతం వాటాను కొనుగోలు చేసింది. ఇది గిఫ్ట్ ఓచర్లు, పేమెంట్ యాప్స్ లాంటి వ్యాపారం చేస్తుంది.

కానీ, అమెజాన్ దగ్గర ఫ్యూచర్ రిటెయిల్ లిమిటెడ్ దాదాపు పది శాతం వాటా మాత్రమే ఉంది. అందుకే నిబంధనలు మారినప్పుడు అది ఆ గ్రూప్‌లో డబ్బులు పెట్టాలనుకుంది. ఆ ఒప్పందంలో కూడా ఫ్యూచర్ రిటెయిల్ లిమిటెడ్‌లో ప్రమోటర్ మొత్తం లేదా కొంత వాటాను అమెజాన్ కొనుగోలు చేయవచ్చని కూడా రాసుకున్నారు.

అమెజాన్ దొడ్డిదారిన ఫ్యూచర్ గ్రూప్ వ్యాపారంలో వాటా కొనుగోలు చేయడం మొదలుపెట్టిందని అప్పట్లో అంతా చర్చించుకున్నారు.

ఒప్పందం జరిగిన అదే ఏడాది ఫ్యూచర్ గ్రూప్ ఫుడ్ హాల్, ఫాషన్ అట్ బిగ్ బజార్ లాంటి కొత్త వ్యాపారాలు మొదలుపెట్టింది. తమ పాత బ్రాండ్ బిగ్ బజార్‌ను విస్తరించే ప్రయత్నం చేసింది.

బిగ్ బజార్

ఫొటో సోర్స్, Getty Images

బిగ్ బజార్ విక్రయాలకు కరోనా దెబ్బ

కంపెనీ ఇదంతా రుణాలు తీసుకుని పూర్తి చేసింది. అదే సమయంలో రిలయన్స్ రిటెయిల్ కూడా మార్కెట్లో పెరుగుతూ వచ్చింది. ఐపీఓ, ఈ-మార్ట్ కొత్త జోష్‌తో వ్యాపారం విస్తరించడం కనిపించింది.

తమ రుణ అవసరాలు తీర్చుకోవడం కోసం ఫ్యూచర్ గ్రూప్ ప్రమోటర్ తమ షేర్లన్నింటినీ కుదువ పెట్టారు. ఆ టైంలో దాదాపు 380 రూపాయలు ఉన్న ఫ్యూచర్ రిటెయిల్ షేర్ ధర, ఈ ఏడాది ఫ్రిబవరిలో హఠాత్తుగా పడిపోయింది. కొన్ని రోజుల్లోనే అది వందకు దిగువకు చేరుకుంది.

అయితే, బిగ్ బజార్‌లో కొనుగోళ్లు కొనసాగడంతో కంపెనీ ఎలాగోలా నడుస్తూ వచ్చింది. కానీ, అదే సమయంలో కరోనా మహమ్మారి వచ్చింది. మార్చిలో లాక్‌డౌన్ వల్ల స్టోర్లలో రోజువారీ కొనుగోళ్లు ఆగిపోయాయి. ఆ ఆదాయం కూడా పడిపోయింది.

లాక్‌డౌన్ వల్ల స్టోర్లు మూతపడ్డంతో తర్వాత మూడు నాలుగు నెలల్లోనే కంపెనీ ఏడు వేల కోట్ల రూపాయలు నష్టపోయిందని, అది భరించలేని నష్టం అని కిషోర్ బియానీ ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు.

చివరికి కంపెనీని అమ్మాలనే నిర్ణయానికి వచ్చారు. తమ ముందు వేరే దారి లేదని ఆయన అప్పుడు తెలిపారు.

ఈ ఒప్పందం జరగకపోతే కంపెనీ దివాలా తీయవచ్చని ఆ సంస్థ లాయర్ కూడా అన్నారు.

బిగ్ బజార్

ఫొటో సోర్స్, Getty Images

సింగపూర్ చేరిన పంచాయితీ

అమెజాన్ ఈ గొడవను సింగపూర్ ఎందుకు తీసుకెళ్లింది, ఈ ఒప్పందం ఆగిపోయిందా అనే ప్రశ్న వస్తుంది.

దీనిపై ఎవరూ ఏదీ చెప్పడం లేదు. అధికారి ప్రకటనలు మాత్రమే బయటికి వచ్చాయి.

ఆదివారం సింగపూర్ నుంచి ఆదేశాలు రావడంతో అదే రాత్రి తాము ఈ ఒప్పందం పూర్తి చేసుకోడానికి కట్టుబడి ఉన్నామని రిలయన్స్ నుంచి ఒక ప్రకటన వచ్చింది.

ఫ్యూచర్ గ్రూప్ కూడా అలాంటి ప్రకటనే చేసింది. అది ఈ మధ్యంతర ఉత్తర్వులను దిల్లీ హైకోర్టులో సవాలు చేయవచ్చని చెబుతున్నారు.

సింగపూర్ మధ్యవర్తిత్వం నిర్ణయం భారత్‌లో నేరుగా అమలు కాదని నిపుణులు చెబుతున్నారు. కేసును ఎదుర్కుంటున్న రెండు పక్షాలు తమ మాటపై నిలిస్తే, ఏ సమస్యా ఉండదని అంటున్నారు.

కానీ, ఇప్పుడు ఫ్యూచర్ గ్రూప్ ఒప్పందాన్ని నిలిపివేయడానికి సిద్ధంగా లేకపోతే, అమెజాన్ భారత్‌లోని ఏదోఒక కోర్టుకు వెళ్లి సింగపూర్ ఆదేశాలు చూపించాల్సి ఉంటుంది.

ఇక్కడ నుంచి ఆమోదం పొందిన తర్వాత మాత్రమే అది రిలయన్స్ కు సూచనలు జారీ చేయించగలదు. అలా చేయకపోతే ఒప్పందం కొనసాగుతూనే ఉంటుంది.

బిగ్ బజార్

ఫొటో సోర్స్, Getty Images

దిగ్గజాల ఢీ ఎందుకు

ఫ్యూచర్ గ్రూప్, రిలయన్స్ సంస్థలు ఇప్పుడు చొరవ తీసుకోడానికి బదులు అమెజాన్ కేసు వేస్తే, దానికి సమాదానం ఇవ్వడానికి వేచిచూస్తున్నాయి. ఈ విచారణ దిల్లీ హైకోర్టులో జరగవచ్చని తెలుస్తోంది. ఫ్యూచర్ గ్రూప్, అమెజాన్ మధ్య ఒప్పందం వివాదాలను దిల్లీలో పరిష్కరిచుకోవాలనే నియమం ఉంది.

ఫ్యూచర్ గ్రూప్ నుంచి వినిపిస్తున్న రెండు వాదనలు ఈ కేసును వారివైపు బలంగా నిలిపిందని నిపుణులు అంటున్నరు.

అమెజాన్‌తో జరిగిన ఒప్పందంలో ఫ్యూచర్ రిటెయిల్‌కు పార్టీగా లేదు. అందుకే దానికి తమ వ్యాపారాన్ని విక్రయించే పూర్తి హక్కు ఉంది.

ఇక రెండోది ఈ ఒప్పందం జరగకపోతే, ఫ్యూచర్ గ్రూప్ దివాలా తీయవచ్చు. అలా కంపెనీతోపాటూ దానిలో పనిచేసే వేలాది సిబ్బంది కష్టాల్లో పడతారు.

కోర్టులో ఏది జరిగితే అది బయటికొస్తుంది. కానీ అసలు ముకేష్ అంబానీ, జెఫ్ బెజోస్ ఈ కేసులో ఎందుకు తలపడుతున్నారు అనే ప్రశ్న కూడా ఉంది.

ఈ కేసు ఫ్యూచర్ గ్రూప్ లేదా ఒక కంపెనీకి సంబంధించిన ఒప్పందం కాదు. ఈ రెండు సంస్థలకూ ప్రపంచంలో అత్యంత ఆకర్షణీయమైన రిటెయిల్ మార్కెట్, అంటే బిగ్ బజార్ కనిపిస్తోంది.

వారు భారత్‌లో అతిపెద్ద రిటెయిల్ వ్యాపారాన్ని ఎలాగైనా సొంతం చేసుకోవాలని అనుకుంటున్నారు.

రిలయన్స్ 10,900 స్టోర్లలో ఏటా 30 వేల కోట్ల విక్రయాలతో ఇప్పుడు దేశంలోనే అతిపెద్ద రిటెయిల్ కంపెనీగా నిలిచింది. ఫ్యూచర్ గ్రూప్‌తో చేసుకున్న ఈ ఒప్పందంతో దానికి అదనంగా 1700 స్టోర్లు, దాదాపు 20 వేల కోట్ల ఆదాయం వస్తుంది.

కానీ అమెజాన్ బాధ దీనిని మించినది. అది భారత్‌లో ఆరున్నర బిలియన్ డాలర్ల పెట్టుబడి పెటాలనే ప్రణాళికలతో ఉంది.

దానికి ఇక్కడ రిలయన్స్ నుంచి అతిపెద్ద సవాలు ఎదురవుతోంది. ఎందుకంటే వారికి అతిపెద్ద రిటెయిల్ నెట్‌వర్క్ ఉండడంతోపాటూ, జియోమార్ట్ లాంటి ఆన్‌లైన్ పోర్టల్ ఉంది. రిలయన్స్ జియో లాంటి అద్భుతమైన నెట్‌వర్క్ కూడా ఉంది.

అమెజాన్

ఫొటో సోర్స్, Getty Images

అమెజాన్‌కు గుబులు

కానీ, అమెజాన్ కేవలం ఆన్‌లైన్ వ్యాపారాన్నే నమ్ముకోవాల్సి ఉంటుంది. దీనికి తోడు దానితో పోటీపడుతున్న ఫ్లిప్‌కార్ట్, ఆదిత్య బిర్లా ఫాషన్ రిటెయిల్‌లో వాటాలు కొనుగోలు చేస్తోంది.

అందుకే, అది ఫ్యూచర్ గ్రూప్, రిలయన్స్ ఒప్పందాన్ని అడ్డుకోవాలని బలంగా ప్రయత్నిస్తోంది.

ఈ ఒప్పందాన్ని తెంచేస్తే, కొత్త కొనుగోలుదారుడిని తీసుకొచ్చి, వారితో ఒప్పందం చేయించే బాధ్యత తీసుకోడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు అది సింగపూర్‌లో ప్రతిపాదించిందని చర్చ కూడా జరుగుతోంది.

కానీ, వ్యాపార రంగాన్ని నిశితంగా పరిశీలించే వారికి దీని వెనుక ఏదో జరుగుతోందనే సందేహం కూడా వస్తోంది.

అమెజాన్ ఫ్యూచర్ గ్రూప్ మధ్య లోలోపల ఏదో అంగీకారం జరిగుండచ్చని కొందరు అనుకుంటున్నారు.

కానీ, అమెజాన్ నేరుగా రిలయన్స్ తోనే ఏదో ఒక ఒప్పందం చేసుకోవాలని అనుకుంటూ ఉండచ్చని భావిస్తున్నారు.

దానిపై ఒత్తిడి తెచ్చేందుకు ఫ్యూచర్ గ్రూప్‌తో ఒప్పందాన్ని అది ట్రంప్ కార్డులా ఉపయోగిస్తూ ఉండచ్చని చెబుతున్నారు.

అయితే, తర్వాత ఎవరు, ఏ ఎత్తు వేస్తారనేది వచ్చే ఆదివారం తర్వాతే తేలుతుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)